డైలీ సీరియల్

అన్వేషణ -16

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సినిమాల్లో లాగా గొప్పగొప్ప ఎస్.ఐ.లు, ఎస్పీలు శివమణి లాంటి పోలీసు ఆఫీసర్లు నిజజీవితంలో ఉండరుగాక ఉండరని పాపం వాళ్లకి తెలీదు. కలం యోధుల జేబులూ నిండాయి. వాళ్ల యజమానులకుండే లావాదేవీలు, ఇబ్బందులూ రహీంపాషాకే అనుకూలంగా పరిస్థితులు మార్చేశాయి.
అన్నీ వెరసి తండ్రి రహీంపాషాగారికి ఏమాత్రం తీసిపోని విధంగా, అసలైన వారసునిగా అహ్మద్‌పాషా తయారయ్యాడు. అందుకని అతడిని విదేశాల్లో అంటే అరబ్ దేశాల్లో ఉద్యోగాలకి పంపుదామనుకున్న ఆలోచనను రహీంపాషా విరమించుకుని, తనకి రాజకీయ వారసుడిగా పుత్రరత్నాన్ని తీర్చిదిద్దాలనుకుంటున్నాడు.
అందుకనుగుణంగానే ఇప్పుడిప్పుడే రాజకీయ ప్రయోజనకరమైన కార్యక్రమాల్లో అహ్మద్‌పాషా పాలుపంచుకుంటున్నాడు. తండ్రి కార్యక్రమాలకి ఏర్పాట్లుచూడడం, ఆయనకోసం వచ్చే వారితో ముందుగా తాను మాట్లాడ్డం, వినయంగా పెద్దవారికి నమస్కరించడం, మరీ పెద్ద వాళ్ల కాళ్లకి నమస్కారం పెట్టడంకూడా నేర్చుకున్నాడు.
అవన్నీ రహీంపాషా ముప్ఫయ్యేళ్ల క్రిందట నేర్చుకున్న పాఠాలు. కొడుక్కి బోధించాడు. ఒక ఆటో నడుపుకుని బ్రతికే తాను ఇంత స్థాయికి ఎలా వచ్చాడోకూడా కొడుక్కి అప్పుడప్పుడు పాఠాలు చెప్పాడు.
పగటిపూటా, రాత్రి ప్రత్యేక డ్యూటీలు- అంటే రైల్వేస్టేషన్ నుంచీ, బస్‌స్టాండ్‌నుంచీ ప్రత్యేక పాసింజర్లను ప్రత్యేక లాడ్జిలకి తీసికెళ్లడం లాంటి డ్యూటీలు అంటూ ఆటో ఎంత నడిపినా నెలనెలా ఆటోఫైనాన్స్ కట్టడమే కనాకష్టంగా ఉండేది రహీంపాషాకి.
ఇలా ఎంతకాలం? జీవితంలో పైపైకి ఎదగాలని తాపత్రయపడ్డాడు. దానికి అనుగుణంగానే పథకాలు వేసుకున్నాడు. అందుకు మునిస్వామినాయుడు ఆలంబనగా దొరికాడు రహీంకి.
సిటీలో ఆయన పలుకుబడి ఉన్న రాజకీయ నాయకుడు. అతడు ఎప్పుడూ అధికార పక్షమే. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలో చేరుతూ మూడుపువ్వులూ, ఆరుకాయలుగా తన రాజకీయ జీవితాన్ని వెలిగించుకుంటున్నాడు.
సామాజిక న్యాయం అంటూ జనంలో ఎదిగాడు. తర్వాత కులాన్ని అడ్డంపెట్టుకుని బలమైన నాయకుడిగా అధిష్ఠానం దృష్టిలోపడ్డాడు. దానికి తగ్గట్టుగానే పైనున్న తన కులంవాడు ముందుముందు పనికొస్తాడులే అని పైనున్న ఓ సీనియర్ నాయకుడు మునిస్వామినాయుడుని జుట్టుపట్టుకుని తన పలుకుబడి ఉపయోగించిన పార్టీలో ఓ చిన్న పదవిలో కూర్చోబెట్టాడు.
అదిచాలు మునిస్వామినాయుడికి అల్లుకుపోవడానికి. అలాగే అల్లుకుపోయాడు. పైకి వచ్చేశాడు. ఆనక పదవుల పందేరంలో నాలుగు చేతులా సంపాదించుకునే పదవి దగ్గరికొచ్చేసరికి ఇతను జుట్టపట్టుకుని పైకిలాగినవాడికే చేయిచ్చి మరొకనికి మద్దతుప్రకటించి తనకి పదవిని పదిలం చేసుకున్నాడు.
అప్పుడు మునిస్వామినాయుడు అంటే సిటీలో చాలాపేరున్న నాయకుడు. చక్రం తిప్పే నాయకుడు. రాజకీయాలు, పరిస్థితులు బాగా వంటబట్టించుకున్నవాడు.
అలాంటి మునిస్వామినాయుడు దగ్గర రహీంపాషా కుదురుకున్నాడు. అందుకు అతడికి బాజీరావు సాయపడ్డాడు. రహీంపాషా ఆటో నడపడానికి ముందు ఒక మెకానిక్ షెడ్డులో కొద్దికాలం పనిచేశాడు. ఆ పని అతడికి సంతృప్తినివ్వలేదు. రాత్రికిరాత్రి పైకి ఎదిగిపోవాలన్న మనస్తత్వం అతడిది. తర్వాత ఆటోడ్రైవర్‌గా మారాడు. అనంతరం ఏంచెయ్యడానికీ అతడికి తోచలేదు. ఆటోడ్రైవర్‌గానే రెండేళ్లుపైగా గడిచిపోయాయి. అప్పటికే అతడికి ఆ వృత్తిమీద బాగా బోరుకొట్టేసింది.
ఆ పరిస్థితుల్లోనే అతడికి బాజీరావుతో పరిచయమయ్యింది. బాజీరావు అప్పటికే ఆ సిటీలో మధ్యరకం రౌడీగా ఎదిగినవాడు. అతడి పేరు అప్పటికే జనం నోళ్లల్లో బాగా నానుతోంది.
ఎవరినో కత్తితో పొడిచేసి పారిపోయి వస్తున్న బాజీరావు చటుక్కున అటుగావస్తున్న రహీంపాషా ఆటోఎక్కి పోనియ్ అని తొందరపెట్టాడు. అతడెవరో రహీంకి బాగాతెలుసు. అలాంటి ఒక దాదా తన ఆటో ఎక్కడంతో రహీంకి థ్రిల్లింగ్‌గా అనిపించింది. ఆఘమేఘాలమీద ఆటోను నడిపి సిటీ శివార్లలోకి తీసుకొచ్చాడు. అక్కడొక పాడుబడ్డ ఇంట్లోకి బాజీరావు వెళ్లాడు. తర్వాత అక్కడే చాలాసేపు ఉండి బాజీరావుకు కావాల్సిన ఏర్పాట్లన్నీచూశాడు రహీంపాషా. చీకటి పడుతున్న సమయంలో అతడిని అడ్డదారిలో సిటీ దాటించేశాడు.
‘ఎన్నాళ్లబట్టి ఆటో తోల్తున్నావురా?’ ఆటోలో బాజీరావు అడిగాడు. అతడు టెన్షన్‌లో ఉన్నాడని రహీంకి అర్థమయ్యింది. రహీంకి. ఆ టెన్షన్ నుంచి కాస్త రిలీఫ్‌కోసమే అతడు మాటకలిపాడనీ కూడా రహీం అర్థం చేసుకున్నాడు.
‘రెండేళ్లనుంచన్నా...’చెప్పాడు నిరాశగా.
‘ఎంతొత్తాది?’
‘ఫైనాన్స్ కట్టడమే కష్టంగా ఉందన్నా...’
‘ఆటో సొంతదా?’
‘అవునన్నా... అనవసరంగా కొన్నాననిపిస్తాంది...’
‘అవసరమైతే ఎప్పుడన్నా పిలుస్తాను... ఎక్కడుంటావేటి?’ బాజీరావు అడిగాడు.
‘అప్సరాకాడ ముసిలోడు షెడ్డుదగ్గరుంటానన్నా...’
బాజీరావు ఆటోదిగి వెళ్లబోతూ అతడి చేతిలో వంద రూపాయల నోట్లు కుక్కి హడావిడిగా వస్తున్న లారీ ఎక్కేశాడు.
అలా జరిగిన బాజీరావుతో పరిచయం తర్వాత నెల రోజులకి బలపడింది. నమ్మకస్తుడైన మనిషి కావాలనుకున్నప్పుడు అవసరమైతే రహీంకి కబురెట్టేవాడు బాజీరావు. అతడు చెప్పిన పని నమ్మకంగా చేసేవాడు రహీంపాషా.
నాలుగు నెలలు గడిచేసరికి రహీం ఆటోవదిలిపెట్టేసి బాజీరావు వెంట తిరగడం మొదలెట్టాడు. ఆటో నడిపి గడించిన సంపాదనకన్నా ఇప్పుడు రహీం సంపాదన బాగానే ఉంది. ఒక రకమైన గుర్తింపు వచ్చేసినట్లుకూడా భావించాడు.
దానికితోడు ఇంకా పెళ్లీపెటాకులు లేకపోవడంవల్ల బాధ్యతలూ అంతగా లేకపోవడంవల్ల ఈ జీవితమే అతడికి బాగా అనిపించింది. వీళ్లందరికీ రాజకీయ పలుకుబడి ఉన్న మునిస్వామినాయుడు అండగా ఉన్నాడు.
మరో ఆరునెలలు గడిచేసరికి రహీం జీవితం చాలా మారిపోయింది. కత్తిపట్టుకున్నవాడు కత్తితోనే పోతాడన్నట్లు బాజీరావును ప్రత్యర్థులు కాపుకాసి గొడ్డళ్లతో నరికి చంపేశాడు.
దాంతో అంతటి చొరవ, తెలివితేటలున్నవాడు మునిస్వామినాయుడు కంటికి కనిపించింది రహీం ఒక్కడే. అలా నాయుడుగారి ఆశీస్సులతో ఆ ముఠాకి రహీం నాయకుడయ్యాడు.
ముఠా నాయకత్వం స్వీకరించిన కొద్దిరోజుల్లోనే ప్రత్యర్థివర్గంలో బలమైన ఇద్దర్ని అతిచాకచక్యంగా యాక్సిడెంట్‌లో చంపించేశాడు రహీం. దాంతో అతడిస్థానం పదిలమయ్యింది. మునిస్వామినాయుడుకు చాలా దగ్గరయ్యాడు. అయితే రాజకీయ నాయకులు, రౌడీముఠాలు ఎంత సన్నిహితంగా కలిసుంటాయో ఆశ్చర్యకరంగా కొన్ని పరిస్థితుల్లో అంత తీవ్రస్థాయిలో ప్రత్యర్థివర్గాలుగా మారిపోతాయి. అందుకు సహజంగా ఎన్నికలే వేదికలవుతాయి. సిటీ శివారుప్రాంతంనుంచి జడ్‌పిటిసి పంచాయితీ ఎన్నకల్లో రహీంపాషా పోటీచేయవచ్చునని, అందుకు మునిస్వామినాయుడు సిఫార్సు చేయవచ్చునని ఓ చోటా పత్రికలో వార్తాకథనం వచ్చింది. అది రహీంపాషా చెప్పారు అనుచరులు. ముసిముసిగా నవ్వుకున్నాడు. - ఇంకా ఉంది

సర్వజిత్ 9010196842