దక్షిన తెలంగాణ

న్యాయం ( కథ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బస్ వేగంగా వెళుతూ ఒక్కసారిగా బ్రేక్ పడడంతో ఉలిక్కిపడి నిద్రలో నుంచి లేచాడు సుమిత్. రాత్రి వారి బావమరిది పెళ్లికి హాజరవడంతో నిద్రపోలేదు. హాయిగా నిద్రపోదామంటే ఈ బ్రేకులు ఒకటి అంటూ చిరాకుపడ్డాడు.
సుమిత్ పక్కన ఓ యువతి కూర్చుని ఉంది. తను ఏడుస్తూ ఉండటం గమనించి ‘అరే ఏమైందమ్మా ఏడుస్తున్నావు’ అని అడిగాడు ఆ యువతి ఏడుపు కనబడకుండా తన చున్నీ అడ్డంగా పెట్టుకుంది.
యువతి పక్కనే కూర్చుని ఉన్న వాళ్లమ్మ ‘ఇపుడు ఎంత ఏడ్చినా ఏం లాభం’ అని అనడంతో సుమిత్ ఆవిడతో ‘ఏమైందమ్మా’ అని అడిగాడు ఆత్రంగా.
‘ఏం చెప్పమంటావు బాబూ, ఎలా చెప్పాలో కూడా నోరు రావడం లేదు’ అంది.
‘మాది పల్లెటూరు. నా మొగుడు నాలుగేళ్ల క్రితమే పంటలు పండక చేసిన అప్పులు తీర్చలేక ఉరేసుకొన్నాడు. అప్పటి నుండి పాప నేను కూలీ పనులు చేసుకొని బ్రతుకున్నాం.
మా ఊరి పండగకి ఎక్కడో నుండి చదువుకున్న కుర్రాళ్లు వచ్చారు. అందులో ఒక కుర్రాడు మా పిల్లను చూసి మోజుపడి ప్రేమించాను అంటూ వెంటపడ్డాడు. పండగయిపోయిన రోజు మా ఊరికి వచ్చాడు. మా అమ్మాయి ముందు దూరం పెట్టినా తరువాత వాడి వలలో పడిపోయింది.
‘పెళ్లి చేసుకుంటున్నానని మాట ఇవ్వడం, కానుకలు ఇవ్వడంతో వాడి మీద పూర్తిగా నమ్మకం పెట్టుకుంది. అవకాశం చూసుకున్న అటవిక పులిలా అమ్మాయిని ఓ రోజు లోబర్చుకున్నాక అప్పటి నుండి కన్పించడం మానేశాడు. చాలా రోజుల తరువాత నాకు విషయం తెలియడంతో కోపంగా కొట్టాను. విషయం ఎందుకు చెప్పలేదని మళ్లీ కొట్టాను. పాపం.. నా బిడ్డ దెబ్బలు ఎలా తట్టుకుందో..
మాలాంటి కష్టజీవుల బ్రతుకుల మీద ఆడుకునే ఆ పిల్లగాడిని వదిలితే ఇంకా ఎంతో మంది జీవితాలతో ఆడుకుంటాడని వాడి ఇంటికి బయలుదేరాము.
సుమిత్‌కి ఆమె ప్రవర్తన నచ్చింది. ‘మీరు వాడిని వదలద్దు. మీ అమ్మాయిని వాడు పెళ్లి చేసుకోవాలి. న్యాయం జరగకపోతే కోర్టుకు కూడా వెళ్లండి ముందు పోలీస్ స్టేషన్‌లో కేస్ ఫైల్ చెయ్యండి. మీలాంటి మంచివాళ్లకి న్యాయం తప్పక జరుగుతుంది. ముందు మీ ధైర్యానికి హ్యాట్సాఫ్.’ ఆ యువతిని సుమిత్ ఓదారుస్తూ అన్నాడు.
‘ఏడవొద్దు ఈ కాలంలో ఇలాంటి మోసగాళ్లు ఎక్కువయ్యారు. మీ అమ్మగారు ఆ నీచుడ్ని వదలరు’ అన్నాడు.
‘అవును ఆడిని వదలను. మా అమ్మాయి విషయంలో తేడా చేస్తే వాడిని చంపుతా లేదా నేను చస్తా’ అంది.
ఇంతలో సుమిత్ దిగాల్సిన స్థానం రావడంతో ‘మీకు తప్పకుండా న్యాయం జరుగుతుంది’ మరోసారి చెప్పి దిగిపోతాడు.
సుమిత్ ఇంటికి వెళ్లడం కోసం ఆటో ఎక్కాడు. తన భార్యకి ఫోన్ చేసి ‘నేను ఇప్పుడే బస్ దిగాను. పావుగంటలో ఇంటికి చేరుకుంటా నువ్వు బాబు సాయంత్రం ఇంటికి వచ్చేయండి’ అని చెప్పి ఫోన్ కట్ చేశాడు.
సుమిత్ ఇంటి ముందు దిగి, తలుపులు తాళం లేస్తున్న సమయంలో బస్‌లో కన్పించిన తల్లి కూతురుని చూసి వాళ్లు ఇలా వస్తున్నారేంటబ్బా అనుకుంటూ వారిద్దరి దగ్గరికి వెళ్లాడు.
ఇక్కడికి మీరు?
మా అమ్మాయిని మోసం చేసిన వాడి ఇల్లు ఇక్కడేనంటా, ఇంటి అడ్రస్ ఫోటో సుమిత్ చేతులో పెట్టిందామె. సుమిత్‌కి చేతులు వణకడం మొదలయ్యాయి. ఎందుకంటే ఆ అడ్రస్ సుమిత్‌దే. మోసం చేసిన వాడు సుమిత్ ఏకైక ముద్దుల తనయుడు.
‘విషయం వీళ్లకు తెలియకూడదు’ అనుకుంటూ ‘అయ్యో ఈ బాబు మొనే్న రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు’ పాపం వాళ్లమ్మ, నాన్న ఎక్కెక్కి ఏడ్చారు. ఇంకా ఆ ప్రమాదం నుండి కోలుకోలేదు వీరు.
వాళ్లు కాసేపు షాకై ‘దేవుడు ఉన్నాడు. ఆ దుర్మార్గుడికి సరైన శిక్ష పడింది. అమాయకురాలైన మా అమ్మాయికి ద్రోహం చేసిన వాడికి భూమి మీద ఉండే అర్హత లేదు’ అంటూ వాళ్లు వెళ్లిపోయారు.
సుమిత్ బలంగా ఊపిరిపీల్చుకోగానే ఫోన్ మోగింది. ‘ఏవండీ.. మన అబ్బాయి నడుపుతున్న బైక్‌ని లారీ గుద్దేసిందంటా. చనిపోయాడంటా’ అంటూ రోదించింది. ఆ మాటకి సుమిత్ గుండె పగిలినట్లు అన్పించింది.
కొడుకు మరణ వార్త కన్నా న్యాయం గెలిచినట్లు అన్పించింది సుమిత్‌కి.

- నల్లపాటి సురేంద్ర
సెల్.నం.9490792553

అంతరంగం

ఆలోచనామృతమే కవిత్వం!

ప్రముఖ సాహితీవేత్త ఆచార్య మసన చెన్నప్ప

‘మల్లి పదాల’తో కవిగా సాహితీ ప్రస్థానాన్ని ప్రారంభించిన ప్రముఖ సాహితీవేత్త మసన చెన్నప్ప... ‘ప్రాచీన కావ్యాలు - గ్రామ జీవన చిత్రణ’తో పరిశోధకుడిగా ఎదిగి, ‘నేత్రోదయ’మై, ‘సమాలోచనం’, ‘రస్వతాలోచనం’, కొత్త ఆలోచనాలోచనాలతో ముందుకు సాగి, ‘అక్షర కేతనం’గా ఎగిరి, ‘బ్రహ్మచర్యం’ దీక్ష ద్వారా ‘అమృత స్వరాలు’, ‘అగ్నిస్వరాలు’ వినిపించిన ఘనత ఆయన సొంతం. ‘వీర సావర్కర్’ గుణకీర్తనంతో పులకించి, ‘అమెరికా ఓ అమెరికా!’ అంటూ ప్రపంచ తత్త్వాన్ని ఆవిష్కరించారు. ‘నయాగర’ను తిలకించి, ‘ఆ సందుక’లో అమ్మ జ్ఞాపకాలను దాచిపెట్టి ‘సమ దర్శనం’లో అంతర్యామిగా ప్రవహించి, ‘సుందరకాండ’లో నాలుగు వేదాలు చదివిన హనుమంతున్ని ఆవాహన చేసి, ప్రకృతి పురుషవివేకం తెలిసి, ‘ఈశావాస్య’మై ఉపనిషత్ సుధాలహారులై కవితా రూపహంసగా తేజరిల్లి ‘బృహద్గీతాచార్యుడై’, ‘ఉద్గ్థీ’పాసనకు నడుం కట్టి ‘శుకోపనిషత్తు’ రచించారు. ప్రపంచానికి దాంపత్య ధర్మప్రవచించి, ‘సాహిత్యంలో తత్త్వదర్శనం గావించి, ‘మోక్ష సాధనలో దశోపనిషత్తు’ల మర్మమెరిగి, అధ్యాపక వృత్తిలో రాణించి ఇరువది ఐదు మంది పరిశోధక పర్యవేక్షణ బాధ్యతలు వహించి, తమ రచనల ద్వారా, ఉపన్యాసాల ద్వారా సామాజిక చైతన్యానికి నిరంతరం కృషి చేస్తున్న సాహితీ కృషీవలుడు ఆచార్య మసన చెన్నప్ప. సాహిత్యం ద్వారా సంప్రదాయ విలువలను అందిస్తూ నాలుగు వేల ముత్యాల సరాలతో తెలుగు సరస్వతీ గళ సీమ నలంకరించిన అవిశ్రాంత కవితామూర్తి ఆచార్య మసన చెన్నప్ప. ఆలోచనామృతమే కవిత్వమని అంటున్న చెన్నప్ప మహబూబ్‌నగర్ జిల్లాకు చెందినవారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తెలుగు విభాగం అధ్యక్షులుగా ఉద్యోగ విరమణ చేశారు. సాహితీ పురస్కారాల ఎంపికలో పారదర్శకత లోపిస్తోందంటున్న చెన్నప్పతో ‘మెరుపు’ జరిపిన ముఖాముఖి ఆయన మాటల్లోనే.....

ఆ మీ రచనా వ్యాసాంగం ఎలా మొదలైంది?
1971 ప్రాంతంలో ఆంధ్ర సారస్వత పరిషత్తులో చదివే రోజుల్లోనే..మా ప్రధానాచార్యులు శ్రీ కె.రంగనాథాచార్యులు గారి మీద శతకం రాయాలని ప్రారంభించాను.

ఆ వివిధ ప్రక్రియల్లో రచనలు చేపట్టిన మీకు ఇష్టమైన ప్రక్రియ ఏది?
పదాలు, పద్యాలు, వచన కవిత్వం, నానీలు, ముత్యాల సరాలు, వ్యాసాలు, నాటికలు తదితర ప్రక్రియల్లో రచనలు చేసిన నాకు పద్య రచన అంటే ఇష్టం!

ఆ ఆధ్యాత్మిక రంగంలో ప్రవేశించడానికి మీకు గల
ప్రేరణ శక్తులేవి?
బాల్యంలో మా అయ్య బుచ్చయ్య గారు వైష్ణవుల ప్రభావం చేత ప్రతిరోజూ భాగవతం చదివించేవారు.. పద్యాలు కంఠస్థం చేయించేవారు. అలా మొదలైంది! వీరయ్య గారి భగవద్గీత ఉపన్యాసాలు విని చిన్ననాటే ప్రశ్నించే వాన్ని! పాత పట్నంలో పనె్నండు భాషలు నేర్చిన పండితుడు శ్రీ గుండేరావు హర్కారే నాకు ఆధ్యాత్మిక విషయాలు బోధించేవారు. అయితే..1996 నాటికి నా ఆధ్యాత్మిక తృష్ణ పండిత గోప దేవశాస్ర్తీ గారి వల్ల తీరింది!

ఆ మీ దృష్టిలో కవిత్వం అంటే ఏమిటి?
కవిత్వమంటే ఆలోచనామృతమే! సంప్రదాయాన్ని విడిచిపెడితే కవిత్వమే లేదు! కవి క్రాంతదర్శి అవ్వాలి. మంచి వ్యక్తిత్వమే ఆలంబనగా కవిత్వం సృజన చేయాలి. అందుకే నా దృష్టిలో వ్యక్తిత్వంతో పాటు పరమార్థాన్ని నిర్దేశించేది కవిత్వం!

ఆ మీకు నచ్చిన గ్రంథం ఏది?
సత్యం స్పర్శ గల గ్రంథాలన్నీ నాకు నచ్చినవే! ప్రాచీన సాహిత్యానికి వస్తే..రామాయణ భారతేతిహాసాలు, ప్రబంధాలు ముఖ్యంగా శతకాలు నాకు నచ్చాయి! సినారె ‘గజళ్లు’, తిరుమల శ్రీనివాసాచారి ‘రుబారుూలు’ దాశరథి ‘అగ్నిధార’, వానమామలై పోతన చరిత్రము, కాళోజీ ‘నా గొడవ’, గురజాడ ‘కన్యాశుల్కం’, విశ్వనాథ ‘ఏకవీర’, జాషువా ‘గబ్బిలం’, తిలక్ ‘అమృతం కురిసిన రాత్రి’ గ్రంథాలు నాకు ఎంతో ఇష్టమైన రచనలు..

ఆ గ్రామ స్వర్గాన్ని సాక్షాత్కరింపజేసిన మీ సిద్ధాంత
గ్రంథాన్ని గూర్చి చెప్పండి?
ఆచార్య వేటూరి ఆనందమూర్తి పర్యవేక్షణలో నేను రూపొందించిన ‘ప్రాచీన కావ్యాలు - గ్రామీణ జీవన చిత్రణ’ అనే సిద్ధాంత గ్రంథానికి ఉస్మానియా విశ్వవిద్యాలయం డాక్టరేట్ ఇచ్చింది. 80 మంది ప్రాచీన తెలుగు కవుల కావ్యాలను ఆమూలాగ్రం అధ్యయనం చేసి - గ్రామ జీవన అంశాలను ఆరు ప్రకరణాల్లో వివరించాను. ఒక వెయ్యి సంవత్సరాల ప్రజల జీవన విధానం ఎట్లా వుంటుందో తెలియజేశాను.

ఆ తెలంగాణ ఉద్యమకాలంలో కవిగా మీ పాత్ర ఏమిటి?
తెలంగాణ ఉద్యమకాలంలో నేను ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఆచార్యునిగా ఉన్నాను. ప్రతి రోజు ఆర్ట్స్ కాలేజి ముందున్న టెంట్ వద్దకు నన్ను పిలిచి ప్రసంగాలు ఇప్పించే వారు. ధూం..్ధం..లలో పాల్గొన్నాను. నా గుండె చప్పుళ్లను ‘తెలంగాణోదయం’ పేరుతో ఒక పద్య కావాన్ని వెలువరించి ఉద్యమానికి ఊపిరిలూదాను.

ఆ యువతరాన్ని సాహిత్యం వైపు మళ్లించాలంటే ఏంచేయాలి?
పాతది, కొత్తది అనే భేదం లేకుండా జీవితానికి దేశానికి, కుటుంబ గౌరవానికి అక్కరకొచ్చే అంశాలను ఈనాటి సాహిత్యంలోకి చొప్పించాలి. లేదా ఉన్న సాహిత్యాన్ని చదివించాలి. యువతను నాస్తికులను, పిడివాదులను తయారు చేసే రాతలకు దూరంగా ఉంచాలి.

ఆ సాహితీ పురస్కారాలపై మీ అభిప్రాయం?
పురస్కారాల ప్రదానంలో పారదర్శకత లోపిస్తోంది. కేంద్ర సాహిత్య అకాడమీ సైతం నూటికి తొంభై శాతం పురస్కారాలు లెఫ్టిస్టులకు ఇస్తోంది. సంప్రదాయ రచనలపై చిన్న చూపు చూపుతోంది. పైరవీలకు ఆస్కారం లేకుండా ప్రతిభను గుర్తించి అర్హులకు పురస్కారాలు ఇస్తే బాగుంటుంది.

ఆ కొత్త రచయతలకు మీరిచ్చే సలహాలు, సూచనలు ఏమిటి?
మనకెన్నో సాహితీ ప్రక్రియలున్నాయి. ఇష్టమైన ప్రక్రియలో రచన చేయాలి. ఏదేమైనా ప్రతిభ, వ్యుత్పత్తి, అభ్యాసం ఈ మూడింటితోనే ఏ రచనైనా రాణించగలదని గ్రహించాలి.

ఇంటర్వ్యూ: దాస్యం సేనాధిపతి, సెల్.నం.9440525544

చిరునామా:
ఆచార్య మసన చెన్నప్ప
ఇం.నం.9-76/2, ఉదయనగర్ కాలనీ
బోడుప్పల్, హైదరాబాద్-500092
సెల్.నం.9885654381

పుస్తక సమీక్ష

రెక్కల్లో
గీతామృతం!

పేజీలు: 74, వెల: రూ.101/-
ప్రతులకు:
డాక్టర్ కేతవరపు రాజ్యశ్రీ
301, గోకుల్ అపార్ట్‌మెంట్,
స్ట్రీట్ నం.4, అశోక్ నగర్,
హైదరాబాద్-20
సెల్.నం.8500121996
భారత్ భాషా భూషణ్ డాక్టర్ కేతవరపు రాజ్యశ్రీ 108 శ్లోకాలను.. రెక్కల ప్రక్రియలో గీతామృతాన్ని పంచారు. ‘రెక్కల్లో గీతామృతం’ పేరుతో ఓ గ్రంథాన్ని వెలువరించి..కవయిత్రి తమ ఆధ్యాత్మిక భావాలను ప్రకటించారు. అధ్యాయాలతో నిమిత్తం లేకుండా 108 శ్లోకాలను ఏరుకొని గీతాసారాన్ని రెక్కల్లో బంధించారు. భగవద్గీత లేకపోతే భారతం లేదు. భారతం లేకపోతే ప్రపంచమే లేదు అని పెద్దలంటుంటారు. ఈ క్రమంలోనే రాజ్యశ్రీ గారు ధర్మ పథాన్ని ప్రబోధించే భగవద్గీతను రెక్కలు కట్టుకొని మన ముందుకు రావడమే గాక.. మనల్ని ధర్మం పట్ల, సంఘం పట్ల, మోక్ష సన్యాసాల పట్ల అనురక్తిని కలిగించేలా ఈ గ్రంథంలో కవితలు కొలువుదీరాయి. మూల శ్లోకాల్లోని గూఢార్థాన్ని, వేదాంత రహస్యాల జోలికి వెళ్లకుండా.. సరళంగా పాఠకులకు అర్థమయ్యేలా ‘రెక్కలు’ను సృష్టించారు. సాధారణంగా సామాజిక అంశాలతో వెలువడే ‘రెక్కలు’లో ఆవిష్కరిస్తారు. కానీ రాజ్యశ్రీ గారు భగవద్గీత ప్రాశస్త్యాన్ని ప్రతిబింబిస్తూ రెక్కలను రూపుదిద్దిన తీరు అభినందనీయం!
ఇందులోని రచన ఆస్వాద యోగ్యంగా సాగించారు. హృద్యంగా, సుందరంగా, సుకుమారంగా రెక్కలును తీర్చిదిద్దడంలో కవయిత్రి ప్రతిభ కానవస్తోంది. స్వజనులను సంహరించలేనంటూ, హృదయం ద్రవించిన అర్జునుడు శ్రీకృష్ణునితో జరిపిన సంభాషణ ఘట్టాలను రెక్కలు రూపంలో అక్షరబద్ధం చేశారు. ఆరు పాదాలో పాఠకులను అలరించే రెక్కలు ప్రక్రియతో గీతామృతాన్ని కవిత్వాన్ని జోడించి అందించడంలో కవయిత్రి సఫలీకృతులైనారు. చక్కని భావాలతో చిక్కని కవిత్వాన్ని రెక్కల రూపంలో గీతామృతాన్ని పాఠకులకు పంచిపెట్టిన కవయిత్రి డాక్టర్ రాజ్యశ్రీ గారికి అభినందనలు తెలుపుదాం. అల్పాక్షరాలలో అనల్పార్థ రచనకు దోహదపడే రెక్కలు నిదర్శనమని చెప్పడానికి యోగ్యంగా ఇందలి రచన కొనసాగింది.

- సాన్వి, కరీంనగర్, సెల్.నం. 9440525544

మనోగీతికలు

చూస్తే.. చాలు!
ప్రియా! అందమైన నీ ముద్దుమోముని చూస్తే.. చాలు
జాబిల్లే మురిసి నీకు ముద్దుపెడతది!
ఆహ్లాదకరమైన నీ చిరునవ్వుని చూస్తే..చాలు
వెనె్నలే వెంబడించి నీతో దోస్తీ కడతది!
వయ్యారమైన నీ విలాసపు నడకను చూస్తే..చాలు
రాజహంసలే వినయంతో నీకు శిష్యులౌతవి!
మనోహరమైన నీ పసిడి పలుకులు వింటే..చాలు
రామచిలుకలే రసికతతో నీపై కవితలు రాస్తవి!
మనోరంజకమైన నీ సొగసు కనుల్ని చూస్తే..చాలు
స్వర్ణ హరిణములే మోహముతో నీకు కన్నుగీటుతవి
శోభాయమానమైన నీ మేని సొబగును చూస్తే..చాలు
సీతాకోక చిలుకలే శీఘ్రంగా నీపై వచ్చివాలుతవి!
రస రంజకమైన నీ నడుము ఒంపుని చూస్తే..చాలు
ఇంద్రధనుస్సే సలాం చేస్తూ నీకు గులామైతది
రస రంజకమైన నీ నడుము ఒంపుని చూస్తే..చాలు
ఇంద్రధనుస్సే సలాం చేస్తూ నీకు గులామైతది

- వేముల సత్యనారాయణ
కుత్బుల్లాపూర్, హైదరాబాద్
సెల్.నం.9603255063

బంగారు బతుకమ్మ..
ఆడపడుచుల అనురాగానికి ఆనవాళ్లు ఈ బతుకమ్మ
మగని మమకారాలకు నిలువెత్తు గౌరమ్మ మా తల్లీ బతుకమ్మ
అంతగ గుర్తింపునకు నోచుకోని పువ్వులనెన్నింటినో అవార్డుల పేరిట గిన్నీస్ బుక్‌లో నమోదయ్యింది ఈ బతుకమ్మ
పచ్చ పచ్చాని బీర ఆకులతో పచ్చగా వర్ధిల్లంటూ
తీరొక్క పూలతో బతుకున ఉన్న తిమిరాన్ని తొలగించేస్తూ
విరజాజుల పరిమళాన్ని జీవనాన సద్గుణాలుగా వెదజల్లుతూ
చామంతులంటూ చల్లని చూపులు మాపైన కురిపిస్తూ
నందివర్ధనమంటి మంచి నడకలను కలిగిస్తూ
ఉమ్మెత్తలోని ఉదారతను మా బతుకున చూపించే తల్లి ఈ బతుకమ్మ
బంతిపువ్వంటి బంగారుమయైన బతుకుల నిస్తూ
తంగేడు పూలతో పేరించే వేళ మా తలరాతల్ని మార్చేస్తూ
చిత్రమైన సింగిడి (ఇంద్రధనుస్సు)లే మా మోమున నవ్వులే విరియంగా
పారిజాతాల్లాంటి మృదువైన పలుకుల్ని మాకీయవే బంగారుతల్లి
ఇన్నిన్ని రకాల పూలతో కొలిచేటి ఇంతి సౌభాగ్యం నిండుగా మెరియాలి
మున్ముందు తరాలకు నీవు మరుగున పడకుండా
ఆడపిల్లని తెలిసి కడుపులోనే చంపుతున్న వారికీ ఆదిశక్తివై హెచ్చరించు తల్లీ
స్ర్తి జాతి గౌరవాన్ని నలుదిశలా వ్యాపించేలా దీవించమ్మా..
ఆరుగాలం కష్టపడి పండించే రైతన్నకూ కడుపునిండా బువ్వ పెట్టమ్మా
బతుకునే ఒక పండుగగా మలిచి జరుపుకునే బ్రహ్మాండమైనట్టి
ఈ బతుకమ్మరా..
ఏడాదికోసారైనా ఎందరెందరినో ఏకతాటిపై కలిపేసి..
తెలంగాణకే తలమానికమైనది ఈ బతుకమ్మ
ఏ కల్మషాలను లేకుండా చేసేదే మా బంగారు బతుకమ్మ.

- విజయలక్ష్మి మార, జగిత్యాల, సెల్.నం.9533333191

ఆత్మీయబంధం

చిత్రం! ఎంత విచిత్రం?
నేను ఇంత గొప్ప మనసున్న
మాతృ మూర్తుల మధ్య ఉన్నానా!
ఇది నా అదృష్టమో!
పూర్వ జన్మ సుకృతమో!
మా పక్కన ఉంటున్న ఆడబిడ్డలు
రక్తం పంచుకున్న తల్లీబిడ్డలు కారు!
తర తరాల బంధం అసలే లేదు!
విధికి బలై..
ఎప్పుడో పతులను కోల్పోయిన వనితలు వారు!
ఆశ్చర్యం!
వృద్ధాప్యంలో..విడువ లేరు ఒకరిని విడిచి మరొకరు!
ఏ శుభసమయాన..
వీరి మధ్య పరిచయం మొగ్గ తొడిగిందో..
ఏ శక్తి వారికి అండగా నిలిచిందో..
మానవీయ బంధాలకు
మమతానురాగాలకు ప్రతీకలై..
బలమైన మైత్రిని పెనవేసుకుని
ఒకరి కొకరు..ముదిమి వయసులో
కష్ట సుఖాలను పంచుకున్నారు!
ఆపదలో ఉన్నవారికి
అండగా ఉంటున్నారు!
బోధలు చేసి బాధలు తీర్చే వాళ్లిద్దరు
అందరి నోట్లో నాలుకలైనారు!
ఏ వ్యక్తీ విడదీయరాని బంధం వారిది!
పాలలో తేనె కలిసిన చందంవోలే
వారి స్నేహం అందరికీ ఆదర్శం!
ఆత్మీయ బంధానికి ప్రతిబింబం!
ఇలా..
మనలోని అందరూ మానవ సంబంధాలకు
మెరుగులు అద్దితే ఎంత బాగుండు?

- బొమ్మకంటి కిషన్
కరీంనగర్, సెల్.నం.9494680785

ఆత్మగౌరవ వేడుక

ఒంపు సొంపులతో, ఒయ్యారాల ఒలకిస్తూ
రంగు రంగుల పూలు తెచ్చి, అంచలంచలుగా పేర్చి
ఎతె్తైన అందలాన గౌరమ్మను నిలిపి
అతి భక్తితో కొలిచే ముతె్తైదువుల భక్తి
మనసు మనసు తట్టిలేపే
చప్పట్ల నృత్య రీతితో
తంగేడు పసుపులద్ది
పట్టుకుచ్చుల తిలకం దిద్ది
గోరింట పారాణులద్ది
వల పుష్పాలతో నాయనమ్మలిచ్చి
ఒడి బియ్యంలు నింపి
దద్దోజనం సద్దికట్టి
గంగమ్మ చెంతకి చేర్చునపుడు
ఆ చెరువు గంగమ్మ
చిన్ని కెరటాల పల్లకిలో
అలల చిరు మేనలు కట్టి
నీటి సవ్వడుల సన్నాయిలూదుతూ
వెనె్నల దీపకళికలు నింపుకొని
తోడ్కొని పోతుంది
నా గౌరమ్మని ఆ చల్లని గంగమ్మ

- సంకెపల్లి కీర్తన రెడ్డి
మహబూబాబాద్, సెల్.నం.9912134309

ఓ ధరిత్రీ!

గుండెల్లో గునపాలు గుచ్చినాగానీ
కనుపాపల్లో కల్లోలాలు కలిగించినాగానీ
హలము, పలుగు పారలతో రక్కినాగానీ
గర్భాన్ని చీల్చి ఖనిజాలెల్ల తరలించినాగానీ
తృణమైన జలమంతా పీల్చేసినాగానీ
పెక్కు హంగులకై నిన్ను పెకిలించినాగానీ
కొంగొత్త పరీక్షలకై నిన్ను కదిలించినాగానీ
చిత్రమైన చిత్తరువులు నీపై పరిచినాగానీ
మొక్కై, మానై నిను వేర్లతో నలిపినాగానీ
కాలుష్య రక్కసి పాదాలు నినుతాకినాగానీ
మాలిన్యంబులను నీ చెంగున విదిలించినాగానీ
నరులు నీ శిరసెక్కి రాక్షసకృత్యాలు చేసినాగానీ
తొక్కిన వారినీ, నిను మ్రొక్కిన వారినీ
భారమని తలంచక భరియించి, నీ పిడిలోని ప్రకృతిని పరవశింపజేసి
పాలుగారే పసి పాపడి నుండి పండుముదుసలి వరకు
నీపై కనుతెరిచి కనుమూయువకు ఓర్పుతో
ఒడిసిపట్టిన ఓ సహనమూర్తి ఓ ధరిత్రీ!
నీకు, నీ సహనానికి వందనం!

- నీలగిరి అనిత
రాంనగర్, కరీంనగర్,
సెల్.నం.9014894141

తెలుగు పలుకు!
భగవంతుని స్మరణలోను
అమ్మా నాన్నల మాటల్లోనూ
అన్నమయ్య వీణలో..
కొలువై వుంది..
తీయనైన తెలుగు పలుకు!
అది రసరమ్యమై..
సిరులను కురుపించుతుంది!
త్యాగరాజు గళంలో
ఓలలాడిన తెలుగు పలుకు..
సప్త స్వరాలకు
ఎంతో తృప్తి గొలుపుతుంది!
ఆటవెలదులకు ప్రీతిపాత్రమై
తేటగీతాలు ఆలపిస్తుంది!
పాటలు, పద్యాల్లోనూ
తెలుగు పలుకు మేటి!
దానికి లేదేది సాటి!
తారల్లాంటి భాషల్లో
చక్కని చంద్రుడులా భాసిల్లే..
నా తెలుగు..
విశ్వానికే చూపుతుంది
వెలుగు!

- బొద్దుల పుండరీకం నేత
సిద్దిపేట
సెల్.నం.9553326359

ఈ శీర్షికకు కవితలు, కథలు, సాహితీ వ్యాసాలు, కొత్త పుస్తకాల సమీక్ష/పరిచయం, కార్టూన్లు ఈ క్రింది చిరునామాకు లేదా ఈ-మెయల్‌కు పంపండి.

మెరుపు శీర్షికకు.. ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక, జగిత్యాల రోడ్, కరీంనగర్. merupuknr@andhrabhoomi.net

email : merupuknr@andhrabhoomi.net

నిర్వహణ : దాస్యం సేనాధిపతి dasyamsenadhipathi10@gmail.com

- నల్లపాటి సురేంద్ర