డైలీ సీరియల్

మహాభారతంలో ఉపాఖ్యానాలు-45

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యుధిష్ఠురుడు: సత్యం, దానం వీటిలో ఏది గొప్పది?
సర్పము: దానం, సత్యం, తత్త్వం, అహింస, ప్రియభాషణం వీటి హెచ్చుతగ్గులు పనియొక్క ప్రాధాన్యతను అనుసరించి ఉంటాయి. ఒకసారి దానం కన్న సత్యమే గొప్పదౌతుంది. సత్యవాక్యం కన్నా దానం గొప్పదౌతుంది. ఈ విధంగా హెచ్చుతగ్గులు పనిబట్టి నిర్ణయింపబడుతాయి.
యుధిష్ఠిరుడు మరల ప్రశ్నించాడు - ‘‘మానవుడికి స్వర్గమెలా లభిస్తుంది? మనం చేసే పనులకు తప్పకుండా కలిగే ఫలితాన్ని ఎలా చూడగలం? శరీరాభిమానం లేని వ్యక్తి ప్రవర్తన ఎలా ఉంటుంది?’’
సర్పము ఇలా బదులు ఇచ్చింది - ‘‘మానవుడు ఆచరించే కర్మలకు మూడు గతులు ఉంటాయి. మనిషిగా పుట్టడం, స్వర్గంలో నివసించడం, పశుపక్ష్యాదులలో పుట్టడం ఈ మూడు గతులు. సోమరితనం లేకుండా అహింసను పాటిస్తూ, జీవిస్తూ దానం మొదలైన మంచి పనులు చేయడం వలన స్వర్గంలో స్థానం లభిస్తుంది. వీటికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తే మనిషిగా పుడ్తాడు. ఇంకా విపరీతంగా ప్రవర్తిస్తే పశుపక్ష్యాదులుగా జన్మనెత్తుతాడు. ఈ పశుపక్ష్యాదులు జన్మలో ప్రవర్తన బాగుంటే తిరిగి మనిషిగా పుడ్తాడు. తాను చేసే కర్మలబట్టి ఈమూడు గతులలో తిరుగుతూ ఉంటాడు. తాను చేసేకర్మలకు ఫలాన్ని ఆశిస్తాడు కనుక మరల మరల పుడ్తూ ఉంటాడు. సుఖదుఃఖాలను తప్పనిసరిగా అనుభవిస్తాడు. కర్మఫలం మీద ఆసక్తిలేక ఇతరులకు మంచి చేయాలని ప్రయత్నించేవాడు నిత్యమైన పరమాత్మయందు మనసు నిలుపుతాడు.’’
యుధిష్ఠురుడు మరల ఇలా అడిగాడు - ‘‘శబ్ద స్పర్శ రూపరస గంధాలకు ఆధారమేది?’’
సర్పము : ఆత్మ స్థూల సూక్ష్మ కారణ శరీరాలను ఆశ్రయించి ఇంద్రియాలతో సుఖదుఃఖాలను అనుభవిస్తుంది. ఈ ఆధారమైన శరీరానికి జ్ఞానం బుద్ధి మనస్సు సాధనాలు. శబ్ద స్పర్శ రూప రస గంధాదులకు ఆధారాలైన పంచ మహాభూతాలతో నిర్మించబడిన శరీరంలో ఉండేది జీవాత్మ.’’
ధర్మరాజు: ‘‘మనస్సు బుద్ధియొక్క ఉత్తమ లక్షణాలు ఏవి?’’
సర్పము: ఆత్మకు భోగ మోక్షాలను సంపాదించటమే బుద్ధి యొక్క పని. బుద్ధియొక్క గుణాన్నిబట్టి మనస్సు గుణాన్ని పొందుతుంది. పని మొదలైనపుడు బుద్ధి వ్యక్తమగుతుంది. మనస్సు ఎప్పుడూ వ్యక్తమగును.
ధర్మరాజు అతని జవాబులకి ఆశ్చర్యపడి ఇలా అడిగాడు. ‘‘నీవు చాలా బుద్ధిమంతుడివి. స్వర్గంలో ఉండేవాడివి. బ్రాహ్మణులని అవమానించాలి అన్న కోర్కె నీకు ఎలా కలిగింది?’’
అపుడు పాము ఇలా చెప్పసాగింది.
నహుషుడు చెప్పిన కథ
‘‘పూర్వం వృత్రాసురుని చంపడంవలన ఇంద్రునికి బ్రహ్మహత్యాపాతకం చుట్టుకొనగా అతను ఎవరికీ కన్పించకుండా ఒక నీటి తటాకంలో దాగున్నాడు. దేవేంద్రుడు కనపడక పోయేసరికి భూమి తేజస్సును కోల్పోయింది. నదుల ప్రవాహాలు ఆగిపోయాయి. అడవుల్లో వృక్షాలు ఎండిపోయాయి. దేవతలు మహర్షులు ఏమి జరుగునో అని భయపడ్డారు. దేవతల రాజు అవటానికి ఆ స్వర్గలోకంలో ఒక్కరికీ అర్హతలేదు.
ఆ సమయంలో దేవతలు, ఋషులు అంతా సమావేశమై ‘‘యశస్వి, ధార్మికుడు తేజస్వి అయిన నహుషుడు దేవరాజ్యానికి రాజు కాగల అర్హతకలవాడు’’ అని నిర్ణయించారు. అతని దగ్గరకు వెళ్ళి అతన్ని స్వర్గ్ధాపతిగా ఉండమని కోరారు. దానికి అతను వారితో ఇలా పలికాడు. ‘‘నేను బలహీనుడిని, మిమ్మల్ని రక్షించేశక్తి నాకు లేదు. అలాంటి బలం ఇంద్రునికి మాత్రమే ఉంది.’’
అపుడు ఋషులు, దేవతలు అతనితో ఇలా అన్నారు. ‘‘నీవు మా అందరి తపస్సుతో ఈ స్వర్గాన్ని పాలించు. దేవతలు, దానవులు, ఋషులు, రాక్షసులు, గంధర్వులు నీ కంటికి గోచరించే అన్ని ప్రాణుల తేజస్సు నీవు చూడగానే గ్రహించి బలవంతు డివి అవుతావు. కనుక నీకు ఏ భయములేదు.’’
ఆ తర్వాత నహుషుడు స్వర్గ్ధాపతి అయ్యాడు. వారి మాటలు విన్న అతను ధర్మాన్ని ఆచరిస్తూ దేవతలను బ్రహ్మర్షులను రక్షించుటకు సంసిద్ధుడైనాడు.
తేలికగా వరాలు, స్వర్గ్ధాపత్యం పొందిన నహుషుడు ధర్మాత్ముడయినా కామానికి లొంగిపోయాడు. ఇప్పుడు అతను అప్పరసలతో కలసి ఉద్యానవనాల్లో విహరించాడు. గంధర్వులు, అప్సరసలూ తమ నాట్యగాన వినోదాలతో అతన్ని సేవించగా ఆనందించాడు. ఈ విధంగా ఉన్న సమయంలో నహుషుని దృష్టి ఇంద్రుని భార్య అయిన శచీదేవి మీద పడింది.
శచీదేవిని చూసి మోహం చెందిన నహుషుడు దేవసభలో ఇలా అన్నాడు. ‘‘నేను దేవతలకు అధిపతిని ఇంద్రుడిని. కనుక శచీదేవి నన్ను సేవించడానికి రావాలి.’’
అతని మాటలు విన్న శచీదేవి బృహస్పతితో ఇలా ప్రార్థించింది. ‘‘బ్రహ్మర్షీ! నేను నీ రక్షణ కోరి వచ్చాను. నన్ను ఈ నీచ నహుషుని బారినుండి కాపాడు. పూర్వం నీవు అన్నమాటలు సత్యం చెయ్యి.’’
అప్పుడు దేవగురువు ఆమెతో ఇలా అన్నాడు. ‘‘దేవీ! నా మాటలు ఎన్నడు అసత్యం కావు. త్వరలోనే నీవు దేవేంద్రుని చూస్తావు.’’
శచీదేవి బృహస్పతిని శరణువేడిన విషయం తెలిసిన నహుషుడు కోపించాడు. అప్పుడు దేవతలు ఋషులు అతని దగ్గరికి వెళ్ళి ఇలా అన్నారు. ‘‘దేవా! నీవు క్రోధాన్ని విడిచిపెట్టు. నీలాంటి ఉత్తములు ఇతరులపై కోపించరు. శచీదేవి ఇంకొకరి భార్య. పరస్ర్తీలను కోరుట పాపం. కనుక నీ మనస్సు మార్చుకో నీవు దేవరాజువు కనుక ధర్మం తప్పకూడదు.’’
అందరూ ఇలా చెప్పినప్పటికిని కామమోహితుడైన నహుషుడు వారి మాటలను లెక్కపెట్టక ఇలా తిరిగి అన్నాడు. ‘‘ఓ దేవతలారా! ఇంద్రుడేమి అంత ధర్మబుద్ధి కలవాడా? అతను గౌతముని భార్య అహల్యను పాడుచేయలేదా? అప్పుడు మీరు అతన్ని ఎందుకు నివారించలేదు. శచీదేవి నా దగ్గరకు రావలసిందే.’’
అప్పుడు దేవతలు శచీదేవిని అతని దగ్గరకు తీసుకుని వస్తామని చెప్పారు.
తర్వాత దేవతలు, ఋషులు బృహస్పతి దగ్గరకు వెళ్ళి ఇలా వేడుకున్నాడు. ‘‘శచీదేవి నిన్ను శరణు కోరిందని, నీవు ఆమెకు అభయమిచ్చావని మాకు తెలుసు. కాని ఇప్పుడు శచీదేవిని నహుషునికియ్యాలి. అతను అందరికన్న బలవం తుడు.’’
శచీదేవి ఏడుస్తూ ‘‘బ్రహ్మన్! నేను నహుషుని వరించను- నిన్ను శరణు కోరాను. నీవు నన్ను రక్షించాలి’’ అన్నది.
బృహస్పతి తనను శరణు కోరిన శచీదేవిని విడువనని వారితో చెప్పెను. ‘‘అలా చేస్తే నేను నరకానికి పోతాను. కనుక ఆమెకు ఏది హితమో అది చేయండి.’’ అప్పుడు దేవతలు తమ గురువునే ఆ యోచన చేయమన్నారు.
అప్పుడు బృహస్పతి ఇలా అన్నాడు. ‘‘శచీదేవి సకల శుభ లక్షణాలు కలది. ఆమెను పొందాలంటే నహుషుడు కొంతకాలం వేచి ఉండాలి. ఇప్పుడు కాలం అనేక విఘ్నాలతో ఉంది. ఇప్పుడు నహుషుడు వరగర్వంతో ఉన్నాడు. కాలుడే కాలాన్ని నడిపిస్తాడు.’’
ఇంకావుంది...

డాక్టర్ ముదిగొండ ఉమాదేవి