డైలీ సీరియల్

యాజ్ఞసేని -- 86

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకృష్ణుడు ఏ పని మీదనైనా దాసిని పంపబోతే నీవే లేచి స్వయంగా ఆ పని చేయుము. నీ భావాన్ని కృష్ణుడు గ్రహించి ‘‘సత్య నిండు మనస్సుతో నన్ను సేవిస్తున్నది’’ అని అనుకోవాలి. భర్త నీ దగ్గర చెప్పిన మాటలను..అది రహస్యం కాకపోయినా నీ వెవ్వరికీ చెప్పగూడదు.
సాంబుడు, ప్రద్యుమ్నుడు నీకు పుత్ర సమానులే. అయినా వారితో కూడా ఎప్పుడూ ఒంటరిగా ఉండదగదు. మంచి వంశంలో పుట్టి, పాపపు పనులకు దూరదంగా నిలిచి ప్రవర్తించే పతివ్రతలతోనే నీకు మైత్రి ఉండాలి. ఆభరణాలను, అంగరాగాన్ని ధరించి, దివ్య పరిమళాలతో భర్తను ఆరాధించుము. ఇది కీర్తికరం. సౌభాగ్యకరం. దీనితో నీ కోరిక తీరుతుంది. శత్రువులు ఉండరు’’ అని పతివ్రత ధర్మాలను, భర్తానురాగాలను పొందే మార్గాన్ని చెప్పింది.
ద్రౌపది చెప్పిన మాటలు విని సత్యభామ సిగ్గుతో తలవంచుకో వలసి వచ్చింది. అందుచేత ఆమె ద్రౌపదికి క్షమాపణ చెప్పుకొన్నది.
‘‘అభిమానవతివైన ఓ ద్రౌపదీ! నేను కేవలం అజ్ఞానంచేత మందులూ, మాకులూ, వశీకరణ విద్యల గురించి ప్రస్తావించాను. వాటిని దయతో పరిహాస స్రసంగాలుగా స్వీకరించి నన్ను క్షమించుము. నీ సౌశీల్యం నీకు ప్రపంచంలో పేరుప్రతిష్టలను ఆర్జించి పెట్టింది. పాంచాలీ! నేను శరణుగోరుతున్నాను. యాజ్ఞసేనీ! నన్ను క్షమించుము. నెచ్చెలుల మధ్య ఇటువంటి పరిహాస ప్రసంగాలు మామూలే’’అని సత్యభామ క్షమాపణ కోరగా ద్రౌపది చిరు నవ్వునవ్వి
‘‘నీవు మందులు, మాకులు గూర్చి చేసిన ప్రస్తావన కేవలం నవ్వులాటకు మాత్రమే జరిపినట్లు అనుకొందాం’’అని అన్నది. తదుపరి శ్రీకృష్ణుడు మార్కండేయ మహర్షులతో, పాండవులతో కలిసి తనకు నచ్చిన విషయాలు ప్రస్తావిస్తూ కొంతకాలం గడిపాడు. అందరితో ఎప్పటివలెనే మాట్లాడి పాండవులవద్ద సెలవు గైకొని రథాన్ని ఎక్కేముందు సత్యభామను పిలిపించాడు.
అక్కడ సత్యభామ ద్రౌపదిని కౌగలించుకొని తన మనోరథానికి తగినట్లుగా మనోహరంగా ఉన్నది. శ్రీకృష్ణునితో పయనమై వెళ్ళబోయేముందు ద్రౌపదితో
‘‘యాజ్ఞసేనీ! ద్రౌపదీ! నీవు కలత పడవద్దు. జాగరణలు చేయవద్దు. నీ భర్తలు దేవసమానులు. వారి ద్వారా మరలా రాజ్యాన్ని పొందగలవు. నీవలె శీలసంపదా, ఉత్తమ లక్షణాలుగల స్ర్తిలు కష్టాలను పెద్దకాలం అనుభవించరు. నీవు నీ భర్తలను కలసి ఈ భూమిని నిష్కంటకంగా తప్పక అనుభవిస్తానని విన్నాను. ద్రుపదకుమారీ! ధార్తరాష్ట్రులను చంపి, శత్రుత్వానికి బదులు తీర్చుకొని పాండవులు రాజ్యాన్ని చేపడతారు. నీవు వనవాసానికి వెళ్ళే సమయంలో నిన్ను పరిహసించినవారి ఆశలన్నీ నీరుగారిపోతాయి. అది నీవు త్వరలోనే చూస్తావు.
ద్రౌపదీ! నీ అయిదుగురు పుత్రులందరూ అస్త్ర విద్యా నిపుణులు. వారందరూ ద్వారకలో క్షేమంగా ఉన్నారు. సుభద్ర కూడా వారియెడల ప్రేమ పూర్వకంగా ఉంటుంది. సుభద్రకు నీవంటే అమిత ఇష్టమే’’ అని చెప్పి సత్యభామ శ్రీకృష్ణుని రథంవద్దకు వచ్చి బయలుదేరి పోతూ ద్రౌపదికి ప్రదక్షిణం చేసింది. రథాన్ని అధిరోహించింది.
శ్రీకృష్ణుడు కూడా ద్రౌపదిని ఊరడించి ద్వారకకు బయలుదేరి వెళ్ళాడు.
(44)
దుర్వాసుఁడొకనాడు దుర్యోధనుడుఁబంప
పాండవులు కామ్యకవనంలో నివసిస్తూ మునులతో కలిసి చిత్రమైన కథలు వింటూ, ఆనందిస్తూ, సూర్యభగవానుడు ప్రసాదించిన అక్షయపాత్రలో ద్రౌపది వండిన అన్నం, పదార్థాలతో అన్నార్థులైన బ్రాహ్మణులను తృప్తిపరుస్తూ కాలం గడుపుతున్నారు.
అక్కడ హస్తినలో దుర్యోధనుడు కర్ణశకున దుశ్వాసనులతో కలిసి పాండవులకు ఎలా హాని చెయ్యాలా అని అనేక ఉపాయాలను ఆలోచిస్తూ ఉన్నాడు. పాండవులు అడవిలో గూడా పట్టణంలో ఉన్నట్లుగానే ఆనందంగా ఉన్నారని విని ఈర్ష్య చెందాడు. ఏమి చెయ్యాలా అని ఆలోచిస్తున్న సమయంలో ఒకనాడు మహాయశస్వి, ధర్మాత్ముడు, తాపసి అయిన దుర్వాస మహర్షి తన పది వేల మంది శిష్యులతో కలిసి యధేచ్ఛగా వారివద్దకు వచ్చాడు. ముక్కోపి అయిన ఆ ముని రాకను చూచి దుర్యోధనుడు ఒళ్ళు దగ్గర పెట్టుని వినయంతో తమ్ముళ్ళతో కలిసి ఎదురేగి సాదరంగా ఆహ్వానించి అర్ఘ్యపాద్యాలనిచ్చి పూజించాడు.
..........................ఇంకావుంది

త్రోవగుంట వేంకట సుబ్రహ్మణ్యము