డైలీ సీరియల్

మహాభారతంలో ఉపాఖ్యానాలు-74

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాని ఇంద్రియాలను జయించిన వాడు, మనస్సును వశం చేసుకొన్న వాడు ఇహలోక పరలోక సుఖాలు పొందుతాడు. ఈ లోకంలో ఎవరినీ బాధించకుండా తన వృత్తినే చేసుకోవాలి. శిష్టుల ఉపదేశాన్ని అనుసరించి స్వధర్మాన్ని ఆచరించాలి. వివేకవంతుడు ఈ ధర్మాచరణలో ఆనందిస్తాడు. ధర్మబద్ధంగా సంపాదిం చిన ధనంతోనే జీవనం సాగిస్తాడు.
మానవుడు మనస్సుతో కోరుకొనే వాటిని అన్నింటిని తపస్సు వల్ల పొందుతాడు. ఇంద్రియ నిగ్రహం సత్యవాక్కు, మనోనిగ్రహం వల్ల మానవుడు పరబ్రహ్మను పొందుతాడు. కౌశికుడు ధర్మవ్యాధుని మరల ఇంకొక ప్రశ్న వేశాడు.
‘‘వ్యాధా! వేటిని ఇంద్రియాలు అంటారు? వాటిని ఎలా నిగ్రహించాలి? ఈ నిగ్రహానికి ఫలం ఏమిటి? దీని గురించి నాకు వివరించు’’
విషయం పట్ల అతని ఆసక్తిని గమనించి ధర్మవ్యాధుడు ఇలా వివరించాడు. ‘‘ఇంద్రియాల ద్వారా ఏ విషయమైనా తెలుస్తుంది. అలా తెలియడానికి మనస్సు ముందుగా ప్రవర్తిస్తుంది. అలా తెలిసిన తర్వాత మనస్సుకు దానిపైన రాగం కాని ద్వేషం కాని కలుగుతుంది. అప్పుడు వాటిని పొందడానికి మానవుడు ప్రయత్నిస్తాడు. కావలసిన రూప రస గంధాదులు దొరికితే వాటిని అనుభవిస్తాడు. వాటిపై రాగం కలుగుతుంది. అవి లభించకపోతే ద్వేషం కలుగుతుంది. తర్వాత కావలసిన వస్తువుపై లోభం కలుగుతుంది. ఆ తర్వాత మోహం కలుగుతుంది. వీటివల్ల పీడితుడైన అతని బుద్ధి ధర్మంపై పోదు. అధర్మంగా డబ్బు సంపాదించాలని అనుకుంటాడు. వంచనతో, ధనం సంపాదించడం వల్ల అతని బుద్ధి వాటి మీదే ఉంటుంది. అతని అధర్మప్రవర్తన వల్ల అతనిలోని మంచి గుణాలు నశిస్తాయి. పాపాత్ములు తమతో సరియైన పాపాత్ములతోనే స్నేహం చేస్తారు. ఇహలోకంలో దుఃఖపడుతారు. పరలోకంలో కష్టాలు, బాధలు అనుభవిస్తారు. అదే బుద్ధిమంతుడు తన తెలివితేటలతో సుదుఃఖాలలోని దోషాలు ముందే గుర్తించి వాటిని తొలగించుకొని మంచివారితో స్నేహం చేస్తాడు. సత్సాంగత్యం వలన అతని బుద్ధి ధర్మమార్గంలో నడుస్తుంది.’’
బ్రాహ్మణుడు అతని (వ్యాధుని) జ్ఞానం చూసి ఆశ్చర్యపోయాడు. అతనితో ఇలా అన్నాడు. ‘‘మహాత్మా! ధర్మవిషయాలలో నీ జ్ఞానం చూస్తే నీవు ఒక మహర్షివని నాకనిపిస్తుంది’’.
దానికి వ్యాధుడు ఇలా జవాబు చెప్పాడు. ‘‘్ధర్మాత్తులైన బ్రాహ్మణులు, పితృదేవతలు ఎప్పుడు ముందుగా భోజనం చేయదగినవారు. వారికి ఇష్టమైనదానిని చెపుతాను విను. ఈ పంచభూతాత్మకమైన చరాచర జగత్తు అంతా పరబ్రహ్మ స్వరూపమే. ఆ పరబ్రహ్మకంటే గొప్పది ఇంకేది లేదు. ఆకాశం, వాయు, అగ్ని, జలం, పృథ్వి ఇవి పంచభూతాలు. శబ్ద స్పర్శ రూప రస గంధాలు వాటి యొక్క గుణాలు.
ఈ పంచభూతాలే కాక ఆరవతత్వం ఉంది. అది మనస్సు. ఏడవతత్వం బుద్ధి. అహంకారం ఎనిమిదవది. ఇవికాక పంచ జ్ఞానేంద్రియాలు, ప్రాణం, సత్త్వరజస్తమస్సులు - ఈ పదిహేడు తత్వాలని అవ్యక్తం అంటారు. వ్యక్తవిషయాలు అవ్యక్త విషయాలు కలిపి 24 తత్త్వాలు అవుతాయి. ఈ తత్త్వాల సముదాయమే వ్యక్తావ్యక్త రూపమైన గుణాలు. ఇవన్నీ పరబ్రహ్మస్వరూపాలు’’.
ధర్మవ్యాధుడు ఇంకా ఇలా చెప్పాడు. ‘‘కంటికి కనిపించే ఈ శరీరమే రదము. బుద్ధి దాని సారథి. ఇంద్రియాలు గుర్రాలు అని శ్రుతులు చెప్తున్నాయి. బుద్ధిమంతుడు నేర్పరి అయిన సారథి గుర్రాలను అదుపులో ఉంచుకొని ప్రయాణం చేసినట్లు ఇంద్రియాలను తన వశంలో ఉంచుకొని జీవన మార్గంలో ప్రయాణిస్తాడు. తన గమ్యాన్ని చేరుకుంటాడు. ఆ గమ్యమే మోక్షము.
తర్వాత జిజ్ఞాసువు అయిన కౌశికుడు ధర్మవ్యాధునిని త్రిగుణాలు అయిన సత్త్వ రజ స్తమస్సుల గురించి వివరించి చెప్పమన్నాడు. అప్పుడు వ్యాధుడు త్రిగుణాల గురించి ఇలా విరించాడు. ‘‘కౌశికా! ఈ మూడింటిలో తమోగుణం మోహాన్ని కలిగిస్తుంది. రజోగుణం పనులు చేయడానికి ప్రేరేపిస్తుంది. సత్వగుణం సర్వశ్రేష్ఠమైనది. ఎప్పుడూ నిద్రపోయేవాడు, కోపిష్టి, సోమరి, ఇంద్రియ నిగ్రహం లేనివాడు తామసుడు. మిక్కిలి ఆశకలవాడు, ఇతరుల గుణాలలో దోషాలు ఎంచేవాడు, అభిమానం ఎక్కువ కలవాడు, సలహాలు ఇవ్వడంలో నేర్పరి రాజసుడు. జ్ఞానం అధికంగా కలవాడు, ధీరుడు ఇతరులలో దోషాలు ఎంచనివాడు, బుద్ధిమంతుడు, కోపం లేనివాడు సాత్వికుడు’’.
తర్వాత కౌశికుడు ప్రాణం ఏ ధాతువును ఆధారంగా చేసుకొని ఉంటుందని ప్రశ్నించాడు. ప్రాణం గురించి వివరించమని అర్థించాడు.
అప్పుడు ధర్మవ్యాధుడు ఇలా చెప్పాడు. ‘‘బ్రాహ్మణా! ప్రాణం శరీరాన్ని సురక్షితంగా ఉంచే అగ్ని స్వరూపమైన ఉదానవాయువు. అది శిరస్సును ఆశ్రయించి శరీరంలో ఉంటుంది. ముఖ్యంగా ప్రాణం శిరస్సు, ఉదానవాయువు రెండింటిలో ఉండి సంచరిస్తూ ఉంటుంది. మూడు కాలాలు ఈ ప్రాణాన్ని ఆశ్రయించి ఉంటాయి. ఆ ప్రాణమే జీవుడు. అదే సమస్త జీవులకు ఆత్మ. అదే జాగ్రదవస్థలో మేల్కొని ఉండి స్వప్నావస్థలో కలలు కంటుంది.ఈ ప్రాణ సంచారం వల్ల ప్రాణిలో కదలిక ఉంటుంది. ఈ సంచారం ఆగిపోతే ప్రాణి మరణిస్తుంది అని అంటారు. ఈ ప్రాణమే ఒక శరీరాన్ని వదిలి ఇంకొక శరీరంలోకి ప్రవేశిస్తుంది.
పరమాత్మ సమస్త ప్రాణులలో ఉంటాడు. లోభ క్రోధాలని అణిచివేయటమే తపస్సు. ఇదే సంసార సముద్రాన్ని దాటించే నావ.
సుఖదుఃఖాలను రెండింటినీ వదిలినవాడే అనంతమైన బ్రహ్మపదాన్ని పొందుతాడు. ధర్మవ్యాధుడు మోక్షం గురించి ధర్మం ప్రాణం గురించి వివరించగా కౌశికుడు ఆశ్చర్యపడి వ్యాధునితో అతని ఈ జ్ఞానానికి కారణమేమిటని అడిగాడు. అప్పుడు వ్యాధుడు ఇలా సమాధానం చెప్పాడు.
ఇంకావుంది...

డాక్టర్ ముదిగొండ ఉమాదేవి