డైలీ సీరియల్

వేదాలలో వైజ్ఞానిక విశేషాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శిలలమీద శిల్పకారులు రకరకాల ద్రావకాలు పూసి, శిలాతలాన్ని మృదువుగా చేసేవాళ్ళు. శంఖద్రావకము, కుష్ఠసారము, సైంధవ ఖర్పరము (సముద్రపుటుప్పు)
ఉకత్స అనే చెట్టుబెరడు చూర్ణం. ఇలాటి వాటితో ద్రావకాలు చేసి, మర్దనం చేస్తే, శిలలు మృదువుగా తయారై, ఉలితో కొట్టినప్పుడు పగిలిపోకుండా సరైన విధంగా చెక్కేందుకు అనుకూలంగా తయారవుతాయి. మన పురాతన ఇంజినీరింగ్ నైపుణ్యాలను గురించి ప్రస్తావించుకున్నప్పుడు, మన వ్యవసాయ పరికరాలను గురించి మరిచిపోయే వీలులేదు. దాదాపు క్రీ.పూ.నుంచి దొరుకుతున్న అనేక వ్యవసాయ శాస్త్రగ్రంథాలలో వ్యవసాయ పనిముట్లను గురించిన వర్ణన విస్తారంగా వుంది. ఇప్పటికీ కూడా పురాతన భారతీయ వ్యవసాయ పరికరాల నమూనాలే ఆధునిక పరికరాల రూపకల్పనకు ఉత్ప్రేరకాలుగా పనిచేస్తున్నాయని వ్యవసాయరంగ శాస్తవ్రేత్తలు అనేకులు అంగీకరిస్తున్నారు. నాగటి చాలులో సూటిగా విత్తనాలు పడేందుకు యాంత్రికమైన యేర్పాట్లు మన పరికరాలలో క్రీస్తుపూర్వం నాటికే రూపొందాయంటే, ఆ రంగంలోవారు చేసిన పరిశోధనను మనం అంచనా వేసుకోవచ్చు.
అలాగే ప్రపంచంలోని ఇతర ఖండవాసులు సంగీత వాద్యాలకోసం జంతువుల పేగులను వాడుతున్న కాలంలోనే, మన భారతీయులు లోహశాస్త్ర విజ్ఞానాన్నీ, లోహ సంబంధమైన ఇంజినీరింగ్ విజ్ఞానాన్నీ వృద్ధిచేసుకుని, సన్నని లోహపు తీగలనూ, పెద్ద వీణ బుర్రలనూ, తంత్రులను బిగించే ‘‘మర’’లనూ, రూపొందించుకొని, శాస్ర్తియమైన వీణకు రూపకల్పన చేసి, సప్తస్వరాలనూ పలికించగలిగారు. ఈ విషయంలో సంగీత కోణంతోపాటు, ఇంజినీరింగ్ విజ్ఞానకోణం కూడా పెనవేసుకుని వున్నదని మనం గుర్తించాలి. సంగీతంతోపాటు, ఖగోళ విభాగాన్ని కూడా మనవాళ్ళు ఇంజినీరింగ్ విజ్ఞానానికి జోడించి, అనేక అద్భుతాలను సాధించారు. వాటిలో శృంగేరి క్షేత్రంలోని ద్వాదశ రాశి స్తంభాల నిర్మాణం, అన్నవరం క్షేత్రంలోని సన్ డయల్ నిర్మాణం వంటివి, ఈనాటికీ నిదర్శనంగా నిలిచి వున్నాయి. ఉజ్జయినిలోను, ఢిల్లీలోను, మరికొన్ని ప్రధాన కేంద్రాలలోనూ, ఆ నాడు ప్రముఖంగా విరాజిల్లిన గ్రహవేధశాలలు (అబ్జర్వేటరీలు) ఈ నాడు కనుమరుగైనాయి. శృంగేరిలోని ద్వాదశ రాశి స్తంభాలలో సూర్యుడు ఏ రాశిలోవుంటే, ఆ రాశి స్తంభంమీదకు ఎండపడుతుంది. అన్నవరంలోని సన్ డయల్‌లో (పలభాయంత్రంలో) సూర్యుడి గమనాన్నిబట్టి నిమిషాలతోసహా కాలాన్ని తెలుసుకునే విధానం వుంది. అరసవెల్లిలోగల సూర్యదేవాలయంలోని ముఖ మండపాల అంతస్తుల నిర్మాణంలోని వైచిత్య్రంవల్ల, రథసప్తమినాడు, సరిగ్గా సూర్యోదయ సమయాన సూర్యకిరణాలు సూర్యదేవుడి పాదాల వద్దకు పాకుతాయి. అలాగే హంపీ విజయనగరంలోని గాలి గోపురాల నిర్మాణంలో ఒకచోట, గూళ్ళలోంచి ప్రసరించే కాంతి కిరణాల ప్రభావంవల్ల చెట్ల ప్రతిబింబాలు తల్లకిందులుగా పడుతున్నాయి (కెమేరాలలో లాగా.) ఇది క్రీ.శ.15వ శతాబ్ది ప్రాంతంలోని నిర్మాణం.
రాతి స్తంభాల ఆకార విశేషాన్నిబట్టి అవి పలికే ధ్వనులను మార్చగల ఇంజినీరింగ్ విజ్ఞానాన్ని ఆనాటివారు స్వాధీనం చేసుకోవటంచేత, హంపీ విజయనగరంలోని సప్తస్వర స్తంభాలు ఇప్పటికీ ప్రపంచాన్ని ఆకర్షిస్తున్నాయి. ఇవి అక్కడ విఠల దేవాలయంలో వున్నాయి. ఆ ఆలయం పూర్తికాలేదు. క్రీ.శ.1513లో అది ప్రారంభమైంది.
గాలిగోపురాల ప్రసక్తివచ్చింది గనుక, మరొక పురాతన ఇంజినీరింగ్ విషయాన్ని కూడా మనం ప్రస్తావించుకోవాలి. అనేక అంతస్తులుగల భవనాలను నిర్మించే ఇంజినీరింగ్ నైపుణ్యం మన దేశంలో క్రీస్తుపూర్వం నాటికే వున్నప్పటికీ, అలాంటి భవనాల నిర్మాణం పర్యావరణ పరిరక్షణకు దోహదకారి కాదని వారు పూర్తిగా గుర్తించారు. అందుకే ఆనాడు ధర్మశాస్త్ర గ్రంథాలలో ఇలాటి భవనాల నిర్మాణాన్ని నిరుత్సాహ పరిచారు. అయినప్పటికీ గాలిగోపురాల రూపంలో ఈ ఇంజినీరింగ్ విజ్ఞానం ఉత్తర దక్షిణ భారతదేశాలలో బహుముఖాలుగా విస్తరించింది. ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో మధుర, శ్రీరంగం, కంచి వంటి క్షేత్రాలలో శిలామయమైన గాలిగోపురాల నిర్మాణం చేసేటప్పుడు మనవారు ప్రదర్శించిన ఇంజినీరింగ్ నైపుణ్యాలు ఆధునిక వైజ్ఞానికులను కూడా ఆశ్చర్యచకితులను చేస్తున్నాయి. అంతంత ఎత్తులకు, అంతంత పరిమాణంలో వుండే రాళ్ళను ఎత్తటానికీ, ఎత్తిన రాళ్లను సూటిగా ‘‘గాళ్ళలో’’ పడేటట్లుగా సర్దుబాటు చేయటానికీ, వారు యే విధానాలను అనుసరించారో, ఆ వివరాలు ఈనాడు లభ్యంకావడంలేదు. అలాగే సువిశాలమైన ఆలయ సభామంటపాలను రాతికప్పులతో నింపేటప్పుడు, ఎంత వాన కురిసినా చుక్క నీరుకూడా లోపలికి కారకుండా రాతి కప్పులను అమర్చే నైపుణ్యం, ఈనాడు అంతరించిపోయింది. అలాగే సువిశాలమైన ఆలయ నిర్మాణం చేసేటప్పుడు, స్తంభాల మీదా, గోడల మీదా, శిల్పాలను చెక్కేటప్పుడు, ఆ స్తంభాలకూ, గోడలకూ మిగిలే భారవహన సామర్థ్యాన్ని (లోడ్ బేరింగ్ కెపాసిటీని) అంచనావేసే సూత్రాలు ఈనాటికీ శిల్పశాస్త్ర గ్రంథాలలో అక్కడక్కడా కనిపిస్తున్నప్పటికీ, వాటి వివరాలు లుప్త ప్రాయాలైపోయాయి. ఆనాటి కట్టడాలు మాత్రం వారి సాంకేతిక సామర్థ్యానికి నిదర్శనాలుగా యిప్పటికీ నిలబడి వున్నాయి. ఇంకావుంది...

కుప్పా వేంకట కృష్ణమూర్తి