డైలీ సీరియల్

మహాభారతంలో ఉపాఖ్యానాలు -20

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శంతనుడు తన దుఃఖాన్ని ఆపుకుంటూ ఆమెతో ఇలా అన్నాడు ‘‘ఈ శిశువును చంపవద్దు! నీవు ఎవరి కుమార్తెవు? ఎందుకు ఈ శిశువులను చంపుతున్నావు? ఇలా కుమారులను చంపి మహాపాపాన్ని పొందుతున్నావు’’
అప్పుడు గంగ అతనితో ఇట్లా అన్నది. ‘‘పుత్రుని కోరుతున్న ఓ రాజా! నేను నీ ఈ కొడుకును చంపను. కాని నేను పెట్టిన నియమం ప్రకారం నిన్ను విడిచివెళ్లే సమయం వచ్చింది. నేను జహ్ను మహర్షి కుమార్తెను గంగను. మహర్షులు నన్ను సేవిస్తూ ఉంటారు. దేవతల కార్యసిద్ధి కోసం నేను నీతో కలిసి జీవించాను. ఈ ఎనిమిది మంది దివ్యులైన వసువులు వశిష్ట మహర్షి శాపం వల్ల వారు మానవులుగా జన్మించారు. వారిని గర్భంలో ధరించడానికి తగిన మానవకాంత ఈ లోకంలో ఎవరూ లేరు. కనుక నేను మానవకాంతగా వచ్చి వారికి జన్మనిచ్చి వారిని పుట్టిన వెంటనే నీట్లో పడవేసి వారికి ముక్తిని కలిగించాను. ఇది వసువుల నియమం. అందువల్ల అలాగే చేశాను. వసువులు వశిష్టముని శాపం నుండి విముక్తులయ్యారు. ఈ కుమారుడు చిరకాలం జీవిస్తాడు. ఇతడు వసువులందరి అంశతో పుట్టినవాడు. ఇతడు నీ వంశానందం కోసం పుట్టాడు. ఇతడు నా కుమారుడు కనుక ఇతనికి గంగాదత్తుడని పేరు పెట్టాలి’’.
అప్పుడు శంతనుడు ఆమెనిలా ప్రశ్నించాడు. ‘‘వశిష్ఠుడు వసువులకు ఎందుకు శాపం ఇచ్చాడు? వారు ఏం తప్పు చేశారు? నీవు నా కిచ్చిన ఈ కుమారుడు ఏ తప్పు చేసినందువల్ల చిరకాలం జీవించబోతున్నాడు? ఓ గంగా! సమస్త లోకాలకూ అధీశ్వరులైన ఈ వసువులు మానవులుగా ఎలా పుట్టారు? ఆ వివరాలు నాకు చెప్పు’’.
అప్పుడు గంగ ఇలా అంది. ‘‘ఓ భరతశ్రేష్ఠా! విను. వారి శాపవృత్తాంతం తెలిపెదను. పూర్వం వరుణుడు తన కుమారునిగా స్వీకరించినవాడే వశిష్ఠుడు. అతని ఆశ్రమం మేరు పర్వతం ప్రక్కన ఉండేది. అక్కడ మహర్షి తపస్సు చేసేవాడు. అతని దగ్గర సురభి అనే కామధేనువుకు పుట్టిన ఒక గోవు ఉండేది. ఆ ఆశ్రమంలో ఆ ఆవు ఏ భయము లేకుండా సంచరించేది.
ఒకసారి పృథువు మొదలైన అష్టవసువులు తమ భార్యలతో సహా ఆ ఆశ్రమానికి వచ్చి, ఆ ప్రాంతమంతా విహరించారు. అప్పుడు ఆ వసువుల్లోని ఒకని భార్య ఆ గోవును చూసి ముచ్చటపడి తన భర్తకు చూపింది. ద్యోవు నామం గల ఆమె భర్త ఇలా అన్నాడు. ‘‘ఈ ఆవు ఈ ఆశ్రమాధిపతియైన వశిష్ఠ మహర్షిది. దీని పాలను త్రాగిన మానవుడు ఏ రోగం లేకుండా పది వేల సంవత్సరాలు వనంతో జీవిస్తాడ’’. అప్పుడు అతని భార్య ఇలా అన్నది ‘‘మానవలోకంలో నాకు జితవతి అనే స్నేహితురాలు ఉంది. ఆమె కోసం ఈ గోవును తెచ్చి ఇవ్వండి. ఆమె కూడా ఈ ఆవు పాలు త్రాగి ఆరోగ్యంతో అంతకాలం జీవిస్తుంది. నా రుూ కోర్కెను తీర్చండి’’.
ఆమె మాటలు విన్న ఆ వసువు భార్య ముద్దు చెల్లించడం కోసం తన సోదరులతో కలిసి ఆ ఆవును దొంగిలించాడు. భార్య కోర్కెను తీరుస్తున్న అతను మహర్షి యొక్క తపఃప్రభావాన్ని గురించి యోచించలేదు. వారు వెళ్లిన తర్వాత పండ్లను సేకరించుకొని వచ్చిన మహర్షికి ఆశ్రమంలో ఆవు కన్పించకపోవడంతో అతను ఆ ప్రాంతమంతా వెదికి, చివరకు తన దివ్యదృష్టితో వసువులు ఆవును దొంగిలించారని తెలుసుకొని క్రోధంతో వారినిలా శపించాడు. ‘‘నా హోమధేనువును దొంగిలించిన ఈ వసువులు మానవులుగా జన్మిస్తారు.’’ అలా శపించి మహర్షి మరల మనస్సును తపస్సు మీద లగ్నం చేశాడు.
వసవులకు వశిష్ఠుని శాపం గురించి తెలిసి వారు మహర్షి దగ్గరకు వచ్చి శాపవిముక్తి కల్గించమని ఎంత వేడినా తపస్వి అయిన వశిష్ఠుని అనుగ్రహాన్ని పొందలేకపోయారు. వశిష్ఠుడు వారితో ఇలా చెప్పాడు. ‘‘మీ అందరినీ శపించినప్పటికీ, మీకందరికీ సంవత్సరం లోపల విముక్తి కలుగును. కాని ఎవరి కారణంగా మీరు శపించబడినారో ఆ ద్యోవు మాత్రం దీర్ఘకాలం మానవలోకంలో జీవిస్తాడు. అతను కీర్తిమంతుడై, సంతానహీనుడై, ధర్మస్వరూపుడై స్ర్తీ భోగాలను వదలి జీవిస్తాడు’’.
అపుడు ఆ వసువులందరూ నా దగ్గరకు వచ్చి ‘‘పుట్టినవారిని పుట్టినట్లుగా నీట్లో పడవేసి తమకు విముక్తి కలిగించుమని’’ నన్ను అర్థించారు. నేను అంగీకరించి ఆ విధంగా చేసి వారికి విముక్తి కలిగించాను. ఈ ద్యోవసువు మాత్రము మహర్షి శాపం వలన చిరకాలం ఈ మానవలోకంలో జీవించి కీర్తి పొందుతాడు. ఇతన్ని నేను తీసుకొని వెళ్లి సకల విద్యలు నేర్పించి పెద్దవాడైన తర్వాత నీ దగ్గరకు పంపుతాను.’’ ఇలా శంతనునితో పలికి గంగ కుమారుని తీసుకొని అదృశ్యమైపోయింది. ఆ ద్యోవు తండ్రిని మించినవాడై దేవవ్రతుడు, గాంగేయుడు, భీష్ముడిగా ప్రసిద్ధి చెందాడు. అతను వివాహం చేసుకోలేదు. ధర్మాత్ముడుగా జీవించాడు. (ఇంకావుంది)

డాక్టర్ ముదిగొండ ఉమాదేవి