డైలీ సీరియల్

సింధు నాగరికతలో ఓ ప్రేమకథ 11

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆమె మాటలు, చేష్టలు చూసి జంతువులు, పక్షులు కూడా ముగ్ధులవుతాయి’’.
‘‘నీ మాటల్లో నాకు తెలిసిన ఓ కన్యరూపం కనబడుతోంది. నాకు ఆమె తెలుసు కదా!’’
‘‘ఔనమ్మా, నీకు తెలుసు.. ఆమె మరెవరో కాదు, మన మోరీ..’’
‘‘మోరీనా.. నా దాసీ... మన నిమ్న జీతగాడు. చేనేత వస్తక్రారుడి కూతురు ఈ ఇంటి కోడలా.. నీకు మతిపోయిందట్రా?’’
‘‘నేను పెళ్ళాడబోతోంది ఓ కన్యని, ఆమె కుటుంబాన్ని కాదు. అంతేకాక ఈ ఇంటి కోడలుగా వచ్చాక ఆమె ఈ ఇంటి సొత్తే అవుతుంది. అటువంటప్పుడు ఆమెను మన కుటుంబంలో ఓ వ్యక్తిగా చూడాలి కానీ ఆమె పుట్టింటిని దృష్టిలో పెట్టుకోకూడదు’’.
‘‘అది సరేరా, కానీ మీ నాన్నగారు ఒప్పుకుంటారా అని?’’
‘‘నువ్వు, నేనూ ఒప్పించాలి. ఓ మాట అడుగుతా అమ్మా, మోరీ నీకు కోడలైతే ఇంటి వ్యవహారాల్లోనే కాక సామాజికంగా కూడా నీకు ఎంత సాయంగా ఉంటుందో చెప్పు’’.
‘‘అది నిజమేరా. కానీ పనిమనిషిని ఇంటి కోడలుగా చేసుకున్నందుకు మన గౌరవం ఏం కావాలి?’’
‘‘అమ్మా, ఈ అంతస్తుల తేడా పెళ్లయిన తర్వాత క్రమంగా క్షీణిస్తుంది కదా! అంటే ఈ కులాంతర వివాహానికి, పేదా గొప్పా వివాహానికి క్రమంగా సమాజం రాజీపడినట్టే కదా!’’
‘‘నా మాట వినరా నాన్నా. నీకు ఎన్నో గొప్ప సంబంధాలు వస్తున్నాయి. పూజారి గారి మనవరాలి సంబంధం మాత్రం మన కుటుంబ గౌరవాన్ని తారాపథానికి చేర్చుతుంది, ఆలోచించుకో’’.
‘‘అలా ఐతే నేను పెళ్ళే చేసుకోను. అది మీకు సమ్మతమేనా?’’
‘‘మాజాకి ఏమీ తోచక బెంగతో వౌనం దాల్చింది. అజోడా ఖిన్న మనస్కుడై బైటకు నడిచాడు. ఇటువంటి పరిస్థితి ఎదురవుతుందని అతడికి తెలుసు. అతడు దానికి సిద్ధంగా ఉన్నాడు.
ఆ రాత్రి భోజనాలు అయాక హనోడా పడక గదిలో భార్య ముభావంగా వుండడం హనోడా గమనించాడు. ఆ కాలంలో భార్యాభర్తలు వేర్వేరు గదుల్లో ఉండేవారు. పడక కూడా ఒక మనిషికే ఉండేది. భార్య భర్త గదిలో కొంత సమయం గడిపి తన గదికో పిల్లల వద్దకో వెళ్లిపోయేది.
‘‘ఏమిటి, ఇవాళ అదోలా ఉన్నావు. మాజా? ఆరోగ్యం బాగుందా?’’ అని భార్యని అడిగాడు.
‘‘నా ఆరోగ్యానికేం, నిక్షేపంలా ఉంది. మన వాడి పెళ్లి విషయంలోనే వచ్చింది పెద్ద చిక్కు’’.
‘‘వాడి పెళ్లికి చిక్కు వచ్చిందా? ఏమిటా మాటలు? ఇంకా సంబంధమే కుదరందే’’.
‘‘కుదిరిపోయింది కాబట్టే చిక్కు వచ్చిందండీ’’ అంటూ మోరీని తప్ప మరెవరినీ చేసుకోనని కొడుకు తనకు నిక్కచ్చిగా చెప్పిన విషయాన్ని భర్తకు వివరించింది.
‘‘నేను ప్రధాన పూజారి మనవరాలిని మనవాడికి చేసుకుందామని ఉవ్విళ్లూరుతూంటే వాడికి ఇదేం పిచ్చి పట్టింది? ఇంటిలో పనిమనిషి మన కోడలవాలా? చాలా బాగుంది! నువ్వు ఔనన్నా నేను మాత్రం చచ్చినా ఒప్పుకోను’’.
‘‘బాగుందండోయ్ మీరన్నది! నేను వాడిని దాన్ని పెళ్ళాడమని ప్రోత్సహిస్తున్నానా ఏమిటి? నాపై అటువంటి అభాండం వేస్తున్నారు? ఇటువంటి అవకతవక సంబంధానికి మీరెంత వ్యతిరేకమో నేనూ అంత వ్యతిరేకమే. ఇప్పుడు మనం పరస్పరం వాదించుకోకుండా వాడిని మనం ఈ మోహకూపం నుంచి బైటకు లాగాలి’’.
‘‘అన్నిటికంటే ముందు మోరీకి నువ్వు స్వస్తి చెప్పేయ్’’.
‘‘ఇంతలా మన కొంప ముంచిన ఆ నంగనాచిని మీరు ఉద్యోగంలో ఉంచమన్నా ఉంచను. రేపే దానికి ఉద్వాసన చెప్తా. ఓసి అభాగ్యురాలా తిన్న ఇంటి వాసాలు లెక్కపెడతావటే?’’ అంటూ మోరీపై తన అక్కసు వెళ్ళగక్కసాగింది.
‘‘మాజా! మన బంగారమే కల్తీ అయితే ఆమెను అని ఏం లాభం? పరిహారంగా నూరు వరహాలు దానికి పారేసి మాకు నీ సేవలు అక్కరలేదు తల్లీ అని ఖరాఖండీగా చెప్పేయ్’’.
‘‘నాకైతే ఇంకా మంచి ఉపాయం తోస్తోంది. మీ ఎగుమతి తైలాల కర్మాగారంలో బంకో అనే అబ్బాయి పనిచేస్తున్నాడుగా. వాడి తల్లిదండ్రులు చనిపోతే మీరే వాడిని చేరదీసి మన తైలాల కర్మాగారంలో ఉద్యోగం ఇప్పించారు. తెల్లగా పొడుగ్గా ఉంటాడు. వాడు మీ మాట కాదనలేడు. దీన్ని వాడికి కట్టబెట్టేయండి. దాని తండ్రి లీబో కూడా మీ మాటని కొట్టేయలేడు. దాంతో అది మన దారికి దూరమవుతుంది. లీబో మన విశ్వాసపాత్రుడు. అతడి మనసు నొప్పించకుండా నూరు వరహాలు ఇచ్చి ఏదో సాకు చెప్పి దాన్ని పనిలోంచి తప్పిస్తా’’.
‘‘అలాగే చేయి. ఈలోగా నేను బంకోని దాన్ని చేసుకోమని ఒత్తిడి చేస్తా. దాని తండ్రితో మాట్లాడి వేగిరం వాళ్ళిద్దరి పెళ్లి చేయించే ప్రయత్నం చేస్తా. నేనే పెళ్లి ఖర్చులు భరించి చేయిస్తానంటే లీబో ఎగిరి గంతేసి ఒప్పుకుంటాడు’’.
ఆ మర్నాడు మోరీ ఇంకా లేచి మొహం కడుక్కుంటూండగా మాజా పంపించిన సందేశ వాహకుడు జారా వాళ్ళింటి తలుపు తట్టాడు.
మోరీ తండ్రి లీబో తలుపు తెరిచాడు.
‘‘ఏమిటి జారా, తెలతెలవారే వచ్చావు?’’ అడిగాడు లీబో.
‘‘నన్ను అమ్మగారు పంపారు లీబోగారు. ఆవిడ మోరీని కొన్ని రోజులు సెలవ తీసుకోమన్నారు. వారే మళ్లీ కబురు చేస్తారట. ఈలోగా నూరు వరహాలు ఆమెకు పారితోషికంగా పంపించారు’’.
ఇంతలో మోరీ వచ్చి ఆ మాట వింది.
‘‘ఏమైంది?’’ అని లీబో జారాని అడిగాడు.
‘‘ఆవిడ మరేం చెప్పలేదు. మోరీ పనిలో ఏ లోటు లేదని చెప్పమన్నారు. కొన్ని చెప్పలేని కారణాలవలన మోరీని సెలవమీద పంపవలసి వచ్చిందని మాత్రమే చెప్పారు’’.
మోరీ ‘‘నేను వారిని కలవవచ్చా?’’ అని అడిగింది.
‘‘వారే నీకు కబురు చేస్తారట. ప్రస్తుతం వీలు లేదన్నారు’’ అని చిన్న గుడ్డ సంచిని మోరికి అందించబోయాడు. చూడముచ్చటగా వున్న ఆ రంగు రంగుల పూల అద్దింకలుగల సంచి మూతికి రంగు తాడు కట్టి ఉంది. రంగు తాడుని వదులు చేసి మూతి తెరవవచ్చు. మోరీ సంచిని అందుకోలేదు. మాజా తనను సెలవుమీద వెళ్లమనడం, అంత ధనం పారితోషికంగా పంపడం వెనుక కారణం పసిగట్టగలిగింది మోరీ.
- ఇంకా ఉంది

-పులిగడ్డ విశ్వనాథరావు