డైలీ సీరియల్

పచ్చబొట్టు-41

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రేపు ప్రొద్దున ఎనిమిది గంటలకు పెద్ద పోస్ట్ఫాసుకు వెళితే విషయం క్లియర్ అయిపోతుంది. కానిస్టేబుల్స్‌ని పంపితే ఎక్కడ తప్పు చేస్తారో అని ప్రతి చిన్న విషయానికి పచ్చబొట్టు విషయంలో తనే హాజరవుతున్నాడు.
ఒక పచ్చబొట్టునేం ఖర్మం తన ఊర్లో పచ్చబొట్టు పడ్డవాళ్లందరినీ కూడా అదేపనిగా విచారణ జరుపుతున్నాడు. ఒక్కళ్ళనోటినుంచీ కూడా సరైన సమాధానం వినిపించటంలేదు.
రాజుల కాలంలోలా రాత్రి పూట వేషాలు మార్చి తిరిగి ఏమన్నా క్లూ దొరుకుతుందా? ఏమో తనకయితే నమ్మకం లేదు.
ఇలాంటివి రాత్రే జరుగుతాయి కానీ పబ్లిక్‌గా జరగవుగా!
ఇన్ని చేస్తున్నాను, ఒక్కసారి అదీ చేసేస్తే సరి. బిచ్చగాడి అవస్థలు తెలిసినట్లు గూర్ఖాల పాట్లు కూడా అనుభవంలోకి వస్తాయి అనుకున్నాడు.
సీరియస్‌గా ఆలోచించాల్సింది పోయి తనమీద తనే జోక్స్ వేసుకుంటున్నట్లుంది పరిస్థితి. ఇలాంటప్పుడే పాజిటివ్‌గా ఆలోచించాలని మనసుకు సర్ది చెప్పుకున్నాడు.
***
విద్య, వినీత్‌ల నిశ్చితార్థం ఘనంగా చేస్తున్నాడు అనే్వష్. ఊర్లో తనకు, విద్యకు తెలిసిన వాళ్లను, అమ్మా నాన్నలకు తెలిసినవారిని, బంధువులను, స్నేహితులను ఎవర్నీ వదలలేదు. ఎక్కడా లోటు కనిపించకూడదని చాలా తాపత్రయపడ్డాడు. ఫలితం దక్కినట్లే భావించాడు. ఎందుకంటే ఎందరిని పిలిచినా, మరెందరో వచ్చినా ఈ హడావిడిలో అమ్మా, నాన్న హడావిడి లేకపోటం పెద్దలోటే. ఆ లోటు విద్యకు తెలియకూడదని, వినీల్ సమక్షంలో అవన్నీ తన చెల్లి మరిచిపోవాలని, పిచ్చి అన్నయ్యలా పదే పదే అనుకుంటున్నాడు. అక్కడ విద్య వినీల్ మాటలకు నవ్వుతోందే కానీ ఎవరైనా ఆమెను పరీక్షగా గమనిస్తే ఇట్టే చెప్పేస్తారు- అంతర్లీనంగా ఆమె ఏదో దిగులుతో బాధపడుతోందని. అది ఆమె కప్పిపుచ్చుకోవాలని ఎంతో ప్రయత్నిస్తోంది. ఎవరిని ఏమార్చిన ఏమార్చకపోయినా తన అన్న అలా అనుకుంటే చాలు. అదే పదివేలు తనకి అనుకొంది మనసులో. పిచ్చి.. పిచ్చిప్రేమ కల చెల్లిలా. ఇద్దరూ ఇద్దరే!
వినీల్ తను పిలిచినవాళ్ళు వచ్చి విష్ చేస్తుంటే వాళ్లని విద్యకు పరిచయం చేస్తున్నాడు ఉత్సాహంగా. విద్య తనకు తెలిసినవాళ్లను వినీల్‌కి పరిచయం చేస్తోంది యాంత్రికంగా. అనే్వష్ వచ్చిన వాళ్ళను గుమ్మం దగ్గిరే నిలబడి ఆహ్వానిస్తున్నాడు లోపలికి వెళ్లమని చెబుతూ. తన స్ట్ఫా అంతా ఒకేసారి రావటంతో వాళ్ళందరినీ తీసుకెళ్లి విద్యకు, వినీల్‌కు పరిచయం చేసి వచ్చాడు.
నాయనమ్మ వడ్డన దగ్గిర ఉండటంతో ఆ వైపే తొంగి చూడటం లేదు అనే్వష్. ఆవిడ శక్తి అలాంటిది. అత్తయ్యా, మామయ్యా కూడా తన మీద కోపగించుకోకుండా రావటం, వచ్చి అన్ని పనులలో పాలు పంచుకోవటం కూడా చాలా సంతృప్తిగా అనిపిస్తోంది. అత్తయ్య కూతురు ‘కన్య’ అయితే రిసెప్షన్‌లోనే ఉంది.
అక్కడే ఉన్న అనే్వష్‌తో ‘‘బావా! రోజా పువ్వులయిపోతున్నాయి, స్టోర్‌రూమ్‌లో ఉన్నాయి, కాసిని తెప్పిస్తావా?’’
‘‘అలాగే’’ అంటూ వెంటనే పసిడికి ఆ పని అప్పగించాడు.
వాళ్ళే కాదు వచ్చిన బంధువులంతా కూడా తలా ఒక చెయ్యి వేసారు. వాళ్ళందరినీ ఒకటే ఫీలింగ్. ఎంత సాయం చేసినా వాళ్ళ అమ్మా, నాన్నని మరిపించలేం కదా అని.
ఇంతలో డిఐజి కుటుంబంతో రావటంతో.. తనే దగ్గిరుండి తీసుకువెళ్లి ఆయన వెళ్ళేంతవరకూ కంపెనీ ఇచ్చి వచ్చాడు.
ప్రతి ఒక్కరూ వచ్చి వధూవరులను ఆశీర్వదించి వెళుతున్నారు. వాళ్ళంతా వచ్చి వెళ్ళేవరకూ ఆ మండపంలో ఒక ప్రక్కన నిలబడి అందరికీ నమస్కరిస్తూ ధన్యవాదాలు చేస్తూనే ఉన్నాడు. అది చూపరులందరికీ ఎంతో ముచ్చట కలిగించింది. ఈ కాలంలో అంత బుద్ధిమంతులు ఎవరుంటారని. ఆడపిల్లలు కలవాళ్లయితే అనే్వష్ తమ అల్లుడైతే ఎంతో బాగుంటుందని ఎన్నిసార్లు అనుకున్నారో?
అనే్వష్ మాత్రం తన కిష్టమైన ఇద్దరూ ఈ ఫంక్షన్‌కి రాకపోవటం, పిలవలేకపోవటం బాధగా, వెలితిగా అనిపించింది. పిలవాలన్నా తృప్తి అడ్రెస్ తెలియదు.
ఇక పచ్చబొట్టు, ఎప్పటిలా ఉత్తరం వ్రాసి టేబుల్ మీద పెట్టాడు. తెలుసుకుంటుందని, తప్పక వస్తుందని ఆశపడ్డాడు. ఉత్తర మాయమవ్వలేదు. అపరిచితులు ఎవ్వరూ రాలేదు కూడా! వీడియో అతనికి మరీ మరీ చెప్పాడు. ఎవ్వర్నీ వదలవద్దని. వచ్చిన అందరూ వీడియోలో ఉండాలని.
అసలు తనకు వీడియో అంటే పడదు. కానీ పచ్చబొట్టు గురించి తప్పక పెట్టించాడు. వీడియో ఉన్న దగ్గిరనుంచీ భావాలన్నీ అఫీషియల్‌గా మారిపోతున్నాయి. అదే తనకు నచ్చటంలేదు. ఏదైనా నాచురల్‌గా ఉంటేనేగా బాగుండేది! కొన్ని కొన్ని అలాగే జరుగుతాయి. ఏది వద్దనుకుంటామో అదే చెయ్యాల్సి వస్తుంది.
దాదాపుగా పిలిచిన వారిలో ముప్పాతిక వంతు వచ్చేసారు. షాపుల వాళ్ళు మాత్రం నెమ్మదిగా కాస్త ఆలస్యంగా ఒకరి తర్వాత ఒకరు వస్తున్నారు.
అత్తయ్య అరిటాకులు కావాలంటే ఇచ్చి వస్తున్న అనే్వష్ ఒక్కసారి అందరి చూపులు ఒకేవైపు తిరగటం గమనించి ఆశ్చర్యపోతూ చూసాడు ఆవైపు ఎవరా అన్నట్లు.
ఆకాశంలో మెరుపు మెరిసినట్లు అక్కడ ఓ దేవకన్యలా.. మిల్కీవైట్ చీరలో మెరిసిపోతూ వస్తోంది తృప్తి.
అంతులేని ఆనందం అనే్వష్ కళ్ళలో. పోనీ ఒకరైనా వచ్చారు అన్న సంతృప్తి. తన సంభ్రమానికి తెరదింపి ‘రండి! రండి! ఆలస్యమైందేం?’ అయినా మించిపోయిందేమీ లేదు’.
సరాసరి విద్య వినీల్ దగ్గరకు వెళ్లి విష్ చేసింది తృప్తి.
వినీల్‌కి తృప్తి రావటం ఎంతో సంతోషాన్నిచ్చింది.
‘‘చెల్లాయ్! వచ్చావా? నిన్ను పిలవలేకపోయానని ఎంత బాధపడ్డానో నీకు తెలియదు. ఆ రోజు అడ్రెస్ ఇవ్వలేదు. ఇల్లు చూపించమంటే వచ్చి తీసుకువెళ్తానన్నావ్’’.
‘‘అందుకేగా వచ్చింది. రాకపోతే తర్వాత నన్ను బ్రతకనిస్తావా? ఇంకాస్త ముందు ఆడపడుచులా పెత్తనం చెయ్యాల్సింది. మజాగా ఉండేది. ఫ్రెండ్స్ వస్తే వాళ్ళను పంపించి వచ్చేటప్పటికీ ఈ వేళయింది’’.
‘‘సరే! వచ్చి బ్రతికిపోయావ్ పో’’ అన్నాడు వినీల్ నాటకీయంగా.
విద్య మనసారా నవ్వింది వారి మాటలకు.
అనే్వష్ అప్పుడే కొందరిని సాగనంపి లోపలకి వచ్చాడు.
తృప్తి దగ్గరకు వెళ్లి ‘్థంక్సండీ’ అన్నాడు.
‘ఏమిటి? నేను కనిపించిన ప్రతిసారీ మీకు థాంక్స్ చెప్పటమేనా పని’
‘అహా.. అలా అని కాదు’.
‘‘మరేమిటి?’’ రెట్టించింది.
పిలవకపోయినా వచ్చినందుకు అని చెప్పాలని ఉంది. మళ్లీ ఏమనుకుంటుందో అని సంశయం.
వినీల్ ఏమన్నా పిలిచాడేమో?
లేకపోతే పిలవకుండా ఎవరు వస్తారు? కొంపదీసి తన మనసు పిలుపు వినిపించిందా?
‘‘పదండి! భోజనం చేద్దురుగాని’’
‘‘బాబోయ్! ఒక్కర్తినీ కంపెనీ లేకుండా నా వల్లకాదు’’.
అప్పటికే చివరి బంతి లేస్తున్నారు.
‘‘అతిథులు కదా! మీరేం కోరినా మేం కాదనలేం. పదండి. నేనే కంపెనీ ఇస్తాను’’ అన్నాడు అనే్వష్.
‘‘నిజంగా!’’ అంది తృప్తి. -సశేషం

-యలమర్తి అనూరాధ 9247260206