డైలీ సీరియల్

ట్విన్ టవర్స్-31

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మామ్మ తలమీద చేయి వేసి ప్రేమగా నిమురుతూ ‘అబ్బాయి పుట్టాడురా’ అంది. వెర్రిగా మామ వంక చూచి కళ్ళు మూసుకున్నాను. పక్కకి ఒత్తిగిల్లి పడుకున్నాను.
కాసేపట్లో పక్క తొట్టెలోంచి పసిబిడ్డ ఏడుపు వినిపించింది.
చిత్రం.. నాకు పక్కకి తిరిగి చూడాలని కూడా అనిపించలేదు. అప్పుడే కాదు, తరువాత రెండు మూడు రోజులయినా నాకు పాపాయిని చూడాలనిపించలేదు. మామ్మ శత విధాలా చెప్పబోయేది. కాని, నా మనసు మాత్రం వినేది కాదు.
ఓ సాయంత్రం పాపాయిని ఎత్తుకుని నా మంచంమీద కూర్చోబోయింది. అప్పటికే చాలా దిగాలుగా ఉన్న మనసు ఒక్కసారి బద్దలయినట్లయి వల వలా ఏడ్చేశాను. మామ్మ తెల్లబోయింది. ఏం అనాలో ఆవిడకే అర్థం కాలేదు. చేతిలో ఉన్న పిల్లాడిని తొట్టెలో పడుకోపెట్టి గబగబా నా దగ్గరకు వచ్చి నన్ను కౌగిలించుకుంది. అప్పటికే గండి పడ్డ దుఃఖం పెల్లుబికిపోయింది.
‘‘ఏమయిందిరా నాన్నా! ఎక్కడయినా బాధగా ఉందా? డాక్టర్ గారిని పిలిపించనా?’’ అంటూ ఎన్నో విధాల సముదాయించబోయింది. కానీ అంతలోనే అన్నయ్య డాక్టర్‌గారిని పిలుచుకు వచ్చేశాడు. ఆవిడ నా వంక చూస్తూనే కొందరికి పురుడు జరిగాక ఇలా వస్తుంది. మీరు కంగారు పడకండి. ఆ అమ్మాయిని వంటరిగా వదిలేయకండి అని చెప్పి వెళ్లిపోయారు.
అంతే! ఇంక మామ్మ నా మంచం వదలలేదు. పిల్లాడి ఆలనా పాలానా అంతా అమ్మేచూసుకుంటోంది. నేను మాత్రం వాడిని ముట్టుకోలేదు. వాడి వంక కనె్నత్తి చూడలేదు. వాడిని కనడంతో నా బాధ్యత అయిపోయిందనిపించింది. మామ్మ ఎంత నచ్చచెప్పబోయినా మొహం తిప్పుకునేదాన్ని. అమ్మ, మామ్మ ఒకరి మొహంలో ఒకరు చూచుకోవడం తప్ప ఏం చేయాలో తెలియని అయోమయంలో పడిపోయారు. నిద్ర పట్టేది కాదు. ఆకలివేసేది కాదు. నిర్లిప్తంగా ఉండిపోయేదాన్ని. తరువాత తెలిసింది పోస్ట్ డిప్రెషన్ అని. పోయిన ఏడాదిగా నామీద, నా ఎమోషన్స్‌మీద వచ్చిన ప్రెషర్ ఒక్కసారిగా దిగిపోయినట్లు అయిపోయింది. గాలి పోయిన బెలూన్‌లా ఉంది నా మనసు.
ఆ సాయంత్రం వేళ, నేను ఒంటరిగా గదిలో పడుకున్నాను. మామ్మ పిల్లవాడిని తెచ్చి పక్కన తొట్టెలో పడుకోబెట్టి తను కూడా వరండాలోకి వెళ్లింది. అప్పుడే వరండాలో కూచుని పూలు కట్టుకుంటున్న వదిన గదిలోకి తొంగి చూసింది. ఏమనుకుందో ఏమిటో, తన తోవన తను పూలు కట్టుకుంటూ చాలా యధాలాపంగా మాట్లాడింది.
‘‘ఏమిటి అమ్మమ్మగారూ ఈ చిత్రం- రఘురాం చక్కనివాడే! మన కళ్యాణి సరేసరి- చుక్కలాంటి పిల్ల. వీళ్ళిద్దరికీ ఇదేమిటి బొత్తిగా ఇలాంటి పిల్లవాడు పుట్టాడు? మీరు చేసిన ప్రార్థనలు, పూజలు అన్నీ ఏమయిపోయాయి’’ అంది.
ఆ తరువాత ఎవరి నోటినుంచీ ఎటువంటి మాట రాలేదు. కాసేపటికి మామ్మ తేరుకుని ‘అంతా దైవఘటన’ అంది తన మామూలు ధోరణిలో.
వదిన మాటలకు ఉలిక్కిపడ్డాను. గోడవైపు తిరిగి ఉన్న నేను చటుక్కున పాపాయి పడుకున్న తొట్టివైపుకు తిరిగాను. పూర్తిగా కప్పి ఉన్న పాపాయి చిన్న చిన్న చేతులు తప్ప ఏమీ కనిపించలేదు.
మెల్లిగా బ్లాంకెట్ తప్పించి చూచాను. గులాబి రంగులో ఉన్నాడు. తలమీద టోటీ పెట్టినట్లు నల్లని జుట్టు తలంతా కప్పేసింది. ఎందుకో తనలోనే నవ్వుకుంటున్నాడు. బుగ్గన సొట్ట పొడిచినట్లు కనిపించింది. తదేకంగా వాడివంకే చూస్తూ ఉండిపోయాను. నాకళ్ళకు అంత అందమైన పాపాయి అసలు భూమిమీద మరొకడు ఉంటాడా అన్నంత చక్కగా కనిపించాడు.ఇంతలో అన్నయ్య గొంతు వినిపించింది. ‘ఏమంటున్నావ్?’ అని వదినను రెట్టిస్తున్నాడు. ‘‘ఏమిటా- మీ మేనల్లుడు అంత అందవికారమయిన బిడ్డను నేనసలు ఎక్కడా చూడలా’’ అంది వదిన.
‘‘అందవికారమా? నీ కళ్ళు ఓసారి పరీక్ష చేయించుకో. నా మేనల్లుడు పున్నమి చంద్రుడు’’ అంటున్నాడు అన్నయ్య.
‘‘ఆ ఆ! కాకి పిల్ల కాకికి ముద్దు. పున్నమి చంద్రుడట, పున్నమి చంద్రుడు, అమావాస్య చంద్రుడు’’ మా వదిన ఇంకా వేళాకోళం చేస్తూనే ఉంది.
అన్ని మాటలూ వింటూ, వాడివంకే తదేకంగా చూస్తున్న నన్ను చూచి, మామ్మ లేచి వచ్చి పిల్లాడిని నా చేతుల్లో ఉంచింది. వాడిని ముట్టుకోగానే నా చేతులు భయంగా బిగుసుకుపోయాయి. వాడు పడిపోతాడేమో అన్నట్లు నెర్వస్‌గా పట్టుకున్నాను.
‘‘వాడేం గాజుబొమ్మ కాదే! ఏమీ ఫరవాలేదు.. ఎత్తుకో’’ అంటూ మామ్మ అక్కడినుంచి వెళ్లిపోయింది. అసలు మామ్మ వీడిని ఎలా ముట్టుకుంది? ఇదివరకు ఎవరికి పిల్లలు పుట్టినా నాకు మడి అంటూ గదిలోకి కూడా అడుగుపెట్టని మామ్మ, అదే అడిగాను మామ్మను.
‘‘అంతా నీ మూలంగానే. నువ్వు వాడి మొహం చూడకపోతే ఎవరో ఒకరు వాడి ఆలనా చూడాలా’’ అంది. అది అబద్ధమయిన సమాధానమే! నాకు, మామ్మకు ఇద్దరకూ తెలుసు.
నేనిక రెట్టించలేదు. వాడు ముద్దుల మనుమరాలికి పుట్టిన ముద్దుల కొడుకు. ఇక అప్పటినుంచి మొదలయింది మామ్మ సతాయింపు.
పాలివ్వవే అమ్మడూ- తల్లికి, పిల్లకూ అనుబంధం అంతా పాలలోంచే ప్రవహిస్తుందే అనేది.
‘‘పో మామ్మా. నీదంతా పాత సిద్ధాంతం’’ అనేదాన్ని. ఎవరు దగ్గరకు తీస్తే వాళ్ళతో కలుగుతుంది అనుబంధం’’ అనేదాన్ని.నిజమేనే! బిడ్డకు అంతేనేమో! కాని, తల్లికి మాత్రం కాదు. తల్లికి- పిల్ల పుట్టకముందు 9 నెలల ముందుగానే మొదలవుతుంది ఆ బంధం.
‘‘ఆ బంధం పిల్లల్లో కలిగేది పాలతోనే’’ అనేది.
‘‘చూడు మీ నాన్నను. నేను ఇంత పెద్దదాన్నయినా, మీ అమ్మ రోజూ నాకు వేళకు అన్నం పెట్టినా, ప్రతిరోజూ నేను తిన్నానో లేదో అని అడుగుతాడు. అంటే మీ అమ్మ నన్ను చూడదనా? కాదే! అదే పేగు తెంచుకు పుట్టిన బంధం. ఆ అనుబంధం ఏ ఇద్దరిమధ్యా రాదు అనేది. ఆ రోజు నుంచి పిల్లాడి పనులు నా చేత చేయించడానికి ప్రయత్నించేది.
మా వదిన నాకు ఓ షాక్ ఇవ్వడానికే అలా రెచ్చగొట్టి ఉంటుంది.

-ఇంకా ఉంది

రమాదేవి చెరుకూరి