డైలీ సీరియల్

మహాభారతంలో ఉపాఖ్యానాలు-73

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మానవుడు తప్పు చేసినా నిండు మనస్సుతో పశ్చాత్తాపం చెందితే అతను పాప విముక్తుడు అవుతాడు. మన శాస్త్రాల్లో చెప్పిన జపతపోయజ్ఞాదులలో దేనినైనా నిష్కామంగా ఆచరిస్తే అతనికి పాపవిముక్తి కలుగుతుంది. ఇతరులలో మంచినే చూడాలి. తప్పును,చెడును చూడకూడదు.
సూర్యుని ఉదయం చేత అంతకు ముందు ఉన్న చీకట్లు తొలగిపోయి నట్లు మనం నిష్కామంగా మంచి పనులు చేస్తే పాపాల నుంచి విముక్తులము అవుతాము. పాపాలకు నివాసస్థానం లోభము. బాగా శాస్తజ్ఞ్రానం లేని లోభులే పాపకార్యాలు చేస్తారు.
గడ్డితో మూసుకున్న బావి ఎలా కన్పడదో అదేవిధంగా ధర్మం ముసుగులో అధర్మం ఉంటుంది. బయటికి ధర్మాత్ములుగా కనిపించే ఈ అధార్మికులలో ఇంద్రియ నిగ్రహం, ధర్మాన్ని బోధించే మాటలు అన్నీ ఉంటాయి. కాని ఆచరణమాత్రం శూన్యం. ధర్మాలన్నీ మాటలకే పరిమితం. శిష్టాచారం ఉండదు.’’
అప్పుడు కౌశికుడు వ్యాధుని ఇలా ప్రశ్నించాడు. ‘‘శిష్టాచారం అనగా ఏమిటి? దాని గురించి నాకు దయచేసి బోధించు’’.
ధర్మవ్యాధుడు ఇలా సమాధానం చెప్పాడు. ‘‘నాయనా! యజ్ఞం, దానం, తపస్సు, వేదాధ్యయనం, సత్యం పలుకడం ఇవి శిష్టుల వ్యవహారాలలో ఉత్తమమైనవి అని పెద్దలు చెప్తారు. ఇంకా శిష్టాచారాల్లో రెండవది సదాచార రక్షణ. గురుసేవ, సత్యం చెప్పటం, కోపం లేకుండా ఉండడం, దానం చేయడం కూడా ముఖ్యమైన ఆచారాలు.
ఇంద్రియ నిగ్రహం, త్యాగం ఆచరణలో ఉండాలి. శిష్టులు సదా ధర్మార్థాల మీద మనసు నిలుపుతారు. అహింస, నిజం చెప్పటం అన్ని ప్రాణులకు మేలు కలిగిస్తాయి. అహింస అన్నింటినీ మించిన ధర్మం. అది సత్యం మీద ఆధారపడి ఉంటుంది. అనాచారమే అధర్మం అని శిష్టుల ఉపదేశం. న్యాయంతో కూడిన కార్యమే ధర్మము.
కోపం లేనివారు, ఇతరులలో తప్పులు ఎంచని వారు అహంకారం, గర్వం, ఈర్ష్య లేనివారు, మనో నిగ్రహం, ఇంద్రియ నిగ్రహం ఉన్నవారు శిష్టాచారులు అవుతారు.
వేదంతో చెప్పిన ధర్మం ఉత్తమం. ధర్మశాస్త్రాలలో చెప్పినది రెండవది. శిష్టుల సదాచారం మూడవది. ఈ విధంగా ధర్మలక్షణం మూడు విధాలు.
దాతలు, తమ దగ్గర ఉన్న వస్తువులు కాని ధనం కాని సమానంగా ఇతరులతో పంచుకొనే వారు కొంత ఇతరులకిచ్చి తర్వాత తాము ఉపయోగించుకొనేవారు దీనులపై దయకల్గిన వారు. విద్యయే ధనంగా భావించేవారు, స్వధర్మాలను పాటించేవారు, సర్వప్రాణుల హితం కోరేవారు- వీరిని శిష్టులు అంటారు.
నిరహంకారులు, ఓర్పు, దమం, శమ కలవారు, దయ దాక్షిణ్యం కలవారు సంతృప్తి కలవారు, కామం, ద్వేషం లేనివారు - ఇటువంటి వారు ఇతరులకు ప్రమాణంగా ఉంటారు. అసూయ లేకపోవడం, ఓర్పు, శాంతి, సంతోషం, ప్రేమ కలిగి ఉండడం, కోరికలని, కోపాన్ని వదిలిపెట్టడం, శిష్టాచారాన్ని అనుసరించడం - ఇవి సజ్జనుల శ్రేష్ఠమార్గం’’.
తనకు తెలిసిన ధర్మ సంబంధ గుణాల గురించి తెలిపిన ధర్మవ్యాధుడు మరల కౌశికునితో ఇలా అన్నాడు. ‘‘ఈ మాంసం విక్రయించడం ఘోరమైన పని. కాని కౌశికా! విధి బలీయమైనది. మనం పూర్వజన్మలో చేసిన కర్మఫలాన్ని ఈ జన్మలో ఖచ్చితంగా అనుభవించాలి. ఈ వ్యాధుని జన్మ నేను పూర్వజన్మలో చేసిన పాపఫలితం. ఆ దోషాన్ని పోగొట్టుకొనడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. నేను ఇతరులు చంపిన మాంసానే్న అమ్ముతున్నాను.
జంతువులను యాగంలో వినియోగించి ఆ శేషం భుజిస్తే అది ధర్మమవుతుంది. కాని మామూలుగా మాంసభక్షణం మాత్రం ధర్మం కాదు. ఇది మాంసవిక్రయం కనుక దీన్ని వదలను. ఇదే నా కులవృత్తి. స్వధర్మాన్ని వదిలివేసిన వానిని అధర్ముడని అంటారు. దానం చేయటం, నిజం చెప్పటం, గురుసేవ, బ్రాహ్మణులను గౌరవించడం, అతివాదానికి, అభిమానికి దూరంగా ఉండడం నాకు అలవాటు. మంచి వంశంలో పుట్టినవారు కూడ మంచి గుణాలు కలవారు కూడా ఘోరకార్యాలు చేసి సిగ్గు పడుతూ ఉంటారు’’.
ధర్మవ్యాధుడు మరల చెప్పసాగాడు.
‘‘్ధర్మస్వరూపం చాలా సూక్ష్మాతిసూక్ష్మంగా ఉంటుంది. ప్రాణులకు మేలు కలిగించేది సత్యం. ఎవరికైనా హాని చేసేది అది నిజమైనా అసత్యం క్రింద పరిగణించాలి. ఇలా పరిశీలిస్తే ధర్మగతి ఎంత సూక్ష్మమో తెలుస్తుంది.’’
కౌశికుడు ఇలా ప్రశ్నించాడు. ‘‘్జవుఢు ఎలా శాశ్వతుడు అవుతాడు?’’
వ్యాధుడు ‘‘శరీరం నశించవచ్చు కాని అందులోని జీవుడు నశించడు. అతని శరీరంలో ఉండే పంచతత్త్వాలు పంచభూతాలలో కలిసిపోతాయి. అందుకే పూర్వం చనిపోతే పంచత్వం పొందాడు అనేవారు. ఈ లోకంలో మనం చేసే కర్మ యొక్క ఫలితం ఇంకొకడు అనుభవించడు. చేసిన కర్తయే అనుభవించును. అతను చేసిన పాపపుణ్యాలు అతనితో వస్తాయి’’.
కౌశికుడు మళ్లీ ఇలా అడిగాడు ‘‘జీవుడు ఇంకొకరి గర్భంలో ఎలా ప్రవేశిస్తాడు?’’
ధర్మవ్యాధుడు ఇలా జవాబు ఇచ్చాడు. ‘‘పుణ్యకర్మలు చేసినవాడు పుణ్యాత్ముల గర్భం నుంచి అలాగే పాపాలు చేసినవాడు పాపాత్ముల గర్భం నుంచి జన్మిస్తారు. పుణ్యకర్మల వల్ల జీవునికి దైవత్వమూ, పుణ్యపాప కర్మల వల్ల మానవత్వమూ, తామసకర్మలవల్ల పశుపక్ష్యాది జన్మలూ కలుగుతాయి. కేవలం దుష్కర్మల వల్ల నరకం కలుగుతుంది. వారు అనేకమార్లు పశుపక్ష్యాదుల జన్మ ఎత్తి చివరకు నరకానికి వెళతారు. దుఃఖాన్ని అనుభవించడానికి పాపపు జన్మ ఎత్తుతారు. ఆ కొత్త జన్మలలో మరల పాపకర్మలు చేస్తాడు. వాటివల్ల ఇంకా పాపజన్మలు ఎత్తుతాడు. అతనికి పాపాలు చేయడమే అలవాటు అవుతుంది.
ఇంకావుంది...

డాక్టర్ ముదిగొండ ఉమాదేవి