డైలీ సీరియల్

ట్విన్ టవర్స్ 136

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆ రోజుల్లో సాధారమయిన అమెరికన్‌కి కాలేజీకి వెళ్లాలని కాదు ధ్యేయం, కాళ్లమీద నిలబడటం, స్వతంత్రంగా బతకడం. కానీ వర్జీనియా చాలా తెలివైనది. కాలేజ్ చదువులమీద చాలా ఆశ పెట్టుకుంది. కాని అనుకోని పరిస్థితుల్లో తల్లి అయింది. కాని తల్లిదండ్రుల సహాయంతో కాలేజీ చదువు మొదలుపెట్టింది.
మొదటి నాలుగేళ్లు, నా జీవితం నీకు చాలా భాగం తెలుసు. ఎలాంటి ఆలోచనతో అమెరికా వెళ్లాలనుకున్నానో నా ఆలోచనా ప్రవాహానికి ఒక ఆనకట్ట నిన్ను నా జీవితంలోకి రానివ్వడం. నేను చేసిన చాలా పెద్ద తప్పుల్లో మొదటిది పెళ్లిచేసుకోవడం. అంతకంటే పెద్ద తప్పు నిన్ను శాసించాలనుకోవడం. ఎంతయినా ఇండియాలో పుట్టి పెరిగిన మగవాడిని కదా! నా భార్యను శాసించడం నా జన్మహక్కు అనుకున్నానేమో!
నిన్ను పెళ్లి చేసుకు వదిలి వచ్చి, నీతో గడిపిన మధురమైన సమయాన్ని గురించి కలలుకంటూ, నువ్వు నా దగ్గరకు రాబోయే రోజు తలచుకుంటూ కొత్త దేశంలో చాలా కష్టపడుతున్నాననుకుంటున్న రోజుల్లో అమ్మ దగ్గరనుంచి ఫోన్ వచ్చింది. నన్ను స్తబ్దుడిని చేసింది. కొంచెం భయం వేసింది. నా ప్రొఫెషనల్ యాంబిషన్ అంత దిగజారిపోయి ఫ్యామిలీ లైఫ్‌లో కూరుకుపోతున్నాననిపించింది. ఒకటి రెండు రోజుల నా మెదడులో మరో ఆలోచన రాకుండా చేసింది. చివరకు, నా యాంబిషన్, నా జీవితం రెండూ సమన్వయపరచుకోవాలంటే నేను కొన్ని నిర్ణయాలు తీసుకోవాలి. అంతే! అదే చేశాను. వెంటనే అమ్మకు ఫోన్ చేశాను. ఆ క్షణంలో నాకు మరేమీ గుర్తులేదు.
నువ్వు నా భార్యవని- నా నిర్ణయంలో నీకు చాలా పెద్ద భాగముందని అన్న ఆలోచన రాలేదు.
ఆ క్షణంలో నాకు కావాల్సింది జరగబోయేది ఆపడమే ముఖ్యం. మిగిలినవన్నిటికి ప్రాధాన్యత లేదు. నా స్వాతంత్య్రం కోల్పోకూడదు.
అమ్మకు ఫోన్ చేశాక, నాకు తెలియకుండానే చాలా పెద్ద రిలీఫ్ పొందాను, గర్వంగా భావించాను. నా ముందుచూపుకు నేనే గర్వించాను.
నీకు గుర్తుందో లేదో ఒక రోజు తెల్ల తెల్లవారుతుంటే నీ దగ్గరనుండి ఫోన్ వచ్చింది. కాని నా ప్రశ్నకు నీ సమాధానం వినంగానే తల తిరిగిపోయింది. చాలా కోపం వచ్చింది. నన్ను ఎవరో శాసిస్తున్నారనిపించింది. ఎవరో బలవంతంగా నా పనులకు అడ్డు వస్తున్నారనిపించింది. రెండు రోజులు చాలా కష్టంమీద ఎదురుచూశాను. ఎటువంటి వార్తా రాలేదు. ఇక ఉండబట్టలేక అమ్మకు ఫోన్ చేశాను.
ఎబార్షన్ జరగదని, నువ్వు భయపడుతున్నావని చెప్పింది.
నాకెంత కోపం వచ్చిందో చెప్పలేను.
అది ఎవరిమీద చూపాలో కూడా తెలియలేదు.
నా పిచ్చి కోపంలో నా స్థిరత్వం పోయింది. పనిమీద కాన్‌సన్‌ట్రేషన్ తగ్గింది.
మొదట్లో నిన్ను విడిచి వచ్చిన ఎడబాటు తరువాత నేను చేసిన పొరపాటు, నన్ను చాలా బాదర్ చేశాయి.
నన్ను నేను నిగ్రహించకుని మళ్లీ పనిలో జొరపడడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. అప్పుడే నీ దగ్గరనుంచి మీ నాన్నగారి దగ్గరనుంచి ఉత్తరాలు వచ్చాయి.
మీ నాన్నగారు రాశారు, కల్యాణి మనస్ఫూర్తిగా ఇష్టపడకపోవడం మూలంగా, నేను కోరినది జరిపించలేకపోయామని.
నీ ఉత్తరంలో, నీ సెంటిమెంట్, విలువలని, పాపపుణ్యాలు అంటూ చాలా రాశావు. డామ్ సెంటిమెంట్స్, డామ్ పెంపకం అని మనసారా తిట్టుకున్నాను. కోపంతో ఊగిపోయాను. డామ్ ఇండియన్ గరల్స్ అని తిట్టుకున్నాను.
మనిద్దరి మధ్య ఉత్తరాలు సాగుతూనే వున్నాయి. కాని, నాలో కోపం మాసిపోలేదు. కాని విధిగా నీకు సమాధానాలు రాస్తూనే వుండేవాడిని. ఎందుకో దిసీజ్ మై డ్యూటీ అనిపించేది. కాని నువ్వు కూడా ఎందుకనో నీ ప్రెగ్నెన్సీని గురించి ఏమీ రాసేదానివి కాదు.
అప్పుడప్పుడు అనుకునేవాడిని. నువ్వు కూడా నీ నిర్ణయానికి విచారిస్తున్నావేమోనని. ఇక ఏమీ చెయ్యలేక గతిలేక ఎదుర్కొంటున్నామేమోనని.
నా మాట విననందుకు తగిన శాస్తి జరిగిందనుకున్న రోజులు కూడా వున్నాయి.
తరవాత మీ అన్నయ్య పంపిన ఫొటో వచ్చింది. ఒక చాపమీద పడుకుని వున్న పాపాయి ఫొటో, బొద్దుగా, నుదుట మీద పెద్ద బొట్టు, ఎటువంటి ప్రత్యేకత లేని ఆ ఫొటోని చూస్తే నాకు ఎలాంటి భావ సంచయమూ కలుగలేదు. రెండు నిముషాలు ఆ ఫొటో చూచి టేబుల్ మీద పడేశాను. ఎటువంటి శ్రద్ధా చూపలేదు. మనసంతా ఏదో కోపం, చిరాకు, ఏదో ఓడిపోయానన్న ఫీలింగ్. అన్నిటితో ఎప్పుడూ చిరాకుగానే అనిపించేది.
నీ దగ్గర నుంచి ఉత్తరాలు వస్తూనే వుండేవి. నా రీసెర్చి చాలా బాగా ముందుకు వెడుతోంది. మా ప్రొఫెసర్ అండ్ గైడ్ వచ్చాడు ఆ ఉదయం. మనం మన రీసెర్చి డైరెక్షన్ మారుస్తున్నాం లేదా వదిలేయాలి అన్నాడు.
అర్థంకానట్లు చూచాను. ఇపుడా రుూ టైములోనా, మరో అర్థ సంవత్సరంలో, ప్రపంచమంతా చాటిద్దామనుకుంటున్న రోజుల్లో రుూ నిర్ణయం ఏమిటి అని అయోమయ స్థితిలో పడిపోయాను.
సైంటిఫిక్ ప్రపంచంలో అప్పుడప్పుడు పేలే బుల్లెట్‌లాంటి వార్త!
ప్రపంచ ప్రఖ్యాత సైంటిస్టు జర్మనీలోనుండి మేము చేసే రీసెర్చి చేస్తున్నాడు. అక్కడనుండి అతని రిజల్ట్స్ ముందుగా వచ్చేశాయి.
మామూలుగా, రీసెర్చి చేయాలనుకునేవాళ్లకు రెండు మార్గాలు వుంటాయి. చాలా ప్రాముఖ్యత వహించిన సబ్జెక్ట్ మీద రీసెర్చి చేయడం. అలాటిదాన్ని చాలామంది చెయ్యాలని ప్రయత్నిస్తారు. చాలా పోటీని ఎదుర్కొంటారు. తమకంటే ముందు మరొకరు సాధిస్తే వెనకబడిపోతారు.
రెండవ రకం, సామాన్యుని టాపిక్ మీద. దీనివల్ల ప్రయోజనమూ, ప్రమాదం తక్కువ.
నా సంగతి నీకు తెలుసుగా. నేను మొదటి ఛాయిస్ తీసుకున్నాను. చాలా కష్టపడ్డాను. కాని రేస్‌లో ఓడిపోయాను. జీవితంలో మొదటి అపజయం.
మొట్టమొదట ట్రయల్స్‌లోనే మంచి ఫలితాలు వస్తూంటే ఆనందంతో నిద్రపోవడం మర్చిపోయేవాడిని.
ప్రొఫెషనల్ సక్సెస్! అంతకంటే ఏం కావాలి ఎవరికైనా అనుకునేవాడిని. రాబోయే గుర్తింపునకు చాలా గర్వంగా ఉండేది. నా రీసెర్చి ప్రపంచ స్థాయిలో గుర్తింపబడుతున్నట్లే భావించుకునేవాడిని. మరో లోకంలో విహరిస్తుండేవాడిని. ఆశయాలు నెరవేరుతున్న రోజులు. ఆశల వరవడిలో ఆకాశంలో హరివిల్లు చూస్తూ విహరించే రాజు. ఆ రకపు సంతోషం జీవితంలో మళ్లీ అనుభవించలేదు. నిజంగా సక్సెస్‌లో నా ముందు నిలచినవాడు అలాటి సంతోషం కలగనేలేదు. ఒక సంతృప్తి మాత్రమే! ఒక సైంటిస్టు పేరు ప్రఖ్యాతుల గుర్తించి ఊహించాడంటే అది కుర్రతనమే! అది చిన్నతనమే! సైంటిస్టుగా జీవితం ఒక సాధన. దానికి ఫలితం కావాలి. గుర్తింపు కాదు. కానీ ఆ రోజు ఎదురైన పరిస్థితిలో నా కాళ్లక్రింద భూమి పగిలిపోతుందనిపించింది. కళ్లముందు నల్లని వలయాలు తిరుగుతున్నట్లు అనిపించింది.
రోజులో నిద్ర, భోజనం కూడా లెక్కచేయకుండా నిర్వహించిన రీసెర్చి రెండవ స్థానానికి వచ్చేసింది. అది నేను ఎదుర్కోలేని దెబ్బ.
నన్ను నేను కూడగట్టుకోలేకపోయాను. సమాధానపర్చుకోలేకపోయాను. మా కొలీగ్స్, ప్రొఫెసర్స్ వాళ్లంతా ఇలాంటివి అప్పుడప్పుడు జరుగుతాయి. మనం అన్నిటికి సిద్ధంగా ఉండాలన్న ఆలోచనతో వున్నారు అనుభవం వున్నవాళ్లు.
పూర్తిగా అనుభవం లేనివాడివి. వయసులో చిన్నవాడిని నేను అయిపోయాను. పైగా వంటరివాడినయిపోయాను

-ఇంకా ఉంది

రమాదేవి చెరుకూరి