డైలీ సీరియల్

మహాభారతంలో ఉపాఖ్యానాలు -124

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒక సమయంలో దేవేంద్రుడు దైత్యులదరినీ జయించి, బ్రహ్మదేవుని దగ్గరకు వెళ్ళి నమస్కరించి బలిని గురించి ఇలా అడిగాడు- ‘‘చతుర్ముఖా! ఎంత దానం చేసినా బలి ధనాగారం ఎప్పుడూ తరిగిపోదు. అతడు ఎక్కడ ఉన్నాడో తెలియటం లేదు. అతను ఎక్కడ ఉన్నాడో తెలియచెప్పు’’ అతను వాయువై, వరుణుడై, సూర్యుడై, చంద్రుడై వారు చేసే పనులన్నీ చేయగలడు. అగ్ని లాగ ప్రాణులను తపించగలడు. కావాలంటే జలంగా మారగలడు. ఆ బలి ఎక్కడున్నాడో తెలియటం లేదు. దయచేసి చెప్పు చతుర్ముఖా!’’
ఇంద్రుని మాటలకు బ్రహ్మదేవుడు ఇలా అన్నాడు - ‘‘ఇంద్రా! బలిని గురించి నీవు అడగటం బాగా లేదు. అయినా నీవు అడిగినప్పుడు అసత్యం చెప్పకూడదు. కనుక బలిని గురించి చెప్తాను విను. శూన్యమైన ఏ ఇంటిలో తమ జాతిలో శ్రేష్ఠమైన గోవు గాని, అశ్వం గాని, గాడిదకాని ఉంటుందో అదే బలి నివాసం.’’
ఇంద్రుడు మరల అడిగాడు - ‘‘బలి ఒంటరిగా దొరికితే అతన్ని చంపాలా? వద్దా? ఆజ్ఞాపించండి’’.
అప్పుడు బ్రహ్మ ఇలా అన్నాడు- ‘‘బలి చంపదగినవాడు కాదు. అతన్ని చంపవద్దు. నీకేమైనా న్యాయ వ్యవహారానికి సంబంధించిన సందేహాలు ఉంటే అడగవచ్చు.’’
బ్రహ్మ అలా చెప్పగానే ఇంద్రుడు తన ఐరావతం ఎక్కి సంపద యొక్క శోభతో భూమిపైన తిరుగసాగాడు.
తర్వాత బ్రహ్మ చెప్పినట్లుగానే ఒక శూన్య గృహంలో ఉన్న బలిని చూశాడు. అతను అక్కడ గాడిద రూపంలో ఉన్నాడు. అప్పుడు ఇంద్రుడు ఇలా అన్నాడు-
‘‘దానవా! గాడిద రూపాన్ని ధరించి పొట్టు తింటున్నావు ఇది చాలా నీచమైన జన్మ. దీనికి నీకు బాధ కలుగుతున్నాదా? లేదా? నీవు శత్రువులకు లోబడి పోయావు. రాజ్యలక్ష్మిని మిత్రులను, కోల్పోయావు, శీలాన్ని పరాక్రమాన్ని పోగొట్టుకున్నావు.
పూర్వం వేలకొలది దాయాదులు నీచుట్టూ ఉండగా మహావైభవంతో తిరగేవాడివి. దైత్యులందరినీ ఆదేశించేవాడివి. నీ ఏలుబడిలో నేలను దున్నకుండానే పంటలు పండేవి. ఇప్పుడు ఇంత దైన్యస్థితిలో ఉన్నావు. నీకు బాధగా లేదా?
పూర్వం నీవు ఎంత వైభవంతో ఉండేవాడివి. రాజ్యలక్ష్మితో కలిసి తేజస్సుతో వెలిగిపోతూ ఉండేవాడివి. ఇప్పటి నీ స్థితిచూడు. పూర్వం నీవు యాగాలు చేసే సమయంలో స్థాపించిన బంగారు యాపస్తంభము ఉండేది. అప్పుడు నీవు కోట్ల గోవులను నిరంతరం దానం చేసేవాడివి. నీవు భూమినంతా వదిలి వెళ్ళేవు. ఇప్పుడు నీ మనస్సులో శక్తి ఉంది. ఇప్పుడు నీ దగ్గర ఏ ఐశ్వర్య చిహ్నాలు లేవు. బ్రహ్మ ఇచ్చిన దివ్యమాల కూడా కన్పించటంలేదు.’’అప్పుడు బలి ఇంద్రుని మాటలకు నవ్వి గంభీరంగా ఇలా అన్నాడు- ‘‘అయ్యో! దేవేంద్రా నీది మూర్ఖత్వం. వాసవా! నీ మాటలు వినటానికి చాలా కఠినంగా ఉన్నాయి. నీకు భృంగారం (సువర్ణపాత్ర) కాని చామరాలు తక్కినవి కన్పించటం లేదు. గుహలో దాచిన రత్నాల గురించి అడుగుతున్నావు. నాకు మంచిరోజులు వచ్చినపుడు వాటిని చూడగలవు. ప్రస్తుతం నీవు సంపద గలవాడివి, నేను సంపద పోగొట్టుకున్నవాడిని. కనుక నీవు నీ ఐశ్వర్యం గురించి నాదగ్గర చెప్తున్నావు. నీ స్థాయికి ఇది తగిన పనికాదు. జ్ఞానతృప్తులు, బుద్ధిమంతులు, సహనశీలురు తమకు దుఃఖం కలిగేటప్పుడు శోకించరు. సంపద వచ్చిన సమయంలో పొంగిపోరు. నీవు మాత్రం సంస్కారహీనంగా ప్రవర్తిస్తున్నావు. నా పరిస్థితి లాంటిది నీకు వస్తే అప్పుడు నీవు ఇలా మాట్లడవు’’.
అలా కోపంతో మాట్లాడిన బలితో ఇంద్రుడు మరలా తన గొప్పదనం చాటుకోవడానికి ఇలా అన్నాడు- ‘‘గతంలో వేలాదిమంది దాయాదులు నీచుట్టూ ఉండగా మమ్మల్ని లెక్కచేయకుండా తిరిగేవాడివి. ఇప్పుడు అందరూ నిన్ను వదిలి వెళ్ళిపోయారు. ఈ దయనీయ స్థితికి దిగులు పడుతున్నావా లేదా? పూర్వం లోకాలన్నింటినీ నీ అదుపులో ఉంచుకొని ఆనందాన్ని పొందేవాడివి. ఇప్పుడు ఈ పతనం నీకు దుఃఖం కాదా?’’
బలి ఇలా అన్నాడు - ‘‘ఇంద్రా! కాలం ఎప్పుడూ పరివర్తన చెందుతూ ఉంటుంది. కనుక ఈ లోకంలో అన్నీ నశించేవే. ప్రాణుల శరీరాలన్నీ ఎప్పుడో ఒకప్పుడు నశిస్తాయి. అందువల్ల శోకించటం లేదు ఇంద్రా! శరీరమూ జీవితము పుట్టుకతోనే వచ్చినా కలసి పెరిగి కలసి నశిస్తాయి. కనుక శోకమెందుకు? ప్రాణులకు అంతిమ గతి మృత్యువే. ఇది తెలియని వారు మోహానికి గురౌతున్నారు.
బుద్ధి లేనివారు మాత్రమే తమకు కష్టాలు కలిగినపుడు దుఃఖిస్తారు. బుద్ధిమంతుడు తన పాపాలను పొగొట్టుకొని పాపరహితుడై సాత్వికుడు అవుతాడు. నేను అర్థాన్ని కాని జీవితాన్ని కాని మరణాన్ని కాని సుఖాన్ని! దుఃఖాన్ని దేన్నీ ప్రేమించను, - ద్వేషించను. ఎవరైనా ఇంకొకరిని చంపుతానంటే అతను చంపే కర్తకాడు. జగత్కర్త అయిన పరమాత్మయే అన్నిటికీ కర్త. బలి ఇంకా ఇలా చెప్తున్నాడు. సకల ప్రాణుల శరీరం పంచభూతాలతో అంటే పృధ్వీ, అగ్ని, వాయు, ఆకాశమ, జలంతో చేయబడింది. మళ్ళీ వాటిలోనే కలిసిపోతాయి. అందగాడైనా, కురూపియైనా, మేధావి అయినా, బలవంతుడు, బలహీనుడు, ధనవంతుడు, నిరుపేద - అందరినీ ఆ కాలం తన తేజస్సుతో తనలోకి తీసుకుంటుంది. ఈ చూస్తున్న జగత్తంతా నశ్వరమూ. కాలాధీనమని తెలిసినపుడు ఇక బాధ ఎందుకు? కాలం నశింపచేసిన దానిని ఇతరులు ఇక ఏం నశింపచేస్తారు. కాలం దహించిన దానినే అగ్ని దహిస్తుంది. కాలోపహతుడే ఇతరుల చేత చంపబడతాడు. ఎంత ఆలోచించినా దివ్య కాలరూపుడైన ఆ విధాత అంతుచిక్కటం లేదు.
ఇంకావుంది

డాక్టర్ ముదిగొండ ఉమాదేవి