డైలీ సీరియల్

మహాభారతంలో ఉపాఖ్యానాలు -123

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సువర్చల ఇలా అంది ‘‘బ్రహ్మర్షీ! ఇన్ని విధాలుగా విడమర్చి చెప్పితే ఏం లాభం? నిత్యక్రియాకలాపాలతో నీ జ్ఞానం నశిస్తోంది. దానికి కారణం చెప్పు. నేను నిన్ను అనుసరించేదానను’’.
అప్పుడు శే్వతకేతువు ఇలా అన్నాడు ‘‘శ్రేష్ఠులు ఆచరించినదానినే ఇతరులు ఆచరిస్తారు. కనుక మనం కర్మ పరిత్యాగం చేస్తే ఇతరులు కూడా కర్మలు చేయడం మానివేస్తారు. దానివల్ల కర్మ సాంకర్యం జరుగుతుంది. ధర్మసంకరమయితే వర్ణసాంకర్యం కలుగుతుంది. వర్ణసాంకర్యం వలన లోకంలో ధర్మభ్రష్టత్వం కలుగుతుంది. అది పరమాత్మకు నచ్చదు. ఎందుకనగా ఈ విశ్వసృష్టి అంతా పరమేశ్వరునిదే కదా! ధూళికణాలు ఎన్ని ఉన్నాయో అన్ని శక్తులు భగవంతునికి ఉన్నాయి. ఆయన మాయతో అదే సంఖ్యలో ఉన్నాయి.
అత్యంత రహస్యమైన ఈ గుహలో నుండి ముక్తిప్రాప్తికై జ్ఞానఖడ్గంతో, జనన మరణబంధనాలను ఛేదించి, నన్ను చేరిన విద్వాంసుడే నాకిష్టమైనవాడు. నిస్సంశయంగా అతడే నేను. ఇది పరమాత్మ ప్రతిజ్ఞ.
మూఢులై, దుర్మార్గులై, వర్ణసంకర కారకులై ధర్మాన్ని అతిక్రమించినవారు నరకానికి వెళతారు. తరువాత అసురులుగా జన్మిస్తారు. కనుక లోకరక్షణ కోసం లోకమర్యాదలను పాటించాలి’’.
అప్పుడు సువర్చల ఇలా అడిగింది. ‘‘శబ్దమంటే ఏమిటి? అర్థమంటే ఏమిటి? వాటి స్వరూప లక్షణాలను వివరించి చెప్పు’’.
శే్వతకేతువు - ‘‘వర్ణసముదాయాన్ని క్రమంగా కాని ఇంకొకవిధంగా కాని ఉచ్చరిస్తే ప్రకాశింపబడేది శబ్దం. ఆ శబ్దం ద్వారా తెలిసే అభిప్రాయం అర్థం’’.
సువర్చల మళ్లీ ఇలా అడిగింది - ‘‘శబ్దం ద్వారా అర్థం ప్రతీతి అయితే శబ్దార్థాల మధ్య సంబంధం ఉందా? లేదా?’’
శే్వతకేతువు - ‘‘శబ్దార్థాల మధ్య నియతమయిన సంబంధమేమీ లేదు. తామరాకు మీద ఉన్న నీటి బొట్టుకు తామరాకుతో ఎలాంటి సంబంధం ఉందో అలాంటిదే శబ్దార్థ సంబంధం’’.
సువర్చల - ‘‘స్వామీ! అర్థముంటేనే శబ్దముంటుంది. అర్థం లేకపోతే శబ్దం నిలువదు. అర్థం లేకుండా ఉన్న శబ్దమేదైనా ఉంటే చెప్పు’’.
శే్వతకేతువు - ‘‘శబ్దానికి అర్థంతో వాచకత్వరూప సంబంధముంటుంది. శబ్దముంటే అర్థమూ ఉంటుంది.
సువర్చల - ‘‘ఇక్కడ శబ్దమంటే వేదం. అర్థమంటే పరమాత్మ అని నా భావం. ఆ పరమాత్మ ఆధారం లేకుండా వేదం నిలువదు. కాని శబ్దార్థాలకు నియత సంబంధం లేదనటం విపరీత భాషణం’’.
శే్వతకేతువు - ‘‘నేను విపరీతంగా చెప్పటం లేదు. ఆకాశం లేకుండా పృథివీ, పృథివి లేకుండా ఆకాశం లేదు. అయినా వాటి మధ్య నియత సంబంధం లేదు. శబ్దార్థాలు కూడా అలాంటివే.’’
సువర్చల - ‘‘అహం శబ్దం ఎప్పుడూ ఆత్మార్థంలో ప్రయోగింపబడుతోంది. కాని శబ్దమక్కడ లేదు. కనుక ఆత్మ అనే అర్థంలో అహం శబ్దప్రయోగం కూడా మిథ్యయే’’.
శే్వతకేతువు - ‘‘అహం భావమే ఆత్మభావంలో ప్రయోగింపబడుతోంది. కాని అహం శబ్దం ఆత్మభావంలో ప్రయోగింపబడటం లేదు. మట్టి కుండతో మృత్తికాభావం కలుగుతుంది. అదే విధంగా పరమాత్మ నుంచి పుట్టిన ప్రతి పదార్థంలోను పరమాత్మ భావం ఉంటుంది. అందుకే అచింత్య పరబ్రహ్మ విషయంలో కూడా అహంభావమే ఆత్మభావము. నేను, నీవు, ఇది - ఇవన్నీ పరమాత్మలో మనం కల్పించినదే కాని వాస్తవం కాదు. అందువలన మాటలు పరమాత్మను చేరలేవు’’ అన్న శ్రుతి వచనంలో వైరుధ్యం లేదు. ఆ పరబ్రహ్మ పరమశుద్ధ స్వరూపం కనుక మాటలకీ అందడు. చర్మచక్షువులతో ఆ పరమాత్మను చూడలేము. కాని జ్ఞానచక్షువులతో చూడగలము’’.
సువర్చల ఇలా అన్నది ‘‘నిర్వికారమై, రూపరహితమై, సర్వవ్యాపి అయిన ఆకాశం ఎప్పుడూ కన్పించినట్లు జ్ఞానరూపుడైన బ్రహ్మ కూడా కన్పిస్తాడు. ఆకాశంలో ఉన్న విశ్వం అంతా ఆకాశంలో కలిసి ఉన్నట్లు కన్పిస్తుంది. అదేవిధంగా పరమాత్మయందున్న సర్వ జగత్తు పరమాత్మతో కలిసి ఉన్నట్లు కనిపిస్తుంది. మనిషి ఆకాశగతమైన వాయువును స్పృశిస్తున్నాడు. ఆకాశగతమైన గంధాన్ని ఆఘ్రాణిస్తున్నాడు. అక్కడ ఉన్న జ్యోతిని కంటితో చూస్తున్నాడు. అలాగే అక్కడ ఉండే మేఘాలను, వానను, తారలను, సూర్యకిరణాలనూ చూడగలుగుతున్నాడు. కాని ఆకాశం కనిపించదు (కన్పిస్తున్నట్లు అనిపిస్తుంది). పరమాత్మ ఆకాశానికే ఆకాశం. అనగా మహాకాశం. అతనే సత్యం. అతన్ని ఈ ఇంద్రియాలతో గ్రహించలేము. ఆయన సర్వవ్యాపి. సాధకుడు బ్రహ్మబోధకమైన వాక్యాన్ని నిరంతరం స్మరించడం వలన పరిపూర్ణ జ్ఞానాన్ని పొందుతాడు.
ఆ పరమాత్మ స్ర్తి కాదు, పురుషుడు కాదు. కేవలం జ్ఞానస్వరూపం. ఈ జగత్తుకు ఆధారము. అతను శుద్ధుడు. అతను వాక్కులకు అందడు. దృష్టికి అందడు. ఆధ్యాత్మ తత్త్వచింతన ద్వారా ఆ
శుద్ధ పరమాత్మని తెలుసుకో గలుగుతాము. సర్వప్రాణులలో ఆ పరమాత్మ జీవరూపంలో ఉంటుంది. ఇదే ఆత్మజ్ఞానం. నేను చెప్పిన అహం పదార్థమిదే’’.
భర్త ఈ విధంగా ఆత్మజ్ఞానాన్ని గురించి వివరించగా సువర్చల ఆనందించింది. తను కూడా తదనుగుణంగా ఆచరించసాగింది. ఈ విధంగా శే్వతకేతువు భార్యతో కలిసి నిత్య నైమిత్తిక కర్మలను ఆచరిస్తూ, ఆ కర్మఫలాన్ని పరమాత్మకు సమర్పిస్తూ చాలాకాలం జీవించి భార్యతో సహా పరమగతిని పొందాడు.
-ఇంకావుంది

డాక్టర్ ముదిగొండ ఉమాదేవి