డైలీ సీరియల్

యువర్స్ లవ్వింగ్లీ... 18

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆ అబ్బాయి దూరంగా వెళ్ళిపోతున్న గుంపులో హరితని భరణికి చూపించాడు. ‘‘పేరు తెలీదట. జూనియర్.. ఒక పక్క మనం ర్యాగింగ్ చేస్తుంటే సిగ్గులేకుండా వీడు ఆ అమ్మాయిని చూసి నవ్వుతున్నాడు’’ అన్నాడు ఉక్రోషంగా.
భరణి తేలికగా నవ్వేశాడు అతడి మాటలకి. ‘‘దానికి నీకెందుకురా అంత కోపం?’’ అన్నాడు అతడి భుజంమీద చరుస్తూ.
‘‘అది కాదన్నా.. ఆ అమ్మాయి కూడా వీడిని చూసి నవ్వుతోందన్నా. ఒక్కరోజులోనే ఆ అమ్మాయిని పడేసాడు. వీడిప్పుడే ఇలా వున్నాడంటే రేప్పొద్దున మన గాళ్ ఫ్రెండ్స్‌కి లైనేసినా ఆశ్చర్యం లేదు. వీడినిలా వదిలేయకూడదన్నా’’ అన్నాడు కోపంగా.
‘‘నీ బాధ వీడు ఆ అమ్మాయిని చూసి నవ్వాడనా లేక ఆ అమ్మాయి వీడిని చూసి నవ్విందనా?’’ నవ్వుతూ అన్నాడు భరణి.
భరణీ మాటలకి అతడు సిగ్గుపడ్డాడు. జూనియర్లు నవ్వేశారు.
భరణి జూనియర్స్ వంక తిరిగి ‘‘గయ్స్.. ఇంక చాలు.. అందరూ చొక్కాలు వేసుకుని మీ పన్లు చూసుకోండి.. అందరూ గుర్తుపెట్టుకోండి. ఆల్ దిస్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ గేమ్. నథింగ్ సీరియస్. రేప్పొద్దున మీరు కూడా మీ జూనియర్స్‌నిలాగే ర్యాగ్ చేస్తారు. కొంచెం ఫన్.. కొంచెం ఎడ్యుకేషన్.. దట్సిట్.. క్యారీ ఆన్!’’
అతని గొంతులో ఏ మహత్మ్యం వుందో కానీ, వింటున్న వాళ్ళంతా మంత్రముగ్ధుల్లా ఆ మాటలకి తలలూపారు. అందరూ చొక్కాలు వేసుకుని బ్యాగ్స్ పట్టుకుని బయటికి నడిచారు.
వాళ్ళు వెళ్లిపోయాక తనవంకే కోపంగా చూస్తున్న ఆ సీనియర్ యువకుడి భుజం చుట్టూ చెయ్యి వేసాడు. అతడేదో అనేలోగానే భరణి అన్నాడు. ‘‘అమ్మాయి పేరు హరిత. నేను నిన్నట్నుంచే గమనిస్తున్నాను.. చాలా ఇంట్రెస్టింగ్ గాళ్...’’
భరణి ‘ఇంట్రెస్టింగ్’ అన్నాడంటే తనింక ఆమె జోలికి వెళ్లకపోవడం మంచిదన్న విషయం అర్థమైంది వాళ్లకి. వెళ్లిపోబోతుంటే మళ్లీ అన్నాడు భరణి ‘‘వర్షమా వానా? ఎవడు వాడు ఆ అమ్మాయికి సైట్ కొట్టినవాడు?’’
‘‘వరుణ్..’’
‘‘వాడ్ని ఆపకు, అలాగే కురవనీ.. ఆ అమ్మాయి వెంటపడుతుంటే చూసీ చూడనట్టు ఊరుకో.. కొన్నాళ్ళు వాళ్ళిద్దరినీ డిస్ట్రబ్ చేయకు’’ వరుణ్‌తో మాట్లాడిన యువకుడి భుజమీద చెయ్యి వేస్తూ అన్నాడు భరణి.
అతడు భరణి మాటలకి ఆశ్చర్యంగా చూసాడు. ఇందాక అతడన్న ‘ఇంట్రెస్టింగ్’ అన్న పదానికి సరైన అర్థం అప్పుడే బోధపడింది. జరగబోయేదాన్ని తల్చుకుని నవ్వుతూ తలూపాడు.
****
వరుణ్‌కి జరిగినదంతా చాలా థ్రిల్లింగ్‌గా అనిపించింది. ఆఖరి నిమిషంలో భరణి వచ్చి తనని రక్షించకపోతే ఏమయ్యేదో కానీ, ఇప్పుడు మాత్రం తనేదో గొప్ప విజయం సాధించినట్లనిపిస్తోంది.
ఆ రోజు ఇంటికెళ్ళక అద్దంలో తన రూపాన్ని మొట్టమొదటిసారి పరిశీలనగా చూసుకున్నాడు వరుణ్. తన అందానికి తనకే ఆశ్చర్యమేసినట్లనిపించింది. ‘రోజూ జిమ్‌కెళతావురా నువ్వు?’ అన్న సీనియర్ మాటలు గుర్తుకు వచ్చాయి. బహుశా తనంత అందంగా లేడని అతడికి అసూయేమో అనుకున్నాడు. మర్నాడు మరింత శ్రద్ధగా తయారై కాలేజీకి వెళ్ళాడు.
****
ఆ రోజు సాయంత్రం మళ్లీ హరిత పక్కకి వచ్చి ‘హాయ్’ అన్నాడు వరుణ్. అతడు తన పక్కకి వస్తే చాలు.. హరితకి గుండెలు దడదడలాడుతాయి. నాలుగు రోజులుగా అక్కడి వాతావరణాన్ని గమనిస్తోన్న హరితకి అక్కడ అబ్బాయిలైనా, అమ్మాయిలైనా కనపడగానే ‘హాయ్’ అంటూ పలకరించుకోవడంతోపాటూ చేయి చేయి అందుకుని కరచాలనం చేసుకోవడం మామూలని గ్రహించింది. కానీ ఆమెకి మాత్రం అబ్బాయిలకి చేయందించాలంటే అదోలా వుంటోంది.
అతడు ఆమె చేతిని అందుకుని సున్నితంగా షేక్‌హ్యాండ్ ఇచ్చి ఆమె పక్కనే నడుస్తూ అన్నాడు.
‘‘నిన్న నువ్వు సీనియర్స్ ముందు నన్ను చూసి నవ్వినందుకు చాలా గొడవైంది’’.
‘‘ఏమయింది?’’ అంది హరిత.
‘‘నేనేదో నీకు సైట్ కొడుతున్నాననుకున్నారు వాళ్ళు. నువ్వు కూడా నవ్వడం, వెనక్కి తిరిగి చూడడం చూసి నువ్వు నాకు ఫ్లాటైపోయావనుకుని కుళ్ళుకుని చచ్చారు. ఒక విధంగా అదే మంచిదైందిలే. ఇప్పుడు నా జోలికెవరూ రావడంలేదు. నన్ను హీరోలా చూస్తున్నారు. థాంక్స్!’’ అన్నాడు.
‘‘సైట్ కొట్టడం అంటే?’’ ఆశ్చర్యంగా అంది హరిత.
ఆమె ప్రశ్నకి వరుణ్ పొలమారినట్లుగా చూసాడు. ఆమె ఆశ్చర్యం నటనా నిజమా అని ఆమె వంక అనుమానంగా చూసాడు. అది నటన కాదు నిజమే అని అర్థమవడంతో నవ్వుతూ అన్నాడు. ‘‘సినిమాలు చూడవా నువ్వు?’’
హరిత సిగ్గుపడుతూ ‘‘తక్కువ.. అమ్మ చదువుకునే పిల్లలు సినిమాలు చూడకూడదంటుంది’’ అంది.
అప్పటికే ఆమెకి ‘అమ్మ కూచి’ అన్న నిక్‌నేమ్ పెట్టడం, దానివెనుక నున్న బ్యాక్‌గ్రౌండ్ ఆనోటా ఈనోటా అతడి చెవిన కూడా పడ్డాయి. అతడు తల పట్టుకున్నాడు. ఆ అమ్మాయి మరీ ఇంత అమాయకురాలనుకోలేదు. ‘‘నేను మీ అమ్మగారినొకసారి చూడాలి’ అందామనుకుని ఆమె ఫీలవుతుందని ఆగిపోయాడు.
‘‘ఇంతకీ సైట్ కొట్టడం అంటే ఏమిటి?’’ మళ్లీ అడిగింది హరిత.
‘‘నీకు నిజంగా తెలియదా?’’ అడిగాడు.
‘‘నిజంగానే తెలియదు వరుణ్.. కాలేజీలో ఫ్రెండ్స్ అనుకుంటుంటే విన్నాను కానీ, అర్థం ఏంటో తెలియదు. అడిగితే ఏమనుకుంటారోనని ఎవరినీ అడగలేదు. ప్లీజ్ చెప్పవా?’’అంది.
వరుణ్ నిట్టూర్చి చెప్పాడు. ‘‘సైట్ కొట్టడం అంటే నచ్చిన అమ్మాయిని తమ ప్రేమలో పడేసుకోవడానికి అబ్బాయిల చూపుల బాణాలు విసరడం అన్నమాట! ఈ రోజుల్లో ఎయిత్ క్లాస్ పిల్లనడిగినా ఈ విషయం చెబుతుంది’’.

ఇంకా ఉంది

వరలక్ష్మి మురళీకృష్ణ