డైలీ సీరియల్

మహాభారతంలో ఉపాఖ్యానాలు -101

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పూర్వం పురిక అనే నగరానిని పీఠకుడనే రాజు పరిపాలించేవాడు. అతను చాలా దురాత్ముడు. క్రూర స్వభావం కలవాడు. ఇతరులను హింసించి ఆనందించేవాడు. కొంతకాలానికి అతనికి ఆయువు తీరి పోయింది. తాను చేసిన క్రూర కర్మల ఫలితంగా ఆరాజు నక్కగా జన్మించాడు. కాని అతనికి తన పూర్వ జన్మ వైభవం గుర్తుండి పోయింది. దాన్ని స్మరిస్తూ పరమ దుఃఖాన్ని పొందాడు. ఎవరైనా మాంసాన్ని తెచ్చి ఇచ్చినా తినలేదు. సకల ప్రాణులను హింసించడం మానివేశాడు. సత్య భాషణవ్రతాన్ని నియమంగా కొన సాగించాడు. చెట్ల మీది నుండి రాలిన పళ్లనే ఆహారంగా తీసుకునేవాడు. కొన్ని సార్లు ఆకులు ఆహారంగా తీసుకొని, మరికొన్ని మార్లు కేవలం నీరు మాత్రమే ఆహారంగా స్వీకరించే వాడు.
అతని నివాసం కూడా శ్మశానంలోనే ఉండేది. అదే దాని జన్మభూమి అయింది. దాని సదాచారాలను ఇష్టపడని తక్కిన నక్కలు దాని చేత ఈ నియమాలను మాన్పించాలని తలిచాయి. అవి ఎంతో నమ్రతగా దాని దగ్గరికి వచ్చి ఇలా అన్నాయి ‘‘నీవు మాంసాహారివై ఉండి కూడా ఈ శ్మశానంలో పవిత్రంగా జీవించాలనుకుంటున్నావు. ఇది నీ జన్మకు తగిన పద్ధతి కాదు. కనుక నీవు కూడా మాలాగే జీవించు. మేము నీకు భోజనం తెచ్చి పెడ్తాము దాన్ని తిను. నీ ఈ ఆచారాలను వదిలిపెట్టు. నీజాతికి ఏది ఆహారమో దానే్న స్వీకరించు’’
వాటి మాటలు విన్న ఆ నక్క యుక్తిగా వివరంగా, మృదువుగా వాటితో ఇలా అన్నది. ‘‘నాపుట్టుకయే విచిత్రమైనది. సదాచారాలవల్లనే కులానికి పేరు వస్తుంది. కులం యొక్క కీర్తి ప్రతిష్ఠలు పెంపొందే కర్మలను చేయాలని నిశ్చయించుకున్నాను. ఇక శ్మశానం నివాసం గురించి చెప్తాను వినండి. ఆత్మయే అన్ని కర్మలను చేయిస్తుంది. కాని ఆవాసం కాదు. ఆశ్రమంలో ఉంటూ ద్విజుని చంపితే అది పాపం కాకుండా పోతుందా? ఆశ్రమం కాని చోట గోవుదానం చేస్తే అది పుణ్యం అవదా? మీ అందరికీ తిండి మీదే ఆసక్తి, మీ జీవిక అవిశ్వాసంతో ఉంది. నింద్యమైనది. ధర్మానికి హాని కలిగిస్తుంది. కనుక దూషిత మైనది. ఇహపర లోకాలకు హాని చేస్తుంది. కనుక నాకిది నచ్చలేదు’’ నక్కమాటలు విన్న ఒక పులి దానిని సదాచారవంతునిగా, పండి తునిగా భావించి నక్కను పూజించి, తన మంత్రిగా నియమించాలని తలచింది. శార్దూలం నక్కతో ఇలా అంది -
‘‘మీ గురించి నాకు అంతా తెలిసింది. కనుక మీరు నాతో పాటు జీవించండి. మీకిష్టమైన భోగాలను అనుభవించవచ్చును. ఇష్టం లేనివి విడిచిపెట్టవచ్చును. మేము క్రూరులం అని ప్రసిద్ధి చెందాము. మాతో మృదువుగా ఉంటే నీకేలాభం’’.
శార్దూలం మాటలు విన్న గోమాయువు వినయంగా ఇలా అంది- ‘‘మృగరాజా! మీరు చెప్పిన విషయం చాలా బాగుంది. ధర్మార్థాలను తెలిసిన వారిని మీకు సహాయకులుగా బతకటం చాలా మంచి విషయం. ఎందుకంటే మంచి మంత్రులు లేకపోతే రాజ్యాన్ని పాలించడం చాలకష్టం. దుష్టమంత్రి కూడా రాజ్యానికి నష్టమే కలిగిస్తాడు. కనుక మీలాంటి ప్రభువులు మీ పట్ల భక్తి ఉన్నావారిని, నీతిజ్ఞులను, సద్భావ సంపన్నులను, స్వామి కార్యతత్పరులను, లోభరహితులను సహాయకులుగా నియమించు కొని, వారిని గౌరవించాలి. మృగరాజా! నాకు భోగాల మీద ఆసక్తి లేదు. మీసేవకుల తత్త్వంతో నా తత్త్వం పడదు. వారు నన్నూ మిమ్మల్ని విడదీస్తారు. మీరు ఎంతో మందికి ఆశ్రయం కల్పించారు. నేను స్వేచ్ఛగా అడవిలో తిరిగేవాడిని. రాజాశ్రయంలో ఉన్నవారికి రాజుకు సంబంధిం చిన దోషాలన్నీ అంటుతాయి. అడవిలో తిరిగి కందమూలాలు తినేవారికి ఆ భయం ఉండదు. ఎక్కడ చూసినా సమృద్ధిగా జలం, ఫలాలిచ్చే వృక్షాలు ఉంటాయి. ఇదే నాకు సుఖమైన జీవితం’’.
నక్క ఇంకా ఇలా అన్నది-‘‘ మృగ రాజా! నేను నీ సేవ చేయాలంటే ఒక నియమం ఉంది. నీవు నా వారిని గౌరవించాలి. నా జీవికకు నీవు కల్పించే వ్యవస్థ నీదగ్గరే ఉండాలి. నీ ఇతర మంత్రులతో కలిసి నేను ఎన్నడూ మంత్రాంగం చేయను. ఎందుకంటే వారు నాపై కొండెములు చెప్తారు. ఏకాంతంగా నేను ఒంటరిగా మీకు హితవచనాలు చెప్తాను. నీ జ్ఞాతులకు సంబంధించిన విషయాలలో నన్ను సలహా అడగవద్దు’’.
మృగరాజు ‘‘అలాగే చేస్తాను’’ అని చెప్పి నక్కను మంత్రిగా నియమించాడు. నక్క, రాజుకు మంచి సలహాలు చెప్పి మంచి పనులు చేయించుతూ ఉంటే తక్కిన సేవకులు అతన్ని ద్వేషించసాగారు. పూర్వం వారు కొద్ది కొద్దిగా ధనం అపహరిస్తూ ఉంటే వారు. ఇప్పుడు నక్క కట్టడి చేయడంతో వారు అలా ధనం అపహరించలేకపోయారు. వారు అనేక విధాలుగా గోమాయువు యొక్క నాశనాన్ని కోరుకున్నారు. అతన్ని అనేక విధాలుగా ప్రలోభపెట్టడానికి ప్రయత్నించ సాగారు. ధనం చేత ప్రలోభపెట్టారు. కాని నక్కవాటికి లొంగలేదు. అప్పుడు వారంతా కలిసి దాని వినాశనానికి ప్రయత్నాలు మొదలుపెట్టారు. వారంతా మృగేంద్రుని కోసం వండిన మాంసాన్ని తీసి గోమాయువు నివాసంలో పెట్టారు. గోమాయువుకు ఈ పని ఎవరు చేశారో ఎందుకు చేశారో తెలుసు, కాని వౌనంగా ఉండిపోయింది. మంత్రి కాక ముందు అతను వ్యాఘ్రంతో అన్నాడు. ‘‘రాజా నాతో మైత్రిని కోరుకుంటే నన్ను చంపకూడదు’’ అని.
తరువాత ఆకలితో మృగేంద్రుడు లేచి ఆహారం కోసం చూడగా అక్కడి మాంసం కన్పడలేదు. ఆ పని చేసిన సేవకులే రాజుతో ఆ మాంసాన్ని గోమాయువు తీశాడని చెప్పారు. గోమాయువు తన కోసం వండిన మాంసాన్ని తిన్నాడు అని విన్న శార్దూలానికి ఆగ్రహం వచ్చింది. వెంటనే దాన్ని చంపాలనుకుంది. రాజులోని ఈ ఆలోచన గ్రహించిన పూర్వపు మంత్రులు గోమాయువుపై ఇంకా చాడీలు చెప్పసాగారు. వారు రాజుతో ఇలా అన్నారు.
‘‘మహారాజా! అతను ఈ పని చేసాడు అంటే ఇంకేదైనా చేయగలడు. మీరు అతని గురించి విన్నది సత్యం కాదు. అతను మాటలలో ధర్మిష్ఠుడు స్వభావంలో క్రూరుడు. అతను తన తిండి కోసం పాటుపడుతున్నాడు. కావాలంటే చూడండి. అని పలికి రాజుకి గోమాయువు ఇంట్లో తాము పెట్టిన మాంసాన్ని చూపించారు. వారి మాటలు విన్న వ్యాష్రుం నక్కను వధించమని ఆజ్ఞాపించింది. అప్పుడు శార్దూలం మాటలు విన్న దాని తల్లి వచ్చి కుమారునితో ఇట్లా అన్నది. ‘‘కుమారా! ఇందులో ఏదో కపట ప్రయత్నం కలిసి ఉంది. కనుక నీవు దీనిని పట్టించుకోకు. కపట మనస్సు కలవారు నిర్దోషులను దోషులుగా చూపిస్తారు. ఇంకొకరి ఔన్నత్యాన్ని సహించలేని వారు ఇటువంటి పనులు చేస్తారు. ఈర్ష్యయే వైరానికి కారణమై పని చేస్తుంది.
అరణ్యంలో తపస్సు చేసుకునే మునులకు కూడా మిత్రులు, ఉదాసీనులు, శత్రువులు అనే మూడు పక్షాలు ఉంటాయి. లోభులకు ఉదారులందు, పిరికి వారికి వీరులందు, దరిద్రులకు ధనవంతులందు సహజంగా ద్వేషం ఉంటుంది. నీయింటి నుండి మాంసం అపహరించబడినప్పటికీ, అతడు మాంసాన్ని తాకనైనా తాకడు. కనుక బాగా ఆలోచించి ఏపనైనా చేయి.
-ఇంకావుంది

డాక్టర్ ముదిగొండ ఉమాదేవి