డైలీ సీరియల్

యాజ్ఞసేని-91

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నీ అనురాగాని ఎల్లప్పుడూ నోచుకొన్న నీ భర్తలు, అదృష్టవంతులైన అందగాండ్రు పాండవులు క్షేమంగాఉన్నారుగదా? అని అడుగగా ద్రౌపది
‘‘రాజా! మీకు కుశలమేనా? పాండవులు స్థిరచిత్తులు. వారు కుశలంగా ఉన్నారు. మీరు ధర్మాన్ని అనుసరించి పాలిస్తున్నారు గదా? నీవు ఇప్పుడు అతిథివి. కావున సంప్రదాయసిద్ధమైన మన్ననలకు అర్హుడివి. దయతో ఉన్నతాసనాన్ని స్వీకరించుము. రుచికరమైన విందు భోజనాన్ని ఆరగించుము.
నా భర్తలు వేటకై వెళ్ళి ఉన్నారు. వారు వచ్చేవేళ అయింది. వారు వచ్చిన తరువాత నీకు తగిన మర్యాదల చేయగలరు. ఆ సత్కారాలను గ్రహించిన పిమ్మట వెళ్ళవచ్చును.’’ అన అన్నది.
అప్పుడు కామాంధకారంతో కళ్ళుకప్పి ఒళ్ళుతెలియరాని జయద్రథుడు ద్రౌపదిని చూచి
‘‘పద్మముఖీ! ద్రౌపదీ! నీవు మాకు చేయదలచిన అతిథి మర్యాదలన్నిటినీ పొందాను. ఏ లోపం రాలేదు.నీ భర్తలు సంపదలను కోల్పోయారు. రాజ్యభ్రష్ఠులయ్యారు. అరణ్యవాసం చేస్తున్న ఆ కుంతీ కుమారులను అనుసవరించటం నీకు తగదు.
మన్మథుడు మంత్రబాణాలచేత నా హృదయం తూట్లుపడింది. ఇంక నీవు నన్ను ధన్యుణ్ణి చేయాలి. ఇక మారుమాటలు చెప్పక లేచి రమ్ము. ప్రీతితో నా రథాన్ని ఎక్కుము. నాకు భార్యవుగమ్ము... సుఖాలు పొందుము. నీవు నాతో కూడి సింధుసౌవీరదేశాలకుమహారాణివిగా ఉండుము.
హృదయాన్ని కంపింపజేసే జయద్రథుడి మాటలనువిని ద్రౌపది భయపడింది. ఆ ప్రదేశం నుండి దూరంగా తొలిగి నిలబడింది. తన భర్తలు ఎప్పుడు వస్తారా అని ఎదురుతెన్నులు చూడసాగింది. వారు వచ్చేవరకు ఏదో సమాధానం చెప్పి కొంతకాలం గడపటానికి సంకల్పించి
‘‘అలా ఎప్పటికనీ జరుగదు సైంధవా! నీవు సిగ్గుపడాలి! ధృతరాష్ట్రుడి కూతురు దుస్సల (దుశ్శల) పాండునందనులకున్నూ, ధార్తరాష్ట్రులకున్నూ వరుసనుబట్టి ఆలోచించగా సోదరియేగదా? ఆమెకు నీవు భర్తవు. కాబట్టి నీవు నాకు ధృష్టద్యుమ్నునివలె సహోదరుడవే అవుతాడు. ఇక్కడ నీవు ఇలా న్యాయాన్ని అతిక్రమించి మాటలు పలుకటం సరిగాదు. న్యాయంగా నీవు నన్ను రక్షించాలి గదా! ధార్మికుల వంశంలో జన్మించిన నీకు ఈ దుష్టబుద్ధి ఏమిటి? ధర్మాన్ని అతిక్రమించవద్దు’’ అని అన్నది.
దుర్మార్గుడైన ఆ జయద్రథుడు చిరునవ్వుతో వికసించిన మొగం కలవాడై-
‘‘పద్మాక్షీ! సాధారణ జన్మం వేరు, రాజధర్మం వేరు సుమా! రాజులకు స్వేచ్ఛ ఉన్నది. రాజులు ఆడువారి ఎడల బంధుత్వంలోని తారతమ్యాలను అనే్వషించనక్కరలేదు. అవసరమైన పట్టుదలతో యధేచ్చగా వినోదం సల్పవచ్చును. అసలు ఆడువారు ఒకరికి మాత్రం చెందిన సొత్తు అనటానికి హద్దు ఉన్నదా? లేదు కదా?
స్ర్తిలు, రత్నాలు ఈ లోకంలో సర్వులకూ సాధారణ వస్తువులని పండితులు అంటారు అని వెటకారంగా అన్నాడు.
అలా మాట్లాడుతున్న సైంధవుడిని చూచి ‘‘ఈ దుష్టుడు మంచి మాటలతో దారికిరాడు. ఈతడి పట్ల కఠినత్వం చూపక తప్పదు’’ అని ఆలోచించి-
‘‘రాజుల వంశంలో జన్మించిన ఓ నీచుడా! జయద్రథా! పాండవులు గొప్ప పరాక్రమవంతులని ప్రపంచానికి ఈవరకే ఋజువైన విషయం. పాండవులను లెక్కచెయ్యక నన్ను అవమానిస్తున్నావు. ఇక నీ అహంకారపూరిత ప్రేలాపాలను కట్టిపెట్టుము. ఇంతటితో ఆగకపోతే చివరకు దుర్భరమైన ఫలితాన్ని చవిచూడగలవు. మూర్ఖుడా! పాండవులను ఇలా తుచ్ఛంగా మాటలాడటానికి నీకు సిగ్గులేదా? నీవంటి కుక్కలు మాత్రమే మొఱుగుతాయి.
భయంకరమైన పరాక్రమం కలిగినవాడైన యుధిష్ఠిరుడిని ఎదిరించబూనటం నీతరమా? జాగ్రత్త! క్రుద్దుడైన భీమసేనుని చూడగానే కాళ్ళు కూడదీసుకొని పరుగులు తీస్తావు!
గాండీవం అనే విల్లును ధరించేవాడు అర్జునుడు. అతడికి కోపం తెప్పించేవారు చావు తప్పించుకొని బ్రతికి బట్టకట్టడం అసాధ్యం.
వారించ శక్యంగాని పరాక్రమం కలిగిన నకుల సహదేవులకు అవమానం చేయటానికి ఆలోచించటం ఎటువంటిదో తెలిసికొనుము.
..........................ఇంకావుంది

త్రోవగుంట వేంకట సుబ్రహ్మణ్యము