డైలీ సీరియల్

అనంతం (కొత్త సీరియల్ ప్రారంభం)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎమ్మెల్యే పెద్దిరెడ్డితో కనీసం ఒక్క ప్రజాహితం కార్యక్రమాన్నైనా జరిపించాలన్న సంకల్పం దేవుడికి కలిగిందేమో, అమావాస్య అర్ధరాత్రి వేళ హఠాత్తుగా గుండెపోటుతో మృతి చెందాడు పెద్దిరెడ్డి.
‘‘ఒక ధృవతార రాలిపోయింది’’ అన్నాడు పార్టీ అధ్యక్షుడు.
‘‘రెడ్డిగారు చనిపోయారంటే నమ్మలేకపోతున్నాను’’ అన్నాడు ముఖ్యమంత్రి.
ఏది ఏమైతేనేం,
‘జాతస్య మరణం ధృవం’అని అందరూ నిబ్బరపడ్డారు. విలాపాలు, సంతాపాలు, దహనక్రియలు, కర్మకాండలూ అయ్యిందే తడవుగా ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ‘పెద్దదిక్కు’ లేకుండాపోయిన భారతీపురం అసెంబ్లీ నియోజకవర్గానికి తదుపరి పెద్దదిక్కు ఎవ్వరా? అన్న ప్రశ్న ఉదయించింది.
‘‘ఇంకెవ్వరూ.. కీ.శే.పెద్దిరెడ్డి కొడుకు పెంటారెడ్డే’’అన్నారు చాలామంది.
‘‘రాజు కొడుకు రాజైనట్టు- మంత్రి కొడుకు మంత్రి. ఎమెల్యే కొడుకు ఎమ్మెల్యే అయ్యేందుకిదేమీ రాచరికం కాదు. గాంధీగారు నానా తంటాలూపడి మనకు స్వాతంత్య్రం తెచ్చింది ఇందుకా?’’అని అడ్డం తిరిగారు కొంతమంది.
అడ్డం తిరిగిన వాళ్ళు అల్పసంఖ్యాకులే కనుకనూ, ప్రజాస్వామ్యంలో అధిక సంఖ్యాకుల మాటే చెల్లుబాటు కావాలి కనుకనూ-
భారతీపురం అసెంబ్లీ నియోజకవర్గానికి జరగబోయే ఉప ఎన్నికల్లో అధికార పార్టీ అభ్యర్థిగా కీ.శే.పెద్దిరెడ్డి కొడుకు పెంటారెడ్డే ఎంపికయ్యాడు.
ఇక, ఎన్నికల బరిలో ప్రత్యర్థులను ఓడించి పీఠం అలంకరించటమే తరువాయి!
రెడ్డియానాయక్ తండా..
భారతీపురం అసెంబ్లీ నియోజకవర్గంలోనే వుంది. బాగా లోతట్టు, అడవిలో వుంది. అంతా కలిపి నూటయాభై గుడిసెలకన్నా ఉండవు. పాదుషాల టోపీలు బోర్లించినట్టుంటాయా గుడిసెలు.. పేద దేవుడి చిన్న చిన్న గుడి గంటల్లా ఉంటాయా గుడిసెలు.
అందులో-
రెండువందల మంది ఓటరు మహాశయులూ,. రెండు వందలకు పైగా వృద్ధులూ- బాల కళేబరాల్లా కనిపించే బక్కచిక్కిన భావిభారత పౌరులూ...
కేవలం రెండువందల మంది ఓటర్లకోసం రెడ్డియానాయక్ తండాలో పోలింగ్ బూత్ పెట్టటం లాభసాటి బేరం కాదు!
పైగా, ఆ తండా లోతట్టు అడవిలో వుంది. పోలింగు సిబ్బందికీ, సామగ్రికీ రక్షణ ఉండదు. ఎన్నికలకోసం అక్కడికి వెళ్ళే నాగరికులకు వసతులుండవు.
అందుచేత రెడ్డియానాయక్ తండాకి రెండు కోసుల దూరంలో వుండే ‘సంతగౌరారం’లో పోలింగు బూత్ పెట్టారు. చాలా ఎన్నికలనుంచి ఆ తండావాళ్ళు ప్రతి ఎలక్షనుకూ గౌరారం వెళ్ళి ఓటు ముద్రలువేస్తూనే ఉన్నారు.
లోతట్టు అడవిలోనుంచి కాలి బాటన నడుస్తూ అడవి దాటి గౌరారం వెళ్ళాలంటే బ్రహ్మప్రళయమే అవుతుంది!
దారిలో, ముళ్ళపొదలు నాగజెముడు మట్టలు తగిలి, ఒక్కోసారి వొళ్ళు చీరుకొనిపోతుంది. గాయాలై రక్తం కార్తుంది. కళ్ళముందే విష సర్పాలు పడగలెత్తి బుసలు కొడుతుంటాయి. మనిషినుంచి ప్రమాదం శంకిస్తే అవ్వి ‘్ఠ’క్కున తలలెత్తి కాటువేస్తుంటాయి.
దూరంనుంచి వినిపించే క్రూర మృగాల అరుపులు మామూలే!
ఆ వాతావరణం అడవి పుత్రులకు అలవాటైపోయింది. తరతరాలుగా క్రూర మృగాలతో, విష సర్పాలతో సహజీవనం సాగిస్తూ, గత్యంతరం లేనప్పుడు నిర్వికారంగా ప్రమాదాలను ఆహ్వానిస్తూ, చివరిక్షణందాకా మనుగడకోసం పోరాడుతూ..
వాళ్ళకు భయం తెలియదు.
భయం తెలిసినా నాగరికులకు ఒక్కోసారి ప్రాణాలకు తెగించి అక్కడికి వెళ్ళక తప్పదు... తండాల్లోకూడా ఓట్లున్నప్పుడు వాళ్ళుమాత్రం ఏం చెయ్యగలరూ!?
భారత రాజ్యాంగాన్ని సవరించి అడవి పుత్రులకున్న ఓటు హక్కును రద్దుచేసే దాకా నాగరికులకా తిప్పలు తప్పవు!
తెల్లవారితే ఓట్ల పండుగ...
కీ.శే.పెద్దిరెడ్డి కొడుకు పెంటారెడ్డి తరఫున చాలామంది నాగరిక రాజకీయాల వాళ్ళు రెడ్డినాయక్ తండాకి ప్రొద్దునే్న చేరుకున్నారు. తండాలో సందడి మొదలైంది!
గూడుగూడుకూ ఎన్నికల గుర్తు ముద్రించిన కాయితాలు పంచారు.
బేనర్లు కట్టారు. రంగుల కాయితాలతో తోరణాలుకట్టి తండా అంతా అలంకరించారు.
గాడి పొయ్యిలు తవ్వారు. అడవి చిదుగులు వెలిగించి పెద్దపెద్ద డేగిషాల్లో అన్నం వొండారు. ‘వరి బువ్వ తినాల్సిందే’ అని బలవంతపెట్టారు.
రాగి సంకటి తప్ప వరి బువ్వ ఎరుగని అడవి పుత్రులకు నోరూరింది. అడవికి వెళ్ళటం మానుకొని ‘ఆతిథ్యం’ అందుకున్నారు.
తాగే వాడికి తాగినంత సారా.
తినే వాడికి తిన్నంత వరి బువ్వ.
‘‘మహాత్మాగాంధీకీ... జై’’
‘‘పెంటారెడ్డికీ... జై.’’
‘‘్భరత్ మాతాకీ... జై..’’
భోజనాల మధ్యలో నాగరికుల అరుపులు వినిపించాయి. ఆ హఠాత్పరిణామానికి అడవి పుత్రులు ఉలిక్కిపడ్డారు!
(ఇంకా ఉంది)

-గోపరాజు నాగేశ్వరరావు