డైలీ సీరియల్

అనంతం-42

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘కొండ దేవరయి సావీ’’ అన్నాడు బాణావతు.
ఇక వాళ్ళ వైపు చూళ్ళేదు పూనకం దేవర!
ఆవేశంతో రొప్పుతూ, గాల్లోకి ఎగిరెగిరిపడుతూ.. మధ్యలో పిల్లిమొగ్గలు వేస్తూ, పరిసరాలు ప్రతిధ్వనించేలా అరుస్తూ, పరాకాష్టకు చేరిన పూనకంతో పెద్ద పెద్దగా రంకెలు వేస్తున్నాడు!
‘‘యావయ్యిందంటే సెప్పవేటి దేవరా’’ బాణావతు అడిగాడు.
‘‘తండాలో అగ్గిబుట్టాలా. గుడ్సెలు గాలి మంటలెగవాల.. శివరేత్తిరి కల్లా సిచ్చుబడుద్ది.. సంకురేత్తిరికల్లా కలాస్ గావాల’’
‘‘అంత కోపవేంటికి దేవరా.. సెప్పవేటి’’ కాళీచరణ్ అడిగాడు.
‘‘సెప్పాల్నంటారా.. కాలీశరన్‌గా! మీ గుడ్సెలు గాలాల..’’
‘‘కాళీశన్నని నీకు తెల్సాసావీ’’ ఆశ్చర్యంగా అడిగాడు కాళీచరణ్.
‘‘నాకు తెలవందేవుందిరా.. రాగ్యాగాడి అయ్యా’’
‘‘అబ్బో.. అది గూడా తెల్సా సావీ’’
‘‘జరిగింది దెల్సు.. జరుగుతుండది తెల్సు.. జరిగేది దెల్సు..’’
‘‘నువ్వు మా దేవరవే.. సావీ’’ అన్నాడు కాళీచరణ్.
అక్కడే వున్న రాగ్యా ముసి ముసి నవ్వులు నవ్వుతూ పూనకం దేవరని చూసి రహస్యంగా కన్నుగీటాడు!
అడవి పుత్రులు భయభక్తులతో పొర్లు దణ్ణాలు పెడుతున్నారు!
కాళీచరణ్ అంతటితో ఆగలేదు.
మరిన్ని వివరాలకోసం పూనకం దేవరని కదిలించి-
‘‘సావీ! నా కొడుకు ఎసువంటోడూ’’ అని అడిగాడు.
రాగ్యా ఉలిక్కిపడ్డాడు! దేవర్ని చూస్తూ మళ్లీ కన్నుగీటాడు!
‘‘ఎవురూ.. రాగ్యా గాడా’’ అడిగాడు దేవర.
‘‘ఆడే సావీ.. ఆడే’’
‘‘శబ్బర్నాకొడుకు.. బిత్తర్నాకొడుకు.. శాకిరి జెయ్యని శండాలపు నాకొడుకు.. అయ్యనే గాదన్న ఆడార్నాకొడుకు’’
రాగ్యా బిత్తరపోతూ దేవర వైపు చూశాడు!
గరుడాచలం కానిస్టేబుల్ కనకయ్యకి అంత ట్రైనింగిచ్చి పంపిస్తే అలా అంటాడేమిటి కనకయ్య?
ఒకవేళ రహస్యంగా తాగిన మందు నిషా తలకెక్కి, చెప్పిందంతా మర్చేపోయాడా?
ఆందోళనగా దేవర వైపు చూశాడు రాగ్యా!
మళ్లీ మళ్లీ కన్ను గీటుతూ నిల్చున్నాడు.
‘‘సత్తెవ్ జెప్పినావు సావీ’’ అన్నాడు బాణావతు.
‘‘రాగ్యాగాడి యిసయవ్లో నీదంతా కరెట్టేగానీ, సావీ, ఏంటికొచ్చింది నీకంత కోపవ్’’ అని కాళీచరణ్ అడిగాడు.
‘‘అది గూడా నేనే సెప్పాల్నంటరా.. సవట యదవల్లార! దేవరకేటిగావాల్నో గమనిచ్చాలి. అడిగిందియ్యాలి. ఇయ్యకపోతే తాండాలో అగ్గిబుట్టుది..’
‘‘రెచ్చిచ్చే దేవరకే అంత కోపఁవైతే ఎట్టా సాఁవీ’’అన్నాడు నగ్గూరాం.
బాణావతు దేవర దగ్గరికి వెళ్ళాడు.
‘‘మేఁవేం అపశారఁవ్ జేశాఁవూ’’ అని అడిగాడు.
‘‘బలులిత్తాఁవు..నైవీజ్జిగఁవెడతాఁవు... ఒగ్గెయ్యి సాఁవీ’’అని కాళీచరణ్ బ్రతిమాలాడు.
లాభం లేదు.
దేవర అంతకంతకూ రెచ్చిపోతున్నాడు!
ప్రత్తికాయల్లాంటి మిడిగుడ్లతో ఉరిమిచూస్తూ-
‘‘ఎవుడిగ్గావాల మీ కొలుపులు... ఎవడిగ్గావాల మీ జాతర్లు.. ఎవుడిగ్గావాల మీ బలులు...ఎవుడిగ్గావాల మీ బలెన్నఁవ్? దేవర్ని.. కొండ దేవర్ని!
నాగ్గావాల్నంటే పులులొచ్చి పోతుల్ని బలిత్తయ్యి.. సింహ్హలొచ్చి బలెన్నఁవ్ బెడతయ్యి... ఏనుగులొచ్చి తానఁవ్ సేపిత్తయ్యి...
ఎలిపోండెల్లిపోండి!
బాజాలొద్దు తప్పెట్లొద్దు తాళాలొద్దు జాతర్లొద్దు.
ఎలిపోండెల్లిపోండి.. అడివి యిడ్సిపెట్టి ఎల్లిపోండి’’అన్నాడు దేవర.
ఇంకా కోపం తగ్గనట్టుంది!
మెడలోవున్న పూలదండని ముక్కలుగా తెంపేశాడు..
పూసల దండల్ని తీసి జనంలోకి విసిరేశాడు..గెంతులు వెయ్యటం ప్రారంభించాడు.
అప్పుడు మళ్ళీ కల్పించుకొని-
‘‘ఏంజేస్తే నీ కోపఁవ్ సల్లారుద్దో సెప్పు సాఁవీ’’అన్నాడు బాణావతు.
‘‘శాత్తావా’’ పేవర అడిగాడు.
‘‘నీ సాచ్చిగా..’’
‘‘సెప్పినాక సెయ్యకపోతే రగతఁవ్ గక్కుతావు.’’
‘‘అట్టాగే సాఁవీ! అడుగు.. ఏం గావాల్నో.’’
‘‘ఏం రా.. కాలీశరన్‌గా?’’
‘‘పూసీనాది’’అన్నాడు కాళీచరణ్.
‘‘నువ్వురా... నగ్గూరాంగా..’’
‘‘నువ్వెట్టంటే అట్టాగే సాఁవీ’’
‘‘సెప్పేదా.’’
‘‘సెప్పుసాఁవీ.. సెప్పు.’’
రాగ్యా ఆసక్తిగా దేవర వైపే కళ్ళార్పకుండా చూస్తున్నాడు!
‘‘రెడ్డియానాయక్ తాండాగదూ- మీది’’
‘‘అవున్సాఁవీ.’’
‘‘మీ తాండాలో వుండ ఒక కనె్నపిల్లని నాకియ్యాల.’’
‘‘బలియ్యాల్నా సాఁవీ?’’ బాణావతు అడిగాడు.
‘‘కాదు.’’
‘‘మరేంటిది?’’
‘‘జోగిన్ని సెయ్యాల’’ అన్నాడు దేవర.
వాళ్ళంతా రాతిబొమ్మలే అయ్యారు!
‘‘జోగిన్నా...’’అన్నారు, క్షణం తర్వాత తేరికొంటూ..
దేవరకి మళ్ళీ కోపం వొచ్చింది!
‘‘సెయ్యరా? సెయ్యనంటే మీ తాండాలో అగ్గి బుట్టుద్ది..’’
‘‘శాత్తాఁవు సాఁవీ...శాత్తాఁవు’’అన్నారు భయంభయంగా.
‘‘అప్పుడే ఆగ్గరఁవ్ సల్లారుద్ది.. కోపఁవ్ సిటికెలో ఎగిరిపోయిద్ది.. మిమ్మల్ని సల్లంగా సూత్తాన్రొరే.. బాణావతుగా’’ అన్నాడు దేవర.
వాళ్ళు కొంచెం ఆలోచనలో పడ్డారు!
‘‘మా తాండా పిల్లే గావాల్నా సాఁవీ’’అని నగ్గూరాం అడిగాడు.
‘‘మీ తాండా పిల్లే.’’
‘‘కనె్న పిల్లలు శానాఁవందుండారు... ఎవుర్ని సెయ్యాలి’’
‘‘సక్కదనాల పిల్ల.’’
‘‘మా తాండాలో అందరూ అసుఁవంటోళ్ళే సాఁవీ.’’
‘‘సంపంగి పువ్వసుఁవంటి అందఁవైన పిల్ల.’’
‘‘అందరూ అసుఁవంటోళ్ళే సాఁవీ’’ అన్నాడు నగ్గూరాం.
దేవరకి ఏం చెప్పాలో అర్ధంకాలేదు!
(ఇంకా ఉంది)

-గోపరాజు నాగేశ్వరరావు