డైలీ సీరియల్

యువర్స్ లవ్వింగ్లీ...45

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాణి ఏం చెయ్యబోతున్నాడో రాజేంద్రకి పూర్తిగా అర్థం కాకపోయినా, అతడేదో లాజిక్ ఆధారంగానే వెడుతున్నాడనిపించింది. అందు కే ఎక్కువగాప్రశ్నించకుండా ‘‘రాజేష్ ఎలా ఉంటాడో మన వాళ్లకి తెలియదు కదా? అక్కడకెళ్లి వాళ్ళూ ఏమని అడుగుతారు? వాళ్ళు ఎలా సమాధానం చెబుతారు?’’’
పాణి జేబులోంచి రాజేష్ పాస్‌పోర్టు సైజు ఫొటో తీసి ఇచ్చాడు.
‘‘ఇది ఎక్కడిది మీకు?’’
‘‘కాలేజీ రికార్డులనుంచి నాక్కావాల్సిన అడ్రసులూ, ఫొటోలూ ముందే సేకరించి పెట్టుకున్నాను. ఎందుకైనా మంచిదని’’.
మరుక్షణమే రాజేష్ పాస్‌పోర్టు సైజు ఫొటోని ఎన్లార్జి చేయించి పది కాపీలు జిరాక్సు తీసి, పది మంది మనుషులకిచ్చి పాతబస్తీ పంపించాడు రవీంద్ర.
‘‘నెక్స్ట్ స్టెప్ ఏమిటి?’’ ఉత్సాహంగా అడిగాడు పాణిని. అతడికి పాణితో కలిసి పని చేయడం ఏదో తెలియని ఉత్సాహాన్నిస్తోంది.
‘‘ఒక కానిస్టేబుల్ని మఫ్టీలో కర్నూలు దగ్గర ఎమ్మిగనూరు అనే ఊరికి పంపాలి’’.
‘‘ఎందుకు?’’
‘‘ఆత్మహత్య చేసుకున్న సంధ్య సొంత ఊరు అది. ఆమె గురించి కొన్ని వివరాలు కనుక్కోవాలి’’.
***
రాత్రి ఎనిమిదింటికి పాణి పోలీస్ స్టేషన్నుంచి హోటల్‌కి బయలుదేరుతుంటే అన్నాడు ఎస్సై రవీంద్ర ‘‘పాణిగారూ, నాదొక సందేహం. అసలు ఆత్మలనేవి ఉన్నాయంటారా?’’
‘‘ఆ విషయం మనం చచ్చి అనుభవిస్తే కానీ తెలియదు’’ అన్నాడు పాణి.
‘‘అది కాదు. భరణి కేసులో మొదటినుంచీ మనకి మానవాతీత శక్తి ప్రమేయం ఏదో ఉన్నట్టుగానే కనిపిస్తోంది. ఎవరో తనని మెస్మరైజ్ చేసి తీసుకువచ్చినట్టుగా అతడు ఎవరికీ చెప్పకుండా గెస్ట్‌హౌస్‌కి రావడం, ఏ అనారోగ్యం లేని అతడు సడెన్‌గా గుండె ఆగి మరణించడం, అతడి మరణానికి దారి తీసిన పరిస్థితులన్నీ నాటకీయంగా ఉండడం, మరణానికి ముందు అతడికి వచ్చిన బెదిరింపులూ, మాటిమాటికీ సంధ్య ఆత్మ అతడికి కనిపించడం, మనం ఇంటరాగేషన్ చేసిన ప్రతి ఒక్కరూ భరణి మరణానికి కారణం మానవాతీత శక్తే అని చెప్పడం- ఇవన్నీ చూస్తుంటే నాకు ఆత్మలున్నాయని నమ్మక తప్పదనిపిస్తోంది. మీరేమంటారు?’’
‘‘్భరణి కేసులో మనం చర్చించాల్సింది ఆత్మలున్నాయా లేదా అన్నది కాదు. ఆత్మలు నిజంగానే ఉన్నా వాటికి భౌతిక అస్తిత్వం ఉండదన్నది మాత్రం నిర్వివాదాంశం. అలాంటి భౌతిక అస్తిత్వం లేని ఒక ఆత్మ ‘నిన్ను వదలను’ అని నల్ల కాగితమీద తెల్ల అక్షరాలతో ఉత్తరాలు రాయడం, టిష్యూ పేపర్ మీద రక్తంతో ‘నీ అంతు చూస్తాను’ అని రాయడం, అర్థరాత్రుళ్ళు బ్లాంక్ కాల్స్ చేయడం లాంటివి ఎలా చేయగలదు? ఇదీ ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం’’.
‘‘అయితే ఇవన్నీ చనిపోయిన సంధ్య పేరిట ఎవరైనా చేసారంటారా?’’
‘‘ఎగ్జాట్లీ’’
‘‘అయితే మరి భరణిని చంపినది ఎవరు? భరణిని చంపినది కూడా సంధ్య ఆత్మ పేరిట ఇవన్నీ చేసిన వ్యక్తే అయితే శరీరమీద ఒక్క గాయం కూడా లేకుండా అతడిని ఎలా హత్య చేయగలిగారు? అలాంటి టాలెంటే హంతకుడికి ఉండి ఉంటే ఆ పనేదో మొదటే చేయచ్చు కదా? సంధ్య ఆత్మ పేరుతో ఈ నాటకం అంతా ఆడాల్సిన అవసరమేమొచ్చింది?’’
‘‘ప్రశ్నలు మనల్ని నిజానికి దగ్గర చేస్తాయి. మీరు కూడా బాగా దగ్గరగా వచ్చేసారని నాకనిపిస్తోంది. రాత్రంతా బాగా ఆలోచించండి. నిజమేమిటో మీకే అర్థమవుతుంది. అర్థం కాకపోయినా ఫర్వాలేదు. పొద్దునే్న హరిత మీకు ఫోన్ చేసి నిజం చెబుతుంది. గుడ్‌నైట్’’ కారు ఎక్కుతూ అన్నాడు పాణి.
ఆ రోజు రాత్రి రవీంద్రకి నిద్రపట్టలేదు. ఏమిటి ఈ కేసులో తను మిస్సవుతున్న లింకు?!
ఎంత ఆలోచిస్తున్నా ఏదో ముడి విడిపోతున్నట్టుగా అనిపిస్తోంది కానీ, మళ్లీ ఏదో కొత్త ముడి పడుతోంది. రాత్రి పదిన్నరకి చార్మినార్ దగ్గరికి వెళ్లిన కానిస్టేబుల్ వెంకటేశం ఫోన్ చేశాడు.
‘‘సార్, మీరు చెప్పింది నిజమే. ఆ ఫోటోలోని వ్యక్తి పదిహేను రోజుల క్రితం చార్మినార్లో ఒక దుకాణంలో డూప్లికేట్ కీ తయారు చేయించుకోవడానికి వచ్చాడట. మైనం ముద్దమీద అచ్చు వేసి తీసుకువచ్చి ఒక డూప్లికేట్ తాళం చెవి తయారు చేయించుకుని వెళ్లాడట’’.
వింటున్న రవీంద్ర అలర్ట్‌గా అయ్యాడు ‘దేని తాలూకు తాళం అది?’’ అని అడిగాడు.
‘‘ఆ విషయం అతడికి తెలియదు. కానీ ఆ ఫొటోలోని వ్యక్తి ఆ రోజు హడావిడిలో తన కూడా తెచ్చిన ఆ మైనం అచ్చుని మర్చిపోయి వెళ్ళాడట. అదింకా ఆ దుకాణందారు దగ్గరే వుంది. నేను ఆ అచ్చుతో మరో తాళం చెవి చేయించుకుని తీసుకుని ఊరి చివరనున్న భుజంగరావుగారి గెస్ట్‌హౌస్‌కి వెళ్ళాను. ఆ తాళం చెవి వాళ్ళ గెస్ట్‌హౌస్ తాళానికి సరిగ్గా సరిపోయింది. ఆ తాళం చెవి, ఆ రోజు అతడు మరిచిపోయి వెళ్లిన మైనం అచ్చు నా దగ్గరే వున్నాయి’’ అన్నాడు ఆ కానిస్టేబుల్.
వింటున్న రవీంద్రలో ఉత్సాహం ఉరకలు వేసింది. ‘‘చూసి రమ్మంటే కాల్చి రావడం అంటే ఇదే. ఇలాంటి కానిస్టేబుల్స్ నలుగురుంటే చాలు మొత్తం స్టేషన్లో కేసులన్నింటినీ ఊది పారేయచ్చు’’ అనుకున్నాడు.
‘‘వెల్ డన్ వెంకటేశం. ఆ రెండిటినీ జాగ్రత్తగా తీసుకువెళ్లి పోలీస్ స్టేషన్‌లో లాకర్‌లో వుంచి ఇంటికి వెళ్ళు’’ అన్నాడు అతడ్ని అభినందిస్తూ.
ఫోన్ పెట్టేశాక రవీంద్ర ఆలోచనలు పరి పరివిధాల సాగాయి. రాజేష్ గెస్ట్‌హౌస్ డూప్లికేట్ కీ తయారుచేసుకుని ఎందుకు తన దగ్గర ఉంచుకున్నాడు? ఏమిటి అతడికి ఆ గెస్ట్‌హౌస్‌తో పని?
‘సంధ్య ఆత్మతో మాట్లాడడానికి కావచ్చు’’ అని పాణి నవ్వుతూ అన్న మాటలు గుర్తుకు వచ్చాయి.
ఆలోచిస్తుంటే అతడికి హఠాత్తుగా అనిపించింది ‘అసలు గెస్ట్‌హౌస్‌కి డూప్లికేట్ కీ తయారు చేయించాల్సిన అవసరమేమొచ్చింది?

ఇంకా ఉంది

వరలక్ష్మి మురళీకృష్ణ