డైలీ సీరియల్

యాజ్ఞసేని--124

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆ దివ్య పురుషుని విశ్వరూపాన్ని చూడటానికి మహర్షులు, నారదాది మునుల తమ మనస్సులో కుతూహల పడుచుండగా ఆ దేవదేవుడు అప్పుడు నారద, మహర్షుల, భీష్మద్రోణవిదుర సంజయులవైపు దయతో నిండిన చూపులు ప్రసరింపజేసి వారికి తన విశ్వరూపాన్ని సందర్శించగలిగే దివ్యదృష్టిని ప్రసాదించాడు. ఆ పుణ్యపురుషులు ఆ నారాయణుని విశ్వరూపాన్ని తిలకించి పరిపూర్ణమైన ఆనందాన్ని అనుభవించారు. అంతరిక్షమంతా సిద్ధసాధ్యవిద్యాధర దేవతల జయజయధ్వానాలతో నిండిపోయింది.
ఆ కలకలాన్ని విన్న ధృతరాష్ట్రుడు శ్రీకృష్ణునితో ‘‘హే కృష్ణా! నాపై దయజూపుము. నా అజ్ఞానాన్ని మన్నించుము. నిన్ను శరణు వేడుచున్నాను. నన్ను అనుగ్రహించి వాసుదేవా! నీ విశ్వరూపాన్ని నీ పాదాలను దర్శించే మహాభాగ్యాన్ని ప్రసాదించుము’’ అని వేడుకొన్నాడు.
అట్లు ధృతరాష్ట్రుడు ఆ దేవదేవుని వేడుకొనగా ఆ అంధనృపతికి ఆశ్చర్యం కలిగేటట్లు దివ్యదృష్టిని ప్రసాదించాడు. ధృతరాష్ట్రు శ్రీకృష్ణుని విశ్వరూపాన్ని వీక్షించి, భక్తితో నమస్కరించి
‘‘పురుషోత్తమా! నిన్నుచూచి ధన్యుడనయ్యాను. నిన్నుచూచిన ఈ కనులతో మరలా యితరులను చూడటానికి యిష్టపడను. నీవిచ్చినచూపును నీవే వెనుకకు తీసుకొనుము.’’ అని ప్రార్థించాడు.
శ్రీకృష్ణుడు ధృతరాష్ట్రుని యెప్పటివలననే గ్రుడ్డివానిగా చేశాడు.
నారదాది మునులు, మహర్షులు వెళ్ళిపోయారు.
శ్రీకృష్ణుడు తన పీఠంనుండి దిగి తన యెదుట నిలిచియున్న సాత్యకి, కృతవర్మలతో కలిసి వౌనంగా అక్కడినుండి బయటకి వెళ్ళిపోయాడు.
శ్రీకృష్ణుని సంధి ప్రయత్నం విఫలమయ్యింది.
కురుపాండవుల యుద్ధం యదార్థరూపం దాల్చింది.
కురుపాండవుల యుద్ధం ముగిసింది. ఇరుప్రక్క మహావీరులందరూ మరణించారు. భీష్మద్రోణ భాహ్లిక కర్ణశల్య శకుని సోమదత్త భూరిభూరిశ్రవులు మొదలగు కౌరవ వీరులందరూ నేలకొరిగారు. ఒక్క భీష్మ పితామహుడు మాత్రం ఉత్తరాయణ పుణ్యకాలం కొరకు ప్రాణత్యాగం చేయలేదు.
అది పదునెనిమిదవనాటి యుద్ధం. శల్యుడు కూడా మరణించాడు. కౌరవుల పక్షాన యుద్ధంలో చావక మిగిలినవారు కృపాచార్యుడు, అశ్వత్థామ మరియు కృతవర్మ మాత్రమే.
పాండవుల పక్షాన పాండవులు, యుయుత్సుడు (్ధృతరాష్ట్రునికి వైశ్యపత్ని యందు పుట్టిన కుమారుడు. యుద్ధంలో పాండవుల పక్షం చేరాడు) సాత్యకి, ఉపపాండవులు, ధృష్టద్యుమ్యుడు మొదలగువారు.
పదునాల్గవ నాటి రాత్రి అశ్వత్థామ పాండవుల శిబిరాలలో నిద్రిస్తున్న ఉప పాండవులను, ధృష్టద్యుమ్న శిఖండి ఉత్తవౌజ మొదలగు మహవీరులను, రాజులను, అశ్వాలను, ఏనుగులను, కాల్బలాన్ని ఖడ్గం ధరించి పశువులను సంహరించినట్లుగా సంహరించాడు. పాండవులు, శ్రీకృష్ణ సాత్యకి మొదలగువారు ఆ రాత్రి ఓఘవతీనదీ తీరంలో విశ్రాంతిని తీసికొన్నారు.
అంతకుముందు ధర్మరాజు ద్రౌపదిని విరాటద్రుపద మహారాజులు మరణించిన తరువాత వారి భార్యలను ఓదార్చటానికై విరాట నగరానికి పంపాడు. ద్రౌపది వెంట సుభద్ర, ఉత్తరలుగూడావెళ్ళారు. సుభద్ర అర్జునుని అనుమతితో ద్వారకకు వెళ్ళటానికి విరాట నగరంలోనే వున్నది. ద్రౌపది విరాటరాజు భార్యనూ, తండ్రి ద్రుపదుని భార్యనూ చూచింది.
పదునెనిమిదవనాటి రాత్రి అశ్వత్థామ జరిపిన ఘోరమారణ హోమం గురించి అక్కడనుండి తప్పించుకొని వచ్చిన ధృష్టద్యుమ్నుని రథసారథి పాండవులు వున్నచోటికి వచ్చి ధర్మరాజుకు విన్నవించాడు. ఆ అమంగళకరమైన మాటవిని యుధిష్ఠిరుడు పుత్ర శోకంతో నేలగూలి పోయాడు. ధర్మరాజు పడి పోతుంటే సాత్యకి, భీమసేనుడు అర్జునుడు నకుల సహదేవులు అతణ్ణి పట్టుకొన్నారు. స్పృహ కోల్పోయిన ధర్మరాజ కొంతసేపటికి స్పృహలోనికి వచ్చి ఆర్తునివలె దుఃఖిస్తూ
‘‘ముందు శత్రువులను గెలిచి తరువాత ఓడిపోయాము’’ అని విలపించ సాగాడు. ద్రౌపదిని తలంచుకొని అన్నాడు.
‘‘కానీ ద్రౌపదిని గురించియే నా బాధ. ఆ సాధ్వి యిప్పుడు శోక సముద్రంలో మునిగి నశిస్తుందేమో? ఇప్పటికే ఆమె శరీరం శోకంతో కృశించింది. ఇప్పుడు సోదరులూ, కొడుకులూ, ముసలి తండ్రి చనిపోయారని విని మరీ మరీ కృశించిపోతుంది. స్పృహ లేకుండా నేలపై కూలుతుంది. ఇంతకుముందెన్నడూ ఈ విధమైన దుఃఖాన్ని తాను అనుభవించి యెరుగదు’’ అని దుఃఖిస్తూ ద్రౌపదిని రప్పించనెంచి వెంటనేనకులుడిని చూచి ‘‘నీవు వెళ్ళి, ద్రౌపదిని, తక్కిన మన స్ర్తిలతో ద్రుపద విరాట స్ర్తిలనూ వెంటబెట్టుకొని ఆ శిబిరానికి రమ్ము, మేముగూడా అక్కడికి వస్తాము.’’ అని అన్నాడు.