డైలీ సీరియల్

వ్యూహం-65

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోటు జేబులోవున్న పిస్టల్ బయటకు తీసి రెప్పపాటు కాలంలో అరవింద్ తలకు, ఛాతికి గురిపెట్టి నాలుగు రౌండ్లు కాల్చాడు.. తల నుంచి ఛాతినుంచి రక్తం కారడం మొదలైంది.
అరిఫ్ పిస్టల్ తనకు గురిపెట్టి కాల్చుతాడని అనుకోలేదు అరవింద్. ఏదన్నా అనుకోవడానికి అతని మెదడు సహకరించలేదు. కుప్పలా కూలిపోయాడు.
డాక్టర్ అరవింద్ కథ అలా ముగిసింది.
బయట నిలబడ్డ సెక్యూరిటీ గార్డును లోపలికి పిలిచాడు అరిఫ్.
‘‘వీడి శవాన్ని సంచిలో కుక్కి హెలికాప్టర్‌లో పడెయ్యండి!’’ అన్నాడు అరిఫ్.
సెక్యూరిటీగార్డులు శవం వున్న మూటను తీసుకువెళ్తుంటే ఆ మూటలో ఏముంది ఇద్దరు ముగ్గురు అడిగారు.
‘‘హాస్పిటల్లో వాడిపడేసిన సిరెంజ్‌లు, కాటన్, పాత మందుల డబ్బలు, సీసాలు వున్నాయి మూటలో.. హాస్పిటల్ డిస్పోజబుల్ వేస్టో!’’ సమాధానమిచ్చాడు సెక్యూరిటీ గార్డు.
శవాన్ని హెలికాప్టర్‌లో పడేశారు.
అరిఫ్ ఎక్కి కూర్చున్నాక హెలికాప్టర్ బయల్దేరింది.
గోదావరి మీదుగా వెళ్ళేటప్పుడు నీళ్ళలో ఆ మూటను జారవిడిచారు సెక్యూరిటీ గార్డులు.
***
కారు వేగంగా నడుపుతూ సూర్యాపేట దగ్గరకు విచ్చేశాడు నాగరాజు. టీ త్రాగాలనిపించి వేసైడ్ హోటల్ ముందు ఆపాడు కారు.
డోర్ లాక్ చేసుకుని కారు కీస్ జేబులో వేసుకుని హోటల్లోకి అడుగుపెట్టబోయాడు.
కారును గమనిస్తూ నలుగురు వ్యక్తులు అతని దగ్గరకు వచ్చారు.
‘‘రెండు సంవత్సరాల క్రిందట పాతిక వేలు తీసుకున్నావ్. అడుగుతున్నామని తప్పించుకు తిరుగుతున్నావ్.. వెంటనే ఇచ్చెయ్యి!’’ అన్నాడు ఓ వ్యక్తి నాగరాజు చొక్కాపట్టుకుని.
ఎవరి దగ్గరా రూపాయి అప్పు తీసుకోడు తను.. వాళ్ళెవ్వరో కూడా తనకు తెలియదు.. పొరపాటు పడ్డారేమో! ఎవరో అనుకుని తనను పట్టుకున్నారేమో అనుకున్నాడు నాగరాజు.
‘‘నా పేరు నాగరాజు.. కారు డ్రైవర్ని.. ఉన్నదాంట్లో సర్దుకుపోవడమేగాని అప్పులు చెయ్యడం నాకు అలవాటు లేదు.. మీరు ఎవరో కూడా నాకు తెలియదు’’
‘‘అప్పు తీసుకున్నాక అప్పు ఇచ్చినవాడు ఎవడో తెలియనట్లు నటిస్తూ వుంటారు.. నువ్వు డాక్టర్ అరవింద్ గారి కారు డ్రైవర్‌వి కదూ!’’ అడిగాడు ఓ వ్యక్తి.
క్యాష్ కౌంటర్ దగ్గర కూర్చున్న హోటల్ యజమానికి ఆ నలుగురు రౌడీల సంగతి తెలుసు. తను జోక్యం చేసుకుంటే రోడ్డు ప్రక్కన తన హోటల్ని నడవనివ్వరు. రోజూ తాగొచ్చి అల్లరి చేస్తారు. వౌనంగా వుండిపోయాడు.
హోటల్లో వున్న ఇద్దరు కష్టమర్స్ బయటకు వచ్చి వినోదం తిలకిస్తున్నట్టు నిలబడ్డారు ఓ ప్రక్కన.
నాగరాజు ఏం మాట్లాడకపోయేసరికి వాళ్ళు అరవింద్ మీద ఎగబడ్డారు.
‘‘డాక్టరుగారి సమక్షంలోనే గదా నువ్వు మా దగ్గర డబ్బు తీసుకుంది’’
‘‘మీరెవరో నాకు తెలియదు’’
‘‘డాక్టర్ అరవింద్‌గారి కారుడ్రైవర్‌వని మేము అంటుంటే వొప్పుకుంటున్నావ్.. మళ్లీ మేము ఎవరో తెలియదని బుకాయిస్తున్నావ్.. మీ డాక్టర్ గారి పేరు మాకెలా తెలుస్తుంది’’ అన్నాడు ఒకతను నాగరాజు ఛాతిమీద గుద్దుతూ.
‘‘ఏయ్.. అనవసరంగా కెలుక్కుంటున్నావ్.. నామీదకు వస్తే మర్యాద ఉండదు’’ తనమీద పడుతున్నవాడిని నెట్టివేసే ప్రయత్నం చేశాడు నాగరాజు.
ముష్ఠియుద్ధం మొదలైంది.
ఒక్కడు, ఇద్దరు అయితే నాగరాజు గట్టిగానే సమాధానం చెప్పేవాడు. వాళ్ళు నలుగురయ్యేసరికి వాళ్ళు కొట్టే దెబ్బలు తట్టుకోలేక కిందపడ్డాడు.
అతడి జేబులోని కారు కీస్ లాక్కున్నారు. కారు ఎక్కి కూర్చున్నారు నలుగురు.
కారు వెనుక సీట్లో బ్రీఫ్ కేసు కన్పించింది. బ్రీఫ్ కేస్ ఓపెన్ చేసి చూశారు. బ్రీఫ్‌కేసులో నోట్ల కట్టలు వుంటాయేమోనని ఆశపడ్డారు. కాగితాలు, సీడీలు చూసి నిరుత్సాహపడ్డారు. ఆ బ్రీఫ్‌కేసు కారు విండో నుంచి విసిరేశారు రోడ్డుమీదకు. సీడీలు, డాక్యుమెంట్లు చెల్లాచెదురుగా పడ్డాయి.
కారు దగ్గరకు పరుగెత్తాడు నాగరాజు.. అతను వచ్చింది కిందపడ్డ పేపర్లు, సీడీలకోసం.
‘‘మా డబ్బు మాకు ఇచ్చేసి కారు తీసుకుపో’’ అంటూ గట్టిగా అరిచాడు కార్లో కూర్చున్న వ్యక్తి.
కారు హైదరాబాద్ వైపు దూసుకెళ్లింది.
ఆ నలుగురు కారు లిఫ్టర్స్. నగరం చుట్టూ వున్న రహదార్ల మీద కాపు కాసి అజాగ్రత్తగా వున్న కారు డ్రైవర్లను గమనించి కార్ల దొంగతనం చేస్తూ వుంటారు. సిటీకి తీసుకొచ్చి అదే రోజు కారు తెలిసిన కారు గ్యారేజీ వాళ్ళకు అమ్మేస్తూ వుంటారు. కారు వెనుకవైపు అద్దం మీద వున్న ‘డాక్టర్ అరవింద్, గుడ్ సమారిటన్ హాస్పిటల్’ అన్న అక్షరాలు చూసి వాళ్ళు నాగరాజును ఇబ్బందిలో పెట్టారు.
రోడ్డుప్రక్కన పడ్డ పేపర్లు, సీడీలు అన్నీ ఏరుకుని బ్రీఫ్ కేసులో సర్దుకున్నాడు. డాక్టర్ అరవింద్‌కు ఫోన్ చేసి జరిగిన సంఘటన గూర్చి చెబుదామనుకున్నాడు నాగరాజు, ఫోన్ ఎవరూ ఎత్తలేదు. స్కందగారికి ఫోన్ చేసి జరిగిన సంఘటన వివరాలు చెప్పాడు.
బ్రీఫ్‌కేసు పట్టుకుని రోడ్డుమీద నిలబడ్డాడు.
హైదరాబాద్‌వైపు వెళ్తున్న కారునెంబరు చూసి గుర్తుపట్టాడు. ఆ డ్రైవర్ తనకు తెలిసినవాడే!
కొంచెం ముందుకు వెళ్లి కారు ఆపాడు ఆ డ్రైవరు. పరుగెత్తుకుంటూ వెళ్లి ఆ కారు ఎక్కాడు.
ఆ కారు సికింద్రాబాద్ వెళ్లాలి. తార్నాకా క్రాస్‌రోడ్స్ దగ్గర ఆపుతానన్నాడు డ్రైవరు.
తార్నాకానుంచి ఆటోలో డిఐజి ఆఫీసుకు వెళ్ళాడు నాగరాజు.
***
డిజిపి కార్యాలయం గేటు దగ్గర వుండే సెక్యూరిటీ స్ట్ఫాకు ముందే చెప్పాడు స్కంద- ‘నాగరాజు అనే వ్యక్తి వస్తే లోపలికి పంపించమని’.

ఇంకాఉంది

అలపర్తి రామకృష్ణ