డైలీ సీరియల్

మహాభారతంలో ఉపాఖ్యానాలు-65

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

8. భరతుని కధ
భరతుడు దుష్యంతుని పుత్రుడు. అతను చిన్నతనం నుంచే ఇతరులకు చేయశక్యం కాని పనులు సునా యాసంగా చేసేవాడు. అతను గోళ్లు, కోరలే ఆయుధాలుగా గల సింహాలను పడగొట్టే వాడు. క్రూరమైన పులు లను తన వశంలో ఉంచేవాడు. పెద్ద పెద్ద రాళ్లను ఒక చేత్తో ఎత్తి వేసేవాడు. గజాల దంతాలను పట్టుకొని వాటిని వశపరచుకొనేవాడు. మిక్కిలి మదించిన సింహాలపై కూర్చుని స్వారీ చేసేవాడు. చాలా బలం గల చమరీ మృగాలను, ఖడ్గమృగాలను అడవిలో బంధించి, వాటిని అణచివేస్తూ సగం చచ్చినవాటిని వదలివేసేవాడు. ఇలాంటి పనులను చూసి భరతుని అక్కడి మునులు సర్వదమనుడు అని పిలిచేవారు. అప్పుడు తల్లి అయిన శకుంతల వనంలోని జంతువులను బాధపెట్టవద్దు అని నిషేధించింది.
భరతుడు పెరిగి పెద్దవాడై రాజయిన తర్వాత యమునాతీరంలో నూరు అశ్వమేదయాగాలు, సరస్వతీ నదీ తీరంలో మూడు వందలు, గంగాతీరంలో నాలుగు వందల అశ్వమేద, రాజసూయ యజ్ఞాలు చేసి బ్రాహ్మణులకు విరివిగా దక్షిణలు ఇచ్చి వారిని సంతృప్తి పరిచాడు.
ఈ యజ్ఞాల తర్వాత అతను అగ్నిష్టోమం, అతిరాత్రం అనే యాగాలు చేసి విశ్వజిత్త్యాగాన్ని చేసి, తర్వాత పది లక్షల వాజపేయ యజ్ఞాలు చేసి యజ్ఞపురుషుని ఆరాధించాడు. కణ్వమహర్షికి వేయి బంగారు కమలాలను బహూకరించాడు. బ్రాహ్మణులకు సర్వరత్నాలతో, బంగారంతో అలంకరించిన గుర్రాలను, ఏనుగులను, రథాలను, పాడి ఆవులను, దాసదాసీ జనాన్ని కోట్ల స్వర్ణ ముద్రలను దానంగా ఇచ్చాడు.
అంత గొప్పవాడు కనుకనే భరతుని పేరు మీద మన దేశానికి భారతదేశం అన్న పేరు వచ్చింది.
9. భగీరథ మహారాజు
భగీరథుని పేరు తలచుకున్నప్పుడు వెంటనే గంగానది గుర్తుకు వస్తుంది. కపిలమహర్షి శాపం వలన భస్మరాసులుగా మారిన తన పూర్వీకులను పాపలోకాల నుండి పరిరక్షించడానికి, స్వర్గంలో ఉన్న గంగను భూమిపైకి తీసుకొని వచ్చిన మహాత్ముడు అతను. అతని బాహుబలానికి ఇంద్రుడు ప్రీతి చెందాడు. అతను నూరు అశ్వమేదయాగాలను చేసి దేవతలను సంతోషపెట్టాడు. ఆయన చేసిన యజ్ఞాలలో సోమరసం త్రాగిన ఇంద్రుడు మత్తుడయి అసురులను జయించి అందరిచేత పూజింపబడ్డాడు.
యజ్ఞసమయంలో భగీరథుడు గంగానదికి రెండు ఒడ్డులందు బంగారు ఇటుకలతో స్నానఘట్టాలు నిర్మించాడు. అనేకమంది రాజులను జయించి వారి భవనాల నుండి కన్యలను తెచ్చి బ్రాహ్మణులకు కన్యాదానం చేశాడు. ఆ కన్యలు నాలుగు గుర్రాలు కట్టిన రథాలలో కూర్చొని వెళ్లారు. ప్రతి రథానికీ నూరు ఏనుగులు అలంకరణలతో ఉన్నాయి. ఒక్కొక్క ఏనుగుతో వేయి గుర్రాలు, వంద గోవులు, మేకలు వెళ్లాయి. ఆయన గంగాతీరంలో దక్షిణలిస్తూ నివసించాడు. ఆ సమయంలో వదిలిన జలం నదిని ఆక్రమించగా గంగ వ్యధ చెంది సమీపంలో ఉన్న రాజు తొడమీద కూర్చున్నట్లున్నది. ఈ విధంగా గంగ అతని పుత్రిక అవడం చేత భాగీరథి అని పిలువబడింది.
గంధర్వులు భగీరథుని ఇలా కీర్తించారు ‘‘్భగీరథుడు దక్షిణలతో యజ్ఞం చేయగా సముద్రానికి వెళ్లే గంగాదేవి ఆయనను తండ్రిగా స్వీకరించింది. ఆయన చేసే యజ్ఞాలలో ఇంద్రునితో సహా దేవతలు స్వయంగా వచ్చి హవిస్సులను స్వీకరించేవారు. ఆ యజ్ఞాలు ఏ విఘ్నాలు లేకుండా, ఏ బాధా లేకుండా చక్కగా జరిగేవి. యజ్ఞసమయంలో ఏ విప్రుడు తనకేది ఇష్టమో అది చెబితే దాన్ని ప్రీతితో భగీరథుడు ఆ విప్రునికి ఇచ్చేవాడు. బ్రాహ్మణానుగ్రహం వలన ఆయన స్వర్గానికి వెళ్లాడు. అంతటి గొప్ప రాజు భగీరథుడు.
10. పరశురాముని చరిత్ర
పరశురాముడు జమదగ్ని పుత్రుడు. ఆయన మహాతపస్వి. గొప్ప ధనుర్విద్యా పారంగతుడు. వీరాధివీరుడు. ఆయన ఈ భూమిని సుఖమయం చేసి యుగధర్మాన్ని ప్రచారం చేశాడు. క్షత్రియులు గోవత్సాన్ని అపహరించి ఆయన తండ్రిని చంపారు. దానితో ఆగ్రహం చెంది ఆయన యుద్ధంలో కార్తవీర్యార్జునుని చంపాడు. అప్పుడు అతనిని సంహరించడానికి వచ్చిన అరువది నాలుగు కోట్ల క్షత్రియులను తన ధనుస్సు సహాయంతో జయించాడు. బ్రహ్మద్వేషం గల పదునాలుగు వేలమందిని యుద్ధంలో వధించాడు. వేయి మందిని ఖడ్గంతో వధించాడు. వేయి మందిని చెట్టు కొమ్మకు ఉరివేసి చంపాడు. ఇంకొంతమందికి ముక్కు చెవులు కోసివేశాడు. తన తండ్రి వధకు ప్రతీకారంగా క్షత్రియులపట్ల కక్ష తీర్చుకున్నాడు. ఇరవై ఒక్క మార్లు వారిపై దండెత్తి క్షత్రియ నాశనం చేశాడు. లక్షల కొద్దీ హైహయ వంశీయులను వధించాడు. తన గండ్రగొడ్డలితో పదివేల మందిని చంపాడు. అక్కడ ఉన్న బ్రాహ్మణులు పెద్దగా కేకలు పెడ్తూ ‘‘్భృగువంశీయా! రామా వచ్చి మమ్ము కాపాడు’’ అని మొరపెడితే అతను క్రోధంతో అంగ, వంగ, కళింగ, కాశ్మీర, దరద, మాలవ, త్రిగర్త, విదేహ, తామ్రలిప్త మొదలైన దేశాలపై దండెత్తి ఆ దేశాలలోని క్షత్రియులను నామరూపాలు లేకుండా చేశాడు. వారి రక్తంతో సరస్సులు నింపి తండ్రికి రక్తతర్పణం చేశాడు.
తరువాత భార్గవరాముడు ఎన్నో యజ్ఞాలను చేశాడు. ఆ యజ్ఞాలలో అతను నదులు, పర్వతాలు, గ్రామాలు కల ఈ భూమినంతటిని కశ్యప మహర్షికి దానం చేశాడు. అందుకే భూమికి కాశ్యపి అన్న పేరు వచ్చింది.
మరీచి పుత్రుడూ బ్రాహ్మణుడూ అయిన కశ్యపుడు భూమిని దానం తీసుకున్న తర్వాత ‘‘నా ఆజ్ఞ ప్రకారం దానం చేసిన ఈ భూమిని వదలి నీవు వెళ్లిపోవాలి’’ అని చెబితే, పశురాముడు కశ్యపుని మాట ప్రకారం బాణం వేటు దూరం సముద్రాన్ని వెనక్కు పంపి శ్రేష్ఠపర్వతమైన మహేంద్రగిరి మీద ఉన్నాడు. అక్కడే తపస్సులో నిమగ్నమయ్యాడు.
ఇంకావుంది...

డాక్టర్ ముదిగొండ ఉమాదేవి