డైలీ సీరియల్

మహాభారతంలో ఉపాఖ్యానాలు -22

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పూర్వం వ్యుషితాశవుడనే మహారాజు ఉండేవాడు. అతడు పూరు వంశానికి చెందినవాడు. మహా ధర్మాత్ముడు. ఒకసారి అతను యాగం చేస్తూ ఉండగా, ఇంద్రుడు దేవతలు మహర్షులు అక్కడికి వచ్చారు. ఇంద్రుడు ఆనందంతో సోమసానం చేసి సంతృప్తుడైనాడు. బ్రాహ్మణులు దక్షిణలతో సంతృప్తి చెందారు. ధర్మాత్ముడు రాజర్షి అయ ఆ వ్యుషితాశవుడు చేసిన యాగంలో దేవతలూ బ్రహ్మర్షులు అన్ని పనులు స్వయంగా చేశారు. దానితో రాజు అందరికన్నా మిన్నగా ప్రకాశించాడు. అతను అశ్వమేధయాగం చేసి నాలుగు దిక్కులలో ఉన్న రాజులందరినీ జయంచి లోబర్చుకున్నాడు. అతను మహాబలవంతుడు. సాగరం దాకా ఈ భూమిని జయంచి అన్ని వర్ణాల ప్రజలను కన్న బిడ్డలలా కాపాడి పరిపాలన చేశాడు. ఎన్నో గొప్ప యాగాలుచేసి బ్రాహ్మణులకు భూరి దక్షిణలిచ్చాడు. ఎంతో సోమరసాన్ని సేకరించి అగ్నిస్టోమం మొదలైన ఏడురకాల సోమయాగాలను చేశాడు.
అలాంటి ఆ వ్యుషితాశవుని ఇల్లాలు కాక్షీవంతుని కుమార్తె భద్ర. ఆమె అంత సౌందర్యవతి ఈ లోకంలో ఇంకెవరు లేరు. భార్య మీద విపరీతమైన మోహం కల ఆ రాజు క్షయవ్యాధికి గురైనాడు. . ఆ వ్యాధితో కొద్దికాలంలోనే అతను అస్తమించాడు. రాజు మరణం అతని భార్యను తీవ్రంగా క్రుంగతీసింది. ఎందుకంటే ఆమెకు సంతానం లేదు.
ఆమె ఈ విధంగా భర్త శవం దగ్గర కూర్చుని దుఃఖించింది. ‘‘ప్రభూ! ఈలోకంలో భర్తలేని భార్య జీవిస్తున్నా దుఃఖంతోనే జీవిస్తుంది. భర్తను పోగొట్టుకున్న భార్యకు మరణమే శరణ్యం. నేను కూడా నిన్ను అనుసరించి వస్తాను. నీవు లేకుండా క్షణం కూడా బ్రతకాలని లేదు. నన్ను కూడా తీసుకొనిపో. ఓ! నరశ్రేష్టా! నీ వెంట నీడలా వస్తాను. నేను అత్యంత దురదృష్టవంతురాలను. పూర్వం ఎన్ని జంటలను విడదీశానో, అందువల్లే నాకు నీతో వియోగం కలిగింది. నేను ఇప్పటినించీ నీ దర్శనానికై నిరీక్షిస్తూ దర్భలపై శయనిస్తాను. ఓ ప్రభూ! నాకు కనిపించు. ఎంతో దుఃఖంతో ఉన్న నాకు కర్తవ్యాన్ని బోధించు ’’.
ఇలా విలపిస్తూ ఆమె ఆ శవాన్ని కౌగిలించుకొని ఉన్నది. అప్పుడు అశరీరవాణి ఇలా పలికింది. ‘కల్యాణీ! చింతించకు. లేచి వెళ్ళు. నీకు వరమిస్తున్నాను. ఋతుస్నానం తర్వాత ఎనిమిదవ రోజుకాని, పద్నాలుగవ రోజు రాత్రి కాని నీ శయ్యపై నా శవంతో నిదురించు’’ ఈ మాట విన్న భద్ర ఆ విధంగా చేసి వరుసగా ఏడుగురు పుత్రులను కన్నది. వారు మద్ర, శాల్వ, దేశాలని పరిపాలించారు.
ఔర్వోపాఖ్యానం

పూర్వం కృతవీర్యుడనే రాజు ఉండేవాడు. అతను భృగు వంశస్తులకు యజమాని. అతను సోమయాగం చేసి ఆ బ్రాహ్మణులకు చాలా ఎక్కువ ధనం, ధాన్యం ఇచ్చి వారిని తృప్తిపరచాడు. కొంతకాలానికి అతను స్వర్గస్థుడైనాడు. ఆ తరువాత కొంత కాలానికి అతని వంశస్థులకు ధనం అవసరమైంది. వారికి భృగువంశస్థుల దగ్గర తమకు కావలసిన ధనం ఉన్నదని తెలిసి రాజకుటుంబీకులు వారి దగ్గరకు యాచనకై వెళ్ళారు. ఆ భార్గవులలో కొందరు తమకు రాజిచ్చిన ధనాన్ని దాచిపెట్టుకున్నారు. కొందరు ఇతరులకు దానం చేశారు. కొందరు మాత్రం రాజులకు ధనం ఇచ్చారు. తరువాత వారితో ఒకరాజు భూమిని త్రవ్వించగా ఒక భృగువు ఇంటిలో పాతిపెట్టిన ధనం కన్పించింది. అప్పుడు ఆ రాజులందరూ అక్కడ చేరి ఆ ధనాన్ని చూచారు. వారందరికీ భృగు వంశస్థులపై కోపం వచ్చి వారందరినీ తిరస్కరించారు. వారు ఎంత శరణు వేడినా ఆ రాజులంతా కలిపి వారిని బాణాలతో చంపివేశారు. తర్వాత ఆ భృగు వంశం లోని గర్భస్థ శిశువులను కూడా చంపుతూ వచ్చారు. అప్పుడు భయంతో ఆ భృగుపత్నులు హిమాలయాలలోని గుహల్లోకి వెళ్లి దాక్కున్నారు. వారిలో ఒక గర్భిణీ స్ర్తి తన గర్భాన్ని భయంతో తన తొడలో దాచుకున్నది. ఈ విషయం తెలిసిన ఇంకొక స్ర్తి ఆ క్షత్రియుల దగ్గరకు వెళ్ళి ఈ విషయాన్ని చెప్పింది. అప్పుడు వారు ఆ గర్భాన్ని నాశనం చేయడానికి వచ్చారని అప్పుడు గర్భస్థ శిశువు తొడ చీల్చుకొని బయటకు వచ్చి ఆ క్షత్రియుల దృష్టిని హరించాడు. క్షత్రియులు దృష్టిని కోల్పోయ ఆ పర్వత ప్రాంతంలో తిరుగుతూ తిరిగి తమ దృష్టిని పొందడానికి ఆ బ్రాహ్మణిని శరణు వేడారు. వారు ఆమెతో దుఃఖిస్తూ ఇలా అన్నారు. ‘‘తల్లీ! నీవు అనుగ్రహిస్తే మాకు మరల దృష్టి వస్తుంది. మేమిక్కడినుంచే వెళ్ళిపోతాం. నీవు నీ కుమారునితోపాటు మాపై దయ తలచి మాకు దృష్టిని అనుగ్రహించు.’’
అప్పుడు ఆ ఇల్లాలు వారితో ఇలా అన్నది. ‘‘నాయనలారా! నేను మీ దృష్టిని హరించలేదు. నా ఊరువు నుండి పుట్టిన ఈ భార్గవుడే మీ మీద కోపంతో అలా చేశాడు. అతను మీరు వధించిన తన బంధువులను తలచుకొని కోపంతో మీ దృష్టిని తొలగించాడు. మీరు భార్గవుల గర్భస్థ శిశువులను కూడా నిర్దయతో చంపివేశారు. అప్పుడు నేను ఈ గర్భాన్ని నా తొడలో వంద సంవత్సరాలు దాచి కాపాడాను. భృగువంశానికి మేలు చేయాలన్న కోరికతో ఈ పని చేశాను. ఈ బాలునికి షడంగ సహిత వేదం గర్భంలో ఉన్నప్పుడే సంక్రమించింది. తేజస్వి వేదవేత్త అయన ఈ బాలుడు తన పితృవధకు కోపించి
మిమ్మల్నందరినీ చంపదలచినట్లు ఉన్నాడు. అతని తేజస్సే మీ చూపును హరించింది. (ఇంకావుంది)

డాక్టర్ ముదిగొండ ఉమాదేవి