డైలీ సీరియల్

అనంతం-56

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘అతనె్నందుకు చంపారు?’’
‘‘అసూయ’’
‘‘అంటే’’
‘‘తెల్లకాకులు, ఎర్ర నెమళ్ళు ఉండవని పరిశోధించి చెప్పినందుకు.’’
‘‘ఉన్నాయా?’’
‘‘లేవన్నందుకే కదా!’’
‘‘ఉన్నాయనీ, లేవనీ- ఎందుకొచ్చింది చర్చ.’’
‘‘అడవిలో కనిపించాయి కనుక’’
‘‘వాటికీ, అసూయకీ ఏమిటి సంబంధం.’’
‘‘పక్షులకు రంగులు పులిమి, అవ్వి దేవర మహత్యం అని నమ్మించబోయారు.’’
‘‘అడవిపుత్రులే రంగులు పులిమారా.’’
‘‘అవును.’’
‘‘వాళ్ళకేమిటి ప్రయోజనం.’’
‘‘మూఢ నమ్మకాలను వ్యాప్తిచెయ్యాలని.’’
‘‘అసలు మీరంతా అక్కడికి ఎందుకు వెళ్ళారు.’’
‘‘డ్యూటీ మీద.’’
‘‘ఏం డ్యూటీ.’’
‘‘చెప్పకూడదు.’’
‘‘చెప్పకూడని పనా.’’
‘‘పై అధికారులే చెప్పాలి.’’
అంతటితో ఆ ఘట్టం ముగిసింది!
పాత బేనర్లే మళ్ళీ ప్రదర్శిస్తూ, పాత నినాదాలే ఇస్తూ, పాత ఉద్యమకారులే మళ్లీ,-
కాల్పులకు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శన చేస్తుంటే, పాత పోలీసులూ క్రొత్త పోలీసులూ కలిసి, వాళ్ళని దూరంగా నెట్టివేస్తున్న దృశ్యం.
పాత సినిమాలా బూజర బూజరంగా కనిపిస్తోంది, దూరంగా!
ఆ ఘట్టంకూడా ముగిసిపోయింది.
సుత్తెలతో కొట్టి ఉలులతో ఎముకల్ని నరుకుతున్న చప్పుళ్ళు పోస్టుమార్టం రూమ్‌లోనుంచి లీలగా వినిపిస్తున్నాయి!
ఆ ఘట్టంకూడా ముగిసిపోయాక ఏంచెయ్యాలి?
అధికారులను వేధిస్తున్న ప్రశ్న అదే!
దేశద్రోహం, ప్రభుత్వాన్ని కూలదోసే కుట్ర కేసులో ముద్దాయిలైన వాళ్ళతో ప్రభుత్వానికి ఎలాంటి సమస్యాలేదు!
న్యాయస్థానాలు వాళ్ళకి కఠిన శిక్షలు విధిస్తాయి.
మేమేమీ నేరం చెయ్యలేదన్నా వాళ్ళ గోడు పట్టించుకొనేవాళ్ళు ఎవ్వరూ ఉండరు.. వాళ్ళంతా జైళ్ళల్లోనే మగ్గిచస్తారు!
తండాల మీద దాడిచేసి, అడవి పుత్రుల్ని వెళ్ళగొట్టొచ్చు!
ఎదురు తిరగరు.. ప్రాణభయంతో పారిపోతారు.
అంచేత,
వాళ్ళతోనూ సమస్య లేదు!
ఉన్న సమస్యల్లా శవాలతోనే!?
బంధువులకు అప్పగిస్తే శవాలతో ఊరేగింపులు చేస్తారు. వీధి వీధినా శవాలను ప్రదర్శిస్తారు.
ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలిస్తారు.
పాటలు పాడుతూ ఉద్రేకాలు రెచ్చగొడతారు.
విధ్వంసం జరిగితే శాంతిభద్రతలేం కానూ? లా అండ్ ఆర్డర్ని ఎలా కాపాడాలి? శాంతినెలా పరిరక్షించాలి?
శవాలతోనే ప్రమాదం!
అవ్వి భయపడవు.. రాజీపడవు.. ప్రలోభాలకు లొంగిపోవు.. వెన్నుపోట్లు పొడవవు...
జనజీవన స్రవంతిలో కలవాలన్నా శవాలను అనుమతించరు!
లాగి అవతల పారేస్తారు..
చితి మంటల్లో కాల్చేస్తారు...
శవాలతోనే ప్రమాదం!
‘‘శవాలకోసం ఎవ్వరూ రాలేదా’’ క్రింది అధికారిని జిల్లా పోలీసు అధికారి అడిగాడు.
‘‘రాలేదు సార్.’’
‘‘వస్తే-వాళ్ళనీ అరెస్టుచెయ్యండి.’’
‘‘అందుకే రావటం లేదేమో.’’
‘‘రప్పించి అరెస్టుచెయ్యండి.’’
‘‘అవకాశం లేదు సార్.’’
‘‘ఎందుకు లేదూ?’’
‘‘ముఖ్యమైన వాళ్ళంతా అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు..’’
‘‘తండాలో ఎవ్వరూ లేరా.’’
‘‘స్ర్తిలు, పిల్లలూ ఉన్నారు.’’
‘‘దాడి చెయ్యండి. బీభత్సం సృష్టించండి. రెడ్డియానాయక్ తండా ఖాళీ కావాలి వెంటనే..’
‘‘అదేపనిలో వెళ్ళారు మన వాళ్ళంతా.’’
‘‘గుడ్! అవసరమైతే కాల్పులు జరపండి. అరెస్టులు చెయ్యండి..’’
‘‘జరుగుతయ్యి సార్.’’
‘‘ప్రభుత్వం చాలా పట్టుదలగా ఉంది.. మేకిట్ ఫాస్ట్’’అని చెప్పి, జిల్లా పోలీసు అధికారి వెళ్ళిపోయాడు.
శవాలను పోస్టుమార్టం పూర్తికాగానే అదే అడవికి తరలించి, అడవి కట్టెలతోనే దహనం చెయ్యాలన్న నిర్ణయం జరిగింది!
* * *
పోలీసు పటాలం రెడ్డియానాయక్ తండాని చుట్టుముట్టింది..!
జట్లుజట్లుగా విడిపడి, కొంతమంది పోలీసులు తండాలోపలికి చొచ్చుకొని పోతూ, కొద్దిపాటి అలికిడి వినిపించినా తుపాకులు ఎక్కుపెడుతున్నారు.
వాళ్ళ మొహాలు నల్లగా మాడిపోయాయి.
తండాల్లో ఎవ్వరూ లేరు!
దాడి చేస్తారని తెలిసి అడవిపుత్రులు పారిపోయారా? కలుగుల్లో దాగిన ఎలుకల్లా చాటుమాటున నక్కి, ప్రతిదాడి చేసే సన్నాహాల్లో ఉన్నారా? సాయుధ పోలీసులు జాగ్రత్తగా పరిసరాలను గమనిస్తూ ప్రతి గుడిశెలోకీ వెళ్తున్నారు.
అణువణువూ గాలిస్తున్నారు.
వాళ్ళకి పరిస్థితి అర్థమైపోయింది!
పారిపోయారన్న కోపంతో రగిలిపోతూ, గుడిశెల్లో వున్న సామాన్లన్నీ చిందరవందర చేస్తున్నారు.
సత్తుగినె్నలు వాళ్ళ బూటు కాళ్ళక్రింద నలిగిపోతున్నాయి.
మట్టి పాత్రలు పగిలిపోతోన్నాయి.
బట్టలు చిరిగిపోతోన్నాయి..
ఒక్కడూ దొరికి చావడేం?
ఒక్కడు దొరికినా చితక్కొట్టేవాళ్ళు. కాళ్ళతో తొక్కేవాళ్ళు.
గోళ్ళల్లో గుండుసూదులు గుచ్చేవాళ్ళు. పట్టుకారుతో పట్టి మర్మాంగాన్ని మెలికలు తిప్పేవాళ్ళు. మూత్రం తాగించేవాళ్ళు..
ఒక్కడూ కనిపించడేం?
‘ఆర్తనాద సంగీతం’వినే అవకాశం ఇవ్వడేం?
‘‘బాస్టర్డ్స్’’అంటూ కసిగా అరిచాడో పోలీసు ఉద్యోగి.
సరిగ్గా అప్పుడు-
పీల గొంతుతో అరిచిన అరుపు వినిపించింది!
అత్యుత్సాహంతో ఓ కానిస్టేబులు లేడిని చంపే పులిలా అక్కడికి దూకాడు.. తుపాకి ఎక్కుపెట్టాడు.
అరిచింది మేకపిల్ల!
నిరాశతో కసిగా దానివైపు చూశాడు. గుంజకి కట్టివేసి ఉంది!
అది-
కానిస్టేబుల్ని చూసింది.
కట్టువిప్పేందుకు దయతో వచ్చిన మనిషనుకుందేమో!
‘‘మే.’’అంటూ మళ్ళీ అరిచింది, అతనివైపు చూస్తూ.
అసలికే అసహనంగా ఉన్నాడు. పైగా అది అరిచింది..
ఉద్యమకారుల నినాదంలా ధ్వనించిందా అరుపు!
(ఇంకా ఉంది)

-గోపరాజు నాగేశ్వరరావు