డైలీ సీరియల్

అనంతం-2

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కీ.శే.పెద్దిరెడ్డి కొడుకు పెంటారెడ్డి ఎవ్వరో అడవి పుత్రులకు తెలుసుకానీ, ‘మహాత్మాగాంధీ’ అంటే ఎవ్వరో తెలియదు.
‘‘సంతగౌరారమ్ ఊరి మద్దెగాల ఎత్తాంటి బొమ్మ లేదూ...!
‘గాంధీ’అంటే ఆయనే.. సాతంతరఁవ్ దెచ్చిండు. ఇయ్యాళ మనఁవిట్టా ఓట్లేత్తాన్నావంటే అదంతా ఆయన సలవే’’అని. తండావాళ్ళ సందేహం తీర్చాడు తండా పెద్ద!
తెల్లవారింది. గౌరారం వెళ్ళి, ఓట్లెయ్యటమే తరువాయి!
ప్రొద్దునే్న మళ్ళీ ఓ విడత కడుపునిండా సారా పట్టించి, సుష్టుగా పులిహోరి మెక్కి అడవి పుత్రులు బయల్దేరారు. నాగరికులు వాళ్ళ వెంట నడుస్తున్నారు.
యువతరం హుషారుగా నడుస్తుంటే, ఓటుహక్కు తప్ప వంట్లో ఓపిక లేని ముసలి ముతక ఓటరు మహాశయుల్ని పార్టీ కార్యకర్తలు డోలీల్లో గౌరారం తరలిస్తున్నారు.
గౌరారం కూడ అంత గొప్ప ఊరేమీకాదు!
పేద దేవుడి గుడి గంటల్లాంటి చిన్నచిన్న గుడిసెలతోపాటు అక్కడ ధనిక దేవుడి పెద్దపెద్ద గంటల్లాంటి గుడిశెలూ ఉన్నాయి. కొన్ని పెంకుటిళ్ళూ ఉన్నాయి.
వెరసి, గిరిపుత్రులకూ సిరిపత్రులకూ మధ్యస్థంగా వుండి గౌరారం!
పోలింగు బూతుముందు క్యూల్లో నిలబడి ఎంతో సహనంగా ఓటు హక్కు వినియోగించుకున్నారు, రెడ్డయానాయక్ తండావాళ్ళు. పవిత్రమైన తమ ఓటుముద్ర సారా తాగించి వరి బువ్వపెట్టి సాదరు కర్చులకిచ్చిన వాడికే వేసి, ‘ఋణం’ తీర్చుకున్నారు.
సమయం సాయంత్రం ఐదు గంటలు దాటింది.
ఎన్నికల యజ్ఞం పూర్తయ్యి, పోలింగు బాక్సులకు సీళ్ళుపడి, క్రియాశీల కార్యకర్తల హడావుడి సర్దుమణిగి-
యువతరం తిరిగి కాలినడకన రెడ్డియానాయక్ తండా దారిపట్టిన దృశ్యాలు కనిపించాయి గానీ, డోలీల్లో వచ్చినవాళ్ళు తిరిగి డోలీల్లో వెళ్తున్న దృశ్యాలే కనిపించలేదు!
ఎవరి దారి వాడిది.
ఎన్నికల సమరం ముగిసిపోయింది.
నాగరికులు ఒక్కరోజు కడుపారా తినిపించిన వరిబువ్వ మాత్రం అడవి పుత్రులకు గుర్తుండిపోయింది!
ఇక, మళ్ళీ జీవితంలోకి రావాలి. క్రూర మృగాలతో నిత్యం సహజీవనం చెయ్యాలి. రక్కసి ముళ్ళపొదల్ని నేర్పుగా తప్పించుకొంటూ అడవిబాట పట్టాలి. విష సర్పాల ప్రమాదం తప్పించుకొంటూ జీవనపోరాటం చెయ్యాలి.
అడవి సంపద సేకరించి, గౌరారం సంతలో అమ్మాలి!
లోతట్టు అడవిలోకి అన్ని తండాలనుంచి అడవి పుత్రులు ప్రతి ఆదివారం గౌరారం చేర్తారు. కట్టె మోపులూ, రుూతాకుల చాపలు, కావిటి బుంగల్లో తెచ్చిన తేనె... చింతపండు, రేగు వెలగ పండ్లు సంతలో పెట్టి, వాళ్ళంతా దళారీలకోసం ఎదురుచూస్తుంటారు.
వినియోగదారులకు నేరుగా అడవి సంపద అమ్మనివ్వరు.
దళారీల ద్వారానే లానా-దేనాలు జరగాలి. భిన్నంగా జరిగితే అడవి పుత్రుల మీదికి పోలీసులను ఉసిగొలుపుతుంటారు.
సంత రాజ్యానికి దళారీలే సర్వాధికారులు!
వాళ్ళమాటే వేదం..
వాళ్ల మాటే శాసనం..
వాళ్ళను ధిక్కరించటం అంటే రాజ్యాన్ని ధిక్కరించినట్టే!
అదీ, సంత తంతు..
***
ఆదివారం..
రంగు పూసల ఆభరణాలు సాంప్రదాయక దుస్తులు ధరించి, కావిళ్ళతో అడవి సంపద మోసుకొంటూ గౌరారం సంతకు అడవి పుత్రులు రావటం మొదలయ్యింది.
ఉదయం పది గంటలకల్లా లోతట్టు అడవిలోని అన్ని తండాలనుంచి అడవి పుత్రులు సంతకు చేరుకున్నారు. రుూతాకుల చాపల మీద సంపదను పరచి ‘బేరగాళ్ళ’కోసం ఎదురుచూస్తున్నారు.
పేరుకు అది సంతే కానీ వినియోగదారులు అక్కడికి రారు. దళారీలు రాకుండా ఉండరు. వాళ్ళు అడవి పుత్రులనుంచి సరుకు కొనుగోలు చేసిన తర్వాతనే దానికి మార్కెట్టు ధర నిర్ణయించబడుతుంది. ఆ ధరకే వినియోగదారులకు అందుతుంది.
దళారీల వాహనాలు వచ్చాయి. క్రిందికి దిగారు. అడవి పుత్రుల దగ్గరికి వెళ్ళారు. చాపల మీద పరచివున్న సరుకు ‘నాణ్యత’ పరీక్షించారు.
‘‘చింతపండు పులుపులేదు. తేనె చప్పగా వుంది. అడవి కట్టెలు ఆరినవి కావు పండ్లు పక్వానికి రాలేదు.’’
సరుకు నాణ్యత మీద దళారులలా వ్యాఖ్యానిస్తుంటే అడవి పుత్రులు నిర్వేదంగా నిర్వికారంగా నీరసంగా నిరామయంగా చూస్తుండిపోయారు.
‘‘కొండ దేవరా.. సర్కుకి మంచి ధర పలికిచ్చు’’అని మనసులో వేడుకోవటం తప్ప వాళ్ళు చెయ్యగలిగిందేదీ లేదు.
రెడ్డియానాయక్ తండా పెద్ద బాణావతునాయక్ కూడా దళారీలకు రెండు బుంగల తేనె, మోపెడు బరువు చింతపండు చిటికెలో అమ్మి సొమ్ముచేసుకున్నాడు. దళారీలకు దణ్ణంపెట్టి కిరాణాకొట్టుకు చేరాడు.. వారానికి సరిపోయేలా కంది బేడలు, రాగి పిండి, ఉల్లిగడ్డలు కొనుక్కొని, దళారీలిచ్చిన డబ్బంతా షావుకారు ముందుపోసి, విప్పారిన కళ్ళతో చూస్తూ-
‘‘బే బాకీ’’ అన్నాడు.
‘‘నువ్వే నాకు రూపాయి బాకీ’’ అన్నాడు షావుకారు.
బాణావతునాయక్ మొహం వాడిపోయింది. ‘‘్ధ...త్తేరీ...! రెండు బుంగల తేనె తలబరువు సింతపండు అమ్మితే, శారెడు కందిపొప్పు సిటికెడు పిండి దోసిడు ఎలిగెడ్డలూ రాకపాయె! కొనబోతేకొరివి, అమ్మబోతే అడివి’ అందిందుకే గావాల’’అని, నిట్టూరుస్తూ అక్కడ్నించి కదిలాడు.
రెడ్డినాయక్ తండా దారిపట్టాడు బాణావతు.
నాగరికుల సంచారం కనిపించే గౌరారం వొదిలిపెట్టి లోతట్టు అడవిలోకి సాగిపోతోన్నకొద్దీ బాణావతునాయక్ మనసు, శరీరం తేలికపడ సాగింది. తెలియని కొత్త శక్తి ఏదో ఆవహించినట్టుంది.
మాయా ప్రపంచానికి సెలవుచెప్పి, తనదైన కల్లాకపటం లేని మంచి ప్రపంచంలోకి వెడుతోన్న అనుభూతికి లోనౌతూ హాయిగా ఊపిరి పీల్చుకున్నాడు బాణావతు.
ఇష్టంలేని బడినుంచి, ఇంటి గంటకొట్టగానే అమ్మ చెంతకు పరుగులుతీసే బడిపిల్లాడిలా అడవి తల్లి వొడిలోకి సాగిపోతోన్నాడు.
రక్కసి పొరలు రాళ్ళగుట్టలు దాటి లోతట్టు అడవిలోకి వెళ్తున్నకొద్దీ అందమైన ప్రకృతి చిత్రాలు తారసపడుతున్నాయి!
కుదురు తెలియని ‘ఆకాశవల్లి’ తీగెలు టేకుచెట్ల మధ్య విస్తరించి, మాటువేసిన వేటగాడు కట్టుకున్న తాళ్ళ ఉయ్యాలల్లా వున్నాయి.
గుంపులుగా నిల్చున్న గ్రీకువీరులకు మల్లే, ఏపుగా పెరిగిన టేకు చెట్లు గంభీరంగా ఉన్నాయి.
నూర్పుల చాటలంత పెద్దవిగావున్న టేకుచెట్ల ఆకులు సూర్యకాంతికి అడ్డుపడుతూ, పట్టపగలే చిమ్మచీకట్లు ముసురుకోగా బాణావతు ఓ చీకటి వలయం దగ్గర ఆగాడు.
తల తిప్పి చుట్టూ చూశాడు.
గాలి వీచింది. ఆకులు కదిలాయి. ఆకుల మధ్యని ఖాళీలగుండా సూర్యకిరణాలు చొరబడి, నేలమీద వింత వింత వెల్తురు బొమ్మల్ని గీస్తున్నాయి!
(ఇంకా ఉంది)

-గోపరాజు నాగేశ్వరరావు