డైలీ సీరియల్

త్రిలింగ ధరిత్రి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొత్త సీరియల్ ప్రారంభం
*
ఓం నమశ్శివాయ!
ఓం నమశ్శివాయ!
ఓం నమశ్శివాయ!
గణపతిదేవుడు నిమీలిత నేత్రుడై పంచాక్షరీ మంత్రం తదేక దీక్షతో జపిస్తున్నాడు.
గణపతిదేవుడు పదేండ్లుగా బందీకృతుడై అక్కడే ఉన్నాడు. బంధము, నిర్బంధము అన్న మాటే గాని అతని వద్దకు వచ్చిపోయే వాళ్లకు ఏ ఆంక్షలూ లేవు. రాదలచుకున్న వాళ్లు వస్తూనే ఉన్నారు పోతూనే ఉన్నారు. రాచమర్యాదలు సాగుతూనే ఉన్నాయి. భటులు అత్యంత విధేయులు గానే మెలగుతున్నారు. సంబోధనలూ ‘‘ప్రభూ!’’ అనే సాగుతున్నాయి. ఆయన దినచర్యకు, దైనందిన వీరోచిత వ్యాయామాది కార్యక్రమాలకు, స్నానపానాలకు నిష్ఠా నియమాలకు రాజలాంఛనాలు లేకపోయినా రాజోచిత మర్యాదకు భోజనానికి ఏ లోటు లేదు.
ఆ సువిశాలమైన ప్రాకారాంతర్భాగంలో ఆయన విహరించడానికి, అశ్వారోహణకు, కత్తిసాముకు, విలువిద్యకు, మల్లయుద్ధానికీ ఎటువంటి ఆటంకాలు లేవు. అన్నీ యథేచ్ఛగా సాగిపోతున్నాయి. దీనికి భటులు, సైనికులు ఎంతో సహకరిస్తున్నారు. అక్కడి ఆయుధ సామాగ్రి అందుబాటులో ఉంది.
గణపతి దేవుడు విలువిద్యలో, ఖడ్గవిద్యలో ఆరితేరాడు. మేటి అశ్వసాహిణి అయినాడు. ఎంత ఎదిగినా వస్తధ్రారణలో మార్పు రాలేదు. గణపతి దేవుడు రోజూ ఉదయం దైనందిన వ్యాయామానంతరం స్నానం చేసి గోక్షీరం సేవించి ఎవరైనా వచ్చేదాకా పంచాక్షరి జపిస్తూ ఉంటాడు.
అప్పుడు పౌరాణికుడు విశ్వనాధశర్మ వస్తాడు. వ్యాసభారతంలోని కొన్ని విషయాలు చదివి వినిపిస్తాడు. నన్నయ భట్టారకుని తెలుగు పద్యాలు కూడా హృదయ రంజకంగా వినిపిస్తాడు. సంస్కృతాన్ని తెలుగును విశే్లషించి నన్నయ భట్టారకులవారి అక్షరరమ్యతను వివరించి చెబుతాడు.
గణపతి దేవుడికి శకుంతలోపాఖ్యానంలోని ‘నుతజలపూరితంబులగు నూతులు’ అన్న పద్యం శకుంతర దుష్యంతుడికి చెప్పింది, ఎంతో నచ్చింది. ఆ పద్యం ఒకటికి రెండుసార్లు చెప్పించుకున్నాడు.
మరికాస్త పొద్దెక్కిన తరువాత చెన్నాప్రగడ గణపయామాత్యులు వస్తాడు. రాజనీతిని గురించి కొంత బోధిస్తాడు. గణపతి దేవుని ఉత్తేజపరుస్తాడు.
గణపామాత్యులు మహారాజు జయతుంగులవారికి చాల సన్నిహితుడు. ఆయన రాజనీతి కోవిదుడని, ఆరితేరిన యోధుడని, గొప్ప జ్ఞాని అని, జయతుంగుడికి బాగా తెలుసు.
రాజప్రాసాదానికి తరచు ఆయన రాకపోకలున్నాయి. అక్కడ ఆయన అమితంగా గౌరవింపబడతాడు. బాగా పలుకుబడి ఉన్న రాజనీతిజ్ఞుడు.
మధ్యాహ్న భోజనానంతరం రామనారాయణశర్మ వస్తాడు. వాల్మీకి రామాయణం నుంచి కొన్ని విషయాలు వివరించి చెబుతాడు, కరుణరసం ఉట్టిపడేట్టు. గణపతి దేవుడు శ్రద్ధగా వింటాడు. రామకథ ఆయన హృదయాన్ని ద్రవింపచేస్తుంది.
సాయంత్రం కొంత గుర్రపుస్వారీ, విలువిద్య, వ్యాయామం, మల్లయుద్ధం అయింతరువాత స్నానం చేసి శుచి అయి భస్మధారణ చేసి శివనామం జపిస్తూ ఉంటాడు గణపతి దేవుడు.
అప్పుడు వాసుదేవశర్మ వచ్చి వ్యాస భగవానుని భాగవతంలోని కొన్ని విషయాలను చెప్పి ఆనందపరుస్తూ ఉంటాడు.
రాత్రి భోజనానంతరం శివుని ప్రార్థించి నిశ్చింతగా సుఖంగా శయనిస్తాడు, రాకుమారుడు గణపతి దేవుడు.
ఇది అక్కడ నిత్యమూ జరిగే కార్యక్రమం.
గణపతిదేవుడు బుద్ధెరిగిన నాటికి ఒక రాజకుమారుడు. అల్లారు ముద్దుగా పెరుగుతున్న రోజులలో ఈ అశనిపాతం దాపురించింది.
ఆయనకు అప్పుడప్పుడూ గుర్తుకు వస్తూ ఉంటుంది. తీరిక సమయాలలో.,
తన తండ్రి మహదేవరాజు, కాకతీయ సింహానాధీశుడు. తల్లి బయ్యాంబ మహాసాధ్వి, తన పెదతండ్రి రుద్రదేవుడు అని అందరూ అనగా విన్నాడు. తనకు సరిగా గుర్తు లేదు.
అనుకోకుండా చిన్నవాడిని తనను బంధించి ఒకరోజు యిక్కడికి తీసుకొని వచ్చారు, యిప్పుడు తానున్న చోటికి.
తండ్రి ఏమైంది తనకు తెలియదు. తల్లిఏమైంది అసలే తెలియదు. ఈ నిర్బంధానికి కారణమేమిటో అర్థం కావటం లేదు ఆ పసిహృదయానికి.
కాలక్రమేణా కొన్ని విషయాలు తెలుస్తూ వచ్చినాయి. తన పెదతండ్రి రుద్రదేవుల వారి అనంతరం తండ్రి మహదేవుడు కాకతీయ సింహా సనం అధిష్ఠించాడని, తన తండ్రి ధార్మిక దృక్పథం కలవాడని, ఆరాధ్య శైవమతాన్ని స్వీకరించాడని, రాజ్యపాలనలో కొంత అలసట కారణంగా అదను చూసి యాదవరాజైన జయతుంగుడు పెద్దయెత్తున దండెత్తి వచ్చి తన తండ్రిని బందీగా తీసికొని పోయి దేవగిరిలో వధించాడని తరువాత కాకతీయ సింహాసనం ఆక్రమించాడని తెలుసుకున్నాడు.
ఇనే్నళ్లుగా ఎన్నడూ గణపతి దేవుడిని జయతుంగుడు చూడడానికి రాలేదు. అతని నుంచి ఏ విషయమూ తెలియదు.
గణపతి దేవుని బంధువులెవరూ తానున్న చోటికి రారు, భటులే బంధువులు, సైనికులే స్నేహితులు. వారితోనే తన క్రీడలు కాలక్షేపం.
(సశేషం)

-అయ్యదేవర పురుషోత్తమరావు