డైలీ సీరియల్

అన్వేషణ -18

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘ఇదంతా నీకు సిల్లీగా అనిపిస్తోంది కదరా?!...’’ క్షణంపోయాక కొండబాబుని అడిగాడు అనిరుధ్.
‘‘లేదురా! సిల్లీగా అనిపించడం లేదు. నీ బాధేంటో నాకర్థమవుతోంది. పాపం ఆ కుర్రాడు ఎంత బాధపడుతున్నాడో అని మా అమ్మ నీ గురించి అంటే ఏమిటో అనుకున్నాను. ఇప్పుడు తెలుస్తోంది నీ బాధేంటో...’’ కొండబాబు అతడినే తదేకంగా చూస్తూ అన్నాడు.
కొద్దిసేపు ఇద్దరూ వౌనంగా కూర్చుండిపోయారు. ఇంతలో దాబా కుర్రాడొచ్చి ఏం కావాలి సర్ అనడిగాడు.
‘‘ఏరా! ఏమన్నా తిందామా...’ అని కొండబాబుని అనిగాడు అనిరుధ్.
‘‘తిందాంరా బాగా ఆకలిగా ఉంది...’’అంటూ పుల్కాలు తీసుకురమ్మని చెప్పాడు కొండబాబు.
అనిరుధ్ తన అమ్మమ్మ దగ్గరకొచ్చి రెండు రోజులయ్యింది. ముందురోజంతా ఇంటిపట్టునే ఉండిపోయాడు. ‘కొన్నాళ్లు నీ దగ్గరుందామని సెలవుపెట్టుకుని వచ్చానే అమ్మమ్మా’-అని చెప్పాడు. వెర్రికన్నా నేను బాగానే ఉన్నాకదరా-అంటూ అతడి తల నిమిరిందామె. మనవడికిష్టమైనవన్నీ చేసెయ్యాలని నిశ్చయించుకున్నది.
ఆరోజు ఉదయం కొండబాబుతో కలసి బయటికి వచ్చాడు అనిరుధ్. దాదాపు ఓ కిలోమీటరు దూరం నడుచుకుంటూ వచ్చి ఓ హోటల్లో ఇడ్లీ తిని మళ్లీ నడుచుకుంటూ ఇంటికొచ్చారు. అలా వెళ్తున్నప్పుడూ, వస్తున్నప్పుడూ అసలు తను ఇక్కడికెందుకొచ్చిందీ, ఏం చెయ్యాలనుకున్నదీ అంతా విపులంగా చెప్పాడు మిత్రుడికి అనిరుధ్.
అంతా విన్న కొండబాబు ఆశ్చర్యపోయాడు. తర్వాత తన మిత్రుని తపన అర్థంచేసుకున్నాడు: ‘‘సరే! ఈ విషయంలో నీకు నేనేంచెయ్యాలి? ఏం చెయ్యమన్నా చేస్తాన్రా...’’ అన్నాడు.
‘‘కచ్చితంగా నీ హెల్ప్ నాకు కావాలిరా!... ఈ పనిచెయ్యడానికి మనకి ఎన్నిరోజులు పడుతుందో, ఎంత డబ్బు ఖర్చవుతుందో చెప్పలేదు... డబ్బు ఎంతయినా ఫర్వాలేదు. నా అదృష్టం బావుండి ఒకళ్లిద్దరితోనే పనయిపోతే... అంటే వాళ్లల్లో ఎవరితోనైనా నా డిఎన్‌ఎ సరిపోతే ఇక మిగిలిన వాళ్లగురించి మనం పట్టించుకోనక్కర్లేదు... ఈ సిటీలోనే ఇద్దరున్నారు... రహీం... నారాయణ... ముందు వీళ్ల సంగతి చూద్దాం...’’
‘‘ప్రస్తుతం వీళ్లిద్దరూ హైపొజిషన్‌లోనే ఉన్నారు...’’
‘‘అవును...కొంచెం కష్టపడాలి...’’
‘‘పడదాం... ఏదో దారిదొరక్కపోతుందా...’’ ఇల్లురావడంతో ఇక ఆ సంభాషణ ఆపేశాడు అనిరుధ్. సాయంత్రం కొండబాబు బైక్‌మీద బ్యారేజి దాటివచ్చి ఓ దాబాలో ఆరుబయట నులకమంచాల మీద కూర్చున్నాడు. కొండబాబు రహీంపాషా గురించి చెప్పాడు.
ఇంతలో పుల్కాలు తీసుకొచ్చాడు కుర్రాడు కర్రీతోబాటు. రెండు కోకోకోలాలు తెచ్చాడు.
‘‘ఇలాంటి పరిస్థితి ఎవరికేనా వస్తుందంటావా?’’ సగం పుల్కా తిన్న తర్వాత కోక్ సిప్‌చేసి అడిగాడు అనిరుధ్.
‘‘ఒకే అనిరుధ్! మనమే చాలాచాలా కష్టాల్లో ఉన్నామనుకొంటుంటారు ఎవరికివాళ్లు. ఎవరికుండే కష్టాలు, సమస్యలు వాళ్లకుంటాయి. నీకులాగే తండ్రెవరో తెలీని, తల్లినీ తెలీని వాళ్లు చాలామంది ఉంటార్రా... నీలా అనే్వషించే వాళ్లూ ఉంటారు... అనే్వషించలేక ఊహతెలిశాక తమలోతాము కుమిలిపోతున్న వాళ్లూఉంటారు...’’ వేదాంతిలా కొండబాబు చెప్పాడు. ‘‘ఇక నారాయణ గురించి చెప్పనా?’’ కాస్సేపయ్యాక అడిగాడు కొండబాబు. ‘‘ఇప్పుడు కాదు... ముందు రహీం పని ముగిశాక అవసరమైతేనే నారాయణ గురించి ఆలోచిద్దాం...’’ అనిరుధ్ అన్నాడు.
‘‘అవును... అదీ కరక్టే!...’’ కొండబాబు అన్నాడు. చీకట్లు పడుతున్న సమయంలో ఇద్దరూ లేచి వచ్చేశారు.
ఇంటికొచ్చి ముందు గదిలో కూర్చున్న మనవడికీ, కొండబాబుకీ మంచినీళ్లిస్తూ అన్నది అమ్మమ్మ: ‘‘ఒరేయ్! మీకిష్టమని కందిపప్పు పచ్చడి చేశాను... కొండబాబూ నువ్వూ ఇక్కడే తినెయ్‌రా...’’ అని.
మధ్యాహ్నం కూడా ఆమె మనవడికి ఇష్టమని గుత్తివంకాయ కూర చేసింది. ఇదివరకయితే అతడు సంతోషంగా ఒక ముద్ద ఎక్కువే తినేవాడు. ఇప్పుడు అమ్మమ్మ ఏమనుకుంటుందోనని తిన్నాడే తప్ప ఇష్టంగా తినలేకపోయాడు.
గుండెలో రగులుతున్న మంట అతడిని స్థిమితంగా ఉండనివ్వడంలేదు. తిండి మీద, ఏ ఇతర పనులమీద దృష్టిపెట్టలేకపోతున్నాడు. నల్లటి ఆ నలుగురి ఆకారాలే అతడిని అస్థిమితం చేసేస్తున్నాయి. ఇటీవల అతడికి నిద్రలేని రాత్రులు ఎన్నో! ఎంతో ప్రశాంతంగా ఉండే అతడి మనస్సు అల్లకల్లోలంగా తయారయ్యింది.
అయితే పైకిమాత్రం మామూలుగా ఉండడానికి ప్రయత్నిస్తున్నాడు. ఏమాత్రం తేడాగా కనిపించినా ఏం అనిరూదూ అలా వున్నావని అమ్మమ్మ పదేపదే అడుగుతుందని, తన మనసు రగులుతున్న బాధని ఏమాత్రం కనిపించకుండా ఉండేందుకు ప్రయత్నిస్తున్నాడు.
ఇక్కడకొస్తే అతడికి ఎవరున్నారు కనక! అమ్మమ్మ, కొండబాబు, ఆప్యాయంగా పలుకరించే అతడి భార్య, అమ్మ తప్ప. పేరుకే మేనమామ, మేనత్త. ఊళ్లోకి వచ్చినందుకు మర్యాదకోసం వెళ్లి వాళ్లని పలుకరించి వస్తాడు. అంతే!
అయితే ఈమధ్య ఎందుకో తెలీదుగానీ, మేనత్త కొంచెం మర్యాదగా మాట్లాడుతోంది. ఆప్యాయత చూపిస్తోంది. టీతాగెళ్లు అంటోంది. ఆమాటే కొండబాబుతో అనిరుధ్ చెప్పినప్పుడు- కొండబాబు నవ్వి అన్నాడు: ‘మీ మామ కూతురు సాయిరమ్యని నీకిచ్చి చేద్దామనుకుంటుందేమో మీ అత్త..’ అని.
‘అంతేనంటావా?...’
‘నాకయితే అలాగే అనిపిస్తాంది మరి... నువ్వు ఎర్రగాబుర్రగా ఉన్నావాయె... బాగా చదువుకున్నావ్. రెండుచేతులా సంపాదిస్తున్నావ్. నీకేటి తక్కువ? అందుకే నిన్ను మంచి చేసుకుంటాంది మీ అత్తమ్మ...’
‘‘రమ్య ఏం చదివిందిరా?’’
‘‘బిఎస్సీ చేసిందిరా బాబూ... దాని స్టయిల్ చూడలేక చస్తున్నారు జనాలు...’’
‘‘అంత స్టయిల్‌గా ఉంటుందా?...’’నవ్వి అన్నాడు అనిరుధ్.
‘‘అబ్బో! తనొక్కత్తే గొప్పగా చదివేసినట్లు... మహఫోజు కొట్టుద్దిరా బాబూ...’’అని మిత్రుడు అనిరుధ్ ముఖంలోకి సూటిగా చూసి: ‘‘అడిగితే చేసుకుంటావా రమ్యని?’’ అనడిగాడు.
‘‘ఉహు చేసుకోను... ఆల్రడీ నేనో అమ్మయిని ఇష్టపడ్డానురా...’’
‘‘ఏంటి నువ్వు లవ్వులోపడ్డావా?!’’ అనిరుధ్‌కేసి తేరిపార చూశాడు కొండబాబు.
‘‘పడ్డానురా!... హిమజ అని... చాలా బావుంటుంది. మంచి అమ్మాయిరా... నేనంటేనూ ఆమెకు చాలా ఇష్టం... అసలు ఈ విషయం అమ్మమ్మతో చెప్పి వాళ్లపెద్దవాళ్లతో మాట్లాడి పెళ్లిచేసుకుందామనుకున్నాను. అమ్మమ్మతో చెప్పడానికి వద్దామనుకుంటున్న సమయంలో ఆమెకు బాగాలేదంటూ నీదగ్గర్నుంచి ఫోనువచ్చింది. ఆమె కోలుకుని నేను వెళ్లేసమయంలో అమ్మ- నాన్నల గురించి తెలియడంతో అనుకున్న ఆలోచనలన్నీ ఒక్కసారిగా మారిపోయాయి’’ అనిరుధ్ చెప్పాడు.
‘‘అవును! అర్థమయ్యింది...’’ ఓదార్పుగా కొండబాబు అన్నాడు. - ఇంకా ఉంది

సర్వజిత్ 9010196842