డైలీ సీరియల్

ఒయాసిస్17

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘శే్వతగారుంటే ఒంటరితనం ఉండదు.. కానీ ఆమె లేని లోటు తీరేది కాదు..’’ అన్నాడు రణధీర్.
‘‘అదే.. అదే.. నేను అనాలనుకున్న మాట. నువ్వన్నావు. అసలా సీను తలచుకుంటే ఇప్పటికీ చెమటలు పట్టేస్తుంది రణా..’’
‘‘మాకే నిద్దర పట్టడంలేదు. మీరీ మాత్రం తట్టుకుని నిలబడ్డారంటే మీరు మాకన్నా ధైర్యవంతులనే చెప్పాలి..’’
ఆ మాటలతో అహోబలరావు మరింత చలించిపోయాడు.
‘‘నువ్వలా ఊరికే కూర్చుంటే నాకేం బాగాలేదు.. చిన్న పెగ్గు తీసుకోవాలి.. మనం ఫ్రీగా మాట్లాడుకుందామనే ఈ టైంకు రమ్మన్నాను..’’ అంటూ అహోబలరావు రణధీర్‌కు విస్కీ గ్లాస్ అందించాడు.
రణధీర్ సిప్ చేశాక అహోబలరావు అన్నాడు.. ‘‘ఇవాళనుంచి మనం ఫ్రెండ్స్. ఎందుకింతగా అడుగుతున్నానని నువ్వనుకోవచ్చు. ఇప్పుడు మనం బ్రతుకుతున్న సమాజంలో ప్రతిదీ కలుషితమైపోయింది. పవిత్రమైన గంగాజలంతో సహా.. ఆప్తమిత్రుడన్నవాడు కంచుకాగడా వేసుకుని వెదికినా కనిపించడంలేదు..
ఎవడినన్నా ఆప్యాయంగా కౌగిలించుకుంటే వెన్నుపోటు పొడిచేస్తున్నాడు.. చుట్టూ నీరున్నా సముద్రం నీరు తాగడానికి ఎలా పనికిరాదో, చుట్టూ ఇన్ని కోట్లమంది ఉన్నా ఆప్యాయంగా, ఆదరంగా ఆత్మీయంగా మనసు విప్పి మాట్లాడుకుదామంటే ఒక్కడు కనిపించడు. ప్రతి మనిషీ తన చుట్టూ ఒక దుర్బేధ్యమైన కోట నిర్మించుకుని, ఒంటరితనం అనే సైనికుడ్ని కాపలా పెట్టుకుని, తన నీడను చూసి తను భయపడుతున్నాడు రణధీర్..’’ అన్నాడు అహోబలరావు.
‘‘మీరు చెప్పింది నూటికి నూరుపాళ్ళు యధార్థం. చివరకు తోడబుట్టిన వాళ్ళు కూడా ఆగర్భశత్రువుల్లా మారిపోతున్నారు.. ఒకరిద్దరి విషయంలో అయితే మనస్తత్వాల్లోనో, పెంపకంలోనో తేడా ఉందనుకోవచ్చు. నూటికి తొంభై మంది కుటుంబాల్లో ఇదే పరిస్థితి..’’ అన్నాడు రణధీర్.
‘‘కాలంలో వచ్చిన మార్పు.. డబ్బు ‘ఇన్ ఫ్లో’ పెరిగే కొద్దీ అవసరాలు పెరిగిపోతున్నాయి. ఒకప్పుడు అయిదారువేల రూపాయల ఆదాయంలో సుఖంగా బతికే కుటుంబాలు, ఇప్పుడు యాభై వేలు వచ్చినా చాలక అవస్థపడుతున్నాయి.. అఫ్‌కోర్స్.. రూపాయి విలువ పడిపోయిందనుకో.. అదొక కారణమైతే అవసరాలు పెరగటం, ఆశకు అంతులేకపోవటం ముఖ్యమైన కారణాలని నాకు అనిపిస్తుంది రణా..’’ అన్నాడు అహోబలరావు మళ్లీ గ్లాసు నింపుకుంటూ..
‘‘మీరు చెప్పింది నూటికి నూరుపాళ్ళూ యధార్థం..’’ అన్నాడు రణధీర్. ఆయన ఏం చెప్పినా చివరకు ఇది రాత్రి కాదు, పగలూ అన్నా.. ఆయనతో ఏకీభవించాలనే అనుకుంటున్నాడు రణధీర్.
‘‘ఒక చిన్న ఉదాహరణ చెబుతాను.. ఓసారి ఓ ఫైవ్‌స్టార్ హోటల్లో రూం బాయ్‌ని అడిగాను.. బాత్‌రూంలో అంత పెద్ద టర్కీ టవల్స్ పెడతారేమయ్య.. అవి కన్వీనియెంట్‌గా లేవు.. మామూలు టవల్స్ పెట్టొచ్చు గదా- అంటే వాడమన్నాడో తెల్సా.. మామూలు టవల్స్ పెడితే కస్టమర్స్ వెళ్ళేటప్పుడు పట్టుకుపోతున్నారండీ.. అందుకని వాళ్ళ సూటుకేసుల్లో పట్టకుండా ఉండేందుకు పెద్ద టర్కీ టవల్స్ పెడుతున్నామండీ.. అన్నాడు. నాకు నవ్వొచ్చింది. కానీ, వాడు చెప్పిన దాంట్లో నిజముంది. మనిషి స్వభావం ఎలా తయారైందంటే, ఎవరూ చూడనంతవరకు, ఎవరికీ తెలియనంతవరకూ ఎలాంటి నేరమైనా చేయవచ్చు- అన్న దృక్పథం ఏర్పడుతోంది. పావు కిలో వంకాయలు కొంటే, రెండొందల గ్రాములే ఇస్తాడు. చిన్న విషయం దగ్గర్నుంచి లక్షల కోట్ల రూపాయల ప్రభుత్వ ధనం స్వాహా చేయటం వరకు ఎవరూ చూడనంతవరకు ఏం చేసినా ఫర్వాలేదు. దొంగతనం, రంకుతనం, హత్యలు, మానభంగాలు, చాటుమాటు ఏ వెధవ పనిచేసినా, పైకి పెద్దమనిషిలా, అమాయకుడిలా, బుద్ధిమంతుడిలా చలామణీ కావాలి.. అదొక్కటే ఆశయం..’’
‘‘ఇలాంటి పరిస్థితుల్లో ఏం చెయ్యమంటారు?’’ అని అడిగాడు రణధీర్.
‘‘ఏం లేదు. అన్నీ లీగలైజ్ చేసి పడేసి, దొంగతనానికి పది పర్సంట్, రంకుతనానికి ఇరవై పర్సంట్.. మానభంగానికి ముప్ఫయి పర్సంట్- అంటూ టాక్స్ వసూలు చేసే రోజులొస్తాయనిపిస్తోంది నాకు..’’ అన్నాడు అహోబలరావు నవ్వుతూ.
ఇంతలో నలభై ఏళ్ల వయసు ఉంటుందేమో- ఒక స్ర్తి రెండు మూడు ప్లేట్లలో తినుబండారాలు పట్టకొచ్చి ఎదురగా పెట్టింది. అహోబలరావు ఆమెను రణధీర్‌కు పరిచయం చేశాడు.
‘‘ఈమె ఛాయ.. మన ఇంజనీరింగ్ కాలేజీలో వైస్ ప్రిన్సిపాల్.. ఇతను రణధీర్.. పోలీసు ఇన్స్‌పెక్టర్..’’ అన్నాడు అహోబలరావు.
ఆమె కూడా వాళ్ళ దగ్గరే కూర్చుంది, నమస్కారం చేస్తూ.
‘‘నేను ఒంటరిగా ఉండలేకపోతున్నానని తను తోడుగా ఉంటోంది నాలుగు రోజులనుంచి.. ఇంతముందు కూడా శే్వత ఉన్నప్పుడూ, వచ్చి నాలుగైదు రోజులుండేది.. మా ఫ్యామిలీ మెంబరే..’’ అన్నాడాయన.
ఒంటరిగా ఉన్నప్పటినుంచీ ప్రతిక్షణం శే్వతను తల్చుకొని, తల్చుకొని కుమిలిపోతుంటే, ఆయన బాధ చూడలేకపోతున్నానండీ.. మనిషి తోడుంటే, మాటల్లో పడి కొంతవరకూ అన్నా మర్చిపోతారు గదాని.. ఇక్కడే ఉండిపొయ్యాను...’’ అన్నది ఛాయ.

- ఇంకా ఉంది

శ్రీధర