డైలీ సీరియల్

సింధు నాగరికతలో ఓ ప్రేమకథ-12

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అజోడా తనను ప్రేమిస్తున్నట్టు, వివాహమాడబోతున్నట్టు తల్లిదండ్రులకు చెప్పి ఉంటాడు. దాంతో మాజా తనను ఈ విధంగా దారిలోంచి తప్పిస్తోంది.
అజోడా నిజంగా తనను అంత గాఢంగా ప్రేమిస్తే అతడే తల్లిదండ్రులతో పోరాడి తనను చేసుకుంటాడు. లేకపోతే తన బతుకు తనదే. నృత్యగానం వృత్తి తనకు ఎలాగూ ఉంది కదా. దాంట్లో తనకు ఈ పాటికే కొద్దో గొప్పో పేరుంది. అన్ని కళలు లాగే అది కూడా మహాసాగరం వంటిది. తాను ఎంత సాధన చేసినా, ఎంత నేర్చుకున్నా ఇంకా నేర్చుకోవలసిందీ, నైపుణ్యం సాధించవలసిందీ బోలెడంత ఉంది. ప్రదర్శనలు ఇవ్వడంతోబాటు కొత్త కళాకారిణిలకు శిక్షణ కూడా ఇవ్వవచ్చు.
అజోడాను చేసుకుంటానని తాను ముందుకు రాలేదే! అతడే తనను చేసుకుంటానని తహతహలాడుతున్నప్పుడు అతడి గుణ అవగుణాలను బేరీజు వేసుకుని తనకు ఆదర్శ భర్త కాగలడనే నమ్మకంతో ఔనంది.
అతడి తల్లిదండ్రులకు అభ్యంతరమైతే ఆ చిక్కుని విడదీసే బాధ్యత అజోడాదే. తనకు అజోడా భర్తగా రాసిపెట్టి లేకపోతే తాను మాత్రం ఏం చేయగలదు?
మోరీ సందేశవాహకుడితో ఇలా అంది- ‘‘అమ్మగారికి నా విజ్ఞప్తి మనవి చేయి. నన్ను అంత ఆదరంగా చూసినందుకు, నా పనిని మెచ్చుకున్నందుకు నేను వారికీ, వారి కుటుంబానికీ ఎల్లప్పుడు రుణపడి ఉంటా. వారు నాపట్ల చూపిన దయనీ, అభిమానాన్ని ఎన్నటికీ మరచిపోలేనని విన్నవించు.
‘‘వారు, పెద్దయ్యగారు, చిన్నయ్యగారు, అత్తారింటిలోనున్న చిన్నమ్మగారు సిరిసంపదలతో, ఆయురారోగ్యాలతో వర్థిల్లాలని జగన్మాతను ప్రార్థిస్తున్నానని చెప్పు.
‘‘నాకు వారు ఉత్కృష్టమైన వస్త్రాలంకారాలు ఇచ్చి పోషించారు. అదే నాకు పదివేలు. అవసరమైనపుడు ధనం అడుగుతానని కానీ ఇప్పుడది అవసరం లేదని, క్షమించమని వేడుకుంటున్నానని చెప్పు. నేను చేసిన కొద్దిపాటి సేవకి ఇంత సొమ్ము తీసుకోవడానికి నా మనసు ఒప్పుకోవడంలేదని మనవి చేయి’’.
‘‘అదేంటి తల్లీ. వారు నిన్ను కనికరించి ఇచ్చిన కానుకని తిరిగి పంపడం మర్యాద కాదు. ఉంచుకో’’ అన్నాడు లీబో.
వెనుకగా ఆ దృశ్యాన్ని చూస్తున్న మోరీ తల్లి ‘‘ఔనే.. వారు మన అన్నదాతలు. నువ్వు తిరిగి పంపితే వాళ్ళ మనసు కించపడుతుంది, తీసుకో’’ అంది.
‘‘వద్దమ్మా, నేను చేయని శ్రమకి పారితోషికం తీసుకోవడం నా అంతరాత్మకి సమ్మతం కాదు. నువ్వు ఈ డబ్బు సంచి తీసుకెళ్ళు’’ అని సందేశవాహకుడిని పురమాయించగా అతడు డబ్బు సంచి తీసుకుని తిరుగుముఖం పట్టాడు.
సందేశవాహకుడు డబ్బు సంచిని మాజాకు తిరిగి ఇస్తూ మోరీ చెప్పిన మాటల్ని వల్లించాడు. ఆ మాటలను విన్నాక ఆమె మొహం మ్రాన్పడింది. సంచిని అందుకుని ‘‘దాని కళ్ళు నెత్తికెక్కాయి. సరే నువ్వు వెళ్ళు’’ అంది.
ఆ రాత్రి భర్తతో ఈ విషయం చెప్పి ‘‘దానికెంత పొగరో చూశారా? నేను పంపిన వరహాలను తిరిగి పంపించేసింది’’ అంది మాజా.
‘‘ఆమె వద్దంటే మనం బలవంతాన వరహాలను కట్టబెట్టలేం కదా! అయిందేదో అయింది, ముందు ఏం చేయాలో చూడండి’’.
‘‘ఆ కుర్రాడిని కనుక్కున్నారా?’’
‘‘పిలిచి మాట్లాడా. లీబో కూతురు ఉంది. చక్కనిది, పాడుతుంది అని మోరీ గురించి వివరించా. నేను నిన్ను పెంచి పెద్దవాడిని చేశాను కాబట్టి నిన్ను ఓ ఇంటివాణ్ణి చేసే బాధ్యత కూడా నాదే. అందువలన మోరీని నువ్వు పెళ్లాడాలని నిశ్చయించా. లీబోతో ఈ విషయం ప్రస్తావిస్తాను. నీ అభిప్రాయం ఏమిటి అని అడిగా.
‘‘తమరే నాకు తల్లీ తండ్రీ. మీరు ఏది చేసినా నా మేలుకే చేస్తారని నాకు నమ్మకం ఉంది అన్నాడు ఆ కుర్రాడు.
‘‘మరేం.. లీబోతో కూడా మాట్లాడి పెళ్లి తతంగం అయిందనిపిస్తే మనవాడు దాని కబంధ హస్తాలనుంచి విముక్తి పొందినట్టే’’ అంది మాజా.
ఆ రోజు మోరీ కనబడకపోయేసరికి ఏమైందా అని అనుకుంటూ ఆరా తీశాడు అజోడా. అమ్మగారే ఆమెను సెలవు మీద పంపినట్టు తెలిసింది.
ఆమెను తనకు దూరం చేద్దామని అమ్మ ఈ ఎత్తుగడ వేసిందని గ్రహించాడు అజోడా. అతడికి పట్టరాని కోపం వచ్చింది. ఎలా దూరం చేస్తారో నేనూ చూస్తానని మనసులో తల్లిదండ్రులకు సవాలు విసిరాడు.
ఇప్పుడు తల్లిని అడిగినా లాభం లేదు. తానే మోరీని కలిసే ఉపాయం ఆలోచించాలి. తనకు ఇష్టంలేని సంబంధం తల్లిదండ్రులు తన సమ్మతి లేందే చేయలేరు కదా! ఆమెకు చేరువై తన ప్రేమను వ్యక్తపరిచే మార్గం ఆలోచించాలి.
ఆ రోజు సాయంకాలం అతడు ఆమోద గృహంలో స్నేహితులతో కలిసి మద్యం సేవిస్తున్నాడు. అజోడా స్నేహితులతో తన ప్రేమ వ్యవహారం చర్చించదలచుకోలేదు. ఆ స్నేహితులు సంపన్న వర్గాల బిడ్డలు, పూజారి వర్గం బిడ్డలు.
ఊరి చివర ఆమోద గృహం ఉంది. ఓ పెద్ద గది మధ్యలో ఓ పురుషుడు డప్పు వాయిస్తూ పాడుతూండగా ఓ స్ర్తి నృత్యం చేస్తోంది. చుట్టూ ప్రేక్షకులు కూచుని రాగి పాత్రల్లోని మద్యాన్ని సేవిస్తూ వీక్షిస్తున్నారు. ఓ సేవకుడు ప్రేక్షకులు ఖాళీ అవుతున్న రాగి పాత్రలలో పెద్ద రాగి కుంభంలోంచి మద్యం పోస్తున్నాడు.
కొంతమంది వెనుక ఆరుబయట ఆసనాలపై కూచుని మాట్లాడుకుంటూ మద్యం సేవిస్తూండగా కొంతమంది మరో పెద్ద గదిలో పాచికలు ఆడుతూ మద్యం సేవిస్తున్నారు. ఆటలు గెలిచినవారు పెద్దగా నవ్వుతూ పందెం ధనాన్ని సంచిలో వేసుకుంటున్నారు.
అనేకమంది సేవకులు పెద్ద పెద్ద విసనకర్రలతో విసురుతూ అతిథులకు చెమట పట్టకుండా చూస్తున్నారు.
అజోడా మిత్రులు నృత్యగాన కార్యక్రమాన్ని కొద్దిసేపు వీక్షించి వెనుక ఆరుబయట ఆసనాలపై కూర్చుని మద్యం సేవిస్తూ సంభాషిస్తున్నారు. ఓ స్నేహితుడు అజోడాతో ఇలా అన్నాడు.
‘‘నీకు తెలుసో లేదో, రేపు సభాస్థలిలో సంగీత నృత్య కార్యక్రమం ఉంది’’.
‘‘అలాగా! మొహంజోదాడో కళాకారులేనా?’’ అవునన్నాడు మిత్రుడు. అంటే ఈ కార్యక్రమంలో మోరీ తప్పకుండా వుంటుంది. - ఇంకాఉంది

-పులిగడ్డ విశ్వనాథరావు