డైలీ సీరియల్

పరశురామోపాఖ్యానం-99

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అతనికి భయంకరుడైన పుత్రుడు కలిగాడు. అతను ధనుర్విద్యాపాంరగతుడు, సకల విద్యలూ నేర్చినవాడు. అగ్నిలాగ ప్రకాశించాడు, అతడు క్షత్రియులందరినీ సంహరించాడు. అతనే జగద్విఖ్యాతి చెందిన పరశురాముడు. అతను గంధమాదన పర్వతం మీద తపస్సు చేసి శంకరుని అనుగ్రహం పొంది దివ్యాస్త్రాలు, తేజస్సుతో ఉన్న పరశువును పొందాడు. ఆ పరశువు గొప్ప శక్తికలది. దానితో అతను లోకాల్లో సాటిలేని వాడుగా యశస్వి అయినాడు.
ఆ కాలంలోనే హైహయ వంశపురాజు అర్జునుడు అనే వాడు ఉండేవాడు అతను గొప్ప బలవంతుడు. అతనికి దత్తాత్రేయుని అనుగ్రహం వలన వెయ్యి చేతులు కలిగాయి. బలంతో కూడిన వేయి చేతులు వచ్చేసరికి ఆ రాజు తన బాహుబలంతో అస్తబ్రలంతో ఈ సప్తద్వీపాలను జయించాడు. అతడు వీరుడే కాదు గొప్ప ధర్మవేత్త కూడా.
అశ్వమేధయాగం చేసి తను జయించిన ఈ భూమినంతా బ్రాహ్మణులకు దానం చేశాడు. అతను నగరాలను, రాష్ట్రాలను, పల్లెలను భిక్ష యిచ్చాడు. అతని బాణాలనించి అగ్నిహోత్రుడు ఉద్భవించి చెట్లనూ అరణ్యాలనూ దహించాడు. గాలి హైహయునితో కలిసి విజృంభించి వసిష్ఠుని ఆశ్రమాన్ని దహించాడు. అప్పుడు వసిష్ఠుడు ఆగ్రహించి అర్జునుని శపించాడు. అతను అర్జునునితో ఇలా అన్నాడు ‘‘అర్జునా! నా వనాన్ని, ఆశ్రమాన్ని పూర్తిగా దహించావు. కనుక యుద్ధంలో పరశురాముడు నీ సహస్ర బాహువులను ఖండిస్తాడు’’.
కాని అర్జునుడు మహా బలవంతుడు నిత్యం శమపరుడై ఉంటాడు. అతను మహా వీరుడు కనుక వసిష్ఠుని శాపం గురించి ఆలోచించలేదు కాని బలవంతులైన అతని పుత్రులు అతని మరణానికి కారకులయ్యారు. వారు మొదట క్రూర స్వభావం కలిగిన వారు. ఈ శాప కారణంగా ఇంకా క్రూరులుగా మారారు. వారు వచ్చి జమదగ్నిమహర్షి యజ్ఞపశువును లాక్కు పోయారు.
వారి తండ్రికి ఈ విషయం తెలియదు. ఈ కారణంగా పరశురామునితో యుద్ధం జరిగింది. ఆగ్రహంతో ఉన్న పరశురాముడు అర్జునుని చేతులు నరికి దూడను తీసుకొని ఆశ్రమానికి వెళ్ళిపోయాడు.
మూర్ఖులైన అర్జునుని కుమారులు జమదగ్ని మహర్షి ఆశ్రమానికి వెళ్ళారు. ఆసమయంలో పర శు రాముడు సమిధల కోసం అరణ్యంలోకి వెళ్ళారు. అర్జనపుత్రులు జమదగ్ని మహర్షి శిరస్సును శరీరం నుండి వేరుచేసి నరికి వేశారు. ఆశ్రమానికి తిరిగి వచ్చిన రాముడు ఈ విషయం తెలిసికొని భూమీద క్షత్రియకులం లేకుండా చేస్తాను’’ అని ఘోర ప్రతిజ్ఞ చేశాడు. అలా శపధం పూని అతను పరశువును, అస్త్రాన్ని చేపట్టాడు. అతను మొదట కార్తవీర్యుని పుత్రులనూ, మనుమలనూ సంహరించాడు. తర్వాత హైహయ రాజులందరినీ చంపి భూమిని రక్తంతో నింపాడు. అతను భూమీద క్షత్రియులు లేకుండా చేసి, తపస్సుకోసం వనానికి వెళ్ళిపోయాడు. కొన్ని వేల సంవత్సరాల తర్వాత అతన్ని అశక్తుడని ప్రజలు నిందించారు. విశ్వామిత్రుని మనుమడు అయిన మహా తపస్వి పరావసువు రాముని అందరి సమక్షంలో నిందిస్తూ ఇలా అన్నాడు.
‘‘రామా! యయాతి మహారాజు పడినప్పుడు వచ్చిన ప్రతర్దనుడు మొదలైన క్షత్రియులు కారా? నీ ప్రతిజ్ఞ పోయింది. ఇంకా నీవు వీరులకు భయపడి నీవు కొండలలో దాక్కున్నావు. ఇప్పుడు ఈ భూమి నిండా క్షత్రియరాజులు ఉన్నారు’’. అతని మాటలు విని
పరశురాముడు కోపంతో మళ్ళీ అస్త్రం చేపట్టాడు.
పూర్వం అతను జాలిదలచి విడిచి పెట్టిన రాజకుమారులు పెరిగి పెద్దవారై బలవంతులుగా తయారయ్యారు. అతను వారందరిపై దండెత్తి చిన్న బాలురతో సహా అందరినీ వధించాడు. కాని గర్భంలో ఉన్న వారిని చంపలేదు. ఆవిధంగా వారు బ్రతికి పోయారు. వారి వలన క్షత్రియకులం మరల వృద్ధి చెందినది.
అప్పుడు పరశురాముడు ఆగ్రహంతో పుట్టిన వాళ్ళని పుట్టినట్లుగా చంపివేశాడు. కాని కొంతమంది క్షత్రియ స్తల్రు పారిపోయి తమ సంతానాన్ని కాపాడుకున్నారు. అనంతరం అతను అశ్వమేధయాగం చేసి ఈ భూమినంతా కశ్యప మహర్షికి దానంగా ఇచ్చేశాడు.
కశ్యపుడు మిగిలిన కొంతమంది క్షత్రియులనైనా రక్షించాలని ‘‘నాకు దానం చేశావు. కనుక నీవు ఇక్కడ ఉండరాదు దక్షిణసముద్ర తీరానికి వెళ్ళు’’ అన్నాడు. అప్పుడు సముద్రుడు రాముని కోసం శూర్పారక దేశాన్ని నిర్మించాడు. దానినే అపరాంత భూమి అని కూడా అంటారు. కశ్యపమహర్షి తను దానం పట్టినంత భూమినంతటినీ బ్రాహ్మణుల కిచ్చి తాను తపస్సు కోసం అడవికి వెళ్ళిపోయాడు.
తరువాత ఇతర రెండు కులాలు అయిన శూద్రులు, వైశయులూ ఇష్టం వచ్చిన విధంగా విప్రుల భార్యలతో ఇష్టానుసారంగా ప్రవర్తించ సాగారు. లోకం అంతా అరాజకమయిపోయింది. బలవంతులు బలహీనులని పీడించి బాధించ సాగారు. ఇలా పీడించబడుతూ అందరి ధర్మాన్ని రక్షింప వలసిన క్షత్రియుల రక్షణ లేక భూమి క్రుంగిపోయింది అలా క్రుంగిపోయిన భూమిని చూసి దయతో కశ్యపుడు భూమిని తన తొడ మీద ధరించాడు. అతను ఊరువు మీద నిలిపాడు కనుక భూమికి ‘‘ఉర్వి’’ అన్ని పేరు వచ్చింది.
అప్పుడు ఆ భూమి కశ్యపుని, తనను రక్షించడానికి రాజు నిమ్మని కోరింది. ఆమె కశ్యపునితో ఇలా అంది ‘‘బ్రాహ్మణా, హైహయ వంశంలో పుట్టిన క్షత్రియ బాలురను నేను స్తల్రతో దాచాను. వారు నన్ను రక్షిస్తారు. విదూరధుని పుత్రుడు పౌరవుని జ్ఞాతి ఒకడు జీవించి ఉన్నాడు. అతన్ని ఋక్షపర్వతం మీద ఎలుగుబంట్లు రక్షించాయి, అదే విధంగా యజ్వ అయిన పరాశరుడు దయతో సౌదాసుని జ్ఞాతిని రక్షించాడు. ఆ ద్విజుడు పరాశరునికి సూత్రునిలాగ అన్ని పనులు చేసి పెట్టడం వలన అతనికి సర్వకర్ముడని పేరు వచ్చింది.
అదే విధంగా శిబిపుత్రుడు. గొప్ప తేజస్వి అయినా ఆవు దూడలతో కలసి గోశాలలో జీవించాడు. అతనిపేరు గోపతి. అతను నన్ను రక్షించగలడు. ప్రతర్ధనుని పుత్రుడు వత్సుడు ఉన్నాడు. అతను కూడా ఆవు దూడలతో కలసి పెరిగాడు.
అతను నన్ను పరిపాలించగలడు. ఇంకా దధివాహనుని పౌత్రుడు కలడు అతన్ని గంగా తీరంలో గౌతముడు రహస్యంగా రక్షించాడు. ఇంకా గొప్పబలం కల కుమారులు మరుత్తుని వంశం వారు ఉన్నారు. ఈ క్షత్రియ బాలకులంతా శిల్పకారుల, చిత్రకారుల ఆశ్రయంలో ఉన్నారు. వీరందరూ నన్ను రక్షిస్తే నేను సుఖంగా ఉంటాను. వీరి తండ్రులూ తాతలూ నాకోసమే యుద్ధంలో పరశురాముని చేత సంహరింపబడ్డారు. నేను వారి ఋణం తీర్చుకోవాలి. నేను ధర్మాన్ని అతిక్రమించిన వారి రక్షణ కోరటంలేదు. ధర్మాచరణ చేసిన వారినే రక్షించమంటున్నాను’’. అప్పుడు కశ్యపుడు భూదేవి చెప్పిన వారి నందరినీ తీసుకొని వచ్చి వారిని వివిధ రాజ్యాలకు రాజులుగా అభిషేకించాడు. వారి తర్వాత వారి పుత్రులు పౌత్రులూ క్రమంగా రాజులై దేశాలని పరిపాలించారు.
-ఇంకావుంది

డాక్టర్ ముదిగొండ ఉమాదేవి