డైలీ సీరియల్

వ్యూహం-20

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తన పంట పండింది.
తిలక్ నిద్ర మత్తులో వుంటాడు కాబట్టి తను దర్జాగా బీరువాలో దొరికిన డబ్బు తీసుకుని ఉడాయించవచ్చు. నెల రోజులు దిగుల్లేదు.. ఆ డబ్బు ఖర్చుపెట్టుకుని సరదాగా తిరగొచ్చు...
శబ్దం రాకుండా బీరువా తలుపులు తీశాడు. పైఅరలో నోట్ల కట్టలు దొరికేయి. ఆ నోట్ల కట్టలు తీసుకుని ప్యాంటు జేబుల్లో కుక్కుకున్నాడు.
ఆ అరలో ఇంకా ఏమన్నా నోట్ల కట్టలు, బంగారం వస్తువులు ఉన్నాయేమోనని చేతితో తడిమాడు.
నోట్ల కట్టల దగ్గర వెండి వినాయకుడి ప్రతిమ వుంది. ఆ ప్రతిమ శేషగిరి చేతికి తగిలి కింద గచ్చుమీద పడింది.
తండ్రి మంచం ప్రక్కన కింద చాపమీద పడుకున్న తిలక్ కొడుకులకు ఆ శబ్దానికి మెలకువ వచ్చింది.
బీరువా దగ్గర ఎవరో తచ్చాడుతున్నట్లుగా కన్పించింది.
ఆ కుర్రాళ్ళు ఇద్దరూ చీకట్లో కదలాడుతున్న శేషగిరి మీదకు సింహాల్లా దూకారు. వాళ్ళనుంచి తప్పించుకోవాలని ప్రయత్నించినా శేషగిరి వల్ల కాలేదు.
తిలక్ కొడుకులు ఆ గదిలో పడుకుంటారని శేషగిరి ఊహించలేదు. బీరువాలో పది లక్షల దాకా డబ్బు ఉందని, ఎందుకైనా మంచిదని ఇద్దరి కొడుకులను గదిలో పడుకోమన్నాడు.
కొడుకుల కేకలకు మెలుకువ వచ్చి లేచి లైటు వేశాడు తిలక్. లైటు వెలుగులో తన కొడుకుల చేతుల్లో పిడిగుద్దులు తింటున్న శేషగిరిని చూశాడు.
‘‘చివరకు ఈ స్థాయికి దిగజారిపోయావా?’’ శేషగిరి వైపు అసహ్యంగా చూస్తూ అన్నాడు తిలక్.
‘‘పోలీసులను పిలిచి వాళ్ళకు అప్పగిద్దాం’’ అన్నాడు తిలక్ పెద్దకొడుకు.
‘‘ఒకసారి జైలుకు వెళ్లి బెయిల్‌మీద బయటకు వచ్చాడు. ఏడేళ్ళ జైలుశిక్ష ఎటూ పడుతుంది వీడికి.. కొత్తగా వీడికి వచ్చే అపకీర్తి ఏమీ లేదు. భార్యాపిల్లల ముందు వీడిని అవమానించి చితకబాది వదిలేద్దాం. అంతకుమించిన పెద్ద శిక్ష లేదు. వీడి భార్య, పిల్లలు జన్మలో వీడి మొహం చూడకూడదన్నంత విరక్తి పుట్టాలి’’ అన్నాడు తిలక్.
కాళ్ళు, చేతులు కట్టి గదిలో ఓ మూల పడేశారు అతన్ని.
తెల్లవారగానే ఇంటిముందు నిలబెట్టి అందరికీ తెలిసేటట్లు శేషగిరి నిర్వాకం గూర్చి పెద్దగా కేకలు వేశారు. చుట్టుప్రక్కలవాళ్ళంతా గుమిగూడేరు. పక్కింట్లో వున్న అన్నపూర్ణ, పిల్లలు కూడా ఆ కేకలకు బయటకు వచ్చి చూశారు.
దొరికిన దొంగ అందరికీ లోకువే!
చుట్టుప్రక్కల వాళ్ళు శేగిరిని చూసి ‘‘పక్కింట్లోనే దొంగతనానికి సిద్ధపడటమా? కాయకష్టం చేసుకుని భార్యాబిడ్డలను పోషించవచ్చు కదా! రిక్షా లాక్కొనేవాడు, చెప్పులు కుట్టేవాడు, రోడ్డుమీద కాయగూరలు అమ్ముకునేవాళ్ళు ఎంతో గౌరవంగా బ్రతకడంలేదూ.. అలా బ్రతకొచ్చుగదా! ఇదేం పని?’’ ముక్కుమీద వేలేసుకున్నారు.
తల్లిదండ్రుల ఆస్తి స్వాధీనంలోకి తెచ్చుకుని ముసలివాళ్ళను మూలకు నెట్టినవాడు, మోసాలు చేసి బ్రతికేవాళ్ళు, అనె్నం పునె్నం ఎరుగని ఆడపిల్లమీద అఘాయిత్యం చేసినవాడు- వీళ్ళందరూ చేతి దురద తీర్చుకున్నారు.
వాళ్ళందరూ తనను కొడుతున్నా, తిడుతున్నా శేషగిరి పట్టించుకోలేదు. కళ్ళల్లో నీళ్ళు నింపుకుని తనవైపు చూస్తున్న అన్నపూర్ణనుచూసి తట్టుకోలేకపోయాడు. పిల్లలు అమాయకంగా, బేలగా తనవైపు చూస్తున్నారు.
గుండెల్లోనుంచి దుఃఖం పొర్లుకు వచ్చింది.
వెక్కి వెక్కి ఏడ్చేశాడు.
జనంలో మళ్లీ జాలి పొంగిపొర్లింది.
అతడిని ఒంటరిగా వొదిలేసి వెళ్లిపోయారు.
అతని భార్యాపిల్లలు కూడా ఇంట్లోకి వెళ్లిపోయారు.
ఇంట్లోకి వెళ్ళడానికి మొహం చెల్లలేదు.
సికింద్రాబాద్ స్టేషన్‌కు వచ్చి కన్పించిన ట్రైన్ ఎక్కాడు- ఆ ట్రైన్ ఎక్కడకు వెళ్తుందో పట్టించుకోకుండానే. అది విజయవాడ వెళ్ళే రైలు.
దిగులుగా తలొంచుకుని కూర్చున్నాడు. ప్రక్కన కూర్చున్న అరవైయ్యేళ్ళ పెద్దాయన గమనిస్తూనే ఉన్నాడు శేషగిరిని.
‘‘ఏం అలా తలొంచుకుని కూర్చున్నావ్? ఆరోగ్యం బాగాలేదా?’’ అడిగాడు.
సమాధానం ఇవ్వకుండా కూర్చున్నాడు.
‘‘మంచినీళ్ళు త్రాగుతావా? తన దగ్గరున్న వాటర్ బాటిల్ ఇవ్వబోయాడు పెద్దాయన.
‘‘వద్దండీ?’’’
ఆ పెద్దాయన పేరు బలరామయ్య. నూజివీడు దగ్గర కోళ్ళఫారంలు వున్నాయి. శేషగిరిని చూస్తూ ‘‘ఇబ్బందుల్లో వున్నట్లున్నాడు.. వదిలెయ్యకూడదు’’ అనుకున్నాడు. వ్యవసాయం చేసి అప్పుల్లో మునిగిపోయి ఆత్మహత్య చేసుకున్న తమ్ముడు గుర్తుకు వచ్చాడు. తమ్ముడు ఆర్థిక ఇబ్బందుల్లో వున్నప్పుడు తనదగ్గర డబ్బు లేదు. తను నిలదొక్కుకున్నాక, తన పరిధిలో తాను సహాయం చేస్తూనే ఉన్నాడు.
శేషగిరిని నూజివీడు తీసుకువెళ్లాడు. పౌల్ట్రీ ఫారం దగ్గర అతన్ని వుంచి పనివాళ్ళమీద అజమాయిషీ, కోళ్ళ గుడ్ల అమ్మకం అతనికే అప్పగించాడు. లక్ష, రెండు లక్షలు శేషగిరికి ఇచ్చి బ్యాంకులో జమ చేయమనేవాడు. ఆ డబ్బు తీసుకుని పారిపోలేదు.
బలరామయ్యగారు తనమీద వుంచిన నమ్మకాన్ని వమ్ము చెయ్యలేదు. ఎన్నో తప్పులు చేసి ఇప్పటికే నరకం అనుభవించాడు. మళ్లీ తప్పులు చేయకూడదనుకున్నాడు. రెండేళ్ళు సజావుగా సాగిపోయాయి.
భార్యా పిల్లలను చూడాలనిపించింది. హైదరాబాద్ వెళ్ళాడు. ఇంటికి వెళ్ళాలనిపించలేదు. వెంకటేశ్వర స్వామి ఆలయంకు శనివారం సాయంత్రం పూట భార్య, పిల్లలు వచ్చే అలవాటు వుంది. ఆలయం దగ్గర ఓ ప్రక్కన నిలబడి భార్యా పిల్లల కోసం ఎదురుచూస్తూ నిలబడ్డాడు. ‘వాళ్ళకు కన్పించకుండా దూరంనుంచి వెళ్లిపోవాలి’! అదీ అతని ఆలోచన. పోలీసుల కళ్ళ బడ్డాడు. అప్పటికే అతనిమీద వున్న డ్రగ్స్ సరఫరా కేసు విచారణ పూర్తిఅయ్యింది. శేషగిరికి ఏడేళ్ళు జైలుశిక్ష పడింది. అతని కోసం గాలిస్తూ వున్నారు పోలీసులు. వాళ్ళకు దొరికిపోయాడు.
ఏడేళ్ళు శిక్ష అనుభవించి బయటపడ్డాడు.
- ఇంకా ఉంది

అలపర్తి రామకృష్ణ