వీక్లీ సీరియల్

పాతాళస్వర్గం-4

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎలా లీకయిందో, ఎవరో హెచ్చరించినా ప్రభుత్వం పట్టించుకోలేదన్న వార్త కూడా వ్యాపించింది. ఇదంతా చంద్రకి తలనొప్పిగా తయారైంది. కొందరు శంకరయ్య క్కూడా దోపిడీతో సంబంధం ఉందని గుసగుస లాడుకుంటున్నారు. దీంతో గౌతమి కూడా కృంగిపోయి కొండ దిగడం కూడా మానేసింది.
ఈ సంఘటనలకి విసిగిపోయిన చంద్ర అడవిలోకెళ్లి బ్లాక్ టైగర్‌ని పట్టుకోవాలని కూడా అనుకున్నాడు. అయితే ప్రభు ఎన్నో విధాలుగా చెప్పి ఆ ప్రయత్నాన్ని ఆపించాడు. మళ్లీ ‘క్లూ’ దగ్గర్నించి ఎలాంటి ఫోనూ రాకపోవడంతో, ఎలాగైనా ఆమెని వెతికి పట్టుకోవాలని నిర్ణయించుకున్నాడు. ప్రభు, ఆమెని కలిస్తే దొంగల గురించి ఇట్టే తెలిసిపోతుందని అతని నమ్మకం.
మరో పది రోజులు గడిచిపోయాయి. ధర్మారావు, కాంతారావు విడివిడిగా వచ్చి శంకరయ్యకి ధైర్యం చెప్తున్నారు. జనం దోపిడీని గురించి మర్చిపోతున్నారు క్రమంగా.
కానీ ఎస్.పి. మాత్రం పట్టుదల వదల్లేదు. అతనికి శంకరయ్య మీదే అనుమానం. అతను దొంగిలించకపోయినా, దొంగలెవరో అతనికి తెలుసని అతని నమ్మకం. అందుకే ఓసారి గర్భగుడి అంతా పరిశీలించి చూడాలనీ, అప్పుడు శంకరయ్య మొహంలోని భావాలు చదవాలనీ నిర్ణయించుకుని, పొద్దునే్న వస్తున్నాననీ, గుడి లోపలంతా చూడాలనీ ఫోన్ చేశాడు.
‘తప్పకుండా. కనీసం అక్కడైనా ఏదైనా ఆధారాలు దొరుకుతాయేమో’ అన్నాడు శంకరయ్య. ఆలోచనలో పడ్డాడు ఎస్.పి.
కొన్ని క్షణాల తర్వాత మర్నాడొస్తానని చెప్పి ఫోన్ కట్ చేశాడు.
ఎందుకో ఆ రాత్రి కన్నుమూత పడలేదు శంకరయ్యకి. ఏదో భయం అతన్ని వణికించేసింది.
రాత్రి పనె్నండయింది. ఏదో ఓ నిర్ణయానికొచ్చినట్టు మెల్లగా లేచాడు. పక్క మంచం మీద పడుకున్న కూతురికేసి చూశాడు. ఆమె గాఢనిద్రలో వుండడం, ఇనప్పెట్టె తెరిచి, అందులోని తాళాల గుత్తి తీసుకుని చప్పుడు కాకుండా బైటికొచ్చాడు. గుడికేసి అడుగులు వేస్తుంటే కాళ్లు తడబడుతున్నాయి. అరచేతులు చెమటతో తడిసిపోతున్నాయి.
అలా తూలుతున్నట్టు వెళ్లి గుడి తలుపులు తీసి లైట్లు వేశాడు. ఓసారి పరిసరాలు పరికించి, మళ్లీ తలుపులు మూసి గర్భగుళ్లోకెళ్లాడు. ఓసారి తిరిగి చూసి ఆ తలుపు కూడా మూశాడు. అమ్మవారి ముందు వెలిగించిన నేతి దీపాలు ఇంకా వెలుగుతూనే ఉన్నాయి. నిలువెత్తు విగ్రహం వెనక మాత్రం మసక వెలుతురుంది. రాతి విగ్రహం వెనుక వున్న నటరాజ విగ్రహాన్ని అతి ప్రయాసగా కదిలించాడు. అది కాస్త పక్కకి జరగ్గానే ఓపాటి మార్గం ఏర్పడింది. గరుడ వాహనం దగ్గరున్న టార్చ్‌లైట్ తీసుకుని దాని సాయంతో, సన్నని మెట్ల ద్వారా కింద వున్న భూగృహంలోకెళ్లాడు. కొండల్లోంచి వూరిన నీటివల్ల అక్కడంతా చితచితలాడుతోంది. అవేం గమనించే స్థితిలో లేడతను.
మెల్లగా రాతి నంది వెనుక వున్న పెద్దపెట్టె తెరిచాడు. అతని కళ్లల్లోకి వింత కాంతి వచ్చింది. ఆ పెట్టె నిండా అమ్మవారి, అయ్యవారి అమూల్యాభరణాలు తళుక్కుమన్నాయి. అందులోంచి ఓ నగ తీసి గుండెలకి హత్తుకున్నాడు. తర్వాత యధాప్రకారంగా పెట్టేశాడు.
కొన్ని క్షణాలు ఏదో ఆలోచించి, పెట్టె మూసేసి మళ్లీ పైకొచ్చేసి, ఎక్కడ తీసినవి అక్కడ పెట్టేసి, అమ్మవారి ముందు సాష్టాంగపడి ఏమీ ఎరగనట్టు ఇల్లు చేరుకుని తేలిగ్గా ఊపిరి తీసుకున్నాడు.
* * *
రాత్రి ఎనిమిది గంటలయింది. విశాలమైన ఆ నర్సింగ్ హోమ్‌లోని ఓ గదిలో గౌతమి, మరో యువకుడు కూర్చున్నారు. ఆ యువకుడి పేరు అనిల్. ఎమ్మెస్ చేసి సింగపడవికి కాస్త దగ్గరున్న ఓ ఊళ్లో నర్సింగ్‌హోమ్ పెట్టాడు. మనిషి అందంగా, హుందాగా ఉంటాడు. అతనికి గౌతమి అంటే ప్రాణం. ఆమెక్కూడా అతనంటే ఇష్టమే. వాళ్ల మనసులు తెలిసిన శంకరయ్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చి పెళ్లి చెయ్యడానికి సిద్ధంగా ఉన్నాడు. అందుకే తరచూ వచ్చి ఆ నర్సింగ్‌హోమ్‌లో పని చేస్తూ అతనికి సాయపడుతూంటుంది. కానీ ఇటీవల రావడం లేదు. విషయం తెలిసిన అనిల్ వెళ్లి ధైర్యం చెప్తున్నాడు. పని వత్తిడి వల్ల నాలుగైదు రోజులుగా ఆమెని కలవలేదు.
‘ఏవిటి గౌతమీ! దిగులుగా కనిపిస్తున్నావు?’ అన్నాడు అనునయంగా.
‘ఏం చెప్పను అనిల్! ఈ దోపిడీ జరిగిందగ్గర్నించీ నాన్న బాగా కృంగిపోయారు. ఎప్పుడూ పరధ్యానంగా ఉంటున్నారు. దానికితోడు పోలీసుల పిచ్చి ప్రశ్నలు. ఆయన పూజా కార్యక్రమాలు కూడా సరిగ్గా చెయ్యలేక పోతున్నారు’ దిగులుగా అంది గౌతమి.
‘బ్లాక్ టైగర్‌ని గురించి భయపడుతున్నారేమో?’
‘బ్లాక్ టైగర్ గురించా?’ తుళ్లిపడిందామె.
‘అవును! అతనెక్కడున్నా, ఎక్కడేం జరిగినా కనిపెట్టేస్తాడు. ఆ దోపిడీ కూడా అతనే చేశాడని అందరూ అనుకోవడం కూడా అతనికి తెలిసుంటుంది. ఈ విషయం మీరే చెప్పారేమో అని అనుమానించవచ్చు కూడా. అతని సంగతి తెలిసిన మీ నాన్నగారు అతనేం చేస్తాడో అని కంగారు పడుతున్నారేమో’ ఏదో ఆలోచిస్తూ అన్నాడు అనిల్.
‘్ఛఛ! అలాంటిదేం లేదు. అసలు నాన్న నోరు విప్పడం లేదు. ముఖ్యంగా ఆ బ్లాక్‌టైగర్‌ని గురించి!’
‘ఏది ఏమైనా ఇంక మీరా కొండ మీద ఉండడం అంత క్షేమం కాదనిపిస్తోంది. అందుకే మా ఇంటికొచ్చెయ్యండి! పెళ్లయ్యాక ఎలాగూ రావాలిగా’ అన్నాడతను చిలిపిగా.
‘లాభం లేదు’ నవ్వింది గౌతమి.
‘అదేంటి మా ఇంటికి రావడమా, నన్ను పెళ్లి చేసుకోవడమా’ భయం నటించాడతను.
‘పెళ్లి చేసుకుంటాను. కానీ కాపురానికి రాను. నువ్వే ఇల్లరికం రావాలి’
‘ఓకే! ఇద్దరం కలిసి ఆ కొండ మీది దేవుళ్లకీ, పశుపక్ష్యాదులకీ వైద్యం చేసుకుంటూ ఎంచక్కా డ్యూయెట్లు పాడుకుంటూ బతికేద్దాం’ నవ్వుతూ అన్నాడు అనిల్.
గౌతమి గలగల నవ్వేసింది.
‘నిజంగా నీకా గుట్టంటే చాలా ఇష్టం కదూ!’ అన్నాడతను.
‘నిజమే అనిల్! ఆ కొండకీ నాకూ అవినాభావ సంబంధం ఉందనిపిస్తోంది. ఊహ తెలిసిందగ్గర్నుంచీ ఆ ఇంట్లోనే ఉన్నాను. అక్కడి చెట్లతోనూ, పుట్టలతోనూ ఆడుకున్నాను. చిరుజంతువులని మచ్చిక చేసుకున్నాను. అలాంటి సుందర ప్రదేశాన్ని అంత తేలిగ్గా వదులుకోగలమా?’ అంది తనని తాను మర్చిపోయినట్లు.
‘నిజమే ఆ గుట్టకీ మీకు విడదీయలేని బంధం ఉంది’ అన్నాడు అనిల్.
‘కానీ అదేం ఆలోచించకుండా మేమే దొంగలు అన్నట్టు చూస్తున్నాడా ఎస్.పి.’
‘ఈ పోలీసులే అంత. అసలు నేరస్తుల్ని పట్టుకోలేక అమాయకుల్ని కటకటాల వెనక్కి నెట్టి చేతులు దులుపుకుంటారు. అసలు దొంగైన ఆ బ్లాక్ టైగర్ జోలికెళ్లలేక ఎదురుగా ఉన్న మిమ్మల్ని నేరస్థుల్ని చెయ్యాలని చూస్తున్నారు. నా కంఠంలో ప్రాణం వుండగా వాళ్లు మీ జోలికి రారు. నిశ్చింతగా ఉండండి. నువ్వు మాత్రం రోజూ ఏదో ఓ టైమ్‌లో వచ్చి వెళ్తూండాలి’ ఆమె చేతులు పట్టుకుని బతిమాలుతున్నట్టు అన్నాడు అనిల్.
‘నాకూ రావాలనే ఉంది అనిల్. కానీ, నాన్న పరిస్థితి చూశాక ఆయన్నొదిలి రావాలని అనిపించడంలేదు. ఆ దొంగలు దొరికితే గానీ అందరి మనసులూ కుదుటపడవు’ అంది గౌతమి బాధగా.
‘కానీ ఆ టైగర్ అంత తేలిగ్గా దొరకడు’
‘అంటే దోపిడీ ఆ టైగరే చేశాడంటావా?’
‘నేనే కాదు. లోకమంతా అదే అంటోంది. నోరులేని జాగిలాలు కూడా నిర్ణయించేశాయి. అవి లోపలికెళ్లి తిరిగొచ్చాయి. గుర్తులేదూ?’
‘ఆ నగల్ని అతనేం చేసుకుంటాడు?’
‘అదేంటి పిచ్చి ప్రశ్న? వాటిని అమ్ముకుని సొమ్ము చేసుకుంటాడు. వాడు అడవిలో వున్నా బైటి పనులు చాలా చేయించగలడు’ అన్నాడు అనిల్.
‘అయితే వాటిని తీసికెళ్లి అమ్ముకుంటాడంటావా?’ ఆతృతగా అంది గౌతమి.
అతను నవ్వాడు.
‘గౌతమీ! నీ ధోరణి చూస్తుంటే అతన్ని, అతను దొంగిలించిన ఆభరణాలనీ నేను చూసినట్టు, అవి అమ్ముతాడని నాకు తెలిసినట్టు మాట్లాడుతున్నావు. నీలాగే నేనూ వూహిస్తున్నా నంతే!’ ఆమె చేతుల్ని తన చేతుల్లోకి తీసుకుంటూ మృదువుగా అన్నాడు.
‘సారీ అనిల్ దీంట్లో నాన్న ఎక్కడ చిక్కుకుంటారో అన్న కంగారులో ఏదేదో మాట్లాడేశాను’ అంది గౌతమి నొచ్చుకుంటూ.
‘ఇంక ఆ దోపిడీల గురించీ, బ్లాక్ టైగర్ని గురించీ మర్చిపోయి ఏమైనా తియ్యని కబుర్లు చెప్పు’ అన్నాడు తను నవ్వుతూ.
గౌతమి మొహం సన్నంగా అయిపోయింది.
ఇద్దరూ కలిసి ఏవో కబుర్లు చెప్పుకున్నారు. హాయిగా నవ్వుకున్నారు.
‘ఎప్పటికైనా ఆ దొంగలు దొరుకుతారంటావా అనిల్?’ అంది గౌతమి హఠాత్తుగా.
‘ఏ దొంగలు?’
‘ఏ దొంగలేంటి అనిల్? అమ్మవారి నగల్ని దొంగిలించిన వాళ్లు’
‘ఓ! ఆ బ్లాక్ టైగర్ని గురించా? ప్చ్! అది అసాధ్యమే’ నిరాశగా అన్నాడు అనిల్.
‘నాకెందుకో ఆ దోపిడీకీ, బ్లాక్ టైగర్‌కీ సంబంధం ఉందని అనిపించడం లేదు అనిల్’ అంది గౌతమి.
త్రుళ్లిపడ్డాడు అనిల్.
‘ఏమన్నావ్?’ అన్నాడు విస్మయంగా.
‘అవును అనిల్! ఈ దోపిడీ ఎవరో చేసి అతని మీదికి తొయ్యాలని చూస్తున్నారని నా అనుమానం’
‘నీకెవరి మీదైనా అనుమానం ఉందా?’
‘్ఫలానా వాళ్లు చేసుంటారని తెలియదు కానీ, ఇది మాత్రం ఆ టైగర్ చెయ్యలేదనిపిస్తోంది’
‘ఎందుకని?’
‘ఆ బ్లాక్ టైగర్ వృద్ధుడు. అదీగాక, దశాబ్దాలుగా అతను దొంగతనాలు, దోపిడీలూ చేసినా ఎన్నడూ అమ్మవారి నగల జోలికి రాలేదు. అన్నింటికన్నా మించి అతను దేవీ భక్తుడని విన్నాను. అలాంటి వాడు అమ్మవారి మంగళ సూత్రాల దగ్గర్నించి దోచుకుపోతాడా?’
‘పిచ్చి గౌతమ్! దైవభక్తికీ దొంగతనానికీ సంబంధం ఏవిటి. నిజంగా అతగాడు దైవభక్తి కలవాడైతే దొంగతనాని కెళ్లేటప్పుడు దణ్ణాలు పెట్టుకుని మరీ వెళ్తాడు. అంతెందుకు ఆలయంలో రెండు పూటలా అర్చనలు చేసే అర్చకులు దేవుడికే నామంపెట్టి హుండీల్లోని సొమ్మంతా కైంకర్యం చేసిన ప్రబుద్ధుల మాటేవిటి?’
‘నిజమే అనుకో! చాలామందికి మా నాన్నమీద అనుమానంగా ఉంది, నిజం చెప్పు! మా నాన్న అంత దుర్మార్గుడా?’ దీనంగా అంది గౌతమి.
‘్ఛఛ! ఆయన్నంటే ఆ భగవంతుణ్ణే అన్నట్టు, నువ్వు వాళ్ల మాటలు పట్టించుకోకు’ ఆమె భుజం మీద చెయ్యేసి అనునయంగా అన్నాడు అనిల్.
గౌతమి మొహంలోకి కాస్త వెలుగొచ్చింది.
తర్వాత ఇద్దరూ సరదాగా ఏవేవో మాట్లాడుకున్నారు. పది దాటాక ఇద్దరూ డిన్నర్ తీసుకున్నారు.
భోం చేస్తున్నంతసేపూ ఏవేవో కబుర్లు చెప్పి ఆమెని నవ్వించాడు అనిల్. తర్వాత తనే స్వయంగా తన కార్లోనే తీసికెళ్లి వాళ్లింట్లో దించేసి వెళ్లిపోయాడు.
* * *
తండ్రి పూజా పునస్కారాలు పూర్తి చేసుకుని వచ్చేసరికి భోజనం సిద్ధం చేసింది గౌతమి. ఇద్దరూ ఏదో మాట్లాడుకున్నారు. భోజనాలు ముగించి హాల్లోకొచ్చారు. తండ్రి మొహంలోని అలసట గమనించిన గౌతమి-
‘నువ్వెళ్లి కాస్సేపు పడుకో నాన్నా’ అంది.
అతనికీ కాస్సేపు పడుకోవాలనే ఉంది. అయితే అప్పుడే ఎస్.పి., బృందం వచ్చేశారు.
‘మళ్లీ కొంపమీదికేం తెచ్చాడో’ అనుకుంటూనే అతనికి విష్ చేసి లోపలికి ఆహ్వానించారు తండ్రీ కూతుళ్లు. ఎస్.పి. లోపలికొచ్చినా మిగతా వాళ్లు బైటే ఉండి కబుర్లలో పడ్డారు.
‘నిజంగా మీ ఇల్లు చాలా బాగుంది పంతులుగారూ! ఈ కొండ మీద, అదీ ఓ అర్చకుల కోసం ఇంత చక్కని ఇల్లు కట్టించారంటే, మేనేజ్‌మెంట్ వాళ్లని అభినందించాల్సిందే’ కూర్చోకుండానే ఇంటిని పరిశీలనగా చూస్తూ అన్నాడు ఎస్.పి.
సంబంధం లేని ఆ ప్రశంసలకి అర్థాలు వెతుక్కుంటూనే-
‘నిజమే సర్! అది దైవసంకల్పం. అవునూ.. ఇంతకు ముందు ఇల్లంతా
చూశారేమో?’ అంది గౌతమి.
‘అఫ్‌కోర్స్! కానీ.. అప్పుడంతా టెన్షన్‌లో వున్నాం కదా. పెద్దగా గమనించలేదు. అన్నట్టు మీరు బట్టలు ఆరేసుకునే తాడుతోనే కదా పంతులుగార్ని కట్టి పడేసింది? మీ ఇంట్లోని తాడు ఆ దొంగలకెలా దొరికిందో?’ యధాలాపంగా అన్నట్టు అన్నాడు ఎస్.పి.
‘పెరట్లో పడుంటే తీసికెళ్లుంటారని అప్పుడనుకున్నాంగా! మళ్లీ కొత్తగా ఈ అనుమానం ఎందుకొచ్చింది?’ బలవంతంగా నవ్వుతూ అంది గౌతమి.
‘ఎసెస్! అప్పుడనుకున్నాం కదా..’ అంటూ చనువుగా ఇల్లంతా తిరిగి తెగ మెచ్చేసుకుంటూ ఓ చోట ఠక్కున ఆగిపోయాడు ఎస్.పి. ఓ మూలగా పడున్న వస్తువులకేసి పరిశీలనగా చూస్తూ-
‘ఇవేంటి? అనెస్తిషియాకి సంబంధించినవి కదూ?’ అన్నాడు.
గతుక్కుమన్నారు తండ్రీ కూతుళ్లు.
‘అవును. నేను డాక్టర్ని కదా?’ తేరుకున్న గౌతమి బలవంతంగా నవ్వుతూ అంది.
‘అది నాకు తెలుసు. కానీ డాక్టర్లకి సంబంధించిన మందులు గానీ, అక్యూబ్‌మెంట్స్ గానీ ఏం లేవు. ఇక్కడ మీరు పేషెంట్స్‌ని చూడరని కూడా విన్నాను. మరి ఈ సరంజామా ఎందుకుంది?’ కాస్త సీరియస్‌గానే అన్నాడు ఎస్.పి.
‘అంటే ఇలాంటివి నా దగ్గర ఉండకూడదంటారా?’ గౌతమి గొంతులోకి కూడా తీక్షణత వచ్చేసింది.
‘అనను. కానీ ఆనాటి తాడుకి, దీనికి ఏదో సంబంధం ఉందని మాత్రం అంటాను.. అంటే - కారణం ఏదైనా మీ నాన్నగారికి స్పృహ పోవడానికి కారకులు దొంగలు కాదంటాను.’
‘ఎస్.పి.గారూ! ఈ డొంకతిరుగుడు మాటలెందుకు? ఆ దొంగతనం మేమే చేసి, దొంగలు చేసినట్టు నమ్మించడానికి నేనే మా నాన్నగారిని కట్టేసి స్పృహ తప్పించానని చెప్పండి’ అంది గౌతమి తీక్షణంగా.
‘్ఛ! అలా అని ఎందుకంటాను? కానీ మీరేదో రహస్యం దాస్తున్నారని నా అనుమానం. మీరు కోపరేట్ చేస్తే గానీ అసలు దొంగలు దొరకరు’ అన్నాడు ఎస్.పి.
‘మేం మొదట్నించీ జరిగినవన్నీ చెప్తూనే ఉన్నాం. జరిగిందానికి మీకన్నా ఎక్కువ బాధ పడుతున్నాం. అలాంటిది - దొంగల గురించిన రహస్యాలు ఎందుకు దాస్తాం? దయచేసి మా మాటలు నమ్మండి’ రెండు చేతులూ జోడించి దీనంగా అన్నాడు శంకరయ్య.
‘సరే! త్వరలో అన్నీ బైటికొస్తాయి. బాగా ఆలోచించుకుని ఏదైనా చెప్పాలనుకుంటే ఫోన్ చెయ్యండి’ అంటూ వెళ్లిపోయాడు ఎస్.పి. బృందంతో సహా.
‘నాన్నా! ఈయనకి మన మీద అనుమానం పెరిగిపోయింది. ఇప్పుడేం చేద్దాం?’ బేలగా అంది గౌతమి.
‘చెప్తాను. నువ్వు మాత్రం జాగ్రత్తగా ఉండు. ఈ పోలీసులు రకరకాల ప్రశ్నలతో కంగారు పెట్టేస్తారు’ ఏదో ఆలోచిస్తూ అన్నాడాయన.
‘నా గురించి బెంగపడకు. ఒకటి చెప్పు! ఈ మధ్య ఆ బ్లాక్ టైగర్ని చూశావా?’ అందామె ఆదుర్దాగా.
‘లేదమ్మా. ఇరవైఏళ్ల క్రితం చూడ్డమే. వయసు మీద పడ్డా ఈ దోపిడీలేవిటో. ఇన్ని దోపిడీలు చేసి ఏం కట్టుకుపోతాడు?’ భారంగా అన్నాడు శంకరయ్య.
‘అలవాటైన ప్రాణం ఊరుకుంటుందా?’
‘సరే.. నువ్వా అనెస్తేషియాకి సంబంధించినవన్నీ తీసి అవతల పడెయ్’
‘ఒద్దు నాన్నా! ఇవాళ చూసింది రేపు కనిపించకపోతే ఆ ఎస్.పి.కి మరింత అనుమానం పెరుగుతుంది. వాటినలాగే ఉండనీ. ఏది ఏమైనా మనల్ని గురించి ఎవరూ అనుమానించరు. అనుమానించినా ప్రూ చెయ్యలేరు’ అంది గౌతమి.
కానీ హత్యలు జరిగినప్పుడు నేను గుళ్లో లేననీ, తర్వాత వచ్చి చూసి కంగారుపడిపోయి, నీ సాయంతో బంధితుణ్ణయి స్పృహ పోగొట్టుకున్నాననీ ఆ ఎస్.పి. కనిపెట్టేసినట్టున్నాడు’ కాస్త దిగులుగా అన్నాడు శంకరయ్య.
‘దాని గురించి నువ్వేం కంగారు పడకు. ఆ నగల వివరాలు ఎవరికీ తెలియవుగా?’ గొంతు తగ్గించి అంది గౌతమి.
‘కొన్ని వివరాలు తెలుసు’ అంటూ ఆ వివరాలు మెల్లగా చెప్పాడు శంకరయ్య.
తర్వాత దొంగతనం గురించి అమ్మవారి నగల గురించి మాట్లాడుకున్నారిద్దరూ.
ఆ రాత్రి మంచాలు చేరినా రెప్ప అంటుకోలేదా తండ్రీ కూతుళ్లకి. రకరకాల ఆలోచనలు, భయాలూ వాళ్లని నిద్రకి దూరం చేశాయి.
అర్ధరాత్రి దాటుతుండగా రెప్పలు మూతపడ్డాయి. అయితే పది నిమిషాలు గడిచాయో లేదో, గుర్రాలు పరిగెడుతున్న శబ్దాలు డ్రమ్ము మోతల్లా వినిపించి త్రుళ్లిపడి లేచారు. ఆతృతగా కిటికీ దగ్గరికెళ్లి చూశారు. వెనె్నల పుచ్చపువ్వులా ఉండటం వల్ల అంతా స్పష్టంగా కనిపిస్తోంది.
పరిశీలనగా చూస్తున్న ఆ తండ్రీ కూతుళ్ల గుండెలు ఆగినంత పనయింది.
కారణం ఆ గుర్రాలు గుడికేసే వస్తున్నాయి.
‘నాన్నా! వాళ్లు బ్లాక్ టైగర్ వాళ్లే కదూ?’ కంగారుగా అంది గౌతమి.
‘కావచ్చు. కానీ వాళ్లు ఇటుకేసి ఎందుకొస్తున్నట్టు?’
శంకరయ్య మొహంలో తెలియని భీతి తొంగి చూసింది.
‘నగల కోసమేమో..’
‘నగల కోసమా? వాటిని గురించి వాళ్లకేం తెలుసు?’
‘లేకపోతే కట్టడాలలో మిగిలిన సంపద కోసం వస్తున్నారేమో’ అంది గౌతమి. అతను మాట్లాడలేదు.
‘అదే అయుంటుంది నాన్నా! గుళ్లో నగలు పోయాయన్న సంగతి వాళ్లకి తెలిసే ఉంటుంది. మిగిలినవైనా దోచుకుందామనుకుని వస్తున్నారేమో?’ మళ్లీ గౌతమే అంది.
‘లేదమ్మా! ఎక్కడ ఎన్ని రకాల దోపిడీలు, దొంగతనాలు చేసినా అమ్మవారి నగల కోసమే కాదు. ఈ గుట్టకేసి చూడనైనా చూడలేదు. అతనెంత కర్కోటకుడైనా, అతనిలో కూడా మానవత్వం ఉంది.’ ఏదో ఆలోచిస్తూ అన్నాడు శంకరయ్య.
తండ్రికేసి పరిశీలనగా చూస్తూ
‘ఏమైనా ఈ విషయంలో మనం పొరపాటు చేశాం నాన్నా’ అంది గౌతమి.
‘గౌతమీ?’
‘అవున్నాన్నా! చక్కని ఈ కొండ మీద, చల్లని ఈ అమ్మవారి నీడలో ఎలాంటి లోటూ లేకుండా ప్రశాంతంగా బతుకుతున్నాం. కానీ.. ఈనాడు.. మనం చేసిన పని.. ప్చ్! తొందరపడ్డాం!’ అంది గౌతమి భారంగా. శంకరయ్య మొహం పాలిపోయింది.
‘సరే జరగవలసిందేదో జరిగిపోయింది. ఇప్పుడు ఆలోచించి ప్రయోజనం లేదు. ఆ ఎస్.పి. గారి దగ్గరికెళ్లి జరిగింది చెప్పేస్తే?’ తండ్రి మొహంలోని నీలినీడలు చూసి అనునయంగా అంది గౌతమి.
‘వొద్దొద్దు! ఆ పని మాత్రం చెయ్యొద్దు’ అని కిటికీ దగ్గరకెళ్లి చూశాడు శంకరయ్య.. అయితే గుర్రాలు గానీ, రౌతులు గానీ కనిపించలేదు. ఎందుకో అతని మనసు కాస్త కుదుటపడింది. కానీ మారు వేషంలో వచ్చిన పోలీసులని వాళ్ల కర్థమైపోయింది.
‘చాలా టైమైంది. ఇంక పడుకో’ అంటూ మంచం మీద వాలాడు. పోలీసుల దగ్గర మరింత జాగ్రత్తగా ఉండాలనుకుంటూ.
‘మరి.. ఆ నగల సంగతి...’ మెల్లగా అంది గౌతమి.
‘దాన్ని గురించి రేపు ఆలోచిద్దాం’ అంటూ కళ్లు మూసుకున్నాడు శంకరయ్య. అయితే ఇద్దరూ నిద్ర నటించారే కానీ నిద్రపోలేదు.
* * *
పోలీసులు, మిగతా ప్రభుత్వ యంత్రాంగం ఎన్ని విధాలుగా ప్రయత్నించినా దోపిడీ తాలూకు ఆచూకీ ఏ మాత్రం దొరకలేదు. మామూలుగా అయితే పోలీసులు కేసు ఎప్పుడో క్లోజ్ చేసేసేవాళ్లే. కానీ సి.ఎం. పట్టుదల వల్ల ప్రయత్నాలు ముమ్మరం చేశారు.
ఆ రోజు సి.ఎం. చంద్ర ముఖ్యులతో రహస్య సమావేశం ఏర్పాటు చేశాడు.
‘దోపిడీ చాలా పకడ్బందీగా చేశారు సార్. ఒక్క ఆధారం కూడా లేకుండా జాగ్రత్త పడ్డారు’ అన్నాడు ఐ.జి.
‘ఇది కచ్చితంగా ఆ బ్లాక్ టైగర్ పనే అయుంటుంది సార్. లేకపోతే ఆ కొండమీదకెళ్లి సెక్యూరిటీ వాళ్లని చంపి ఆభరణాలు దోచుకెళ్లే ధైర్యం ఎవరికుంటుంది?’ అన్నాడు డిజిపి.
‘దొంగతనం ఎవరు చేసినా సొమ్ము చేసుకోవడానికేగా. మరి ఆ కోణంలో ప్రయత్నించారా?’ కాస్త చిరాగ్గానే అన్నాడు చంద్ర.
‘అయ్యో! అలాంటి వస్తువులు కొనే వాళ్లందరి దగ్గరా మఫ్టీలో మనవాళ్లని పెట్టాం సార్. అంతేకాదు, అవి దేశం దాటకుండా తగిన ఏర్పాట్లు కూడా చేశాం’ అన్నాడో ఆఫీసర్.
‘దోపిడీలో అతనికీ భాగం ఉందంటారా?’
‘లేకపోవచ్చు. కానీ దోపిడీని గురించి అతనేదో దాస్తున్నాడని నా అనుమానం. కాదు. నమ్మకం సార్’ అన్నాడు తరచూ శంకరయ్య ఇంటికెళ్లొస్తున్న ఎస్.పి.
‘నాలుగు తగిలిస్తే వాడే చెప్తాడు’ అన్నాడు ఐ.జి.
‘తొందరపడకండి. అతన్ని అబ్జర్వ్ చేస్తూండండి. ఎలాగైనా ఆ దొంగల్ని పట్టుకుని నగలని కాపాడాలి. ఆ బ్లాక్ టైగరే చేశాడని తేలితే అడవిలోకి వెళ్దాం. కానీ ఏం చేసినా చక్కని ప్లాన్ ప్రకారం చెయ్యాలి’ అన్నాడు చంద్ర. తర్వాత రెండు మూడు గంటలు ఏవేవో పథకాలు వేసుకుని తృప్తిగా లేచారంతా.
(ఇంకా ఉంది)

-రావినూతల సువర్నాకన్నన్