డైలీ సీరియల్

అన్వేషణ -24

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాడు ఏదైనా హాస్పిటల్‌లో చేరి నాలుగు రోజులుంటే తప్ప తన పనికాదని అనుకున్నాడు వీరబాహు. అదెలా సాధ్యం?
మందు తాగుతున్నాడు... ఏదో తింటున్నాడు. తన బాస్ వీరబాహు ధోరణి అర్థం కావడం లేదు బోడన్నకి. మందుతాగడం, తినడం చూస్తుంటే అతడికేం అర్థం కాలేదు.
‘‘ఏటిగురూ...అలా ఉన్నావ్?’’అనడిగాడు బోడన్న మరోసారి.
‘‘ఏం లేదురా... ఏదో చిన్న సమస్య... పర్సనల్‌లే...’’ చెప్పాడు వీరబాహు.
‘‘మరి రహీంబాస్ మనల్ని ఇక్కడనుంచి యెళ్లిపోమన్నాడు?!’’
‘‘యెళదాం... చిన్నపనుంది. అది చూసుకుని యెళదాం...’’
‘‘మనకోసం పోలీసోళ్లు గాలిత్తన్నారంట...’’
‘‘అవును గాలిత్తన్నారు...నేను ఎస్‌ఐగాడితో మాట్లాడాలే... ఐదారు రోజులు ఆళ్లు అలా తిరుగుతుంటారు... ఈలోగా చిన్నపనుంది అది చేసేసుకుని మనం ఈ స్టేట్ దాటెళ్లిపోదాం...’’
‘‘పర్లేదా?’’
‘‘ఏంకాదు... నేజూసుకుంటాలే...’’అని లేచాడు వీరబాహు మనసులో ఒక నిర్ణయానికొచ్చాక.
** ** **
‘‘నీకెవరైనా పెద్ద డాక్టర్లు తెలుసా?’’అడిగాడు మిత్రుడు కొండబాబుని అనిరుధ్.
సాయంత్రం ఐదుగంటలు కావస్తూంటే ఇద్దరూ కలిసి బైక్‌మీద బయల్దేరారు. సిటీ శివారుదాటాక అనిరుధ్ అడిగాడు.
‘‘పెద్ద డాక్టర్ అంటే... అమ్మమ్మని చూడ్డానికొచ్చిన డాక్టర్ కె.వి.రావు... ఎంబిబిఎస్సే... పేరున్నవాడుకూడా...’’చెప్పాడు కొండబాబు.
‘‘ఆయన పెద్ద పేరున్న డాక్టరే. కానీ మన పనికి సరిపోడు. కార్పొరేట్ హాస్పిటల్ డాక్టర్ కావాలి... వేరే తెలిసున్నవాళ్లు ఎవరూ లేరా? డిఎన్‌ఎ టెస్టుకి వాళ్లు పంపించాలి... ఇక్కడ చెయ్యరు...’’వివరించాడు అనిరుధ్.
‘‘నాకయితే ఎవరూ పరిచయం లేదురా... ఎంక్వైరీ చెయ్యాలి...’’
‘‘డబ్బులు పడేస్తే ఎవరైనా చేస్తారు... కానీ సీక్రెసీ మెయిన్‌టెయిన్ చెయ్యాలి కదా...అదే సమస్య...’’
‘‘అవును!...నాకర్థమయ్యింది... మన డాక్టర్‌ద్వారా ప్రయత్నిద్దామా?’’
‘‘ఎలా?!’’ అనిరుధ్ అన్నాడు.
‘‘ఏదో వంక చెబుదాం... సపోజ్ కంప్లీట్ హెల్త్‌చెకప్, మరేదోనో చెప్పి ఒక మంచి డాక్టర్‌ని పరిచయం చెయ్యమందాం...’’
‘‘ఈ ఐడియా బాగుందిరా కొండలూ... ఆ పని చెయ్యి... ఆ తర్వాత ఆ డాక్టర్‌ని మనం మేనేజ్ చేద్దాం డబ్బు ఆశచూపి...’’
‘‘ఎస్!... నోట్లు పడితే ఎవరు లొంగరు కనక!?’’... బండి ఆపరా... ఇక్కడ అల్లంటీ బావుంటుంది’’అన్నాడు ఒక హోటల్ దగ్గర కొండబాబు.
ఆ సాయంత్రం ఇద్దరూ డాక్టర్ రావు దగ్గరికి వెళ్లారు. వాళ్లు వెళ్ళేటప్పటికి ఆయన దాదాపు పేషెంట్లను చూడ్డం పూర్తిచేసి రిలాక్స్‌గా ఉన్నాడు.
‘‘వాట్ అనిరుధ్?.. మీ గ్రాండ్ మదర్ ఎలా ఉన్నారు? షి రుూజ్ ఓకేనే కదా?’’ వీళ్లని చూసి అడిగాడు డాక్టర్ రావు.
‘‘షి ఈజ్ ఫైన్ సర్..’’ అనిరుధ్ చెప్పాడు.
‘‘దేనికొచ్చారు.. వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ?’
‘‘ఏం లేదు సర్, మా వాడు కంప్లీట్ హెల్త్ చెకప్ చేయించుకోవాలంటున్నాడు.. అందుకని ఎవరైనా మంచి డాక్టర్‌ని సజెస్ట్ చేస్తారని..’’ కొండబాబు అన్నాడు.
‘‘హెల్త్ చెకప్?.. డోంట్ వర్రీ.. నేజేస్తాగా..’’
డాక్టర్ ఆ మాటతో కొండబాబుకి ఏం చెప్పాలో తోచలేదు. వెంటనే అన్నాడు అనిరుధ్. ‘‘అఫ్‌కోర్స్ మీరు చేస్తారు సర్.. కానీ నాకు హెల్త్ కార్డు యాక్సెప్ట్ కాదు సర్. ఎనీ కార్పొరేట్ హాస్పిటల్ కావాలి.. అందుకే మంచి డాక్టర్‌ని సజెస్ట్ చేస్తారని.’’ ఆ మాటకి కొండబాబు తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నాడు.
‘‘ఓ.. అదా ప్రాబ్లెమ్.. అఫ్‌కోర్స్ ఇక్కడ చేయించుకుని వేరే చోటునుంచి బిల్లు పెట్టుకోవచ్చు.. లేదా అక్కడే చేయించుకోవచ్చు.. మంచి డాక్టర్ అంటే.. ఈ రోజు అంతా కమర్షియల్ అయిపోయిందయ్యా.. అందులోనూ కార్పొరేట్ హాస్పిటల్స్ అయితే మరీను..’’
‘‘అలాగే సర్... ఏ హాస్పిటల్ సర్..?’’
డాక్టర్ రావు చెప్పాడు. ఏయే హెల్త్ చెకప్‌లు చేయించుకోవాలో చెప్పాడు. కొందరు డాక్టర్లు, డయోగ్నస్టిక్ సెంటర్లు ఏయే రకాలుగా చెకప్‌ల పేరిట మోసం చేస్తున్నారో కూడా చెప్పాడు.
‘‘నేనయితే అన్నీ బాగా చేసేవాడిని.. హెల్త్ కార్డ్ ప్రాబ్లమ్ అంటున్నారుగా.. నేను ఈ కార్డుల గోల పెట్టుకోదల్చుకోలేదు.. అదో పెద్ద తలనొప్పి వ్యవహారం.. ’’ అన్నాడు డాక్టర్ రావు.
‘‘అవునండి.. డాక్టర్ హేమంత్‌కి ఫోన్ చేసి చెబుతారా?’’ కొండబాబు అడిగాడు.
‘‘ష్యూర్.. ’’ అంటూ డాక్టర్ హేమంత్‌కి ఫోన్ చేశాడు. జాగ్రత్తగా చూడమనీ చెప్పాడు.
మర్నాడు ఉదయం పది గంటలు కావస్తూంటే డాక్టర్ రావు చెప్పిన హాస్పిటల్‌కి వెళ్లారు మిత్రులిద్దరూ. అప్పటికి ఇంకా డాక్టర్ హేమంత్ డ్యూటీకి రాలేదు. పనె్నండు గంటలకి వస్తారని చెప్పారు రిసెప్షన్‌లో.
‘‘హేమంత్‌ని ఇంటి దగ్గర కలుద్దామా..?’’ బయటికి వచ్చి అడిగాడు అనిరుధ్‌ని కొండబాబు.
‘‘అదే మంచిదేమో.. ఇక్కడ అంత ప్రశాంతంగా మాట్లాడ్డానికి కుదరకపోవచ్చు. ఇంటి దగ్గరయితే మనం అన్ని విషయాలూ మాట్లాడవచ్చు. ఏదో ఒక బేరం సెటిల్ చేసుకోవచ్చు కూడా’’ అనిరుధ్ అన్నాడు.
రిసెప్షన్‌లో డాక్టర్ హేమంత్ ఇంటి అడ్రస్ తీసుకుని బయల్దేరారు. అయితే ఆయన ఇంటి దగ్గర లేరు. హాస్పిటల్‌కి వెళ్లాడని చెప్పారు. మళ్లీ ఇద్దరూ హాస్పిటల్‌కి వచ్చారు. డాక్టర్ హేమంత్ ఇంకా రాలేదన్నారు. బహుశా జె.పి హాస్పిటల్‌లో ఉండొచ్చన్నారు. అయినా ఇంకో గంటలో ఇక్కడికే వస్తారన్నారు.
‘‘మర్చిపోయాన్రా అనిరుధ్.. స్పెషలిస్టులు రెండు మూడు హాస్పిటల్స్‌లో విజిటింగ్ డాక్టర్లుగా పనిచేస్తుంటారు.. ఇపుడు జె.పి హాస్పిటల్‌కి వెళ్లుంటాడు.. మనం అక్కడికి వెళ్లినా తీరుబడిగా మాట్లాడే అవకాశం ఉండదురా.. ఇక్కడే ఉందాం..’’ కొండబాబు చెప్పాడు. ఇద్దరూ పేషెంట్లు కూర్చునే చోట కూర్చున్నారు.
గంటలో వస్తాడనుకున్న డాక్టర్ హేమంత్ గంటన్నరకి వచ్చాడు. తాము ఆయనను కలవాలని కొండబాబు వెళ్లి అడిగితే, ఇంపార్టెంట్ పేషెంట్లున్నారు, వాళ్లని చూశాక డాక్టరుగారు మిమ్మల్ని చూస్తారని రిసెపన్షన్ వాళ్లు చెప్పడంతో, తమని డాక్టర్ కె.వి.రావుగారు పంపించారని చెప్పాడు అనిరుధ్. అయినా రిసెప్షన్ వాళ్లు పెద్దగా పట్టించుకోలేదు. పంపిస్తాం కూర్చోండి అన్నారు. అలా రెండు గంటలు కూర్చున్నాక కానీ డాక్టర్ హేమంత్‌ని కలవడానికి వాళ్లకి అవకాశం రాలేదు.
‘‘వైద్యం మాటెలా ఉన్నా హడావిడి మాత్రం ఎక్కువ ఉంటుందిరా ఇక్కడ..’’ లేస్తూ అన్నాడు కొండబాబు.
‘‘అందుకే మనం వేలకు వేలు ఫీజులిస్తున్నాం మరి..’’ అంటూ స్ప్రింగ్ డోర్ తోసుకుని డాక్టర్ హేమంత్ రూములోకి అడుగుపెట్టాడు అనిరుధ్.

- ఇంకా ఉంది

సర్వజిత్ 9010196842