డైలీ సీరియల్

మహాభారతంలో ఉపాఖ్యానాలు -19

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆ తేజస్సుతో నీ కొక కొడుకు పుడతాడు. అతడు రాజు కోరిక తీరుస్తాడు. కాని అతనికి మాత్రం మానవలోకంలో సంతానం ఉండదు’’. ఈ విధంగా గంగానదితో ఒప్పందం చేసుకొని వసువులు వెళ్లిపోయారు. ప్రతీప మహారాజు సర్వప్రాణులయందు దయ కలిగినవాడు. ఆయన గంగా ద్వారంలో నివసిస్తూ ఎన్నో సంవత్సరాలు జపిస్తూ కూర్చుని ఉన్నాడు. అప్పుడు గంగ సుందరమైన రూపుదాల్చి ఆ రాజర్షి వద్దకు వచ్చి అతని కుడితొడపై కూర్చుంది.
రాజు ఆమెను చూసి ‘‘కల్యాణీ! నేను నీకు ఏమి ఇవ్వగలను? నీ కోరిక ఏమిటి?’’ అని అడిగాడు.
అప్పుడు గంగ ‘‘రాజా! నేను నిన్ను కోరి వచ్చాను. నన్ను పరిగ్రహించు. కోరికతో వచ్చిన స్ర్తిని తిరస్కరించరాదు’’
అప్పుడు రాజు ఇలా అన్నాడు ‘‘సుందరీ! నేను పరకాంతను కామించలేను. సవర్ణురాలు కాని కాంతను కూడా కామించను. ఇది నా నియమం’’.
అప్పుడు గంగ ఇలా అంది ‘‘నేను అమంగళమైనదాన్ని, పొందదగనిదాన్ని కాను. నీపై అనురక్తి గల దివ్యకాంతను. నన్ను పరిగ్రహించు’’.
రాజు మరల ఇలా అన్నాడు ‘‘నీ కోరికను నీవే తిరస్కరింపజేసుకున్నావు. నిన్ను అంగీకరిస్తే ధర్మహాని జరుగుతుంది. నేను నాశనవౌతాను. కల్యాణీ! నీవు నా కుడి తొడపై కూర్చున్నావు. అలా కుడితొడపై కూర్చునే అవకాశం సంతానానికి, కోడలుకు మాత్రమే ఉంటుంది. ఎడమ తొడ మీద కామినులు మాత్రమే కూర్చుంటారు. కనుక నేను కాముకుడినై నీతో ప్రవర్తించలేను. కుడితొడ మీద కూర్చున్నావు కనుక కోడలు కాదగినదానవు’’. అప్పుడు గంగ ఇలా అన్నది ‘‘మహాత్మా! అలాగే చేస్తాను. నీవు ధర్మాత్ముడవు. నీపై గల భక్తివలన నీ వంశాన్ని సేవించాలను కుంటున్నాను. నేను నీ కుమారుని కలుస్తాను. ఒక నియమానికి లోబడి తమకు కోడలిని కాగలను. నా ప్రవర్తనను మీ కుమారుడు అంగీకరించాలి. నేను ఏది చేసినా ఎప్పుడూ కాదనకూడదు. ఈ నియమానికి ఒప్పుకుంటే మీ కుమారుని వరిస్తాను. ఆయన పుత్రుల ద్వారా స్వర్గలోకాన్ని చేరుకుం టాడు’’.రాజు దానికి అంగీకరించాడు. కొంతకాలానికి అతనికి పుత్రోదయం అయింది. ఆ దంపతులకు మహాభిషుడే పుత్రునిగా జన్మించాడు. అతనికి తండ్రి శంతనుడు అని పేరు పెట్టాడు. శంతనుడు పెద్దవాడై సకల శాస్త్ర పారంగతుడై నిష్ఠతో రాజ్యపాలన చేశాడు. అతను అనేక పుణ్యకర్మలను చేశాడు. వనంతో శోభిస్తన్న కుమారునితో ప్రతీప మహారాజు ఇలా అన్నాడు ‘‘కుమారా! గతంలో ఒక దివ్యకాంత నా దగ్గరకు వచ్చింది. ఆమె ఎప్పుడైనా ఏకాంతంగా పుత్రకామనతో నీ దగ్గరకు వస్తే ఆమెను ఏ ప్రశ్నలు అడుగకు. ఆమె ఏమి చేసినా నీవు ప్రశ్నించరాదు. ఆమె కోరితే నా ఆజ్ఞగా భావించి నీవు భార్యగా స్వీకరించాలి’’. శంతనుని ఇలా ఆదేశించి అతన్ని రాజును చేసి ప్రతీపుడు అరణ్యానికి తపస్సుకోసం వెళ్లిపోయాడు.
ఒకసారి శంతనుడు వేటకై గంగాతీరాన గల అరణ్యానికి వెళ్లి అక్కడ అనేక మృగాలను వేటాడాడు. గంగాతీరంలో తిరుగాడసాగినాడు. అక్కడ అతను ఒక దివ్యకాంతను చూచాడు. ఆమెకు కూడా రాజుపై మక్కువ కలిగి అతని దగ్గరకు వచ్చింది.
రాజు అపుడు ఆమెతో ఇలా అడిగాడు. ‘‘కల్యాణీ! నీవెవరవు? దేవకాంతవా? గంధర్వకాంతవా? లేక అప్సరసలతో ఒకతెవా? దివ్య సౌందర్యం కలిగిన నిన్ను యాచిస్తున్నాను. నా భార్య కావలసింది’’
శాంతనమహారాజు మాటలు విన్న గంగకు తాను పూర్వం వసువులకిచ్చిన మాట గుర్తుకు వచ్చింది. ఆమె ప్రతీ మాటను తలచుకుంది. వసువుల శాపవిమోచనం సమయం వచ్చిందని గ్రహించి రాజుతో ఇలా అంది. ‘రాజా! నేను నీకు భార్యనై నీ ఆధీనంలో ఉంటాను. కాని నేను ఏమి చేసినా, శుభమైనా, అశుభమైనా నన్ను అడ్డగించకూడదు. నాకు కష్టం కలిగేటట్లు మాట్లాడినా, ప్రవర్తించినా తప్పక నిన్ను వదలి వెళ్లిపోతాను’’
శంతనుడు ఆమె మాటలకు ఆ విధంగా చేస్తానని ఒప్పుకొని ఆమెను తీసుకొని తన నగరానికి వెళ్లాడు. శంతనుడు గంగతో అన్ని విధాలుగా సుఖించాడు. ఆమెను ప్రశ్నించకూడదు కనుక ఆమె ఏమి చేసినా ఎన్నడూ ప్రశ్నించలేదు. గంగ కూడా తన నడవడితో సౌందర్యంతో, వినయంతో రాజుని ఎంతో సంతోషపరిచింది. ఆ విధంగా సుఖిస్తున్న ఆ దంపతులకు దివ్యమైన కొడుకులు ఎనిమిది మంది పుట్టారు. పుట్టిన ప్రతిశిశువును గంగ నీటిలో పడవేయసాగింది. ఈ విధంగా ఏడు మంది శిశువులను గంగలో పడవేసింది. ఆమె చేస్తున్న ఈ పని శంతన మహారాజుకు నచ్చలేదు. కాని ఆమె తనని వదలి వెళ్లిపోతుందేమో అన్న భయంతో ఊరుకున్నాడు.
ఎనిమిదవ కుమారుడు పుట్టినప్పుడు అతణ్ణి కూడా భార్య నీటిలో పడవేస్తుందని రాజు దుఃఖించాడు. (ఇంకావుంది)

డాక్టర్ ముదిగొండ ఉమాదేవి