డైలీ సీరియల్

ట్విన్ టవర్స్-108

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెదిమంతా విరిచింది. ఒక్కసారి ఏడవడం మొదలుపెట్టింది.
నోట్లో వేలు దొరకడం లేదు. వెచ్చటి బ్లాంకెట్ లేదు. వాళ్ళ నాన్న చేతుల్లో చాలా అసౌఖ్యంగా వుంది దానికి. ఆ ఏడుపు పెద్దయి, ఆ చిన్న రూమ్ అంతా నిండిపోయింది.
అందరి కళ్లు తేజామీద వున్నాయి. ఎవ్వరూ పాపాయి గోడు వినడంలేదు. రూమ్ మాత్రం మారుమోగిపోతోంది. నర్స్ మెల్లిగా తలుపు కూడా దగ్గరగా వేసింది.
కొద్ది నిముషాలు గడిచింది. తేజాలో ఎటువంటి చలనమూ కాలేదు. సావిత్రి కళ్ళు తుడుస్తూనే వున్నాయి. నా మనసుకు మునుపెన్నడూ అనుభవించనంత నిరుత్సాహం, నిస్పృహ కలిగింది.
మరో కొద్ది నిముషాల్లో, వౌళిలో సహనం నశించిపోయింది. వాట్స్ ది హెల్ అంటూ కూతురిని భుజంమీద వేసుకుని లాలించబోయాడు. అది వాడి చేతుల్లో నిలవకుండా ఏడుస్తూనే వుంది.
ఉష పుట్టాక అసలు ఇంతగా ఏడ్చింది ఇదే మొదటిసారేమో! అది ఏ పూట అయినా కాసేపు ఏడుద్దామా అని పెదవి విరుచుకోంగానే ఎవరో ఒకరు ఎత్తుకునేవాళ్లం.
నేను అంటూ వుండేదాన్ని, దీనికి అసలు ఏడవడం కూడా రాదేమో! మామ్మ ఎప్పుడూ అనేది, ఏడవనివ్వండిరా ‘బాలానాం రోదనం బలం’ అని. ఎందుకో మామ్మ తరచుగా గుర్తికువస్తోంది.
వౌళి చేతుల్లో ఏడుస్తున్న పిల్లను నేను తీసుకున్నాను. అనుకున్న పని నెరవేరలేదు. నేను పొరబడ్డాను. వౌళి అన్నట్లు నా ఇమాజినేషన్ అయి వుంటుంది. లేకపోతే ఉష ఇంత ఏడుస్తుంటే తేజాలో ఎందుకు రియాక్షన్ రాలేదు. అనవసరంగా డాక్టర్స్ టైమ్ కూడా వృధా చేశానేమో! అనుకుంటూనే కళ్ళతో బ్లాంకెట్ వేపు చూపించాను.
వౌళి వంగి తీసి ఇచ్చాడు.
రెండు చేతుల్లో అడ్డంగా పట్టుకున్నాను ఉషను.
పైన బ్లాంకెట్ కప్పాను.
దగ్గరగా హృదయానికి హత్తుకున్నాను.
అయినా అది ఏడుస్తూనే వుంది. అది మామూలు ఏడుపు కాదేమో! అమ్మకోసం ఏడుస్తుందేమో అనిపించింది. దాన్ని చేతులతో వూగిస్తూనే, తేజా పడుకున్న బెడ్‌కి అవతలవైపుకు వెళ్లాను. అక్కడ పెద్ద విండో వుంది.
ఉష తలమీద చేయివుంచి, గుండెలకు దగ్గరగా పట్టుకున్నాను. అలవాటయిన వెచ్చదనం. అలవాటయిన స్పర్శ. అయినా దాని ఏడుపు మాన్పలేకపోయింది. పాలు పట్టాలని చూచాను. నోట్లో పీకను కూడా పెట్టనివ్వలేదు. చివరకు దాని తలమీద నా ముఖం వంచి, దాని చెవుల్లో రహస్యం చెప్తున్నట్లే మెల్లిగా, అది రోజూ వినే జోల పాట హమ్ చేయడం మొదలుపెట్టాను. తారాస్థాయిలో వున్న దాని ఏడుపు కొంచెం కొంచెం క్రిందకు వస్తోంది. దాని ఏడుపులో నా పాట ఎవరికీ వినిపించడంలేదు, దానికి తప్ప.
అది మెల్లి మెల్లిగా ఏడుపు తగ్గిస్తోంది. అయినా కోపంగా, నసుగుతున్నట్లు ఏడుస్తూనే వుంది.
కొద్ది నిముషాలు గడిచాయి. రెండు చేతులుతో మొహం అంతా రుద్దుకుంటూ, చివరకు తన బొటనవేలు నోట్లో వేసుకుంది. మెల్లిగా శాంతించింది. అది ఎంత ఏడ్చిందంటే దాని కళ్లల్లోంచి నీళ్ళు కూడా కారిపోయాయి. దాని చూస్తే నా మనసు ద్రవించి పోయింది. గుండెలకు దగ్గరగా వుంచుకుని మెల్లిగా హమ్ చేస్తూనే వున్నాను.
రూమ్ నిశ్శబ్దమయింది, దాని ఏడుపు ఆగడంతో. నా హమ్మింగ్ సన్నగా రూమ్‌లో వినిపిస్తోంది కాబోలు, అది నేను గమనించలేదు.
నేను కిటికీ వైపు తిరిగి వున్నాను. నా వెనుక భాగంలో అందరూ వున్నారు.
కిటికీలోంచి క్రిందకు చూస్తున్నాను.
క్రింద కోర్టు యార్డ్ కనిపిస్తోంది. చాలామంది రోగులని వీల్ చైర్‌లో పెట్టి, ఆరు బయట తిప్పుతున్నారు. అరుదుగా దొరికే ఫ్రెష్ ఎయిర్ కోసం.
ఎంత పెద్ద హాస్పిటల్. ఎన్ని రకాల రోగాలు, అందరికీ ఒకటే ఆశ! త్వరగా కోలుకుని అక్కడనుండి ఇంటికి వెళ్లిపోవాలనే! హాస్పిటల్ ఎంత శుభ్రంగా వుంచారు. ఎంతో ట్రైనింగ్ పొందిన అక్కడి పరివారం- ఎంతో ఆదరంగా ఆప్యాయంగా చూస్తారు. అయినా సరే, అందరికీ ఆ ప్రదేశం నుండి దూరంగా వెళ్లాలనే అనుకుంటారు.
ఇదేం చిత్రం భగవంతుడా! ఇంతమంది సఫర్ అవుతూంటే చూడటంలో నీకేం దొరుకుతుంది. నా ఆలోచనా ప్రవాహంలో నేను ఇంకా హమ్ చేస్తూనే వున్నాను అలవాటుగా.
అంతవరకు నిశ్శబ్దంగా వున్న గదిలో నా వెనుకగా, చిన్న కలకలం బయలుదేరింది.
ఉలిక్కిపడ్డట్టుగా వెనక్కి తిరిగాను, పాపాయిన చేత్తో పట్టుకునే!
‘‘డోన్ట్ స్టాప్ మేడమ్. డోన్ట్ స్టాప్, కంటిన్యూ!’’ అంటున్నాడు డా.వాకర్ గబగబా- ఆతృతగా!
అర్థం కానట్లు చూచాను వౌళి వంక. వాడు చటుక్కున లేచాడు. నా రెండు భుజాలమీద చేతులుంచి ఇంకొంచెం సేపు హమ్ చెయ్యి అమ్మా, ఆపకు’’.
వాడు ఏమిటి అడుగుతున్నాడో, ఎందుకు అడుగుతున్నాడో అర్థం కాలేదు. అయోమయంగా వాడి వంక చూచాను.
వాడి మొహంలో అంతులేని కంగారు నిండి వుంది. తల వూగించాడు. ‘‘వాడు ఆపకు, ఉషకి ఇంకొంచెం సేపు పాడు’’ అన్నాడు.
మరొక సమయంలో అయితే- అసలు ఏం జరుగుతుందో- ఎందుకు అంతా అంత కంగారుగా వున్నారో- అన్నీ అడగకుండా పాడేదాన్ని కాదు. కాని వౌళి మొహం చూచి మరొక ప్రశ్న వేయలేదు.
తల వంచుకుని ఉషవంక చూస్తూ మెల్లిగా హమ్ చేస్తున్నాను.
అప్రయత్నంగా నా కళ్లు తేజా మీదకు వెళ్లాయి. తేజా బలవంతంగా కళ్లు తెరవాలని ప్రయత్నిస్తోంది.
నా నోట పాట ఆగిపోయింది. వౌళి నా భుజంని కుదిపాడు. ఇప్పుడు హమ్ చేయడం మానేశాను.
తేజా వంక చూస్తున్న నా నోటినుండి, మామూలుగా పాట వచ్చేసింది. లాలి పరమానంద.. రామ గోవిందా! అంటూ గోవిందుడిని తలచుకునేప్పటికి తేజా కళ్ళు మెల్లిగా తెరుచుకున్నాయి.
మిరకిల్! నిజంగానే మిరకిల్.
ఆ తరువాత ఇంక నా నోటినుండి పాట కాదు కదా మాట కూడా రాలేదు!
అక్కడే నుంచుని వున్న న్యూరాలజిస్ట్ వెంటనే ఏదో ఇంజెక్షన్ ఇవ్వమని ఆర్డర్ చేశాడు.

-ఇంకా ఉంది

రమాదేవి చెరుకూరి