డైలీ సీరియల్

ఒయాసిస్..13

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘దీప్తి.. మీ వయసు?’’
‘‘ట్వంటీఫైవ్’’’
‘‘కరెక్ట్.. అడ్రెస్..’’’
‘‘హౌస్ నెంబర్ టెన్ డాష్ ట్వంటీ త్రీ, కమలానగర్..’’
‘‘కరెక్ట్..’’’
‘‘మీరేం చేస్తుంటారు?’’
‘‘అకౌంట్స్ సెక్షన్, బాలాజీ ఇంజనీరింగ్ కాలేజ్..’’
‘‘కరెక్ట్.. అన్నీ టాలీ అయ్యాయి.. వన్స్ ఎగైన్ కంగ్రాట్స్.. రెండు రోజుల్లో మీకు కన్‌ఫర్మేషన్ లెటర్ పంపిస్తాం.. అప్పుడు మిమ్మల్ని కాంటాక్ట్ చేసి మీ ఆప్షన్ చెప్పచ్చు.. థాంక్యూ..’’ అని డిస్‌కనెక్ట్ చేశాడు రణధీర్.
ఒక చిన్న ఆశపెట్టి మనిషి గుట్టు అంతా ఎలా రాబట్టవచ్చో మనిషి బలహీనతను ఎంత తెలివిగా వాడుకోవచ్చో ఇటీవలి కాలంలో చాలామంది చేసి చూపిస్తున్నారు.
ఆ అమ్మాయి వివరాలు రాబట్టటానికి రణధీర్ అదే బాణం వేశాడు. దాన్ని బట్టి ఆమె విషయాలు కొన్ని తెలిసాయి.
గీత అనేది ఆ అమ్మాయి అసలు పేరు కాదు. అక్కడ దొంగ పేరు చెప్పి, తన పబ్బం గడుపుకుని ఉంటుంది. దీప్తి ఇంజనీరింగ్ కాలేజీలో అకౌంట్స్ సెక్షన్‌లో పనిచేస్తోంది.
ఈ మాత్రం తెలిస్తే చాలు.. కానీ ఈ అమ్మాయి చాలా తెలివిగలది. ఇలాంటివాళ్లనంచి తిన్నగా అడిగితే ఏ సమాధానం రాదు. నర్సింగ్ హోంలోకి మారు పేరుతో వెళ్లటం బట్టి, మనిషికి గుట్టు ఎక్కువ అని అర్థమవుతోంది.
ఇలాంటివాళ్లని డీల్ చెయ్యాలంటే ఏదో ఆశ చూపి గాలం వెయ్యాల్సిందే.. అని నిర్ణయించుకున్నాడు రణధీర్.
రణధీర్ శంభుప్రసాద్‌కి ఫోన్ చేశాడు.
‘‘బాలాజీ ఇంజనీరింగ్ కాలేజీకి ఫోన్ చేసి, అకౌంట్స్ సెక్షన్‌లో పనిచేస్తున్న దీప్తి అనే అమ్మాయిని ఇంటరాగేషన్‌కి పిలవండి. ఆ సమయంలో నేను మీ దగ్గరకొస్తాను. నేను ఒక సినిమా ప్రొడ్యూసర్‌ననీ, నా పేరు చక్రపాణి అని, త్వరలో పెద్ద స్టార్స్‌తో సినిమా తీయబోతున్నానని- ఆ అమ్మాయికి తెలిసేలా చెయ్యాలి, మనం చిన్నప్పటినుంచీ చాలా క్లోజ్ ఫ్రెండ్స్‌లాగా, ఒరేయ్ అంటే ఒరేయ్ అనుకోవాలి ఆ కాసేపు..’’ అన్నాడు రణధీర్.
‘‘నిజంగా కూడా మనం ఫ్రెండ్సే కదా..’’ అని నవ్వాడు శంభుప్రసాద్.
‘‘నేను పోలీసు శాఖకు చెందినవాడ్ని అని తెలిస్తే, ఆ అమ్మాయి నాతో మాట్లాడకపోవచ్చు. కానీ పోలీసాఫీసర్లతో స్నేహం ఉందని తెలిస్తే, అవసరమైనప్పుడు నా ద్వారా పనులు చేయించుకునే ప్రయత్నం చేస్తుంది. ఆమెకు సాయం చేస్తూనే వీలున్నంత సమాచారం రాబట్టవచ్చునన్నది ప్లాన్. శే్వత చనిపోయే రోజూ, ఆ ముందు రోజు కూడా, ఆ డాక్టర్ని కలిసిన చివరి అవుట్ పేషెంట్ ఈ అమ్మాయే. అనుమానం ఎక్కడొస్తోందంటే, ఈ అమ్మాయి ముందుగా నర్స్‌కి ఫోన్ చేసి రిజిష్టర్‌లో తన పేరు రాయించుకుంది. ఆ అమ్మాయిది ఈ రోజు చూసే పేషెంట్స్ వరుసలో మొదటి నెంబరు. కానీ డాక్టర్ని కలిసిన చివరి పేషెంట్ ఈ అమ్మాయే. అంతకుముందు రోజూ ఇదే పద్ధతిలో డాక్టర్ని కలిసింది. అంటే పేషెంట్స్ అంతా వెళ్లిపొయ్యక, నర్సులు పైకి వెళ్లాక డాక్టర్ ఏకాంతంగా ఉన్నట్లు ఈ అమ్మాయి ద్వారా హంతకుడికి ఏదన్నా సంకేతం అంది ఉంటుందా- అన్న కోణంలో దర్యాప్తు చేయాలి. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే, తన అసలు పేరు దీప్తి అయితే రిజిస్టర్‌లో గీత అన్న పేరు రాయించింది.
దీన్ని బట్టి ఏం అర్థమవుతోంది? హత్య జరుగుతుందని తెల్సి, పోలీసుల ఎంక్వయిరీలో తను దొరకకుండా తప్పించుకునేందుకు వీలుగా పేరు మార్చి మిస్‌లీడ్ చేసే ప్రయత్నమా ఇది- ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నదంటే ఆమె నుంచి నిజం రాబట్టటం అంత తేలిక కాదు.. ముల్లును ముల్లుతోనే తీయాలి. నేను పోలీసు డిటెక్టివ్ ఇన్స్‌పెక్టర్ రణధీర్‌గా కాకుండా, మరో రూపంలో ఆమెకు పరిచయం కావాలి. స్నేహం చేస్తున్నట్లు, సాయం చేస్తున్నట్లు నటించి, ఆమెకు కాన్ఫిడెన్స్ కలిగించాలి. అప్పుడు ఏదో సమయంలో అసలు విషయం బయటపడుతుంది. ఇంత నాటకం ఆడాలి..’’ అన్నాడు రణధీర్.
‘‘కానివ్వండి, ఈ నాటకంలో నాకూ ఏదన్నా పాత్ర ఉందా, లేదా?’’ అని అడిగాడు శంభుప్రసాద్.
‘‘అసలు సంధానకర్తవి నువ్వే. దీప్తిని ఇంటరాగేషన్‌కి పిలువు.. మీరు మాట్లాడుతుండగా నేను ప్రవేశిస్తాను. నా పేరు చక్రపాణి అనీ, సినిమా ప్రొడ్యూసర్‌ననీ, హీరోయిన్‌ల వేటలో ఉన్నాననీ అంటూ, ఆ అమ్మాయే హీరోయిన్‌కి పనికొస్తుందనే చిన్న ఆశ పెట్టి చేపని గాలానికి తగిలించాలి..’’ అన్నాడు రణధీర్.
‘‘అది కాలంతకురాలిగా ఉంది. నీకు గాలం వేస్తుందేమో చూడు.. దాన్ని నువ్వు ట్రాప్ చేయాలని చూస్తే అదే నిన్ను ట్రాప్ చేస్తుందేమో..’’
‘‘దాని ట్రాప్‌లో నేను పడినట్లు నమ్మిస్తేగాని, నాతో ఏదీ మనసు విప్పి చెప్పదు..’’
‘‘అది విప్పే రకంలా లేదు. నీ చేత విప్పించే రకంలా ఉంది..’’ అని నవ్వాడు శంభుప్రసాద్.
మర్నాడు శంభుప్రసాద్ దీప్తిని పోలీసు స్టేషన్‌కు పిలిపించాడు.
ఆమెను బయట కూర్చోబెట్టి, శంభుప్రసాద్ రణధీర్‌కి ఫోన్ చేశాడు. అతను స్టేషన్ దగ్గరకు వచ్చాడని తెల్సాక దీప్తిని రూంలోకి పిల్చాడు. ఎదురుగా కూర్చున్నాక, ఆమె వంక చూశాడు. చామనఛాయగా ఉన్నా, మొహం గుండ్రంగా, కను ముక్కు తీరు తీర్చిదిద్దినట్లు ఉండటంతో ఆకర్షణీయంగానే కనిపిస్తోంది. చెదరని చిరునవ్వు ఆమెకు పెట్టని ఆభరణంగా ఉంది.
‘‘నీ పేరు?’’ అని అడిగాడు శంభుప్రసాద్
‘‘నా పేరు తెలియకుండానే, నన్నిక్కడికి పిలిపించారా?’’ అన్నది నవ్వుతూ.
‘‘ఇది పోలీసు స్టేషన్. నువ్వు చెప్పేది ప్రతిదీ ఇక్కడ రికార్డ్ అవుతుంది.. ఎదురుప్రశ్నలు మానేసి, అడిగినదానికి సమాధానం చెప్పు...’’
‘‘నా పేరు దీప్తి..’’

- ఇంకా ఉంది

శ్రీధర