డైలీ సీరియల్

అనంతం-4

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మీరీబాయి విసురుగా భర్త దగ్గరికి వెళ్ళింది.
‘‘రొండుబార్ల పొద్దెక్కింది. గూడెం నిదర లెగిసింది. తోటోళ్ళు అడివికెళ్ళినా దొరోరికింకా నిదరేనా... లెగు...లెగు వింక! లెగిసి, తొందరగా తానంజేసి అడివికెళ్ళు’’అన్నది చేత్తో భర్తను తట్టి పిలుస్తూ.
రెడ్డియా పూర్తిగా కళ్ళుతెరిచాడు. భార్యను చూస్తూ మురిపెంగా నవ్వాడు. లేచి కూర్చొని చుట్టూ చూసాడు!
పై కప్పు కంతల్లోనుంచి వెల్తురు కిరణాలు చాపమీద పడుతున్నాయి. వాటిని దోసిళ్ళతో పట్టుకొంటూ కిలకిలా నవ్వాడు.
‘‘ఏంటి కత?’’అని మీరీబాయి అడిగింది నవ్వుతూ.
‘‘బాణావతు దొరగారియ్యాళ అడివికి బోరు’’ అన్నాడు.
‘‘ఏంటికి బోరంట?’’
‘‘రెట్టు’’
‘‘రెట్టా? ఆదోరఁవ్ సంతలో ఏటమ్ముతావ్...?’’
‘‘తేనె’’
‘‘యాడిది?’’
‘‘నల్లకొండ కాడో తేనె పట్టుంది. పెద్ద తెరసాపంతుంది. సాఁవిరంగా. దాన్ని గొడితే సాలు! సిందిపోయింది సిందిపోనా, రొండు పెద్ద బుంగల తేనొచ్చుద్ది. శనోరఁవెళ్ళి తేనె పట్టుగొట్టి, ఆదోరఁవ్ సంతలో అమ్మాల.. అదీ దొరోరీ ‘పిలాన్’! అన్నాడు గర్వంగా చూస్తూ, రెడ్డియానాయక్.
బాణావతు కూడా నిద్రలేచాడు.
‘‘అడివికి బోనంటవా అయ్యా?’’ అని అడిగాడు.
‘‘బోను! బోనంటే బోను! ప్రెపంచకంలో వుండ సింతపండంతా దొరుకుద్దన్నా ఇయ్యాళ నేను అడివికి బోను.’’
‘‘బూశక్రగెడ్డలు యాడుంటయ్యి?’’
‘‘ఏంటికి రా..’’
‘‘తినాలనిపించింది’’అన్నాడు బాణావతు.
ముద్దుల కొడుకు మాటలకు మీరీబాయిక్కూడా భూచక్రగడ్డ గుర్తొచ్చి నోరూరింది. భర్తవైపు ఆశగా చూస్తూ-
‘‘అవునయ్యోయ్.. బూశక్రగెడ్డ దిని శానాదినాలైంది. రెట్టని అడవికి బోనంటివి గదా! నల్లకొండ కాడ గెడ్డలుంటయ్యి. ఒక్క గెడ్డ తొవ్వి తెచ్చినావంటే కడుపునిండా దినొచ్చు’’ అన్నది.
రెడ్డియానాయక్కు భూచక్రగడ్డలు గుర్తొచ్చాయి!
భార్య చెప్పింది నిజమే! అక్కడి, నల్లకొండ దగ్గరి సారవంతమైన భూమిలో భూచక్రగడ్డలు విస్తారంగా పండుతాయి. వాటి ఆకులను చూసి, భూమిలోపల పెరిగే గడ్డలు పక్వానికి వచ్చిందీ, లేనిదీ యిట్టే తెలుసుకోగలడు తను!
పక్వానికొచ్చిన గడ్డను ఎంచుకోవాలి. రెండు, మూడు అడుగుల లోతు భూమిని తవ్వాలి. అప్పుడు భూచక్రగడ్డ బైటికొస్తుంది.
రెడ్డియానాయక్ నల్లకొండ దగ్గరికి బయల్దేరాడు. గబగబా కాలకృత్యాలు ముగించుకొని, వేటకొడవలి చేతపట్టి, నింపాదిగా నడుస్తూ, దారిలో ఎదురైన వాళ్ళను పలుకరిస్తూ..
తను కొట్టాలనుకున్న తేనె పట్టుకూడా అక్కడే వుంది. దాన్ని ఒకసారి చూడాలి. ఎంత తేనె పట్టొచ్చో అంచనావేసి, తగినన్ని బుంగలతో వెళ్ళాలి. తేనె పట్టుకొట్టి సంతలో తేనె అమ్మాలి.
నాయక్ నల్లకొండ దగ్గరికి చేరుకున్నాడు. ముందుకు వొంగి నేలమీద చూపులు నిలిపి పరీక్షగా చూస్తున్నాడు!
ఒకచోట పక్వానికి వచ్చిన భూచక్రగడ్డ ఆకులు నేలమీద కనిపించాయి. వేట కొడవలితోనే భూమిని తవ్వుతూ కూర్చున్నాడు.
ఓ అడుగు లోతు తవ్వి, కొడవల్ని ప్రక్కనపెట్టి- తవ్విన మట్టంతా దోసిళ్ళతో ఎత్తిపోశారు.
భూచక్రగడ్డ తల భాగం కనిపించింది!
ఎరుపు, పసుపు, తెలుపు రంగుల మిశ్రమంలా గడ్డ కనిపించగానే రెడ్డినాయక్ కళ్ళు సంతోషంతో విప్పారాయి.
అలా రంగు తిరిగిందంటే అది బాగా పక్వానికొచ్చిన భూచక్రగడ్డే!
మళ్ళీ వేట కొడవలి అందుకున్నాడు. రెట్టించిన ఉత్సాహంతో తవ్వుతున్నాడు.
తవ్విన మట్టిని చేతులతో తోడివేస్తూ, యింకా యింకా తవ్వుతూ, త్వరగా గడ్డను బైటికి తియ్యాలన్న లక్ష్యంతో పరిసరాలను కూడా మరచిపోయాడు.
దీక్షగా తన పనిలో నిమగ్నమై పోయాడు రెడ్డియానాయక్.
ఇప్పుడు భూచక్రగడ్డ పూర్తిగా కనిపిస్తున్నది.
ఏపుగా పెరిగిన పెద్దగడ్డ.
పండి, పక్వానికొచ్చిన తియ్యదనాలగడ్డ.
భూమిని తవ్వటం పూర్తయ్యింది. మట్టంతా తోడివేసి, గడ్డను రెండు చేతులతో బలంగాపట్టి, బైటికి లాగాడు. దానికి అంటుకొని వున్న ఎర్రమట్టిని తల గుడ్డతో తుడిచి శుభ్రం చేశాడు.
వేట కొడవల్ని నడుముకు వ్రేలాడగట్టి, భూచక్రగడ్డను నెత్తిమీదికి ఎత్తుకోబోయాడు రెడ్డియానాయక్.
సరిగ్గా అప్పుడు-
నాగరికుల బూట్లక్రింద నలుగుతూ అడవి ఎండుటాకులు ‘గర...గరా’ శబ్దించసాగాయి... అతని చుట్టూ, వలయంలా వున్న ఎండ పొడలో నేలమీద తుపాకి బొమ్మలు నర్తిస్తున్నాయి!
నాయక్ తుళ్ళిపడి చుట్టూ చూశాడు!
సాయుధులైన కలప దొంగలు అప్పటికే అతన్ని చుట్టుముట్టారు.
అతనికి పరిస్థితి ఏమిటో అర్థమైపోయింది. చుట్టూ చూశాడు.
కలప దొంగల రూపంలో పొంచివున్న ప్రమాదాన్ని అంచనావేశాడు.
ఇప్పుడేం చెయ్యాలి?
శత్రువుల వ్యూహం చాలా పకడ్బందీగా వుంది. మనుషుల వేటలో ఆరితేరిన నరహంతకుల వ్యూహంలా వుంది. తప్పించుకొనే దారి లేదు.
వృథాగా చావటమా? ఒక్క శత్రువునైనా చంపి చావటమా?
అతని కళ్ళు విస్ఫులింగాలు కురిపించాయి!
మొలకు వ్రేలాడుతున్న వేటకొడవల్ని అందుకొందుకు చెయ్యి అలా కదిలించాడో- లేదో శత్రువులు అతనికా అవకాశం ఇవ్వకుండా మెరుపు వేగంతో దాపుకు వచ్చి అతన్ని పెడరెక్కలు విరిచి పట్టుకున్నారు.
నాయక్ పెనగులాడుతున్నాడు.
రౌధ్రంగా బుసలు పెడుతున్నాడు.
ఆవేశంతో కంపించి పోతోన్నాడు.
కళ్ళతోనే పెనుమంటలు సృష్టిస్తున్నాడు.
లాభం లేదు! ఎంత పెనుగులాడినా పట్టు సడలటంలేదు. వేట కొడవలి అందుకొని శత్రువుల శరీరాలను ఖండ ఖండాలుగా నరికివేసే అవకాశంలేదు.
బోనులో చిక్కిన పులిలా గర్జించాడు.
అడవి ప్రతిధ్వనించింది.
‘‘అది లాండ్‌మైన్ కదూ?’’ భూచక్రగడ్డ వైపు వ్రేలు చూపిస్తూ ఓ ఫారెస్టుగార్డు అడిగాడు.
కలప దొంగలు గలగలా నవ్వారు.
‘‘తీవ్రవాదివి కదూ?’’ మళ్ళీ అడిగాడు.
నాయక్ అయోమయంగా చూస్తున్నాడు.
ఫారెస్టు గార్డులు కలప దొంగలు, కీ.శే.పెద్దిరెడ్డి అనుచరులూ అతన్ని లాక్కొని వెళ్ళి, ఓ టేకుచెట్టు కాండానికి తాళ్ళతో కట్టివేశారు.
చింత బరికలతో బాత్తున్నారు.
రైఫిల్ బట్లతో కొడుతున్నారు.
(ఇంకా ఉంది)

-గోపరాజు నాగేశ్వరరావు