డైలీ సీరియల్

మహాభారతంలో ఉపాఖ్యానాలు-50

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాండవులు పనె్నండు సంవత్సరాలు అరణ్యవాసం చేసి ఒక సంవత్సరం అజ్ఞాతవాసం విరాటరాజు కొలువులో ప్రచ్ఛన్న రూపాలలో ఉన్నారు. అన్ని సేవలు దాసీలచేత చేయించుకొనే ద్రుపదకుమార్తె ఒక సేవికలాగా రాణి సుదేష్ణకు సేవలు చేస్తున్నది. అప్పటికి పది నెలలు అజ్ఞాతవాసం గడిచిపోయింది. ఇంకొంతకాలంలో అజ్ఞాతవాసం ముగుస్తుంది అన్న సమయంలో విరాటరాజు బావమరిది, సేనాపతి, మహాబలవంతుడు అయిన కీచకుడు ద్రౌపదిని చూసి మోహించి ఆమెను పొందాలనుకున్నాడు. అతను తన సోదరి అయిన సుదేష్ణ దగ్గరకు వెళ్ళి ద్రౌపదిని గూర్చి వివరాలు చెప్పమని, ఆమె తనను మోహంలో పడవేసింది అని చెప్పాడు. ఇంకా ఇలా అన్నాడు ‘‘ఈమె దేవతాస్ర్తి లాగ ఉంది. ఈమె నీకు దాసిగా తగదు. నా యింటి యజమానురాలిగా ఉండదగినది. నా భవనంలో ఎంతో మంది సేవకులు ఉన్నారు. ఎంతో సంపద ఉంది. అటువంటి భవనంలో ఉండే అర్హత కలది’’.
తర్వాత అతను తన అక్క అనుమతి తీసుకొని ద్రౌపది దగ్గరకు వచ్చి ఆమెతో ఇలా అన్నాడు ‘‘శుభాంగీ! నీ రూపం శ్రేష్ఠమైనది. నీ కాంతి దివ్యమైనది. నీ ముఖం మచ్చలేని చంద్రునిలా ఉన్నది. నీవు పద్మాసన అయిన లక్ష్మివా? లేక రతివా? హ్రీ, శ్రీ, కీర్తి కాంతి అనేవారిలో ఎవరవు? నిన్ను చూచిన నా మనస్సును మన్మథుడు అగ్నిలా దహిస్తున్నాడు. నిన్ను పొందాలనే కోరిక నాలో పెరిగిపోతోంది. నీవు ఇలాంటి సుఖం లేని చోట ఉండతగదు. సర్వ ఆభరణాలు ధరించి నాతో భోగాలు అనుభవించడానికి అర్హురాలవు. నన్ను వరించు. నీవు కోరితే నా భార్యలందరినీ వదలివేస్తాను. లేదా వారు నీకు దాసీలు అవుతారు. నేను కూడా నీకు దాసుడిలా వశమై ఉంటాను’’.
అప్పుడు ద్రౌపది కీచకునితో ఇలా అన్నది - ‘‘మహావీరా! నీవు కోరదగని నన్ను కోరుకుంటున్నావు. నేను సైరంధ్రిని. ఇతరులకు కేశాలంకరణ చేసే దాసీని. అన్నింటికి మించి పరస్ర్తిని. నాతో ఇలా మాట్లాడటం నీకు మర్యాద కాదు. బుద్ధిమంతుడు తన భార్యయందు ప్రేమ కలిగి ఉండాలి. అదియే పరమధర్మం. పరస్త్ర యందు ఎన్నడూ మోహం కలుగకూడదు. అనుచిత కార్యాలు సదా విడిచిపెట్టాలి. ఇదే సత్పురుషుల ధర్మం’’.
సైరంధ్రి ఈ విధంగా ఎంత హెచ్చరించినా కామంతో కళ్లు మూసుకుపోయిన కీచకుడు ఆ మాటలు పెడచెవిన పెట్టాడు. ఇంద్రియ నిగ్రహం లేని అతను ద్రౌపదితో మరల ఇలా అన్నాడు. ‘‘కల్యాణీ! నిన్ను చూచినప్పటి నుంచీ మన్మథుని చే పీడింపబడుతున్నాను. నీకు అధీనుడను. నన్ను ఏలుకో. నన్ను తిరస్కరిస్తే నీవు పశ్చాత్తాపపడవలసింది. ఈ భూమి మీద నాతో సమానమైన వీరుడు లేడు. ఉత్తమమైన భోగాలలోను నా సాటి ఎవరూ లేరు. ఇలాంటి భోగాలు నాతో కలిసి అనుభవించక ఆ దాసీ పని నీకెందుకు? ఈ సమస్త రాజ్యాన్నీ నీ పాదాల చెంత పెడ్తున్నాను. నాతోపాటు ఈ సంపదను, రాజ్యాన్ని ఏలుకో’’.
అసభ్యకరమైన కీచకుని మాటలు విని ద్రౌపది అతనితో ఇలా అంది. ‘‘సూతపుత్రా! నీవు ఇలా మోహంలోపడి ప్రాణాలు పోగొట్టుకోకు. ఐదుగురు గంధర్వులు నా పతులు. వారు నిత్యం నన్ను రక్షిస్తూ ఉంటారు. వారికి ఆగ్రహం తెప్పించకు. నీవు నన్ను ఎన్నటికీ పొందలేవు. ఈ పాపబుద్ధి మానుకో. లేకపోతే నీకు సర్వనాశనం తప్పదు. నన్ను కోరితే నీవు ఎక్కడ ఉన్నా నా భర్తలు నిన్ను నీ పుత్రులతో సహా నాశనం చేస్తారు. కులక్షయం నీకు మంచిది కాదు. నీ మాటలన్నీ వ్యర్థాలే. నీ చావు కోరి నీ వంశ నాశనం కోసమే నీ కిలాంటి దుర్బుద్ధి పుట్టింది. గంధర్వుల ప్రియపత్నియైన నన్ను అనుచితంగా కోరిన నీకు ఆకాశంలోకాని, పాతాళంలో కాని, భూమి మీద కాని శరణు ఇచ్చేవారు లేరు’’.
పతివ్రత అయిన ద్రౌపది ఇంత వివరంగా చెప్పినా కామపీడితుడైన కీచకుడు లెక్కచేయలేదు. సుధేష్ణతో ఇలా అన్నాడు. ‘‘అక్కా! సైరంధ్రి నా దగ్గరకు వచ్చి నన్ను అంగీకరించే ఉపాయం చూడు. లేకపోతే నా ప్రాణాలు పోతాయి’’.
సుధేష్ణ తమ్మునితో ఇలా అన్నది. ‘‘సైరంధ్రి నా ఆశ్రయంలో ఉంది. నేను ఆమెకు పరపురుషుల దగ్గరకు పంపను అని హామీ ఇచ్చాను. ఆమె మహాపతివ్రత. ఐదుగురు వీరులు బలవంతులైన గంధర్వులు ఆమె పతులు. వారు సదా ఆమెను రక్షిస్తూ ఉంటారు. ఆమెను కోరడం నీకు తగదు. మహారాజు కూడా ఆమెను చూచి మోహపడ్డాడు కానీ ఆమె భర్తల విషయం తెలిసి ప్రాణభయంతో ఆమె గురించి తలచరు. గంధర్వులు మహాత్ములు. వారి శక్తి గురించి నీకు చెప్తున్నాను. నీకు ప్రాణం మీద ఆశ ఉంటే ఈ కోరికను విడిచిపెట్టు. లేకపోతే నీకు వంశనాశనం తప్పదు.’’
అక్క మాటలతో కీచకునికి ఆగ్రహం కలిగింది. అతను కోపంతో ఇలా అన్నాడు ‘‘నీకు నా బలం గురించి సరిగ్గా తెలియదు. అందుకే ఇలా అంటున్నావు. వేలు, లక్షల గంధర్వులను నేను ఒక్కడినే చంపివేయగలను. ఇక ఈ ఐదుగురు నాకొక లెక్కా?’’
కీచకుడు ఇలా దురహంకారంతో మాట్లాడగానే సుధేష్ణ తన తమ్ముడు ఈ పాపపుచర్యతో పాతాళంలోకి పడిపోతాడని దుఃఖపడింది. కాని అతను మారడని తెలుసుకుంది. మరల ఇంకొకసారి అతనికి నచ్చచెప్పాలని ఇలా అంది. ‘‘నీ కారణంగా సోదరులు, మిత్రులు అందరూ నశించిపోతారు. నీవు పాపాత్ముడవు. నరాధమా! నీవు నన్ను చేయకూడని పాపకృత్యానికి ప్రేరేపిస్తున్నావు. కులంలో ఒకరు పాపం చేస్తే కులం అంతా నశిస్తుందని అంటారు. నీ కారణంగా అందరూ నశిస్తారు. ఈ పరిణామాలన్నీ తెలిసి కూడా సోదరప్రేమతో నీవు చెప్పింది చేస్తాను. అందుకే దుఃఖిస్తున్నాను’’.
సుధేష్ణ బాగా ఆలోచించి కీచకునితో ఇలా అంది. ‘‘పర్వదినం రోజున నీ ఇంటిలో మధ్యాహ్నం భోజనాన్ని సిద్ధం చేయించు. నేను సైరంధ్రిని సుర తెమ్మని మీ ఇంటికి పంపుతాను. ఆమెను బుజ్జగించి వశపరచుకో’’.
కీచకుడు ‘సరే’నని అప్పటికి వెళ్లిపోయాడు.
తర్వాత అతను మంచి వంటలను చేయించి, మద్యాన్ని తెప్పించాడు. తర్వాత అతను సుధేష్ణను విందుకు పిలిచాడు. అతను సుధేష్ణను ఇలా కోరాడు. ‘‘రకరకాల పిండివంటలు వండించి మంచి మద్యాలు తెప్పించాను. ఎలాగైనా సైరంధ్రిని నా దగ్గరకు పంపి నా కోరిక తీర్చు’’.
సుధేష్ణ అతని నీచ వాంఛకు మనసులో బాధపడి ఇలా అంది. ‘‘నువ్వు ఇంటికి వెళ్ళు. నేను సైరంధ్రిని మీ ఇంటి నుంచి సుర తెమ్మని పంపుతాను’’.
పాపచింతనతో ఉన్న కీచకుడు ఆనందంతో ఇంటికి వెళ్లిపోయాడు. సుధేష్ణ సైరంధ్రిని పిలిచి ఇలా చెప్పింది. ‘‘సైరంధ్రీ! కీచకుని ఇంటికి వెళ్ళి నాకు త్రాగటానికి మంచి మదిర తీసుకొనిరా!’’
సైరంధ్రి ఇలా అడిగింది. ‘‘మహారాణీ! నేను అతని ఇంటికి వెళ్లలేను. నీకు తెలుస్తుందా! అతనెంత పాపచింతనతో ఉన్నాడో. నేను ఇక్కడికి చేరినపుడు అన్న మాటలు నీకు తెల్సు. కీచకుడు మూర్ఖుడు. మదోన్మత్తుడు. అతను నన్ను చూడగానే అవమానిస్తాడు. కనుక నేను అక్కడికి వెళ్లను. నీ దగ్గర ఇంకా చాలా మంది దాసీలు ఉన్నారు. వారిలో ఎవరినైనా పంపు’’.
అప్పుడు సుధేష్ణ ఇలా అంది. ‘‘నేను నిన్ను పంపుతున్నాను కనుక అతడు నిన్ను అవమానించడు’’. ఇలా చెప్పి సుధేష్ణ ఆమెకొక బంగారు పాత్రను ఇచ్చి కీచకుని ఇంటికి పంపింది. పాత్రను తీసుకొని వెళ్తూ సైరంధ్రి ఇలా ప్రార్థించింది. భగవంతుడా! నేను మనసా వాచా నా పతులను తప్ప ఇంకెవ్వరినీ తలవనిదాననైతే ఈ కీచకుడు నన్ను బలవంతపెట్టకుండుగాక!’’
ఇంకావుంది...

డాక్టర్ ముదిగొండ ఉమాదేవి