డైలీ సీరియల్

అన్వేషణ -44

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అలా సిటీలో థామస్ ఓ అనధికార విఐపిగా చెలామణీ అవుతున్నాడు.
థామస్ దంపతులకి పిల్లలు లేరు. ఎందుకులే అదో లంపటం అన్నది అతడి భార్య జ్యోతీ థామస్. ఆమె అతడికి మొదటి భార్యా కాదు, అతడు ఆమెకి మొదటి భర్తాకాదు.
ఒక విధంగా చెప్పాలంటే వాళ్లిద్దరూ వాళ్ల దృష్టిలో మాత్రం సహజీవనం చేస్తున్న ఆదర్శ దంపతులన్నమాట!
మొదటి భర్తని ఆమె వదిలేస్తే, మొదటి భార్యని అతడు గుట్టుచప్పుడు కాకుండా చంపేసి, అది గ్యాస్‌స్టౌ ప్రమాదంగా గొప్పగా జనాలని నమ్మించాడు.
వాళ్ల పద్ధతి ప్రకారం ఆమె మృతికి సంతాపసూచికంగా ప్రార్థనలూ అన్నీ అయ్యాక పేదలకు అన్నదానం కూడా చేశాడు. ఆమె చనిపోయిన ఆరు నెలలకు జ్యోతీ థామస్‌తో పరిచయం కావడం, మరో రెండు నెలలకు ఆమెతో సహజీవనం ప్రారంభించాడు.
అతడు ఇంగ్లీషు ధారాళంగా కాకపోయినా మాట్లాడతాడు. ఇంగ్లీషులో మాట్లాడుతున్నా, తెలుగులో మాట్లాడుతున్నా మధ్య మధ్యలో బూతులు యధాలాపంగా వచ్చేస్తాయి. అందుకే అతడి కంపెనీలో పనిచేస్తున్న ఇద్దరు ఆడపిల్లలు అవేమీ పట్టించుకోరు. మొదట్లో వాళ్లు కంగారు పడ్డారు గానీ తర్వాత వాళ్లకి అలవాటైపోయింది అతడి బూతుల భాష.
అతడు జీవితంలో కష్టాలు, సుఖాలు, కల్మషాలు అన్నీ చూశాడుగానీ దేనినుంచీ అతడు పాఠాలు అంటూ నేర్చుకోలేదు. అతడి తల్లి ఓ హాస్టల్‌లో పనిచేసేది. తండ్రి ఏవేవో పనులు చేస్తూండేవాడు. అంతగా ఇంటిపట్టున ఉండేవాడు కాదు. ఒక విధంగా చెప్పాలంటే థామస్ గాలికి పెరిగాడు. అందుకే చదువబ్బలేదు. ఎలాగో కష్టపడి ఆ రోజుల్లో స్కూల్ ఫైనల్ వరకూ వచ్చాడు. అది దాటలేకపోయాడు.
కొన్నాళ్లు జులాయిగా తిరిగాడు. చివరికి తల్లి బాగా పోరు పెడితే ఆటో నడపడం మొదలుపెట్టాడు. కానీ ఆటో ద్వారా సంపాదించిన డబ్బులో ఏనాడూ ఒక్కరూపాయి కూడా తల్లికి ఇచ్చిన పాపాన పోలేదు. వాడు కుదుటపడితే చాలులే రూపాయి ఇవ్వకపోనా అనుకున్నది తల్లి.
ఓ ఏడాదిన్నరపైగా ఆటో డ్రైవర్‌గా గడిపాడు. అప్పుడే అతడికి తనలాగే ఆటో నడుపుతున్న రహీం పరిచయమయ్యాడు. అలాగే సెంటర్‌లో వుండే రిక్షావాళ్లు నారాయణ, కనకారావు పరిచయమయ్యారు. కానీ అతడికి కుదురులేరు. అది మానేసి మళ్లీ జులాయిగా తిరగడం మొదలెట్టాడు థామస్.
ఓ రోజు వైజాగ్ నుంచి తన తమ్ముడు వస్తే అతడి దగ్గర నిలకడలేని కొడుకు గురించి మొరబెట్టుకున్నది థామస్ తల్లి. వాడిని తనతో తీసికెళతానని తమ్ముడు చెప్పి థామస్‌ని వైజాగ్ తీసికెళ్లాడు. ఉన్న సిటీలో బాగా బోరు కొట్టేసిన థామస్‌కి సరదాగా కొన్నాళ్లు వైజాగ్‌లో ఉండొచ్చని మేనమామతో వెళ్లాడు.
అక్కడ ఒక ఎక్స్‌పోర్టు కంపెనీలో థామస్ మేనమామ చిన్న ఉద్యోగం చేస్తున్నాడు. ఎలాగో వాళ్లని బ్రతిమిలాడి మేనల్లుడికి కూడా అందులోనే ఉద్యోగం ఇప్పించాడు.
రెండేళ్లు అక్కడ బాగానే గడిచిపోయింది థామస్‌కి. కానీ ఇంకేదో చెయ్యాలనుకున్నాడు. మనస్సు వేరే వేరే దార్లలోకి మళ్లుతోంది. అక్కడ వేరే వేరే వాళ్లతో పరిచయాలేర్పడ్డాయి. షిప్పుల్లో వచ్చే విదేశీయుల అలవాట్లు, అవసరాలు తెలుసుకున్నాడు. ఆ దిశగా ప్రణాళికలు వేశాడు.
మేనమామ నెత్తీ నోరూ మొత్తుకుంటున్నా వినకుండా ఉద్యోగం మానేశాడు. తనే ఓ చిన్న కంపెనీ పెట్టేశాడు మరో పార్ట్‌నర్‌తో.
కలసి. దాని పేరే షైనీ ఎంటర్‌ప్రైజెస్. మరో రెండేళ్లకి ఆ పార్ట్‌నర్‌ని ఏదో సాకుతో పంపించేశాడు.
మరో రెండేళ్లకి అతడి జీవితంలో చాలా మార్పలు చోటుచేసుకున్నాయి. వేషభాషల్లో మార్పులొచ్చాయి. కంపెనీ కూడా పెరిగింది. ఆ కంపెనీలో ఇపుడు మరో ఐదుగురు సిబ్బంది కూడా పనిచేస్తున్నారు.
ఓ ఇల్లు కూడా కొన్నాడు. కారూ కొన్నాడు. థామస్ సార్ ఇపుడు సిటీలో ఒక చిన్నసైజు విఐపి క్రింద లెక్క! కానీ రూపాయికీ లెక్క అడుగుతాడని, పిల్లా జెల్లా లేరు, ఏం చేసుకుంటాడు సంపాదనంతా అని ఆఫీసులో గుసగుసలాడుకుంటారు స్ట్ఫా అంతా. దానికి అతడు చెప్పే సమాధానం- దేనికైనా పద్ధతిగా ఉండాలి. లెక్క లెక్కే అంటాడు.
కానీ పద్ధతి తప్పేవాడు అతడే. పద్ధతట.. పద్ధతట.. అవినీతి తప్ప మరేం లేదు వీడి బతుక్కి.. వీడికి పద్ధతి కూడాను అనీ తిట్టుకుంటారు స్ట్ఫా.. అతడిని ఎరుగున్నవారూను.
ఎవరేమనుకున్నా థామస్ తన ధోరణి తనదే అన్నట్లుంటాడు. అలా ఉండకపోతే అతడు థామస్సే కాదు!
ఏ ముహూర్తాన ఇతడితో పరిచయమయ్యిందో కానీ రహీం పాషా, నారాయణ ఇప్పటికీ అతడితో పరిచయాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు. వాళ్లిద్దరిలో ఎవరు వైజాగ్ వచ్చినా ఆ రోజు థామస్‌తో వాళ్లు ఎంజాయ్ చెయ్యాల్సిందే!
కానీ ఈ జట్టులో కనకారావే వీళ్లంత పైస్థాయికి రాలేదు. రావాలని వాడు ప్రయత్నించలేదు అంటారు వీళ్లు. కానీ వాడి తలరాత మాత్రం అలా లేదని వాళ్లు అనుకోరు.
కనకారావు ప్రస్తుతం థామస్ దగ్గరే ఉన్నాడు. అతడి అనధికార కార్యకలాపాలు చూసేది కనకరావే! ఎగుమతి చేయడానికి అమ్మాయిల్ని ఉద్యోగం పేరుతో మభ్యపెట్టి సేకరించేది కనకారావే.
కాస్త కనుముక్కు తీరు బాగున్న అమ్మాయిల్ని అరబ్ దేశాలకు, షిప్పుల్లో వచ్చే విదేశీయులకు సరఫరా చేయడం కనకారావు, థామస్ చేస్తున్న అనధికార అక్రమ కార్యకలాపాలు!
ఉద్యోగమని నమ్మి వెళ్లిన అమ్మాయిలు నరక కూపంలో దిగిపోయాక ఎవరితోనూ చెప్పుకోలేక, ఉద్యోగమని తల్లిదండ్రులు పంపారు కనక, వారికి కాదని చెప్పి వెనక్కి రాలేక మగ్గిపోతున్నారు. ఒకళ్లిద్దరు తల్లిదండ్రులకు తెలిసినా బయటికి చెప్పుకోలేక గుడ్లనీరు నొక్కుకుని ఊరుకుంటున్నారు.
కనకారావుకు పెళ్లీ పెటాకులు లేవు. రాత్రి అయ్యేసరికి పీకలదాకా తాగి పడుకుంటాడు. వాడుండేది షైనీ ఎంటర్‌ప్రైజెస్ పైన గదిలోనే. వాడి శరీరంలో రక్తంకన్నా బ్రాందీ, విస్కీల పాలు ఎక్కువగా ఉంటుంది.
వాడు రోజూ ముఖం కడుక్కునేది వాటితోనే. బుద్ధిపుడితే స్నానం చేస్తాడు, లేకపోతే లేదు. ఎప్పుడూ వాడు జీన్ ప్యాంటూ, టీషర్టుతోనే ఉంటాడు. గడ్డం గియ్యడం అనేది వాడు మర్చిపోయి చాలకాలం అయ్యింది. ఎప్పుడేనా మరీ పెరిగితే ‘ఒరే కనకం గడ్డం తగ్గించరా చూడలేక చస్తున్నాం’ అని ఎప్పుడేనా థామస్ అంటే వెళ్లి ట్రిమ్ చేయించుకొస్తాడు.
అతడికి తల్లి తండ్రీ ఉన్నారో లేదో ఎవరికీ తెలీదు. బహుశా వాడే మర్చిపోయాడేమో! అంతటి బాధ్యతా రాహిత్య జీవి కనకారావు!
కుటుంబమూ, బాధ్యతలంటే అతడికి మహాచికాకు.. లైఫ్ ఎప్పుడూ జాలీగా ఉండాలంటాడు. పనికిమాలిన బంధనాలు పెట్టుకోవడం శుద్ధ దండగంటాడు.
అదే పద్ధతి తన తల్లిదండ్రులు ఆచరిస్తే తన బతుకు ఎక్కడుండేదో, ఎలా ఉండేదో, అసలు ఉండేదో లేదో కూడా వాడెప్పుడూ ఆలోచించడు. వట్టి రికామీ బతుకు కనకారావుది! అందుకే వాడిని చేరదీశాడు థామస్ తన దగ్గర పడుంటాడని.
- ఇంకా ఉంది

సర్వజిత్ 9010196842