డైలీ సీరియల్

యమహాపురి 54

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అది ఒక చిన్న గది. గదిలో చల్లదనంతోపాటు వెనె్నలకాంతి. నేలమీద కార్పెట్.
గది మధ్యలో డైనింగ్ టేబుల్. దానిపై అందమైన పింగాళి గినె్నల్లో సద్దిన విందు భోజనం.
బల్లచుట్టూ నాలుగు కుర్చీలు. మాత, పుత్ర, రాజా- మూడింట్లో కూర్చున్నారు. ఒకటి ఖాళీగా ఉంది.
అందమైన ఓ యువతి, అందమైన దుస్తులు ధరించి, ముగ్గురిముందూ ప్లేట్లలో పదార్థాలు వడ్డించింది.
‘‘టామీ- వెళ్లి తలుపు మూసి గది బయట నిలబడు’’ అంది మాత.
‘‘టామీ?! మనిషికి అదేం పేరు?’’ అనుకుంటూ రాజా ఉలిక్కిపడ్డాడు. ఈలోగా- ఆ యువతి కదలగానే కాలికున్న గొలుసు నాలుగో కుర్చీకి తగులుకుని ముందుకు పడబోయి తమాయించుకుంది.
‘‘రెండు నెలల నుంచి ఇక్కడున్నావు. ఇంకా అలవాటు పడలేదా?’’ మాత గొంతు క్రూరంగా పలికింది.
అందమైన మహిళ మాత. అంతవరకూ ఎంతో సౌమ్యంగా మాట్లాడింది. ఆమె గొంతులో అంత క్రూరత్వం పలుకుతుందని ఊహించలేదు రాజా. ‘‘అధికార దర్పం ప్రభావం కాబోలు’’ అనుకున్నాడు.
ఆ యువతి కుర్చీనుంచి గొలుసు విడిపించుకుని మాతకేసి చూసి నవ్వింది.
ఆ నవ్వులో అసహాయత లేదు. అవమానభారం లేదు. బాధ లేదు.
కొంత సంజాయిషీ, కొంత గౌరవం, కొంత ఆరాధన. చాలావరకూ అమాయకత్వం.
‘‘అది మంచితనమా? బానిస మనస్తత్వమా?’’ అనే మీమాంసలో రాజాకి కడుపులో దేవినట్లయింది.
అది క్షణమాత్రమే. టామీ వెళ్లిపోయాక- మాత గొంతు అమ్మంత కమ్మగా, ఆప్యాయంగా ఉంది. ఆమె అతణ్ణి తన కొడుకుతో సమంగా ఆదరిస్తూ- తను తింటూ, వాళ్లకి కొసరి కొసరి వడ్డించి తినిపిస్తుంటే- విందు భోజనం అద్భుతంగా ఉంది.
ఎంతటి సామాజిక స్పృహ ఉన్నా- విలాసం అన్నింటినీ మర్చిపోయేలా చెయ్యగలదు. ఆ విలాసానికి అమ్మ ఆప్యాయత జతపడితే ఇక వేరే చెప్పాలా?
‘‘ఇలాంటి విందు నా జీవితంలో ఎరుగను. మీకు చాలా చాలా థాంక్స్’’ అన్నాడు రాజా.
‘‘ఇంతవరకూ ఈ ఇంట్లో ఈ గదిలో భోంచేసింది ముగ్గురే ముగ్గురు. నువ్వు నాలుగోవాడివి’’ అంది మాత.
ఆ గది యమకీ, ఆయన భార్యాబిడ్డలకీ మాత్రమే పరిమితమని రాజాకి అర్థమయంది. అందులో తనకి స్థానం లభించిందంటే- తాను యమకి ప్రతినిధి అని వారు గట్టిగా నమ్మారు. కాదని తెలిస్తే?
తన కాళ్లకి ఏదో గొలుసు తగిలినట్లు అనిపించి- ఓసారి కాలు విదిపాడు రాజా. కాలు స్వేచ్ఛగా కదలడంతో తేలికగా నిట్టూర్చి, ‘‘నాలుగోవాడిగా ఈ గదిలో అడుగెట్టిన నాకు రెండో అమ్మ దొరికింది. మీకు పాదాభిందనం చెయ్యాలనుంది’’ అన్నాడు.
‘‘అలాంటి కోరిక నా పుత్రకీ ఉంది. కానీ దేవుడికే తప్ప మనుషులకి పాదాభివందనం చెయ్యకూడదని ఇక్కడి నియమం’’ నవ్వింది మాత.
ఆ నవ్వులో రవంత గర్వం. సాక్షాత్తూ దేవుడే తనకి భర్త అయ్యాడనేమో!
రాజా పుత్ర వంక చూశాడు. అతడి ముఖంలో ఏదో తెలియని నిరాసక్తత. అదే నిరాసక్తత రాజా పట్ల కూడా ఉన్నట్లుంది. ‘‘పుత్ర ఏం చేస్తుంటాడు?’’ అన్నాడు రాజా.
మాత ముఖంలో గాంభీర్యం. ‘‘నువ్వు ఏదో అడగాలన్నావు. అది ఇది కాదనుకుంటాను’’ అందామె.
పుత్ర గురించి చెప్పడం ఆమెకిష్టం లేదని రాజాకి అర్థమైంది. ‘‘మీరు తర్వాత మాట్లడుకుందాం అన్నారని..’’
‘‘ఔను. ఏమైనా సందేహాలుంటే కడుపునిండా తిన్నాక అడగాలి. అప్పుడు మనసు ప్రశాంతంగా ఉంటుంది. అడిగేదాంట్లో స్పష్టత ఉంటుంది. వినేది వంటబడుతుంది. ఇప్పుడు మన భోజనాలైపోయాయి. కాబట్టి నువ్విక అడిగేది అడగొచ్చు’’ అంది మాత.
రాజా గొంతు సవరించుకుని, ‘‘ఆదరణకూ ఆప్యాయతకూ మీకు మీరే సాటి. ఆపైన మీలో అసలు సిసలు అమ్మ ఉంది. నన్ను మీరు బిడ్డలా భావించి ఆదరించారు. ఈ పరిసరాల్లో వున్న మనుషులందరూ ఎంతో అదృష్టవంతులని నాకనిపిస్తోంది’’ అన్నాడు.
‘‘నువ్వు చెప్పింది విన్నాను. అది నీ అభిప్రాయం. దాని గురించి నేనేమనను. కానీ నువ్వేదో అడగాలనుకున్నావ్! నిర్భయంగా అడుగు’’ నిర్భయంగా అన్న పదాన్ని ఒత్తి పలికింది మాత.

‘‘ఈమె తెలివైనది. మనసుని చదవగలదు. మనసులో మాట చెప్పించగలదు. ఈమె విషయంలో జాగ్రత్తగా ఉండకపోతే- నా గురించిన అసలు విషయం కూడా బయటపడిపోవచ్చు’’ అనుకున్నాడు రాజా. మళ్లీ గొంతు సవరించుకుని, ‘‘కానీ ఇక్కడ కొందరు మనుషుల్ని జంతువుల్లా రాటలకి కట్టేసి పనులు చేయిస్తున్నారు. ఒకోసారి వాళ్లని క్రూరంగా హింసిస్తున్నారు’’ అన్నాడు.
మాత ఆశ్చర్యంగా ‘‘నువ్వు దేవుడి ప్రతినిధివి కాబట్టి- నిన్ను ప్రత్యేకంగా చూస్తున్న మాట నిజం. కానీ నీ అంత కాకపోయినా మిగతా మనుషుల్ని కూడా ఎంతో బాగా చూసుకుంటాం. మనుషుల్ని రాటకి కట్టి క్రూరంగా హింసించడం నువ్వెక్కడ చూశావో నాకర్థం కాలేదు’’ అంది.
ఆమె అలా అనేసరికి ఆశ్చర్యపోవడం రాజా వంతయింది. ‘‘ఇప్పుడు మనకి భోజనం వడ్డించి వెళ్లిన యువతి కాలికి గొలుసుంది. అది తగులుకుని ఆమె పడిపోబోయింది కూడా!’’ అన్నాడు.
మాత మరింత ఆశ్చర్యపడి ‘‘అదా-నీకది మనిషిలా కనిపించిందా?’’ అంది.
రాజా తెల్లబోయి, ‘‘రెండు కాళ్లమీద నిలబడింది. చీర కట్టింది. మనిషిలాగే చేతులు ఉపయోగిస్తోంది. మనం చెప్పినవన్నీ అర్థం చేసుకుంటోంది. ఆమెను మనిషి కాదని ఎలా అనుకుంటాను?’’ అన్నాడు.
మాత అతడివంక ‘‘ఓరి అమాయకుడా’’ అన్నట్లు చూసింది.
చిలక మనిషిలా మాట్లాడుతుంది. చిలకని మనిషి అనుకుంటామా?
కుక్క మనిషి చెప్పిన పనులన్నీ చేస్తుంది. కుక్కని మనిషనుకుంటామా?
చింపాంజీ రెండు కాళ్లమీదా నడుస్తుంది. చింపాంజీని మనిషనుకుంటామా?

ఇంకా ఉంది

వసుంధర