డైలీ సీరియల్

సావిత్రి ఉపాఖ్యానం-70

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇప్పటికి మనమిద్దరం కలిసి చాలా దూరం ప్రయాణించాము. కనుక మిత్రులం.ఆ మైత్రిని పురస్కరించుకొని నేను చెప్పేది విను. ఎవరు జితేంద్రియులు కారో వారు వనంలో నివసిస్తూ ఆశ్రమ నివాస శ్రమను ఓర్వలేరు. ధర్మపాలన చేయలేరు. సజ్జనులకు ఇష్టమైన ఒక ఆశ్రమధర్మాన్ని మనం శ్రద్ధగా అనుసరిస్తే అందరూ ఆ మార్గానే్న అనుసరిస్తారు. దీనికి నైష్ఠిక బ్రహ్మచర్యం, సన్యాసం అక్కర్లేదు. కనుక ఆశ్రమ ధర్మమే ముఖ్యము.’’
సావిత్రి మాటలకు యముడు సంతోషించి ఇలా అన్నాడు. ‘‘అనిందితా! నీ మాటలకు నాకు చాలా ఆనందాన్నిచ్చాయి. నీ భర్త ప్రాణం తప్ప ఏదేని వరం కోరుకో ఇస్తాను’’. సావిత్రి ఇలా అడిగింది. ‘‘నా మామగారు దృష్టిని పోగొట్టుకొని వనవాసం చేస్తున్నారు. ఆయనకు దృష్టిని ప్రసాదించు’’.
యముడు ఇలా అన్నాడు. ‘‘సావిత్రీ! ఈ వరాన్ని నీకు ఇస్తున్నాను. ఈ మార్గం చాలా దుష్కరమైనది. నీవు అలసిపోయావు. నీవు కోరినవిధంగా నీ మామకు శుభం జరుగుతుంది. ఇక తిరిగి వెళ్లు’’.
సావిత్రి యమునికి ఇలా సమాధానం చెప్పింది. ‘‘్భర్తతో ఉంటే భార్యకు ఎన్నడూ అలసట కలుగదు. భర్త ఎక్కడ ఉంటే అక్కడే నేనూను. సురేశా! ఒక మాట విను. సజ్జనులను కలియటం ఒక అదృష్టం. అది నిరర్థకం కాదు. కనుక సజ్జన సాంగత్యం ఉండాలి’’.
యముడు ఇలా అన్నాడు - ‘‘కల్యాణీ! సజ్జనుల విషయంలో నీవు చెప్పిన హితోక్తి నాకు బాగా నచ్చింది. సత్యవంతుని ప్రాణాలు తప్ప ఇంకేమైనా వరం కోరుకో ఇస్తాను’’.
అప్పుడు సావిత్రి ఇలా కోరుకుంది. ‘‘దేవా! మా మామగారు రాజ్యాన్ని పోగొట్టుకున్నారు. ఆయన తిరిగి తన రాజ్యాన్ని పొందాలి. ఆయన తన స్వధర్మాన్ని ఎప్పుడూ విడువకూడదు’’.
యముడు ఇలా అన్నాడు. ‘‘ఓ రాజపుత్రీ! ద్యుమత్సేనుడు తిరిగి రాజ్యాన్ని పొందుతాడు. అతను తన స్వధర్మాన్ని విడువడు. నీ కోరిక తీరింది కదా! ఇక వెనుదిరిగి వెళ్లు. శ్రమపడకు’’.
సావిత్రి అతని మాటలు విని మరల ఇలా జవాబు ఇచ్చింది. ‘‘దేవా! జనులందరినీ నియమంగా ఉంచుతున్నావు. ఇష్టానుసారంగా వారిని తీసుకొని పోతావు. అందుకే నీకు యముడు అన్న పేరు వచ్చింది. ఇంకా విను. సర్వప్రాణులకూ మనసా వాచా కర్మణా ద్రోహం చేయకుండా వారి పట్ల దయ చూపడం, దానం చేయడం ఇది సత్పురుషుల ధర్మం. మానవులు అల్పాయుష్కులు, బలహీనులు. కనుక వారు శరణు కోరితే శత్రువులు కూడా వారిపై దయ చూపుతారు’’.
ఆమె మాటలకు ఎంతో ఆనందించి యముడు ఇలా అన్నాడు. ‘‘దాహం కలిగినవారికి మంచినీరు ఇచ్చినట్లు నీ మాటలకు నాకు ఆనందాన్ని కలిగిస్తున్నాయి. సత్యవంతుని ప్రాణాలు తప్ప ఇంకేదైనా వరం కోరుకో ఇస్తాను’’.
సావిత్రి అంది - ‘‘మా తండ్రికి పుత్రులు లేరు ఆయనకు వందమంది ఔరసపుత్రులను అనుగ్రహించు’’. యముడు ఆ విధంగా వరమొసగి ఆమెను ఇక వెనుకకు మరలమన్నాడు.
సావిత్రి నడుస్తూనే ఇలా అన్నది. ‘‘నా భర్త సన్నిధిలో ఇది నాకు దూరమేమీ కాదు. అలసట లేదు. నడుస్తూనే నేను చెప్పే ఈ మాటలు వినండి. మీరు సూర్యపుత్రులు కనుక మిమ్మల్ని వైవస్వతుడు అంటారు. ప్రజలందరి పట్ల సమానధర్మంతో ఉంటారు కనుక సమవర్తి అంటారు. మనుష్యులకు మంచివారిపై ఉన్న నమ్మకం తమ మీద కూడా ఉండదు. సర్వప్రాణులకు మంచితనం వల్లనే విశ్వాసం ఏర్పడుతుంది. కనుక ప్రజలు మంచివారినే నమ్ముతారు.’’
ఆమె మాటలు ధర్మబద్ధంగా ఉండడం వలన విన్న యముడు మిక్కిలి ఆనందించి ఇలా అన్నాడు - ‘‘కల్యాణీ! నీవు అన్న ఈ మాటలు ఇంతవరకు ఎవ్వరినోటా వినలేదు. నేను చాలా ఆనందించాను. సత్యవంతుని ప్రాణాలు తప్ప ఇంకేదైనా వరం కోరుకో ఇస్తాను’’.
అప్పుడు సావిత్రి ఇలా కోరింది. ‘‘నాకు, సత్యవంతుడికీ బలసంపన్నులైన వంద మంది ఔరస పుత్రులు కావాలి’’.
యముడిలా అన్నాడు - ‘‘సావిత్రీ! నీకు వందమంది బలవీర్య సంన్నులైన పుత్రులు కలుగుతారు. చాలా దూరం వచ్చావు. ఇక వెనక్కి వెళ్లిపో’’.
సావిత్రి ఇలా అన్నది - ‘‘సజ్జనులు ఎప్పుడూ ధర్మబద్ధంగానే నడుస్తారు. వారితో కలయిక నిష్ఫలం కాదు. సత్పురుషుల వల్ల సజ్జనులకెప్పుడూ భయం కలుగదు. సత్పురుషులు తమ సత్యబలంతో సూర్యుని కూడా నడిపించగలరు. తపస్సుతో భూమిని భరించగలరు. భూత భవిష్యత్ వర్తమాన కాలాలకు వారే గతి. సజ్జనులకు సజ్జనుల మధ్య దుఃఖముండదు. వారు ఎప్పుడూ పరోపకారం చేస్తారు. వారు స్వార్థదృష్టితో దేన్నీ చూడరు.వారి ఆగ్రహం వ్యర్థం కాదు. అనుగ్రహము, అర్థమానాలు వారితోనే నిలుస్తాయి. వారు సర్వరక్షకులు’’.
యముడిలా అన్నాడు- ‘‘సావిత్రీ! నీవు అన్న మాటలు ధర్మసమ్మతంగా, అర్థవంతంగా, మనోనుకూలంగా ఉండి, నీపై భక్తి పెరుగుతున్నది. సాటిలేని వరమేదైనా కోరుకో’’.
అప్పుడు సావిత్రి ఇలా అంది. ‘‘మహాత్మా! నా తక్కిన వరాలలాగ కాక తమరు నాకిచ్చిన నాల్గవ వరం దాంపత్య జీవనం లేకుండా అసాధ్యమైనది. కనుక సత్యవంతుని బ్రతికించు. భర్త లేకుండా నేను బ్రతకలేను. భర్త లేకపోతే నాకు స్వర్గం అక్కరలేదు. సుఖాలు అక్కరలేదు. నాకు నూర్గురు పుత్రులు పుడతారని వరము ఇచ్చారు. కానీ నా భర్తను మీరు తీసుకొని పోతున్నారు. నా భర్త లేకుండా ఔరసపుత్రులు ఎలా పుడ్తారు? కనుక సత్యవంతుని జీవింపజేస్తే తమరి వరం యధార్థ మవుతుంది’’.
యముడు అలాగేనని పాశాన్ని విడిపించి సావిత్రితో ఇలా అన్నాడు ‘‘హే కులనందినీ! నీ భర్తను పాశవిముక్తుడిని చేశాను. ధర్మార్థాలతో కూడిన నీ మాటలకు ఆనందించాను. సాధ్వీ! సత్యవంతుడు నీతో కలిసి నాలుగు వందల సంవత్సరాలు జీవిస్తాడు. వంద అశ్వమేదయాగాలు చేస్తాడు. నీకు వంద మంది కొడుకులు పుడతారు. నీ తల్లిదండ్రులకు వందమంది పుత్రులు జన్మిస్తారు. ఇదంతా నీ పాతివ్రత్య ధర్మం వల్లనే సాధ్యమైంది’’ అని పలికి తన లోకానికి వెళ్లిపోయాడు.
సావిత్రి భర్తప్రాణాలను వరంగా పొంది తిరిగి భర్త ఉన్న చోటుకు వచ్చి మరల భర్త తలను తన ఒడిలో పెట్టుకొని కూర్చున్నది. కొంతసేపటికి మేల్కొన్న సత్యవంతుడు ఆమె వంక ప్రేమతో చూస్తూ ఇలా అన్నాడు. ‘‘కల్యాణీ! నేను చాలాసేపు నిద్రపోయాను. నన్ను ఎందుకు లేపలేదు? నన్ను పట్టి లాగుకుపోతున్న ఆ నల్లటి మనిషి ఎవరు?’’

ఇంకావుంది...

డాక్టర్ ముదిగొండ ఉమాదేవి