డైలీ సీరియల్

సింధు నాగరికతలో ఓ ప్రేమకథ-18

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అజోడా తప్పు చేసినవాడిలా వౌనం వహించాడు. ‘‘కొంచెంలో ప్రమాదం తప్పింది. జాగ్రత్తగా నడుపు’’ అని హెచ్చరించాడు ఆ చోదకుడు. అజోడా తల ఆడించి చిన్నగా నవ్వాడు, బండిని ముందుకు పోనిస్తూ.
కొంచెం దూరం వెళ్ళాక ‘పాట మానేశావేం మోరీ, పాడు’’
‘‘మీరు పాట వింటూ బండిని నడపడంలో అలక్ష్యం చేస్తున్నారు’’.
బండిని ఆపి ‘‘పాడు మోరీ, పాడు. నీ పాట విన్నాక బండిని నడుపుతా’’ అన్నాడు.
బండిని ఆపి పాటలో పూర్తిగా లీనమై విన్నాడు అజోడా. తర్వాత ‘‘మోరీ నీ పాట వింటూంటే ఆ బండాయన అన్నట్టు నా మనస్సు నిజంగా అలా ఆకాశ వీధుల్లో తేలియాడుతోంది’’ అన్నాడు.
మోరీకి నవ్వాగలేదు.
‘‘ఆ దున్న బండాయన మిమ్మల్ని కవి చేసేశాడు’’ అంది. అజోడా కూడా బిగ్గరగా నవ్వాడు.
‘‘నన్ను కపి నుంచి కవి చేసింది నీ పాట. ఏదీ మరోపాట అందుకో, బండి ఆపే ఉంచుతా’’.
ఈ విధంగా వాళ్ళు జోగార్‌కు చేరారు. ఓ ఏరు ఎత్తునుంచి లోయలోకి దూకుతోంది. ఆ జలపాతంనుంచి లోయలో చేరిన నీరు కొలనులా ఏర్పడింది. చెరువులో అదనంగా చేరుతున్న నీరు రెండు చిన్న ఏరుల్లా బైటకు పారుతోంది. ఆ ఏర్ల మధ్య ఊరు నెలకొంది. కొలను చుట్టూ చెట్లు, పొదలు, రకరకాల పక్షుల కువకువలు, పలుకులతో రమ్యాతిరమ్యంగా ఉంది ఆ ప్రదేశం.
అజోడా మోరీలు బండిని ఓ చోట నిలబెట్టి ఎద్దులను విప్పి అక్కడ ఉన్న ఒకడికి రుసుము ఇచ్చి అప్పజెప్పారు. వాళ్ళే వాటి దాణా, నీళ్ళు అవరాలను చూసుకుంటారు.
ఇద్దరూ భోజనం సంచీతో బయలుదేరి కొలను ఒడ్డున చెట్లతోపు మధ్య ఓ చోటు ఎంచుకుని కూర్చున్నారు.
‘‘మోరీ ఇవాళ నా కల సాకారమైంది. మనం ఇద్దరం పక్షులుగా మారి ఎక్కడెక్కడికో ఎగిరిపోవాలని నా మనసు ఉవ్విళ్లూరుతోంది.’’
‘‘ఇందాక మీ మనసు ఆకాశ వీధుల్లో తేలియాడుతోందన్నారు? ఇపుడు పిట్టగా మారి ఎగిరిపోవాలనుకుంటోందా?’’ నవ్వుతూ అంది మోరీ కొంటెగా.
‘‘నీ పాట విన్నప్పుడు అలా అనిపించింది. ఇపుడు ఈ మనోహర వాతావరణంలో నువ్వు నేను పక్షులుగా మారి ఎగురుతూ ఆకాశం నుంచి ఈ అపురూప ప్రాకృతిక సౌందర్యాన్ని వీక్షించాలని ఉంది’’.
‘‘అప్పుడు అమ్మమ్మ చెప్పే కథల్లో మంత్రగత్తె వచ్చి మనని పక్షులుగా ఉండిపొమ్మని మంత్రిస్తే మన బండి, ఎద్దులు, నా కార్యక్రమం ఏమవాలి?’’
‘‘మనం చిలకా గోరింకల్లా కాపురం చేయవచ్చు’’.
ఇద్దరూ కబుర్లు చెప్పుకుంటూ తెచ్చిన భోజనం ఆరగించి కొలనులో స్వాదు జలాన్ని తాగారు.
అజోడా తాను తెచ్చిన కానుకను తీసి ఆమెకు చూపెట్టాడు.
‘‘చూశావా, వీటిని నీ కోసం సుమేర్ నుంచి వచ్చిన నగల వర్తకుడి వద్ద కొన్నా’’ అన్నాడు.
‘‘చాలా ఖరీదైనవవిగా ఉన్నాయి’’
‘‘లేకపోతే నీకోసం చవక కానుక కొంటానా? అటువంటివి నువ్వు ధరిస్తే నాకే అవమానం కదా! అదీకాక నా ప్రేమతో పోలిస్తే ఇది కూడా సరితూగదు. ఏదీ నీ చేయి.. నేను తొడుగుతా..’’
‘‘వద్దండీ.. దీన్ని మా అమ్మా నాన్నలనుంచి ఎలా దాచగలను?’’
‘‘దాని గురించి కూడా ఆలోచించా మోరీ. నువ్వు వాళ్ళ కళ్ళపడకుండా ఉంచలేకపోతే నా వద్దే ఉంచు. మన వివాహం అయాక నీ చేతులకే ఉంటుంది, ఏదీ చేయి..’’ అంటూ ఆమె కుడి చేయి పట్టుకుని ఏకాగ్రతతో చూశాడు.
‘‘ఇది మానవ చేయా లేక స్వర్గం నుంచి దిగివచ్చిన అప్సరస చేయా?’’ అన్నాడు అజోడా చేతిని చుంబిస్తూ.
‘‘చాలులెండి మీ పొగడ్తలు..’’ అంది మోరీ సిగ్గుతో.
‘‘ఈ పాణిని ఇలానే జీవితాంతం నేను గ్రహించాలని నా అభీష్టం. మరి నీ అభీష్టం?’’
‘‘నా చేతి నాడి మీ చేతిలోనే ఆగిపోవాలని దేవుడికి నా ప్రార్థన’’
‘‘అలా అని నన్ను ఎంత వేదనకు గురిచేశావో తెలుసా? నువ్వు లేకపోతే నేనూ లేనట్టే’’.
‘‘నా ఉద్దేశ్యం, నాలో శ్వాస ఉన్నంతవరకు మీకు తోడుగా ఉండాలని’’.
‘‘సరే.. పువ్వుల్లాంటి ఈ చేతులు ఎన్నడూ కందిపోకుండా చూసుకుంటానని మాట ఇస్తున్నా’’ అని ఆమె చేతులకు బంగారు కడియాలు తొడిగాడు.
‘‘చూడు, నువ్వు ధరించినందుకు వీటికి ఎంత అందం వచ్చిందో?’’
ఆమె చేతులను చూసుకుంది.. ఆమె కళ్లుకాంతివంతమయాయి. గోమేధాలు, సూర్యకాంతులు పొదిగున్న ఆ కడియాలు పసిడి వెలుగులు రత్నాల తళుకులు వెదజల్లుతున్నాయి. చేతికి ఒకటి కాదు జత కాదు చెరో చేతికి మూడేసి జతలు.
అంత విలువైన నగలు ధరించిన ఏ కన్య మనసులో ఆనందం పాలవెల్లువ పొడిచినట్లుండదూ. అందులోనూ తననూ తన అందాన్ని కొలుస్తున్న సంపన్నుడూ, సమర్థుడూ, స్ఫురద్రూపి అయిన వరుడు తనకు ధరింపజేస్తే!
ఆమె కళ్ళల్లో ఉప్పొంగిన సంతోషాన్ని చూసిన అజోడా ‘‘మహారాణి, ఈ నగలేపాటి. ఇంకా విలువైన నగలు మీకు సమర్పించదలిచాడు మీ ఈ భక్తుడు. ఎందుకంటే మీ సంతోషమే ఈ భక్తుడి సంతోషం’’.
‘‘నాకు ఇప్పటికి ఈ నగలు చాలు దొరగారు. కానీ నాకు ఈ నగలుకంటే విలువైన నగలు కావాలి. అది మన వివాహం తర్వాత చెప్తాను’’.
‘‘మణిహారం కావాలా? 24 పేటల హారమా?’’
‘‘వాటికంటే విలువైన నగలు కావాలి. తర్వాత చెప్తా. ఓపిక పట్టండి. మన వివాహం కానీయండి’’.
‘‘సరే. ఎప్పుడు చెప్తే అప్పుడే ఇచ్చుకుంటా. ఏవీ నీ చేతులు అని ఆమె చేతుల్ని తీసుకుని తన చెంపలకి తాకించాడు. ఆమె కూడా అతడి చేతుల్ని తీసుకుని తన చెంపలకు తాకించింది.
దాంతో అతడి మనసు విచ్చిన ఉమ్మెత బూచిలా గాలిలో తేలిపోయింది.
‘‘పద మోరీ, అలా ఈ కొలను తీరాన తిరిగి వద్దాం. చూడు కొలనులో పడవలు ఉన్నాయి. మనం నౌకావిహారం కూడా చేయవచ్చు’’. - ఇంకాఉంది

-పులిగడ్డ విశ్వనాథరావు