డైలీ సీరియల్

మహాభారతంలో ఉపాఖ్యానాలు -21

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పూర్వకాలంలో మాండవ్యుడనే బ్రాహ్మణుడుండేవాడు. అతను సత్య తపోనిష్ఠుడు, ధర్మజ్ఞుడు, మహాతపస్వి, మహాయోగి. ఆ మహర్షి తపస్సులో నిశ్చలుడై ధ్యానంలో ఉండగా కొందరు దొంగలు తాము దొంగిలించిన సొమ్ము అతని ఆశ్రమంలో దాచి సైనికులు వచ్చే లోగా దాక్కున్నారు. వారిని వెంబడించిన భటులు ఆశ్రమం లో తపస్సు చేసుకొంటున్న ఆ ఋషిని చూసి ఇలా అడిగారు. ‘ఓ విప్రోత్తమా! దొంగలు ఎటు వెళ్ళారో చెపితే వెళ్ళి వాళ్ళను పట్టుకుంటాం’’ భటులు అలా అడుగుతున్నా వౌనవ్రతం లో ఉన్న ఋషి బదులు చెప్పలేదు. అప్పుడు భటులు ఆశ్రమం అంతా వెతికి అక్కడ దొంగలు దాచిన సొమ్మును దొంగలను చూచి మునిని దొంగ అని అనుమానించారు. మునిని, దొంగలను బంధించి రాజు దగ్గరకు తీసుకొని వెళ్ళారు. రాజు దొంగలను, మునిని చంపవలసిందిగా ఆజ్ఞాపించాడు. అప్పుడు సైనికులు ఆ తపస్వి గురించి తెలియక అతని శరీరంలోకి శూలం దించారు. అలా మునిని శూలమెక్కించి వారు సొమ్ము తీసుకొని వెళ్ళిపోయారు. ఈ విషయం మిగతా మునులకు తెలిసింది. వారంతా రాత్రి సమయంలో పక్షుల రూపంలో అతని దగ్గరకు వచ్చి అతని దుస్థితి చూచి ఎంతో దుఃఖించారు. వారు అతన్నిలా అడిగారు. ‘‘ద్విజోత్తమా! శూలంపై ఆరోపించబడి ఇంతటి కష్టాన్ని అనుభవించడానికి మీరు ఏం పాపం చేశారు’’.
అప్పుడు ఆ ముని వారితో ఇలా అన్నాడు. ‘‘ఎవరిపై దోషాన్ని ఎత్తి చూపగలను? నాకెవరూ హాని చేయలేదు’’.
భటులు అక్కడే ఉండి ఈ విషయం విని యథాతధంగా మహారాజుకు నివేదించారు. రాజు వారి మాటలు విని, మంత్రులతో కలిసి వచ్చి శూలంపై ఉన్న మునిసత్తముని ప్రసన్నుని చేసుకోవాలనుకొని ఇలా అన్నాడు. ‘‘ఋషిశ్రేష్ఠా! అజ్ఞానంతో నేను మీకు హాని కలిగించాను. నాపై కోపించక అనుగ్రహించండి’’
రాజు ఇలా దీనంగా పలుకగానే మహర్షి అతని పట్ల ప్రసన్నుడైనాడు. రాజు వమునిని శూలం నుండి విడిపించాడు. శూలాన్ని శరీరం నుండి వేరుచేయాలని ప్రయత్నించారు. కాని కొంతభాగం శరీరంలోనే ఉండిపోయంది. అప్పటి నుంచి ఆ ఋషి ఆ శూలాన్ని శరీరంలోనే ఉంచుకునే జీవించాడు. దీని ఫలితంగా అతను అతి దుర్లభమైన పుణ్యలోకాలకు చేరాడు. అణి అంటే శూలాగ్రభాగం. అది శరీరంలోనే నిలిచిపోయంది. కనుక ఆ ముని ఆణీమాండవ్యునిగా ప్రసిద్ధి చెందాడు.
ఆ ఋషి చనిపోయాక యమధర్మరాజు దగ్గరకు వెళ్ళి ఇలా అడిగాడు. ‘‘నేను శిక్షని ఈ విధంగా అనుభవించటానికి కారణమేమి టి? నేను చేసిన అంత పెద్ద నేరమేమిటి?’’
అప్పుడు యముడు ‘‘తపోధనా! నీవు రెక్కల పురుగుల (తూనీగల) వెనుక భాగాన్ని దర్భపోచలతో గ్రుచ్చావు. దాని ఫలితాన్ని ఇలా పొందావు. స్వల్ప దానానికి ఎన్నోరెట్లు ఫలితం ఇచ్చినట్లు స్వల్పమైన అధర్మం చేసినా అది అనేక దుఃఖ ఫలాలను ఇస్తుంది.’’
ఋషి ‘‘నేను ఏ వయస్సలో ఈ పని చేశాను?’’ అని అడిగాడు.
యమధర్మరాజు ‘‘నీవు చిన్న వయస్సులో ఈ విధంగా చేశావు’’
మాండవ్యుడు ఇలా అన్నాడు. ‘‘పిల్లలకు పండ్రెండు సంవత్సరాలు వచ్చేదాకా ఏ పని చేసినా అది తప్పుకాదని ధర్మశాస్త్రాలు చెప్తున్నాయ. కదా. మరి ఆ వయసు బాలునకు ధర్మశాస్త్రాలు తెలియవు. నేను ఆ వయస్సులో చిన్న తప్పు చేశాను. దానికోసం నాకు ఇంత పెద్ద శిక్ష విధించావు. అన్ని ప్రాణుల వధకంటే బ్రాహ్మణ వధ పెద్దది. కనుక ఓ ధర్మరాజా! మానవలోకంలో శూద్రుడవై జన్మిస్తావు. ఇప్పటి నుండి బాలబాలికలందరికీ ధర్మ ఫలితాన్ని ప్రకటించే ఒక హద్దును పెడ్తున్నాను. పదునాలుగు సంవత్సరాల దాకా ఎవరికీ ఏ పాపం అంటదు. ఆ తర్వాత చేస్తే మాత్రం ఆ పాప ఫలితం అనుభవించాలి’’
మాండవ్య మహర్షి శాప ఫలితంగా యమధర్మరాజు విదురుడుగా శూద్ర జన్మ ఎత్తాడు. అతను శూద్రుడు అయనప్పటికీ సర్వ ధర్మ కుశలుడు. ఎటువంటి క్రోధం లేనివాడు. కురువంశ శ్రేయస్సు కోరినవాడు. విదురుడు నీతికోవిదుడు రాజనీతివిశారదుడుగా కూడా సంభావించబడ్డాడు. అందుకే ఇప్పుడు కూడాపిల్లలను దేవతలుగా భావించి వారు చేసిన తప్పులను క్షమిస్తూ వారు ఏవిధమైన తప్పులు అసలు చేయకుండా చిన్నప్పటి నుంచి వారికి మానవత్వాన్ని, ధర్మాచరణను బోధించే బాధ్యత తల్లిదండ్రులు తీసుకొన్నారు. మొక్కై వంగనిది మానై వంగునా అన్నట్టు వారు అధర్మాచరణను నేర్చుకున్నట్లు అయతే దాని నుంచి విముక్తులు కావడం కష్టం కనుక చిన్ననాటి నుంచి సద్భాస్యాన్ని నేర్పించాలి. (ఇంకావుంది)

డాక్టర్ ముదిగొండ ఉమాదేవి