వీక్లీ సీరియల్

పాతాళస్వర్గం-2

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాలగమనంలో ఆలయ శిఖరం తప్ప ఇంకేం కనిపించనంతగా చెట్లు పెరిగిపోవడం వల్ల ఆలయ పరిసరాల్లో చీకటిగా ఉంటుంది. అలా అని అక్కడ కరెంట్ సౌకర్యాల్లేవని కాదు. భూలోకంలోని కైలాసం అన్నంత వైభవంగా ఉంటుంది. తగ్గ సెక్యూరిటీ ఉంది. అయినా దొంగతనం జరిగింది.
పోలీసులు జనాలని కంట్రోల్ చేస్తూనే కొండ మీది ఆలయం దగ్గరికి చేరుకుని షాక్ కొట్టినట్లు కొన్ని క్షణాలు బిగుసుకు పోయారు. కారణం అక్కడుండే ఇద్దరు సెక్యూరిటీ గార్డులు నెత్తురు మడుగులో పడున్నారు. తేరుకుని గర్భగుళ్లోకెళ్లారు. శతాబ్దాలుగా భద్రపరచిన జహ్వరీ మంగళ సూత్రాలతో సహా మాయమై పోయాయి. ఎలక్ట్రిసిటీ మెయిన్ బోర్డు దగ్గరంతా ధ్వంసం చేయబడి ఉంది. పోలీసు బలగం తెచ్చుకున్న పవర్‌ఫుల్ టార్చ్ వెలుగులో తుఫాన్‌లో చిక్కుకున్న పూదోటలా ఉంది గుడి అంతా. ఆలయ పూజారి శంకరయ్య, ఓ మూలగా కట్టిపడేసి, శవంలా పడున్నాడు. అతనిలో జీవం ఉందని గ్రహించిన ఎస్.పి. అతన్ని హాస్పిటల్‌కి పంపే హడావిడిలో వుండగా, కంగారు పరుగెత్తుకొచ్చిందో యువతి. ఆమెకి దుఃఖం తన్నుకొస్తోంది.
‘మీరు?’ కళ్లు చిట్లించి చూస్తూ అడిగాడు ఎస్.పి.
‘ఈయనే ఆలయ పూజారి శంకరయ్యగారు. ఆయన కూతుర్ని నేను. నా పేరు గౌతమి. గుడిపక్కనున్న ఇంట్లోనే మేముంటాం. ఒక్కసారి మా నాన్నగారిని చూడొచ్చా?’ వేడుకోలుగా అందామె.
‘ఆయనకి స్పృహ లేదు. హాస్పిటల్‌కి తీసుకెళ్లాలి’
‘అందుకే. నేను చూస్తాను. సారీ! మీకు చెప్పలేదు కదూ! నేనూ డాక్టర్నే’
‘అలాగా. అయితే చూడండి’ అంటూ పక్కకి తప్పుకున్నాడు ఎస్.పి. ఆమెని గురించి ఆలోచిస్తూనే.
ఆమె తండ్రిని పరీక్షించి, ఎస్.పి. అనుమతితో ఇంట్లోకెళ్లి మెడికల్ కిట్ తెచ్చి ప్రథమ చికిత్స చేసింది. పది నిమిషాల తర్వాత మెల్లగా కళ్లు తెరిచాడు శంకరయ్య.
హాస్పిటల్‌కి తీసికెళ్లాలనుకున్న పోలీసులు, ఆయన తేరుకోవడంతో తేలిగ్గా ఊపిరి తీసుకున్నారు. అతని ద్వారా, దొంగల గురించి మొత్తం తెలుసుకోగలం అన్న నమ్మకం కుదిరింది. ఎస్.పి. అనుమతితో తండ్రిని ఇంట్లోకి చేర్పించింది గౌతమి.
అప్పటికే తెల్లవారిపోయింది.
ఎస్.పి. శంకరయ్య నించి ఎన్నో వివరాలు రాబట్టాలని ప్రయత్నిస్తున్నాడు. అయితే శంకరయ్య ఆ దృశ్యం గుర్తొచ్చినప్పుడల్లా భయంతో వణికిపోతున్నాడే కానీ నోరు తెరవలేక పోతున్నాడు. అంతా గమనిస్తున్న గౌతమి -
‘నాన్న షాక్‌లో వున్నారు. కాస్త తేరుకున్నాక అన్ని విషయాలూ అడిగి తెలుసుకోవచ్చు. ఇప్పటికి ఆయన్ని రెస్ట్ తీసుకోనివ్వండి. ప్లీజ్’ అంది వేడుకోలుగా.
అతను ఎవరితోనో మాట్లాడి-
‘సరే... జాగ్రత్తగా చూడండి. రేపు కలుద్దాం’ అంటూ బయటకి నడిచాడు.
అప్పటికే గార్డ్స్ శవాలని పోస్టుమార్టంకి పంపించడం, గుడిలో ఫొటోలూ, ఇతర ఆధారాలు సేకరించడం లాంటివి జరిగిపోయాయి.
* * *
సింగపడవి అన్నది అతి భయంకరారణ్యం. ఒకప్పుడు అక్కడ సింహాలు విచ్చలవిడిగా తిరగడం మూలంగా దానికా పేరు వచ్చిందంటారు. ప్రస్తుతం సింహాలు అంతగా లేకపోయినా, అక్కడక్కడా కనిపిస్తూనే ఉంటాయి. వాటితోపాటు పులులు, చిరుతలు, తోడేళ్లు లాంటి జంతువులు సంచరిస్తున్నట్టు వాటి అడుగుజాడలు చెప్తుంటాయి. అంతేకాదు - ఆ అడవిలో క్రూర జంతువులకన్నా, భయంకరమైన బందిపోటు దొంగల ముఠాలున్నాయని కూడా అంటారు. వాళ్ల నాయకుడు బ్లాక్ టైగర్.
అయితే అతని చర్యలు విన్నవారే తప్ప అతన్ని చూసినవారు లేరు. అందుకే అతన్ని గురించి ఎవరికి తోచినట్లు వారు ఊహించుకుంటూంటారు. ఆ అడవికేసి చూడడానిక్కూడా సాహసించరు. కానీ అడవి మొదట్లోనే ఉన్న కొండమీది అమ్మవారికి అత్యంత మహిమలున్నాయన్న నమ్మకంతో పొద్దుపోక ముందే వెళ్లి దైవ దర్శనం చేసుకుంటూంటారు.
అంతే కాదు. అతి పురాతన ఆలయమైనా శిథిలావస్థలో ఉండదా ఆలయం. అత్యాధునిక సౌకర్యాలతో సెక్యూరిటీ గార్డ్స్‌తో, పవర్‌ఫుల్ లైట్స్‌తో వైభవోపేతంగా ఉంటుంది. అన్ని హంగులు దానికుండడానిక్కారణం, దైవ విగ్రహాలకే కాక, ఆలయ కట్టడాలలో సైతం అపూర్వ మణిమాణిక్యాలను పొందుపరచడమే. ఆ సంపదని ఇటు ప్రజలు, అటు ప్రభుత్వం కాపాడుకుంటున్నారు.
ఆ ఆలయ పూజారి శంకరయ్య దశాబ్దాలుగా ఆ కొండమీదే ఉంటున్నాడు. పదేళ్లనాడు భార్య కాలం చేసినా వున్న ఒక్క కూతురు గౌతమి డాక్టర్ పట్టా తీసుకున్నా అతను మాత్రం కొండ దిగి ఎక్కడికీ వెళ్లలేదు. గౌతమి కూడా పట్నంలో చదివినా తండ్రితోపాటు కొండమీదే ఉండిపోయింది. ఆ కొండన్నా, ఆలయ ప్రాంగణమన్నా వాళ్లకి ప్రాణం.
అదీగాక శంకరయ్య మనుగడ కూడా సామాన్య పూజారి మనుగడలా ఉండదు. వైభవంగానే ఉంటుంది. చక్కని ఇల్లు, దానికి తగిన సరంజామా, ఫోన్ సౌకర్యం లాంటివి అన్నీ ఉన్నాయి. గౌతమిక్కూడా ఆ పరిసరాలంటే ఎంతో ఇష్టం. కొండ మీది నుంచి చుట్టుపక్కల తిరిగే మనుషుల్ని, దూరంగా కనిపించే గ్రామాలని చూడటమంటే మరీ ఇష్టం.
చిత్రమేమిటంటే ఆ ఆలయంలో అమూల్య సంపద ఉందని అందరికీ తెలుసు. అడవిలో భయంకరమైన అడవి దొంగలు... బయట కిలాడీ దొంగలు చాలామందే ఉన్నా ఇంతవరకు ఆ ఆలయం జోలికి ఎవరూ వెళ్లలేదు. అందుకేనేమో ఆ తండ్రీ కూతుళ్లకంత నిశ్చింత. కానీ హఠాత్తుగా గుడి మీద దాడి జరిగింది. ఇద్దరు సెక్యూరిటీ గార్డులు నేలకొరిగారు. పవిత్రమైన ఆలయం నెత్తురుతో తడిసింది.
ఈ సంఘటన క్షణాల్లో కార్చిచ్చులా అంతటా వ్యాపించి పోయింది.
రూమ్‌లో అసహనంగా పచార్లు చేస్తున్నాడు చంద్ర. అతని ముందు రకరకాల పేపర్లు పరచి ఉన్నాయి. అన్నీ సింగపడవి దోపిడీని గురించే.
‘్ఛ! మనం కాస్త ముందుగా మేలుకుంటే బావుండేది’ గొణిగినట్టు అన్నాడు చంద్ర. అలా అనడం ఎన్నోసారో అతనికే గుర్తు లేదు. ప్రభు మాట్లాడలేదు.
‘ఆమె ఎవరై ఉంటుంది?’ అన్నాడు చంద్ర సోఫాలో కూలబడుతూ.
‘తెలియదు. ఎంక్వైరీ చెయ్యమంటారా?’ అన్నాడు ప్రభు.
‘ఒద్దొద్దు. అసలామె ఫోన్ చేసిన సంగతే ఎత్తొద్దు. అలా అయితే మన అసమర్థత బైటపడుతుంది’ కంగారుగా అన్నాడు చంద్ర. కాస్సేపటి తర్వాత-
‘ఏమైనా ఆధారాలు దొరికాయా?’ అన్నాడు ఆశగా.
‘లేదు. ఆ పూజారిగారు కూడా ఏం చెప్పలేక పోతున్నారు. కానీ అందరూ అనుకోవడం, ఈ దోపిడీ ఆ బ్లాక్ టైగరే చేసుంటాడని.’
‘బ్లాక్ టైగరా?’ త్రుళ్లిపడ్డాడు చంద్ర.
‘అవును. అతనికి తప్ప అంత ధైర్యం ఇంకెవరికీ ఉండదని అందరికీ తెలుసు. అందరూ అంటుంటే నాకూ అదే అనిపిస్తోంది’ భారంగా అన్నాడు ప్రభు.
ఆలోచనలో పడ్డాడు చంద్ర. ఎంతో సక్రమంగా, జనరంజకంగా వుందనిపించుకున్న తన రాష్ట్ర పాలనలో ఈ సంఘటన పెద్ద అవమానంగా అనిపించింది. ఏదో నేరం చేసినట్టు మొహం వాడిపోయింది. అది గమనిస్తూనే ఉన్నాడు ప్రభు.
‘మీరేం వర్రీ అవకండి సార్. త్వరలోనే ఆ దొంగలు నగలతో సహా దొరికిపోతారని హోమ్‌మినిస్టర్ గట్టిగా చెప్పారు’ అన్నాడు అనునయంగా.
‘అది చెప్పినంత తేలిక్కాదు. ఒకవేళ అందరూ అనుకుంటున్నట్టు ఈ దోపిడీ బ్లాక్ టైగరే చేసుంటే, వాణ్ణి పట్టుకోవడం...’ అన్నాడు చంద్ర మాట పూర్తి చెయ్యకుండానే ఏదో ఆలోచిస్తూ.
‘ఎలాగైనా మనకి ఫోన్ చేసినవాణ్ని పట్టుకుంటే ఆ దొంగల వివరాలు కచ్చితంగా తెలుస్తాయి. ముందు తనెక్కణ్ణించి ఫోన్ చేసిందో కనుక్కుందాం’ ఉత్సాహంగా అన్నాడు ప్రభు.
‘అదీ! అలా చేస్తేగానీ మన పొరపాటు నలుగురికీ తెలియదు. పేపర్లు, ఛానెళ్లు రంగులు పులిమి మరీ ఏకేస్తారు’ అన్నాడు చంద్ర చిరాగ్గా.
అతనికి, దోపిడీని గురించిన బాధకన్నా, తనకి చెడ్డ పేరొస్తుందన్న భయంకన్నా, ఓ స్ర్తి ధైర్యం చేసి అర్ధరాత్రి ఫోన్ చేసి హెచ్చరించినా తాము మేలుకోలేదన్న బాధే ఎక్కువగా ఉంది. దానికి తోడు నాలుగు రోజులు గడిచినా దోపిడీని గురించి ఎలాంటి ఆచూకీ దొరకలేదు.
* * *
ఆలయ పరిసరాల్లో పోలీసుల హడావిడి, జనాల ఊహాగానాలు ఎక్కువయ్యాయి. పూజారి చెప్పిన వివరాలు కూడా ఎలాంటి సమాచారాన్ని అందించలేక పోయాయి. మచ్చలేని చంద్ర మనసు మరింత కలవరపడుతోంది. పత్రికల వాళ్లకీ, టీవీ ఛానెళ్ల వాళ్లకీ ప్రభే ఏవేవో చెప్తున్నాడు. అతనికి తెలుసు చంద్ర మనసు ఎంత సున్నితమైందో. నిర్విరామంగా మోగుతున్న ఫోన్లకి సమాధానాలు చెప్పలేక సతమతమై పోతున్నాడు ప్రభు.
ఆ రోజు రాత్రి తొమ్మిదవుతుండగా మళ్లీ ఫోన్ మోగింది. విసుగ్గా రిసీవర్ తీసిన అతని మొహంలోకి ఒక్కసారిగా కాంతివచ్చేసింది. కారణం ఫోన్ చేసింది మునుపటి స్ర్తియే.
‘హలో మీరా! ఎక్కణ్నించి?’ అన్నాడు ఉద్వేగంగా.
‘నా గురించి ఎంక్వైరీలు మాని దొంగల్ని గురించి చూడండి. అవునూ మీ ఎంక్వైరీ ఎంతవరకూ వచ్చింది?’ అందామె వ్యంగ్యంగా.
ప్రభుకేం మాట్లాడాలో తోచలేదు. ఎలాగైనా ఆమెని కలిసి దొంగల ఆచూకీ తెలుసుకోవాలన్న ఆలోచనలో పడిపోయాడు.
‘హలో!’ హెచ్చరించిందామె.
‘చెప్పండి’
‘నేను చెప్పడం అయిపోయింది. ఇంక చెప్పాల్సింది మీరే!’
‘ఏం చెప్తాను. మీరు చెప్పినట్టే ఘోరం జరిగిపోయింది. మా వల్ల పొరపాటే జరిగింది మేడమ్! తెల్లారి లేచిందగ్గర్నించీ, డమీ ఫోన్లు, బెదిరింపు లెటర్స్ వస్తూనే ఉంటాయి. అలాంటిదే మీ ఫోనూ అనుకున్నాం. అదీగాక ఆ టైమ్‌లో ఏం చెయ్యాలో తోచలేదు. నిజంగా మేం చేసింది పొరపాటే. ఈ విషయంలో మీకు క్షమార్పణ చెప్పుకుంటున్నాను. దయచేసి మాకు... కాదు. మన దేశానికి మేలు చెయ్యండి. ప్లీజ్!’ అన్నాడతను వేడికోలుగా.
ఆమె నవ్వింది.
‘చెయ్యాలనే నా తాపత్రయం’ అంది మెల్లగా.
‘్థంక్స్! మీ పేరు? మిమ్మల్నెక్కడ కలవాలి?’ అన్నాడతను ఆదుర్దాగా.
‘నా పేరుతో మీకు అవసరం ఉంటుందనుకోను. కానీ గుర్తుగా ఏదో ఓ పేరుండాలి కాబట్టి, ‘క్లూ’ అని పిలవండి’
‘క్లూ?’ విస్మయంగా అన్నాడతను.
‘యా! క్లూ! ఏదైనా ముఖ్యమైన ఆధారాలు దొరికితే మీకు ఫోన్ చేసి క్లూ ఇస్తాను. నన్ను కలవాలని ప్రయత్నించకండి’
‘్థంక్యూ! అది చాలు. ఇంతకీ మీరెక్కడ్నించి మాట్లాడుతున్నారు?’ కుతూహలంగా అన్నాడు ప్రభు.
ఆమె గొంతు గంభీరంగా అయిపోయింది.
‘మీకు క్లూ ఇచ్చి తద్వారా, మన రాష్ట్రానికి ఉడతా భక్తిలా సాయపడదామనుకున్నాను. కానీ మీరు దొంగల్నొదిలేసి నన్ను గురించి ఎంక్వైరీలు మొదలుపెట్టారు. ఇలాంటివి ఎదురౌతాయనే కళ్లతో చూసిన నేరాల్ని చెప్పడానిక్కూడా జనం భయపడతారు’ అంది కఠినంగా.
గతుక్కుమన్నాడతను.
‘దోపిడీ గురించి వివరాలు సేకరించి ఏదైనా క్లూ దొరికితే మీకు తెలియజేస్తాను. కానీ నా గురించి తెలుసుకోవాలని, నా ఫోన్ ఎక్కణ్నించి వస్తుందో కనిపెట్టాలని ప్రయత్నించకండి. అలా చేస్తే ఈ మాత్రపు సహాయం కూడా చెయ్యను’ మళ్లీ ఆమే అంది.
‘సారీ! మీ నుంచి వివరాలు తెలుసుకోవాలన్న ఆదుర్దాతోనే ఎంక్వైరీ చేశాను. అపార్థం చేసుకోకండి. ఇంతకీ ఇప్పుడు ఎందుకు ఫోన్ చేశారు?’ అన్నాడతను ఆతృతగా.
(ఇంకా ఉంది)

-రావినూతల సువర్నాకన్నన్