డైలీ సీరియల్

అన్వేషణ -- 47

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘చెప్పానుగా.. వాడు ఎవరికీ ఏ రకమైన సహాయం చేయడు.. ఒకవేళ ఎవడైనా తనకి సహయం చేస్తే చేసినందుకు వాడిని సర్వనాశనం చేసేస్తాడు.. ఎందుకంటే వాడు ఎదిగిపోయి తనకి పోటీ అయిపోతాడన్న దుర్మార్గపు ఆలోచన వాడిది..’’
‘‘అంటే..’’ కొండబాబు సగంలో ఆగిపోయాడు, ఆ తర్వాత ఏం మాట్లాడాలో అర్థంకాక.
‘‘వద్దు.. వెళ్లిపోండి.. మీ ఊళ్ళో ఏదైనా చిన్న బడ్డీ హోటల్ పెట్టుకోండి, బాగుపడతారు..’’ చెప్పాడు పరమేశ్వరం.
పరమేశ్వరం మాటలబట్టి అతడికి ధామస్‌మీద చాలా కోపం ఉన్నట్లు అర్థమైంది కొండబాబుకి, అనిరుధ్‌కి. ఇక అసలు విషయానికి వచ్చేస్తే మంచిదని, దానికి అతడు ఏదైనా సలహా ఇస్తాడని అనుకున్నారు. ‘చెప్పెయ్యనా?’ అన్నట్లు మిత్రుడు అనిరుధ్ ముఖంలోకి చూశాడు కొండబాబు. దానికి సమాధానంగా అలాగే అని తలూపాడు అనిరుధ్.
‘‘సర్! మీరు మాకు కొంచెం సహాయం చేసి పెట్టాలి..’’ కొండబాబు అన్నాడు.
‘‘బిజినెస్ విషయంలోనా.. నా వల్ల కాదు..’’ అనేశాడు.
‘‘కాదండి పరంగారూ.. నిజానికి మేం బిజినెస్ పనిమీద రాలేదు..’’ అనిరుధ్ అన్నాడు.
‘‘బిజినెస్ కాదా?!.. మరి?!..’’ పరమేశ్వరం మళ్లీ సిగరెట్ వెలిగించుకున్నాడు. కుర్రాడిని పిలిచి మరో టీ ఆర్డర్ చేశాడు. మీరూ తాగుతారా అన్నట్లు వాళ్లకేసి చూశాడు. వాళ్లు వద్దని చెప్పటంతో ఒక టీ అన్నాడు కుర్రాడితో.
‘‘ఒక ముఖ్యమైన పనిమీద వచ్చాం పరంగారూ.. థామస్ దగ్గరికి మమ్మల్నెవరూ పంపలేదు. మేమే వెతుక్కుంటూ వచ్చాం వాడికోసం..’’ చెప్పాడు కొండబాబు.
‘‘వెతుక్కుంటూ వచ్చారా?.. ఏం పనిమీద?’’
‘‘చాలా ముఖ్యమైనదండి.. ఎవరికీ చెప్పుకోలేనిది.. చెప్పకూడనది.. కానీ మీ ఫ్రాంక్‌నెస్ నచ్చింది.. అందుకే మీ దగ్గర దాచాలానుకోవడం లేదు..’’ కొండబాబు అన్నాడు పరమేశ్వరాన్ని కాస్త పొగుడుతూ.
నిజానికి పరమేశ్వరం ముక్కుసూటిగా పోయే మనిషి. పొగడ్తలకి లొంగే తత్వం కాదు. పరమేశ్వరం రెండో టీ తాగుతూ, సిగరెట్ కాలుస్తూ వౌనంగా ఉండిపోయాడు. అతడు తన మాటలు వింటున్నాడో లేదో కూడా వాళ్లకి అర్థం కాలేదు. వాళ్లూ వౌనంగా ఉండిపోయారు కాస్సేపు.
ఇటీవల పత్రికల్లో వచ్చిన పితృత్వ హక్కు గురించిన కథనాలు, పిచ్చి మహిళపై అత్యాచారం వగైరాల గురించి చెప్పాడు కొండబాబు.
‘‘వాటికీ మీకూ ఏమిటి సంబంధం?,,’’ గంభీరంగా అడిగాడు.
తర్వాత కొండబాబు క్లుప్తంగా ముప్ఫయ్యేళ్ల క్రిందట జరిగిన పిచ్చి పద్మపై అత్యాచారం గురించి చెప్పి.. దాని ఫలితంగా పుట్టిన అనిరుధ్‌ని చూపించాడు.
ఆ మాట వినగానే బెంచీమీద ఒక్కసారిగా పరమేశ్వరం నిటారుగా కూర్చున్నాడు. చేతిలో సిగరెట్ పారేశాడు. తేరిపార చూశాడు అనిరుధ్ వైపు.
‘‘ఇప్పుడు అనిరుధ్ ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్. నెలకు దాదాపు లక్ష సంపాదిస్తున్న ఐటి ఉద్యోగి.. తనకి తండ్రైన ఆ స్టుపిడ్ ఎవరో తెలుసుకోవాలన్న లక్ష్యంతో ఉన్నాడు.. జస్ట్ తెలుసుకోవడమే అతడి కోరిక... ఆ తండ్రి ఆస్తులూ, వారసత్వం ఏమీ అతడికి అక్కర్లేదు.. జస్ట్.. ఆ స్టుపిడ్ ఎవరో తెలియాలి.. అందుకే ఈ ప్రయత్నం..’’ వివరించాడు కొండబాబు చాలా ఆవేశంగా.
మళ్లీ అనిరుధ్‌ని తేరిపార చూశాడు పరమేశ్వరం. కుర్రాడిని పిలిచి ఇంకో టీ చెప్పాడు స్ట్రాంగ్‌గా. అతడికి తలంతా దిమెక్కిపోయింది కొండబాబు చెప్పింది విన్నాక. చాలాసేపు అతడేం మాట్లాడలేదు. మూడో టీ తాగాక అన్నాడు.
‘‘మీకు కావాల్సిన నాలుగో వ్యక్తి కనకారావు కదూ.’’
‘‘అవునండి.. కనకారావే’’ అనిరుధ్ చెప్పాడు.
‘‘మా త్రాష్ఠుడికి నికృష్ఠపు పనులు చెయ్యడంలో.. కుడిభుజంలాంటి వాడొకడున్నాడు. వాడి పేరు కూడా కనకారావే. బహుశా మీకు కావాల్సిన కనకారావు అతడే అయితే ఆ త్రాష్టుడు కూడా ఇక్కడే ఉన్నాడు..’’ చెప్పాడు పరమేశ్వరం.
‘‘అవునా.. బహుశా వాడే అయ్యుంటాడు..’’ కొండబాబు అన్నాడు.
‘‘మీరిచ్చిన సమాచారానికి థ్యాంక్స్ సర్..’’ అనిరుధ్ అన్నాడు.
‘‘మీ డిఎన్‌ఎ టెస్టుకి వీళ్లిద్దరి బ్లడ్ శాంపిల్స్ కానీ, మరేదైనా కానీ కావాలి మీకు?..’’ పరమేశ్వరం అన్నాడు సాలోచనగా చూస్తూ.
‘‘అవునండి..’’
‘‘మీరెక్కడ ఉంటున్నారు?’’ పరమేశ్వరం అడిగాడు.
లాడ్జి వివరాలు చెప్పాడు కొండబాబు.
‘‘అక్కడికెళ్లి ప్రశాంతంగా మాట్లాడుకోవచ్చననుకుంటాను?’’ అన్నాడు పరమేశ్వరం.
‘‘ష్యూర్ సర్!.. వెళదాం రండి...’’ అనిరుధ్ పిలిచాడు అతడిని సంతోషంగా.
టీలకు పరమేశ్వరం డబ్బులివ్వబోగా చప్పున అనిరుధ్ ఇచ్చేశాడు. ముగ్గురూ ఆటోలో లాడ్జికి వచ్చేశారు. అప్పుడు సమయం పావుతక్కువ ఏడు కావస్తోంది.
‘‘పరంగారూ కాఫీ, టీ, టిఫిన్.. ఏదైనా ఆర్డర్ చెయ్యమంటారా?’’ అనడిగాడు కొండబాబు.
‘‘ఉహూ.. వద్దు.. అవేమీ నేను తినే సమయం కాదు.. ఓ అరగంట పోయాక లిక్కర్ తీసుకుంటాను..’’ నిర్మొహమాటంగా చెప్పాడు పరమేశ్వరం.
‘‘తెప్పించమంటారా?’’ అనిరుధ్ అడిగాడు.
‘‘మీరూ కంపెనీ ఇస్తారా?’’
‘‘వాడికి అలవాటు లేదండి.. నేను మాత్రం బీరు వరకూ వచ్చాను..’’ కొండబాబు నవ్వుతూ చెప్పాడు.
‘‘అయితే మీకా శ్రమ వద్దు నేనే తెచ్చుకుంటాను..’’ చెప్పాడు పరమేశ్వరం.
‘‘అలాక్కాదండి.. ఇవ్వాళ.. కాదు మేం ఇక్కడ ఉన్నన్నిరోజులూ మీరు మాకు అతిథులు..’’ కొండబాబు అన్నాడు నవ్వుతూనే.
‘‘ఆ తర్వాత?’’
‘‘మాకు ఆత్మీయ మిత్రులు..’’ చెప్పాడు అనిరుధ్.
‘‘మీరు ఖచ్చితంగా థామస్‌కి కొడుకు కాదు..’’ పరమేశ్వరం అన్నాడు.
ఆ మాటకి చప్పున ఇద్దరూ పరమేశ్వరంకేసి చూశారు ఆశ్చర్యంగా.
‘‘అవును.. కచ్చితంగా కాదు.. ఆ జీన్స్ మీలో లేవు.. తనకి మేలు చేసినవాడిని కీడు చేసే గుణం థామస్‌ది.. మేలు చేసిన వాడిని ఆత్మీయుడిగా చూసే గుణం మీది.. వాడి జీన్స్ మీలో ఎలా ఉంటాయి?..’’ పరమేశ్వరం వివరంగా చెప్పాడు.
అప్రయత్నంగా అనిరుధ్ కళ్లు చమర్చాయి. పరమేశ్వరం అన్నట్లు థామస్ తనకి ఏమీ కాకుండా ఉంటే బాగుండుననుకున్నాడు. కొండబాబు చటుక్కున కుర్చీలోంచి లేచి వచ్చి పరమేశ్వరానికి షేక్‌హ్యండిచ్చాడు, మంచిమాట చెప్పారండీ అంటూ.
‘‘ఇంతకీ నేను మీకేం చేసి పెట్టాలి?’’ అడిగాడు పరమేశ్వరం.
కొండబాబు, మధ్య మధ్యలో అనిరుధ్ ఏం కావాలో చెప్పారు. దానికి పరమేశ్వరం పది నిముషాలు ఆలోచిస్తున్నట్లుగా వౌనంగా కూర్చుండిపోయాడు. తర్వాత సాలోచనగా అన్నాడు.
‘‘వాడికి.. అదే మా బాసు త్రాష్ఠుడికి బిపి, సుగరూ ఉన్నాయి. వాడికి అనుమానాలెక్కువ. అలాగని వాడి అలవాట్లేం మార్చుకోడు. వారానికోసారి డాక్టర్ దగ్గరికెళ్లి బిపి చెక్ చేయించుకుంటూంటాడు. ఒక విధంగా అది వాడికో వ్యసనం.. వాడి డాక్టర్‌ని పట్టుకుంటే మీకు కావాల్సిన ఏదో ఒక ఆధారం ఇవ్వగలడు..’’ చెప్పాడు పరమేశ్వరం.

-- ఇంకా ఉంది

-- సర్వజిత్ 9010196842