డైలీ సీరియల్

అన్వేషణ -2

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అక్కడ తను ఉండలేనురా అంది. ఈ కట్టె ఇక్కడ ఇలానే కాలిపోవాల్రా అంది. రెండు రోజులు ఆమె దగ్గరే ఉండి అనిరుధ్ ఎంతగా బ్రతిమిలాడినా, నచ్చచెప్పినా, ప్రాధేయపడినా ఆమె రాలేనుగాక రాలేనంది.
‘నువ్వు పెళ్లిచేసుకోరా అప్పుడొస్తాను’ అంది. అలాగే నువ్వొస్తే పెళ్లిచేసుకుంటాను’ అన్నాడు. ఆమె నవ్వేసి ఊరుకుండిపోయింది. చేసేది లేక వచ్చేశాడు అనిరుధ్.
తనకి తండ్రెవరో, తల్లెవరో తెలీదు. వాళ్లు తను పుట్టగానే పోయారుట. అమ్మమ్మా, మేనమామా, మేనత్తా అందరూ చెప్పేమాట ఇది. అప్పటినుంచీ తనను అమ్మమ్మే పెంచి పెద్ద చేసింది. ఆ ముసలితనంలో కాయకష్టం చేసి మరీ పెంచింది. ఆ వయస్సులో ఆమె పడ్డ కష్టం, తపన అతడికి తెలీలేదు. ఆమె తినీ తినకా తనకోసం పడ్డ ఆరాటం అప్పుడు అతడికి తెలీలేదు. కానీ, పెద్దయ్యాక తెలిసింది అమ్మమ్మ ఎంత కష్టపడిందో, తనకోసం ఎంత త్యాగం చేసిందో. అది కావాలి, ఇదికావాలి అని తను మారాం చేసి ఆమెను వేధించుకుతిన్న ఆ రోజులు తలచుకుంటే ఇపుడు అతడికి ఏడుపొస్తుంది.
అలాంటి అమ్మమ్మని తను ఎంతబాగా చూసుకోవాలి? పువ్వుల్లో పెట్టి చూసుకోవాలి. కానీ, అమ్మమ్మ రానంటోంది. పిచ్చి సన్నాసీ నువెళ్లి హాయిగా ఉండరా.. నేనెంతకాలం ఉంటాను.. రాలిపోయేదాన్ని.. ఇక్కడే రాలిపోనీరా కన్నా.’ అంటూ జీవంలేని నవ్వు నవ్వేస్తూ చెప్పేసింది.
‘పోనీ అమ్మమ్మ చెప్పినట్లు పెళ్లి చేసుకుని, అపుడు ఆమెను తన దగ్గరికి తెచ్చేసుకుందాం’ అనుకున్నాడు. అప్పుడు నిజంగా అమ్మమ్మ వస్తుందా అన్నదీ సందేహమే!..
ఈ ఆలోచనలతో అనిరుధ్ సతమతమవుతున్న సమయంలోనే అతడికి తమాషాగా పరిచమయ్యింది హిమజ!
చాలా అందమైన పేరు. పేరుకు తగ్గట్టుగానే ఆమె నాజూగ్గా, అందంగా ఉంటుంది. కవులు వర్ణించే మీనాక్షి మీనాక్షి అన్నట్లు ఆమె కళ్లు కూడా అందంగా ఉంయి. ఆమె పెదవులమీద ఎప్పుడూ చిరునవ్వు తారాట్లాడుతూ ఉంటుంది.
ఆమె అప్పుడప్పుడు చుడీదార్లు వగైరా మోడ్రన్ డ్రెస్సులు వేస్తుంది. కానీ, చీరలో మాత్రం చాలా అందంగా ఉంటుంది. మళ్లీ మళ్లీ చూడాలనిపించేట్లుంటుంది.
అతడు చార్మినార్ అందాలు చూస్తూ తన్మయత్వంలో వున్న సమయంలో, హిమజ కూడా అలా చూస్తూ వెనక్కి నడుస్తూ వచ్చి అనిరధ్‌మీద పడింది.
‘అయాం సారీ అండీ’ అన్నది నొచ్చుకుంటూ హిమజ.
‘ఫర్వాలేదండి’ అన్నాడు అనిరుధ్.
ఆ తర్వాత అక్కడ ఆ చారిత్రక కట్టడాన్ని చూస్తున్నంతసేపు మధ్యమధ్యలో ఆమె అనిరుధ్‌ని చూస్తూనే ఉంది. అతడూ ఆమెను చూస్తూనే ఉన్నాడు. అలా వాళ్లిద్దరి చూపులూ చాలాసార్లు కలుసుకున్నాయి. ఎవరి దారిన వాళ్లు వెళ్ల్లిపోతున్నపుడు కూడా చివరిసారి సుమా అన్నట్లు ఒకరినొకరు మళ్లీ చూసుకున్నారు.
ఆ రోజంతా ఆమె సారీ చెప్పడం, ఆమె చూపులు అనిరుధ్‌ని వెంటాడుతూనే ఉన్నాయి. ఏదో ఆకర్షణ అతడిని మరీ మరీ వెంటాడింది. నాలుగు రోజులు గడిచినా ఆమె రూపం అతడి కళ్లల్లో మెదులుతూనే ఉంది.
సరిగ్గా మూడు రోజులు పోయాక రాత్రి ఏడు గంటల సమయంలో ఓ షాపింగ్ మాల్‌లో ఆమె తారసపడింది, అదీ లిఫ్ట్‌లో. ఆమెను చూడగానే అప్రయత్నంగా అతడి పెదవులు విచ్చుకున్నాయి. చిత్రం! ఆమె పెదవులూ విచ్చుకున్నాయి.
ధైర్యం చేసి అనిరుధ్ అన్నాడు ‘హలో’ అని. ఆమె కూడా వినిపించీ వినిపించనట్లు ‘హలో’ అని తలతాటించింది.
లిఫ్ట్ బయటకొచ్చి జంట్స్ సెక్షన్ వైపు అనిరుధ్, లేడీస్ సెక్షన్ వైపు ఆమె వెళ్లిపోయారు.
తన డ్రెస్ సెలక్షన్ చేస్తూలిఫ్ట్ కేసి మాటిమాటికీ చూస్తున్నాడు అనిరుధ్ ఆమె వెళ్లిపోతోందా అని. తనలో కలుగుతున్న ఆలోచనలకి, తర్వాత తనలో తనే నవ్వుకున్నాడు.అతడు సెలక్షన్ పూర్తిచేసి బిల్లు చెల్లించి లిఫ్ట్ దగ్గరికి వచ్చి లిఫ్ట్‌కోసం ఎదురుచూస్తుంటే ఆమె కూడా వచ్చింది.
ఈసారి అతడిని చూసి ముందుగా ఆమే నవ్వింది. మళ్లీ లిఫ్ట్‌లో ఇద్దరే.. చూపులు.. దొంగచూపులు.. ‘ఏం చేస్తున్నారు?’ అనిరుధ్ అడిగాడు ధైర్యం చేసి.
‘కార్పొరేట్ కాలేజీలో లెక్చరర్‌గా..’ చెప్పిందామె. ఇద్దరూ లిఫ్ట్ బయటికి వచ్చారు.
‘ఇఫ్ యూ డోంట్‌మైండ్ లెట్స్ హావ్ ఎ కాఫీ?..’ అడిగాడు అనిరుధ్.
అలా అడిగిన తర్వాత తనకే ఆశ్చర్యం వేసింది. తనేనా అలా అడిగింది అని. తనని కాలేజీలో అందరూ బుద్ధు అని నిక్‌నేమ్‌తో పిలిచేవారు.
ఐదు సెకండ్ల వౌనం తర్వాత ‘పదండి’ అన్నట్లు తలూపిందామె.
షాపింగ్‌మాల్ ఫస్ట్ ఫ్లోర్‌లో ఉన్న హోటల్లో మిడిల్ టేబుల్ దగ్గర ఎదురెదురుగా కూర్చున్నారిద్దరూ.
‘నా పేరు అనిరుధ్. ఇక్కడ ఐటి కంపెనీ నడుపుతున్నాను’ అన్నాడు అనిరుధ్, వెయిటర్ వచ్చేలోగా వౌనంగా కూర్చోవడం ఇష్టంలేక.
‘నా పేరు హిమజ. మాథ్స్ లెక్చరర్‌ని’ చెప్పిందామె.
‘చార్మినార్ దగ్గర సంఘటన ఇప్పటికీ నాకు నవ్వొస్తుంది...’ కాస్సేపయ్యాక అన్నదామె చిన్నగా.
‘అవును... కొన్ని పరిచయాలు తమాషాగా అనిపిస్తాయి..’ అన్నాడు.
అవునన్నట్లు తలూపిందామె. ఈలోగా వెయిటర్ వచ్చాడు. కాఫీ ఆర్డర్ చేశాక, ఎవరెక్కడ ఉంటున్నదీ వివరాలు తెలుసుకున్నారు. సెల్ నెంబర్లూ ఇచ్చుకున్నారు.
‘ఫేస్ ఈజ్ ది ఇండెక్స్ ఆఫ్ ది మైండ్’ అన్నట్లు అనిరుధ్‌ని చూడగానే వేరే ఎలాంటి చెడు అభిప్రాయమూ కలగలేదు. ఇపుడు రెండోసారి కలిసినపుడు కాస్త సదభిప్రాయం లాంటి భావన కలిగింది. ఫోన్ నెంబరు ఇచ్చినంత మాత్రాన కొంపలేం మునగవు కదా అనుకున్నది.
‘మీకు వీలున్నపుడుమా కంపెనీకి రండి’ కాఫీ తాగి బయటకొచ్చాక చెప్పాడు అనిరుధ్.
అలాగే అన్నట్లు తలూపి, ఓ చిరునవ్వు నవ్వి ఆటో ఎక్కి వెళ్లిపోయిందామె. మళ్లీ ఓ పదిరోజులపాటు ఆమె రూపం అనిరుధ్‌ని వెంటాడి గిలిగింతలు పెట్టింది.
ముచ్చటగా అన్నట్లు మూడోసారి శిల్పారామంలో కనిపించింది హిమజ. ‘హాయ్’ అని పలుకరించుకున్నారు.
‘ఎప్పుడూ మీరు నాకులాగ ఒంటరిగానే బయటికి వస్తుంటారా?’ అనడిగాడు అనిరుధ్ ఆమెనే చూస్తూ.
‘ఎప్పుడూ అని కాదు.. రిలాక్స్‌గా, ఎంజాయ్‌మెంటుకయితే ఫ్రెండ్స్‌తో వెళతాను.. చిన్న చిన్న షాపింగ్ పనులకైతే ఒంటరిగానే వస్తాను.. తొందరగా అవుతుందని..’ అన్నదామె అతడి పక్కన నడుస్తూ.
‘నాకైతే ఇక్కడ ఫ్రెండ్స్ లేరులెండి, మా బిజినెస్ పార్ట్‌నర్ జగదీశ్ తప్ప..’ అనిరుధ్ చెప్పాడు.
‘ఓ.. ఎనీహౌ లైక్‌మైండ్ ఫ్రెండ్స్ ఉంటేనే హ్యాపీగా ఉంటుంది.. లేకపోతే మహా చికాగ్గా అనిపిస్తుంది..’
‘అఫ్‌కోర్స్.. ఏమైనా షాపింగ్ చేద్దామని వచ్చారా?’ - ఇంకా ఉంది

సర్వజిత్ 9010196842