డైలీ సీరియల్

అనంతం-12

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇప్పుడా తేనెపట్టు ముదురు గోధుమరంగులో నిగనిగలాడుతూ, నాణ్యమైన మామిడి తాండ్ర వ్రేలాడుతున్నట్టుంది!
పట్టునుంచి బొట్లుబొట్లుగా తేనె చుక్కలు పడుతూంటే ఓ బుంగను దానిక్రింద పెట్టారు.
తేనె బొట్లు లీలగా చప్పుడు చేస్తూ, బుంగలో పడుతున్నాయి.
ఇక, చెయ్యాల్సిందల్లా- మైనంలావున్న తేనెపట్టును తుంపులు తుంపులుగా లాగి, ఖాళీబుంగల్లో వెయ్యాలి. పిడికిళ్ళకు పట్టినంత మైనం ముద్దల్ని తీసికొని బలంగా పిండాలి.
మైనం అంతా పిండి అవతల పారేస్తే బుంగల్లో తేనెమాత్రమే మిగుల్తుంది.
ఇద్దరి మొహాలూ సంతోషంతో విప్పారాయి.
వాళ్ళు తేనె పిండే సంబరంలో వుండి పరిసరాలను గమనించలేదు.
పెనుముప్పు పొంచి వుందని వాళ్ళకు తెలియదు.
***
రాత్రికి రాత్రే నల్లకొండ దగ్గర నాగరికుల గుడారాలు వెలిసాయి! ఎవ్వరూ అది గమనించలేదు.
విఐపీల గుడారాలు అధికారుల గుడారాలు పోలీసు సిబ్బంది గుడారాలూ...
విడివిడిగా గుడారాలు నిర్మించి, వ్యక్తుల స్థాయినిబట్టి వాటిని కేటాయించారు.
పనివాళ్ళకు కొంచెం దూరంగా గుడారాలు వేశారు.
ప్రభుత్వ వాహనాలు వస్తూపోతున్నాయి.
అంత హంగామా ఎందుకు చేస్తున్నట్టు? రాత్రికిరాత్రి రహస్యంగా అన్ని గుడారాలువేసి, ప్రభుత్వ యంత్రాంగాన్నంతా అక్కడికి ఎందుకు తరలించినట్టు?
అంతా గోప్యంగా వుంది!
ఇంతకూ విషయం ఏమిటంటే-
అక్కడి అడవి భూముల్లో విలువైన ఖనిజ సంపద వుంది. బాక్సైట్ నిధులున్నాయి.
అంతర్జాతీయ మార్కెట్టులో భారీ ధర పలికే అక్కడి ఖనిజ సంపద మీద బహుళ జాతి కంపెనీలు కనే్నశాయి.
అడవి భూముల్ని తవ్వి ఖనిజాలను వెలికితీసి మార్కెట్టుకు తరలించేందుకు అనుమతికోరి, అనుకున్నది సాధించాయా బహుళజాతి కంపెనీలు.
ప్రభుత్వం తలవంచింది వాళ్ళముందు!
నిజానికి, ఖనిజ సంపదకోసం అడవి భూముల్ని తవ్వితే పచ్చదనాల అడవి మరు భూమిగా మారిపోతుంది. అడవిని ఆశ్రయించి బ్రతుకుతున్న అడవి పుత్రులు తండాలుగా ఖాళీచేసి నిర్వాసితులౌతారు బ్రతుకుతెరువు కోల్పోతారు.
బహుళజాతి కంపెనీల పాలై, ధ్వంసమయ్యే అడవిలో క్రూర మృగాలక్కూడా స్థానం మిగలదు. నివాసం కోల్పోయే ఆ మృగాలు నిజారణ్యం వొదిలిపెట్టి జనారణ్యాల్లోకి తరలివస్తాయి!
తరతరాలుగా అక్కడే నివాసం ఉంటున్న అడవి పుత్రులు తండాలు ఖాళీచేసి వెళ్ళేందుకు ఒప్పుకోరు. బలవంతంగా పంపించటం అంత తేలిక పనికాదు.
సాంప్రదాయాక ఆయుధాలతోనే దీర్ఘకాలిక పోరాటాలకైనా సిద్ధపడతారు తప్ప, ప్రభుత్వానికి తలవంచరు!
అందుకే...
శాంతిభద్రతల పరిస్థితి తలెత్తకుండా అడవి పుత్రుల్ని లాలించి బుజ్జగించి, శాంతియుతంగా తండాలు ఖాళీచేయించటం ఎలా? బహుళజాతి కంపెనీలకు ప్రయోజనపడేదెలా? అన్న.
రెండేరెండు అజెండా అంశాలతో కమిటీ వేసింది.
రాజకీయ మేధావులు; క్లిష్ట సమయాల్లో కిటుకులు చెప్పి ప్రభుత్వాన్ని గట్టెక్కించే సలహాదార్లు: రాజకీయ వ్యూహ రచనా దురంధరులనూ సదరు కమిటీల్లో సభ్యులుగా వేసి, వాళ్ళందర్నీ ఒకచోట చేర్చి, సుదీర్ఘంగా చర్చించి-
ఓ నిర్ణయానికొచ్చింది ప్రభుత్వం!
‘‘అడవుల్ని భోంచేస్తాం- అడ్డుతొలగండి’’అన్నట్టు ఉండకూడదు ప్రభుత్వ వైఖరి!
లౌక్యంతో అనుకున్నది సాధించాలి!
డచ్చివాళ్ళూ ఫ్రెంచివాళ్ళూ ఈస్టిండియా కంపెనీ వాళ్ళూ- రాజ్యాధికారం కావాలని ముందుగా అడగలేదు.
వ్యాపారం పేరుతో భారతదేశంలో చోటు పొంది, అటు తర్వాత రాజ్యాధికారం స్థాపించినట్టే,
ప్రభుత్వం కూడా ముందుగా ఖనిజ సంపద విషయం చెప్పకూడదు. ‘‘పులుల రక్షిత ప్రాంతం’’, ‘‘జింకల రక్షిత ప్రాంతం’’అంటూ అడవుల్లో కంచెలువేసి కాపలాపెట్టినట్టే ‘‘కలివికోడి రక్షిత ప్రాంతం’’ ఏర్పాటుచెయ్యాలి.
ఇప్పుడు వార్తల్లో వున్నది కలివికోడి. గొప్ప జాతి కోడి.
అరుదైన కోడి. ఆంధ్ర దేశానికి గర్వకారణమైన కోడి.
దానికి అడవిలో రక్షణ కల్పించాలంటే ఎవ్వరూ కాదనరు.
పైగా, సంతోషిస్తారు సహకరిస్తారు.
అది జీవకారుణ్యం!
అంచేత-
నల్లకొండ , నెమలిగుట్ట, నీటి కొలను, రెడ్డియానాయక్, తండాలను ఓ వృత్తంలోకి తెచ్చి,- వృత్తం చుట్టూ బలమైన యినుప కంచె వెయ్యాలి. దాన్ని ‘కలివికోడి ప్రాజెక్టు’ అనాలి.
నిషిద్ధ ప్రాంతంగా ప్రకటించి సాయుధ పోలీసుల కాపలాపెట్టి, అడవి పుత్రుల్ని దాపుల్లో ఉండకండా చెయ్యాలి.
భూగర్భ ఖనిజాల త్రవ్వకం విషయం తెలియని అడవి పుత్రులు కలివికోడి రక్షిత ప్రాంత నిర్మాణాన్ని అడ్డుకోరు!
ప్రభుత్వంనుంచి రహస్య ఆదేశాలు అందిన వెంటనే యంత్రాంగం అంతా కదిలింది.
రాత్రికిరాత్రి నల్లకొండ దగ్గర గుడారాలు నిర్మించి వాటిల్లో మకాం పెట్టారందరూ.
కీ.శే.పెద్దిరెడ్డి కొడుకు ఎమ్మెల్యే పెంటారెడ్డి, పక్షి జాతులమీద పరిశోధనలు చేసి పట్టా పుచ్చుకున్న డాక్టర్ గరుడాచలం కూడా ఆగమేఘాల మీద వచ్చి గుడారాల్లో కుదురుకున్నారు.
* * *
కొండదేవర జాతరప్పుడు తప్ప ఎప్పుడూ చాలా ప్రశాంతంగా, ముని పర్ణశాలకుమల్లే శాంత గంభీరంగావుండే వాతావరణం పూర్తిగా మారిపోయింది!
నల్లకొండ దగ్గర నాగరికుల సంచారం, ప్రభుత్వ వాహనాల కదలికలు, సాయుధ పోలీసుల విన్యాసాలూ...
అవ్వి-
(ఇంకా ఉంది)

-గోపరాజు నాగేశ్వరరావు