డైలీ సీరియల్

అన్వేషణ -17

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అయితే ఆ వార్త రహీంపాషాయే కావాలని చెప్పి రాయించుకున్నాడని మునిస్వామినాయుడు ఊహించాడు. అతడి వందిమాగదులు కూడా అయ్యుండవచ్చునన్నారు.
తీరా నామినేషన్ టైమొచ్చేసరికి అక్కడ మునిస్వామినాయుడు బంధువు నామినేషన్ వేశాడు. దాంతో రహీంపాషా మనస్సు చివుక్కుమంది. అయితే ఎవరిదగ్గరా అతడు ఆ విషయం ప్రస్తావించలేదు.
మునిస్వామినాయుడు తనను పిలిచి బుజ్జగిస్తాడేమోననుకున్నాడు. అలాంటిదేమీ జరగలేదు. నాయుడు ఆ పని చేయలేదు. ఆ విషయంలో అతడు రహీంపాషాని గుర్తించినట్లే కనిపించలేదు.
ఇంతలో కార్పొరేషన్ ఎన్నికలు ముంచుకొచ్చాయి. ఫలానా వార్డునుంచి ఫలానావారి మద్దతుతో ఆ అభ్యర్థి, ఈ అభ్యర్థి అంటూ పత్రికల్లో వార్తలు గుప్పించేస్తున్నారు. కొన్ని ఆయా అభ్యర్థులే రాయించుకుంటే, మరికొన్ని పత్రికలే ఊహించి రాస్తున్నాయి.
అప్పుడూ అలానే రహీంపాషా పేరు వినపడింది. ఈసారి పెద్ద పత్రికలో ఆశావహుల్లో రహీంపాషా అంటూ వార్త వచ్చింది. ఈసారి మునిస్వామినాయుడు తనను పిలిచి మాట్లాడతాడేమోననుకున్నాడు రహీం. నామినేషన్ ఘట్టం సమీపిస్తున్నా అలాంటిదేమీ కనిపించలేదు.
సరిగ్గా నామినేషన్ ఆరంభమయ్యేరోజు మునిస్వామినాయుడు సిఫార్సుచేసిన అతడి మరో బంధువుకే సీటు ఇచ్చినట్లు వార్త వచ్చింది.
రహీంపాషాకి ఛెళ్లున కొట్టినట్లయ్యింది నాయుడు చేసిన పని- ‘మనం ఆడి కాళ్లదగ్గర పడుండేటోళ్లం... ఆడు మాత్రం ఆడి కులపోళ్లకి, ఆడి బంధువులకి సీటిచ్చుకుంటాడు...’ అనుచరుల దగ్గర అసంతృప్తి వ్యక్తంచేశాడు రహీంపాషా. వాళ్లు అగ్గిలో ఆజ్యంపోసినట్లు మరింత ఎక్కించారు.
అది చేరాల్సిన ప్రత్యర్థివర్గం వాళ్లకి క్షణాల్లో చేరిపోయింది. ఆ రాత్రి పదకొండు గంటల తర్వాత మునిస్వామినాయుడికి చిరకాల ప్రత్యర్థి చినగంగప్ప ఒకళ్లిద్దరు ముఖ్య అనుచరులతో రహీం ఇంటికొచ్చాడు. అరగంట రహస్యంగా మంతనాలు జరిపాడు.
ఫలితంగా మర్నాడు ఉదయం పది గంటల సమయంలో అనుచరుల భారీ ప్రదర్శనతో, చినగంగప్ప వెంటరాగా రహీంపాషా కార్పొరేటర్ అభ్యర్థిగా, నాయుడు అభ్యర్థికి వ్యతిరేకంగా నామినేషన్ వేశాడు. అలా నాయుడికి ఝలక్ ఇచ్చాడు.
తను పెంచిపోషించిన రహీం ఇలాంటి పనిచేస్తాడని నాయుడు అనుకోలేదు. అయితే రౌడీని ఎవరు పట్టించుకుంటార్లే అని మునిస్వామినాయుడు ఆ విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదు.
ఎవరినైనా రాయబారానికి పంపి నామినేషన్ ఉపసంహరించుకునేలా చేద్దామని కొందరు సలహాఇచ్చారు నాయుడికి. నాయుడు అందుకు అంగీకరించలేదు. తననుకాదని వెళ్లిపోయిన వాడిని బ్రతిమిలాడే స్థితిలో తాను లేనని వాడి సంగతి ఎన్నికలయ్యాక చూద్దామని అనుకున్నాడు.
కానీ, నాయుడు మనిషి అనుకున్న అభ్యర్థిపై మొదటి భార్యని పెట్రోలుపోసి తగలబెట్టేశాడని, రెండో భార్యని మరోలా చంపేశాడని, ఇలాంటి క్వాలిఫికేషన్లు, ఆరోపణలు చాలా ఉన్నాయి.
ఒక్క రౌడీ అన్న ముద్ర తప్ప రహీంపాషా మీద మరే ఆరోపణలు ఓటర్లకి కనిపించలేదు. తక్కువస్థాయి నేరస్థుడెవరూ అంటే ఓటర్లకి రహీంపాషాయే కనిపించాడు. అందుకే మంచి మెజారిటీతో కార్పొరేటర్‌గా గెలిపించారు. అలా మునిస్వామినాయుడికి దూరమైపోయి రాజకీయాలలో ఒక మెట్టు పైకెదిగాడు రహీంపాషా.
దాంతో అతడి వేషభాషల్లో మార్పొచ్చింది. ప్రవర్తనలోనూ మార్పొచ్చింది. అపారమైన కరుణ, దయ కూడా అతడిని అప్పుడప్పుడు ఆవహించేస్తుంటాయి.. కానీ నాలుగుగోడల మధ్యా మాత్రం అసలైన రహీంపాషాయే కనిపిస్తాడు.
తండ్రి ఎదుగుదలను కళ్లారా చూసినవాడు అహ్మద్‌పాషా. అందుచేత అణకువలు, మెళుకువలు బాగా వంటబట్టించుకున్నాడు. చదువు చట్టుబండలుకన్నా రాజకీయాల్లోనే కొడుకు బాగా రాణించగలడని రహీంపాషా మురిసిపోయాడు.
అయితే తనలా కత్తులు కటార్ల జోలికివెళ్లకుండా చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు రహీంపాషా. కానీ కొట్లాటల్లో ఉన్న మజా అహ్మద్‌పాషాకి ఇష్టం. తండ్రి దృష్టికి రాకుండా జాగ్రత్తపడుతూ అతడు ఆ పనులుచేస్తూనే ఉన్నాడు. ఒకటీరెండూ రహీం దృష్టికి వచ్చినా కుర్రాళ్లు ఆమాత్రం ఖుషీచేయరా అన్నట్లు తేలిగ్గా తీసుకున్నాడు. అమ్మాయిని రేప్ చేశాడని తెలిసినా అతడు అలానే తీసుకున్నాడు.
కార్పొరేటర్‌గా ఎన్నికయిన ఆర్నెళ్లకి రహీం కారు కొన్నాడు. అప్పుడప్పుడు నిరాడంబరతని ప్రదర్శించడానికి బైక్‌మీద పేదలు ఉండే కాలనీల్లోకి వెళ్లివాళ్లని పలుకరించి, వాళ్లింట్లో మజ్జిగో, టీయో తాగి వస్తుంటాడు. ఏవేవో వరుసలుపెట్టి వాళ్లని పిలవడంకూడా నేర్చుకున్నాడు.
కార్పొరేటర్‌గా రహీం రెండేళ్ల వైభవం, సంపాదనా సామర్థ్యంచూసి సిటీలో పేరున్న ఓ ఆటోమొబైల్‌షాపు యజమాని జలాలుద్దీన్‌పాషా తన కూతురు రజియాబేగం నిచ్చి రహీంపాషాని అల్లుడిని చేసుకున్నాడు. రజియా తన ఇంటికొచ్చాక తనకి బాగా కలిసొచ్చిందనుకున్నాడు రహీం.
పదవిలో ఉన్న ఐదేళ్లూ ఏ చిన్న అవకాశాన్నీ వదులుకోకుండా సంపాదించుకున్నాడు రహీం. పార్టీలో తన పైవాళ్లకి ముట్టజెప్పాల్సినవి మరచిపోలేదు. వాటిలో కక్కూర్తిపడలేదు. రెండోసారి ఎన్నికయి రెండేళ్లు గడుస్తోంది. ఇక మూడోసారి ఎన్నికవడం కష్టమేనని అతడికి బాగా తెలుసు....
‘‘ఇది రహీంపాషా చరిత్ర... పైకి ఎంతమెత్తగా కనిపిస్తాడో మనిషి అంత కర్కోటకుడు... ఇంకో విషయం తనని చేరదీసి, పెంచిన మునిస్వామినాయుడిని కాదని, అతడి అభ్యర్థిని ఓడించి నాయుడు పరువుమీద దెబ్బకొట్టాడు. రెండోసారీ అదే అభ్యర్థిని ఓడించి నాయుడు పరువుమీద మరో దెబ్బకొట్టాడు...
ఇప్పుడు వయస్సు రీత్యానో, రాజకీయ కారణాలవల్లనో మునిస్వామినాయుడు ఫేడౌట్ అయిపోయాడు. దానికితోడు బిపి, సుగర్, ఆస్త్మా, ఈమధ్యనే హార్ట్ ప్రోబ్లమ్ రోగాలొచ్చాయి నాయుడికి. చేసిన పాపాలన్నీ అతడిని రోగాలుగా చుట్టుముట్టాయని జనం చెప్పుకుంటారు. అతడి ప్రత్యర్థి చినగంగప్ప, రహీంపాషా ఇప్పుడు అధికార పార్టీకి చెందినవారు. నాయుడు పార్టీ ఇప్పుడు నామమాత్రంగా ప్రతిపక్షంలో ఉంది...’’ చెప్పడం అయిపోయిందన్నట్లు కొండబాబు రిలాక్స్‌గా కుర్చీలో వెనక్కి వాలాడు.
‘‘ఇప్పుడు వీడికి మనం డిఎన్‌ఎ టెస్టుచేయించాలి...’’ కాస్సేపయ్యాక కోక్ కొంచెం సిప్‌చేసి అన్నాడు అనిరుధ్.
‘‘అదీ వాడికి తెలీకుండా...’’
‘‘అవును....’’
‘‘అదంత తేలిక్కాదు...’’
‘‘అదీ తెలుసు.... వాడికి తెలీకుండా డిఎన్‌ఎ టెస్టుచేయించడం ఇల్లీగల్ అనీ నాకు తెలుసు.... అయినా తప్పదు... ఈ నలుగురిలో ఎవరి డిఎన్‌ఎతో నా డిఎన్‌ఎ సరిపోతుందో సరిచూసి అప్పుడు బహిరంగ పరుస్తాను. కోర్టుపరంగా ప్రొసీడ్ అవుతాను. కోర్టు ఆర్డర్‌తో మరోసారి అఫీషియల్‌గా, లీగల్‌గా డిఎన్‌ఎ చేయించి వాడు నాకు తండ్రి అని రుజువు చేసుకుంటాను. దట్సాల్... అదే నాకు కావాలి... అంతకు మించి వాడి ఆస్తి, ఆదరణ మరేం అక్కర్లేదు. నా రూట్ ఏమిటో నాకు తెలిస్తేచాలు...’’అనిరుధ్ అన్నాడు కొంచెం ఉద్వేగంగా. కొండబాబు వౌనంగా తల పంకించాడు. - ఇంకా ఉంది

సర్వజిత్ 9010196842