డైలీ సీరియల్

సింధు నాగరికతలో ఓ ప్రేమకథ-14

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అతడి మొహంలో విషాద ఛాయలు గాఢమయ్యాయి.
‘‘మోరీ, నీ భావాన్ని నేను గౌరవిస్తున్నా కానీ.. కానీ.. నిన్ను చూడందే నేను ఉండలేనే’’ అంటూండగా అతడి కళ్ళల్లో సన్నని నీటి పొర పొటమరించబోతుందా అనే సందేహం కలిగింది మోరీకి.
మోరీకి అతడిపై జాలివేసింది.
‘‘సరే చిన్నయ్యగారూ, మనం ఇలా కలుసుకున్నట్టే నా నృత్యగాన కార్యక్రమాల్లో కలుసుకుంటూ ఉందాం. ఓ కళాకారిణి, ఆమె కళాభిమాని బాహాటంలో మాట్లాడుకుంటూంటే ఎవరూ ఏమనుకోవడానికి తావుండదు.’’.
‘‘అలాగే’’ అన్నాడు అజోడా. బొత్తిగా లేనిదానికంటే కొద్దైనా నయం అని.
‘‘అది సరే కానీ నువ్వు రావడం మానేశావు? నేను నిన్ను చేసుకుంటానని చెప్పాక మా అమ్మా నాన్నలు నిన్ను ఉద్యోగంలోంచి తీసేశారా ఏమిటి?’’
‘‘మీకీ విషయం గురించి తెలియలేదా?’’
‘‘నాకు నిజంగా తెలియదు. ఓ సేవకుడు మా అమ్మ నీకు పంపిన సందేశం గురించి తీసుకువెళ్ళాడని విన్నా. నేను వాడిని పిలిచి అడిగితే వాడు ఆ రహస్యం చెప్పడు. ఎందుకంటే మా అమ్మ ఈ రహస్యం ఎవరికీ చెప్పవద్దని వాడిని ఆదేశించి ఉంటుంది. పైపెచ్చు వాడు అమ్మకి నేను ఆ సందేశం గురించి అడిగినట్టు చెప్తాడు’’.
‘‘నేను మీకు ఆ సందేశం గురించి చెబితే నేను చెప్పినట్టు వెల్లడవుతుంది కదా! అందుకు నేను చెప్పను. మీరే కనుక్కోండి. క్షమించండి’’.
‘‘సరే నేనే కనుక్కుంటాలే’’
‘‘నేను ప్రదర్శనకి నోరాదడో వెళుతున్నా’’
‘‘ఎప్పుడు వెళుతున్నావు?’’
‘‘ఎల్లుండి వెళుతున్నా. రెండు రోజులు కార్యక్రమం ఉంటుంది. ఇహ సెలవు’’
‘‘సరే వెళ్ళు’’
అజోడా నోరాడడోకు వెళ్ళటానికి నిశ్చయించాడు. దానివల్ల మోరీతో అక్కడ కాలం గడపవచ్చు. అంతేకాక అక్కడ తననీ, మోరీని గుర్తుపట్టే వాళ్ళుండరు. మోరీని ఒప్పించి అక్కడే వాహ్యాళికి వెళ్ళే అవకాశం చిక్కవచ్చు. అక్కడ ఆమెకు చక్కని బహుమతి కూడా ఇవ్వదలిచాడు.
ఇంటిలో ఏం చెప్పాలో ఆలోచించాడు. ఆలోచించి తండ్రి హనాడాతో ఇలా అన్నాడు. ‘‘మన వస్త్రాల సరుకు లోధాల్ సముద్ర రేవుకు ఆలస్యంగా చేరుతోందిట. గాతున్‌దడలో వున్న దళారీ సుమాగా మన సరుకును లోధాల్ రేవుకు పంపడంలో ఆలస్యం చేస్తున్నాడు. అదీకాక ఇదివరకటి ఎగుమతుల డబ్బు కూడా అతడు ఇవ్వాలి. అందుకోసం అతడిని కలుసుకోవాలని అనుకుంటున్నా నాన్నగారు’.
‘‘ఔను, అతడు ఈమధ్య ఇక్కడకు రాలేదు. మన బకాయిలు గురించి గాతున్‌దడోకు వెళుతున్న వాళ్ళతో అతడికి కబురు పంపించా. ఇంతవరకు జవాబు రాలేదు. నువ్వు వెళ్లి ఆ డబ్బు కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేయడం మంచిదే’’ అన్నాడు హనోడా.
గాతున్‌దడో మొహంజదాడోకి ఎడ్లబండిమీద మూడు నాలుగు రోజుల దూరంలో వుంది. మోరీ ప్రదర్శన ఇస్తున్న నోరాదడో అక్కడకు దగ్గరే. కొన్ని ఘడియల ప్రయాణం.
‘‘మన ఎగుమతి సరుకు ఒక మాసంలో సిద్ధమవుతుంది. దాని గురించి కూడా మాట్లాడి కరారు చేసుకో’’.
‘‘అలాగే నాన్నగారు’’
‘‘ఐతే వెళ్లిరా నాయనా, మనం కొత్తగా కొన్న కోడెద్దుల బండిలో వెళ్ళు’’.
‘‘అలాగే నాన్నగారూ. అన్నట్టు నేను రావడానికి పది నుంచి 12 దినాలు పట్టవచ్చు. అక్కడ దగ్గరలో జోగార్‌లో జలపాతం, సరస్వతి నది మధ్య దీవిలోనున్న అమ్మవారి గుడిని కూడా చూసివస్తాను’’.
‘‘ఔను, ఆ జలపాతం నువ్వు చిన్నప్పుడు చూశావు. అమ్మవారి కోవెల చూసి కూడా చాలా ఏళ్ళయింది. అలాగే చూసిరారా నాన్నా’’ అంది తల్లి మాజా.
‘‘ఔనురా, నీకు కొత్త చోట్లు చూసినట్టూంటుంది. కాస్త ఆటవిడుపూ వుంటుంది. అయితే వీలైనంత తొందరగా తిరిగి వచ్చేయ్’’ అన్నాడు హనోడా.
‘‘ఔనురా నాన్నా, నువ్వు లేందే మాకు తోచదు’’ అంది తల్లి కాస్త బరువైన గొంతుతో.
‘‘అలాగేనమ్మా’’ అన్నాడు అజోడా.
ప్రయాణం రోజు బండి చోదకుడు జుంబా బండి సిద్ధం చేశాడు. జుంబా అజోడా విశ్వాసపాత్రుడు. తన ప్రయాణం వివరాలు ఎవరికీ చెప్పవద్దని అతడికి చెప్పి ఉంచాడు అజోడా.
మేదరి పెట్టెలో తన వస్త్రాలు, ఆభూషణాలు, పొడువాటి పీకగల కూజాలో నీళ్ళు ఓ బుట్టలో నిల్వ ఉండగలిగే చిరు ఆహార పదార్థాలు ఉంచి బండిలో పెట్టించాడు అజోడా.
జుంబా రెండు ఎడ్లని లాగడానికి పూన్చి ఒక అదనపు ఎద్దును వెనుక కట్టాడు. అది ఆటవిడుపునకు కట్టిన ఎద్దు. జుంబాకి వెళ్ళే ప్రాంతాల గురించి క్షుణ్ణంగా తెలుసు. ఇదివరకు ఆ ప్రాంతాలకు వెళ్లి వచ్చినవాడే.
ఇంటిలో అందరికీ వీడ్కోలు చెప్పి బండిలో కూర్చున్నాడు అజోడా. అతడి తల్లిదండ్రులు బండివరకు వచ్చి విజయంగా తిరిగిరా అని దీవించారు.
జుంబా బండిని నడిపాడు. బండి ఊరు దాటి రహదారిపైకి వచ్చింది. రహదారి రెండు వైపులా చలికాలపు పైర్లు పచ్చగా కనువిందు చేస్తున్నాయి. వాటిలో ప్రధానమైనది యవ పైరు. అక్కడక్కడ గోధుమ పైర్లు కూడా కనబడుతున్నాయి. బఠాణి, అవిసె పైర్లు కూడా దర్శనమిస్తున్నాయి. ఆకుపచ్చ పైర్లమధ్య పసుపు జల్లినట్లు ఆవ పైర్లు కనులకు ఉల్లాసం కలిగిస్తున్నాయి.
వేసంకాలమైతే జొన్న, నువ్వు, పత్తి విరివిగా కానవచ్చేవి. ఇక్కడ రైతులు ద్రాక్ష, ఖర్జూరం, పుచ్చకాయలు కూడా పండిస్తారు.
గడ్డి మేస్తున్న ఆవులు, మేకలు, గొర్రెలు సర్వసామాన్యంగా కనబడే దృశ్యాలు. కోళ్ళగూళ్ళు, కొటారిస్తూ సంచరించే కోళ్ళు ఎక్కడ పడితే అక్కడ ఎదురవుతూనే వుంటాయి.
దార్లన్నీ మట్టిదార్లే. అక్కడక్కడ మార్గం మరీ ఎత్తుపల్లాలతో ఉండడంవలన బండి తీవ్రమైన కుదుపులకు గురవుతోంది. 7 ఘడియలు (మూడున్నర గంటలు) ప్రయాణం తర్వాత బండిని ఓ చెట్టు నీడన నిలబెట్టి ఎడ్లని విప్పి విరామం ఇచ్చాడు. తర్వాత వాటికి నీళ్ళిచ్చి ముందు రెండు ఎడ్లలో ఒకదాన్ని వెనక్కు కట్టి వెనక కట్టిన దాన్ని ముందుకు కట్టాడు.
- ఇంకాఉంది

-పులిగడ్డ విశ్వనాథరావు